ప్రకాశం

వ్యూహ, ప్రతివ్యూహాల్లో పాలక, ప్రతిపక్షనేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నగరా మోగకముందే మెజారిటీ నియోజకవర్గాల్లోని పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొంతమంది సొంతగా సర్వేలు చేయించుకోగా, సర్వే ఫలితాలు కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముమ్మర కసరత్తులు చేసేపనిలో నిమగ్నమయ్యారు. అధికార పక్షానికి చెందిన కొందరు ముఖ్యనేతలను ప్రతిపక్షపార్టీల నాయకులు చేర్చుకోవటం, అదే విధంగా ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులను అధికారపార్టీ నాయకులు చేర్చుకోవటం రోజువారీ తంతుగా మారింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎదోఒక నియోజకవర్గంలో నాయకుల, కార్యకర్తల కప్పదాట్లు జరుగుతూనే ఉన్నాయి.
ప్రధానంగా ఈతంతు ఎక్కువుగా దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో జరుగుతుండగా, మరికొన్ని నియోజకవర్గాల్లో సాధారణంగా జరుగుతున్నట్లు సమాచారం. దర్శి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపు లక్ష్యంగా మంత్రి శిద్దా రాఘవరావు వ్యూహాల్లో ఉన్నారు. ఈసరికే నియోజకవర్గంలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లురు, దొనకొండ, కురిచేడు మండలాల ఇన్‌చార్జ్‌లుగా తన కుటుంబ సభ్యులను నియమించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే మండలాల్లోని ప్రతి గ్రామాన్ని జల్లెడపడుతున్నారని తెలిసింది. వైసీపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలను టీడీపీలో చేర్చుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. అదేవిధంగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు మద్దిశెట్టి శ్రీ్ధర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమ అనుచరులను రంగంలోకి దింపి గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కొంతమంది తెలుగుతమ్ముళ్లను వైసీపీ గూటికి చేర్చటంలో సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. మొత్తంమీద దర్శి నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటికే రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇటీవల టీడీపీకి చెందిన కొందరు ముఖ్యనాయకులను జగన్ సమక్షంలో వైసీపీలోకి చేర్చారు. రానున్న రోజుల్లో కూడా మరికొందరు నేతల వలసలు ఉంటాయని అన్నా వర్గీయులు చెబుతున్నారు. అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్‌రెడ్డి సైతం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తన అనుచరులతో ఎప్పటికప్పుడు కుస్తీలు పడుతున్నారు.
కాగా ఇటీవల కాలంలో చీరాల రాజకీయం వేడెక్కింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీ ఇన్‌చార్జ్ యడం బాలాజీ తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరుపున ఆమంచి పోటీ చేయనుండగా, టీడీపీ తరపున పోటీచేసే అభ్యర్థిని ప్రకటించాల్సిఉంది. పర్చూరు నియోజకవర్గంలో కూడా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం పోటీచేయనుండగా టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు రంగంలోకి దిగనున్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో పర్చూరు నియోజకవర్గం ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకం కానుంది. రాష్ట్ర రాజకీయం మొత్తం పర్చూరుపైనే కనపడే అవకాశాలు ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు చెంచురాంను ఓడించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పావులు కదిపే అవకాశాలున్నాయి. కాగా తన కుమారుడిని గెలిపించుకుని తన సత్తా ఏమిటో చంద్రబాబుకు రుచి చూపించాలన్న ఉత్సాహంతో దగ్గుబాటి ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. మొత్తంమీద ఇరుపార్టీల్లో ఇప్పటికే పోటీ విషయంలో క్లారిటీ ఉన్నవారు మాత్రం వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతుండగా ఇంకా టికెట్ రాని ఆశావహులు మాత్రం టికెట్ కోసం పరుగులు తీసేపనిలో నిమగ్నమై ఉన్నారనే చెప్పవచ్చు.