ప్రకాశం

జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన మద్దిశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 17 : పారిశ్రామికవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మద్దిశెట్టికి జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితోపాటు మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీ్ధర్ ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో అందరు సమష్టిగా కృషి చేసి పార్టీని గెలిపించాలని జగన్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా సూచించారు.
ఇదిలాఉండగా ముందుగా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి జగన్‌తో కలిశారు. ఈ సందర్భంగా శివ తమ కుటుంబ సభ్యులని జగన్ సంబోధించడంతో అక్కడ ఉన్న బూచేపల్లి వర్గీయులు ఒక్కసారిగా బూచేపల్లి జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా తొలివిడత జాబితాలో ఎంఎల్‌సి పదవిని కట్టబెడతానని బూచేపల్లికి జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి గెలిపించాలని బూచేపల్లికి జగన్ సూచించినట్లు సమాచారం. దీంతో ఒకపక్క మద్దిశెట్టికి ఎమ్మెల్యే సీటు, మరోపక్క బూచేపల్లికి ఎంఎల్‌సి పదవి హామీ ఆశ చూపడంతో దర్శి నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయని చెప్పవచ్చు. దీంతో దర్శి నియోజకవర్గంలోని కాపులు, రెడ్లు, ముస్లింలు, ఎస్‌సిలతోపాటు ఇతర వర్గాలు కలిస్తే వైకాపా అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనన్న భావనలో ఆ పార్టీ గుంభనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున మద్దిశెట్టి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో గత కొంతకాలంగా మద్దిశెట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ సమక్షంలో మద్దిశెట్టి వైకాపాలో చేరడంతో కాపులు ఆయనకు మద్దతు తెలుపుతారో లేక జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారో వేచి చూడాల్సిఉంది. కాగా మద్దిశెట్టి గెలవాలంటే బూచేపల్లి కుటుంబం మద్దతు తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. అందులో భాగంగానే జగన్ వ్యూహాత్మకంగా మద్దిశెట్టి వెంట బూచేపల్లి ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఈపాటికే మద్దిశెట్టి తన సామాజిక వర్గానికి చెందిన వారితో రాజకీయ సమాలోచనలు జరిపారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంపై మద్దిశెట్టి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. మొత్తంమీద రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మద్దిశెట్టి గెలుపునకు కృషి చేస్తానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియచేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింతగా బలోపేతం చేసి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయనున్నట్లు ఆయన తెలిపారు. తన ముందున్న కర్తవ్యం మద్దిశెట్టిని గెలిపించడమే అని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలాఉండగా బూచేపల్లి, మద్దిశెట్టి వెంట తాళ్లూరు జడ్పీటీసీ మారం వెంకారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, దొనకొండ పార్టీ మండల అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కురిచేడు మండల పార్టీ అధ్యక్షుడు వెంకయ్య, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తంమీద వైకాపా దర్శి నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారనుంది.