ప్రకాశం

జిల్లాలో విస్తారంగా ఖరీఫ్ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 21: జిల్లాలో ఖరీఫ్ సాగును రైతన్నలు విస్తారంగా చేపట్టారు. ఈపాటికే జిల్లాలోని 56 మండలాల్లో లక్షా 31 హెక్టార్లలో కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు రైతులు సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదేవిధంగా ఈనెలాఖరు నాటికి 2లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరాంమూర్తి తెలిపారు. రాష్ట్రప్రభుత్వం నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తుండడంతో వరిసాగు చేసే రైతులు తమ పొలాలు చదును చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈపాటికే రైతులు వరినారుమడులు పోసుకున్నారు. గత మూడు సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయకపోవడంతో వరిసాగు చేసే రైతులు వరిసాగుకు స్వస్తిపలికారు. కానీ నాగార్జున సాగర్‌లో నీరు సమృద్ధిగా ఉండడంతో ప్రభుత్వం జిల్లాలోని ప్రజలు తాగేందుకు, సాగుచేసేందుకు విడుదల చేసింది. ఈనేపధ్యంలో జిల్లాలోని రైతులు రెట్టింపు ఉత్సాహంతో సాగర్ ఆయకట్టు కింద పంటలు సాగుచేసేందుకు పూర్తిస్థాయిలో సమాయత్తమవుతున్నారు. అదేవిధంగా కెడబ్ల్యుడి కింద కూడా వరిసాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉండగా ఈనెలలో సరాసరి వర్షపాతం 133.6 మి.మీ నమోదుకావాల్సి ఉండగా ఇప్పటివరకు 55.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో వర్షాలు పడితే భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈపాటికే రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు.
కాగా, జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని మంచినీటి చెరువులన్నింటినీ సాగర్‌నీటితో నింపారు. దీంతో మంచినీటి సమస్య కూడా తీరింది. అదేవిధంగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకల్లోకి నీరు చేరడంతో సాగుకు రైతులు ఉపక్రమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వచ్చేనెలలో శనగ పంటను రైతులు విస్తారంగా సాగుచేపట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వరిసాగు జిల్లాలో విస్తారంగా చేపట్టనుండడంతో వ్యవసాయ కూలీలకు పనులు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో జిల్లాలో వరిసాగు లేకపోవడంతో కొంతమంది వ్యవసాయ కూలీలు ఇతర జిల్లాలకు వలసబాట పట్టారు. ఈనేపథ్యంలో రైతులతో పాటు వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరిసాగు చేపట్టడం వలన పశువులకు పశుగ్రాసం కొరత కూడా తీరనుంది. గతంలో పశుగ్రాసం లేక ఇతర జిల్లాలకు పశువులను పశుపోషకులు తరలించేవారు. కానీ జిల్లాలో అలాంటి పరిస్థితులు ఇకనుండి కనిపించవని రైతులు పేర్కొంటున్నారు . అదేవిధంగా జిల్లాలోని కోస్తాతీర ప్రాంతం వెంట విస్తారంగా వేరుశనగ పంటసాగు చేపట్టారు. ఇటీవలకాలంలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలులేక వేరుశనగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో భూగర్భ జలాలు పెరగడంతో స్పింక్లర్ల ద్వారా నీరు సమృద్ధిగా వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.