ప్రకాశం

ఒంగోలు పార్లమెంట్ నుంచి మళ్లీ నేనే పోటీచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 14: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేసి గెలుపొంది తీరుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీచేసి గెలుపొంది ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలను పూర్తిస్థాయిలో మారుస్తానని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ గెలుపొందడం ఖాయమని, ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలోని వెలుగొండ, రామాయపట్నం పోర్టు, నిమ్జ్, దొనకొండ పారిశ్రామిక హబ్‌లను నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేయడం, రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే సాధ్యమని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. కనీసం ఆరోగ్యశ్రీ, 108 వ్యవస్థలను సైతం ముఖ్యమంత్రి అస్తవ్యస్తం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైకాపా ఒంటరిగానే పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజనలో, ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశాయని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఎవరు అధికారం చేపడితే వారికి తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమపాలనపై పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించటాన్ని సుబ్బారెడ్డి స్వాగతించారు. గత నాలుగున్నరేళ్ల నుంచి తాము చంద్రబాబు ప్రభుత్వంపై పోరు సాగిస్తూనే ఉన్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఐటి దాడులు జరుగుతుంటే దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అవహేళన చేశారు. ఐటి దాడుల్లో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న ఆందోళనతో చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి పుష్కరాలకు రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లు ఖర్చుపెట్టిందని, దానిలో సగం రూ.1500 కోట్లు వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చుపెట్టి ఉంటే పూర్తయ్యేదని ఆయన తెలిపారు. రామాయపట్నంకు మేజర్ పోర్టు కావాలని, మినీపోర్టు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. రామాయపట్నంకు మేజర్ పోర్టు వస్తే కేంద్రప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లా అభివృద్ధితో రూపురేఖలే మారుస్తానని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒంగోలు పార్లమెంటు నియోజకర్గ అభివృద్ధిపై దృష్టిసారించి తన నిధులతో ఎంతో అభివృద్ధి సాధించానని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. ఇటీవల తాను వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ఈ పాదయాత్రలో అనేక సమస్యలు ప్రజల నుంచి వచ్చాయని, ఆ సమస్యలన్నింటిని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంమీద రానున్న ఎన్నికల్లో తానే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.