ప్రకాశం

అభివృద్ధి వైపు అడుగులు.. నేడు ప్రకాశం జిల్లా 47వ ఆవిర్భావ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి వైపు అడుగులు..
నేడు ప్రకాశం జిల్లా 47వ ఆవిర్భావ దినోత్సవం
జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ప్రకాశం జిల్లా మంగళవారంనాటితో 46 సంవత్సరాలు పూర్తిచేసుకుని 47వ వసంతంలోకి అడుగుపెడుతోంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ ప్రకాశం జిల్లాను ఏర్పాటుచేశారు. మూడు జిల్లాల విభిన్న సంస్కృతులు కలిగిన జిల్లా ప్రకాశం జిల్లా. పశ్చిమప్రాంతం మొత్తం కర్నూలు జిల్లా సంస్కృతి, మార్టూరు, యద్దనపూడి తదితర ప్రాంతాలు గుంటూరు జిల్లా, కందుకూరు తదితరప్రాంతాలు నెల్లూరు జిల్లాల సంస్కృతికి చెందినవిగా ఉంటాయి. ఆయాప్రాంతాలకు చెందిన ప్రజలకు ఆ మూడు జిల్లాలతో సంబంధాలు కొనసాగుతుంటాయి.

ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,్ఫబ్రవరి 1:జిల్లాలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు అభివృద్ధి అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయనే చెప్పవచ్చు. జిల్లాకు ఇంతవరకు ఎలాంటి విశ్వవిద్యాలయాలు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఇటీవలే ఒంగోలులోని పరిసర ప్రాంతాల్లో ట్రిపుల్‌ఐటిని మంజూరు చేశారు. ఈట్రిపుల్‌ఐటిని త్వరలోనే ఏర్పాటుచేయనుండటంతో జిల్లా విద్యాపరంగా అభివృద్ధి చెందనుంది. రిమ్స్‌లో వైద్యకళాశాల జరుగుతూనే ఉంది.ప్రైవేటు పరంగా కూడా మెడికల్ కాలేజి మంజూరుకు రంగం సిద్దమైనట్లు సమాచారం. దీంతో ప్రభుత్వపరంగా మెడికల్ సీట్లు రాని జిల్లాలోని విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు కూడా అవకాశం ఉండనుంది. జిల్లాలోని దర్శి నియోజకవర్గ పరిధిలోని దొనకొండలో పారిశ్రామిక పార్కు, కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పామూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక జోన్ (నిమ్జ్) ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆమేరకు భూసేకరణ కూడా జరుగుతోంది. దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌తోపాటు, నిమ్జ్ ఏర్పాటు అయితే వెనుకబడిన ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు భారీగా కలగనున్నాయి. ప్రస్తుతం నిరుద్యోగులు ఉపాధి కోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తదితరప్రాంతాలకు వలసవెళ్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రానున్నాయి.
ఇదిలాఉండగా రైల్వేపరంగాను వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఈరైల్వేలైను నిర్మాణం జరిగితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలోను తూర్పుప్రకాశం నుండి కాకుండా పశ్చిమప్రకాశం నుండి కూడా రైళ్ళ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే భాగంగా జిల్లాలోని మార్కాపురం -పొదిలి, దొనకొండ - కనిగిరి -పామూరు రోడ్ల విస్తరణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. దీంతో రవాణావ్యవస్ధపరంగా జిల్లా అభివృద్ధి చెందనుంది. కాగా జిల్లాకు వరప్రసాది అయిన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిఅయి నీటిని పూర్తిస్ధాయిలో విడుదల చేస్తే అటుసాగుకు, ఇటు తాగునీటికి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 102కిలోమీటర్ల మేర కోస్తాతీరప్రాంతం విస్తరించి ఉంది. ఆయాప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధిచేస్తే ఆప్రాంతం మరింతగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లాలో కరవునివారణకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. మొత్తంమీద ప్రకాశం జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తుందనే చెప్పవచ్చు.

హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
* నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు
మార్కాపురం, ఫిబ్రవరి 1: ఓ యువకుని హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్షతోపాటు ఒక్కొక్కరికి 3500 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ఆరవ అదనపు జడ్జి శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం 2011 ఆగస్టు 14వ తేదీ రాత్రి పట్టణానికి చెందిన పఠాన్ ఆసిఫ్‌ఖాన్‌ను మద్యం తాగించి మండలంలోని బొడుచర్ల సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్ళి రేగులగడ్డ తిరుపతయ్య, గుత్తికొండ సుభానీ (రోబో), చాగంటి కృష్ణవేణి దారుణంగా హత్యచేసి గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్‌పోసి తగులపెట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి రూరల్ ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేయగా సిఐ రాఘవేంద్ర దర్యాప్తుచేసి నిందితులను అరెస్టు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం నిందితులు నేరం చేసినట్లు రుజువుకావడంతో రేగులగడ్డ తిరుపతయ్య, గుత్తికొండ సుభానీ, చాగంటి కృష్ణవేణిలకు యావజ్జీవ శిక్ష విధిస్తూ, ఒక్కొక్కరికి 3500 రూపాయల ప్రకారం జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీదేవి తీర్పు ఇచ్చి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇదే సమయంలో మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో జరిగిన మరో జంట హత్యల కేసులో కూడా సిఐ రాఘవేంద్ర దర్యాప్తుచేసి నిందితులను అరెస్టు చేయగా ఇటీవల ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కాగా, ఈ రెండు కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెఎల్ రాజు వాదించారు.
ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి
- విద్యార్థులకు ప్రముఖ నవలా రచయిత యండమూరి పిలుపు
చీరాల, ఫిబ్రవరి 1: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. వాణి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక రోటరి సామాజిక భవనంలో సోమవారం విద్యార్థులకు విద్యార్థి - భవిష్య ప్రణాళిక అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం తగ్గించుకోవాలన్నారు. అనవసర భయాందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో చదవాలని సూచించారు. అనంతరం పరీక్షల్లో పాటించాల్సిన నియమాలు, అనుసరించాల్సిన పద్ధతులను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు పి అహ్మద్, సంజయ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

దొనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం
భూసేకరణ వేగవంతం చేయాలి
* అధికారులకు ఆర్డీఓ ఆదేశం
కందుకూరు, ఫిబ్రవరి 1: దొనకొండలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక కారిడార్ కోసం భూసేకరణ వేగవంతం చేయాలని ఆర్డీవో జి మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో దొనకొండ మండల పరిధిలోని గ్రామాల్లో ఎపిఐఐసి వారికి కేటాయించదలిచిన భూముల సర్వే కోసం నియమించబడిన డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, సర్వే ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐ, విఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్డీఓతోపాటు ఏపిఐఐసి ఎజడ్‌ఎం జీవన్, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ నరసింహారావు తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సర్వే కోసం కేటాయించిన గ్రామాలకు సంబంధించి గ్రామ ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎల్‌ఆర్‌ను అనుసరించి సర్వే నెంబరు స్వభావం, పూర్తి విస్తీర్ణం సరిచూడాలన్నారు. భూములను తనిఖీ చేసేటప్పుడు సర్వేయర్ ఎఫ్‌ఎంవి ప్రకారం విస్తీర్ణం ఒకసారి చూసుకుని సదరు భూమిపై రైతుకు గల హక్కును గుర్తించాలన్నారు. ఆ భూమిలో ఏయే పైర్లు సాగుచేసి ఉన్నారో తదితర వివరాలను నమోదు చేయాలని సూచించారు. భూసేకరణలో పట్ట్భాములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను విడివిడిగా తయారుచేయాలని సూచించారు. పట్ట్భాముల అంశంలో తప్పనిసరిగా హక్కుదారుడి పేరు, వారసుని పేరు నమోదు చేయాలని సూచించారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి 25వేల ఎకరాలు సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పై సూచనలను సర్వే సిబ్బంది దృష్టిలో ఉంచుకుని భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ భూముల సర్వే కోసం నియమించబడిన రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి
నేత కార్మికులను ఆదుకోవాలి
- ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ పిలుపు
ఒంగోలు, ఫిబ్రవరి 1 : చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేత కార్మికులను ఆదుకోవాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రంగారాయుడు చెరువు ఎదురుగా ఉన్న ది ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో జిల్లాస్థాయి చేతనే వస్త్ర ప్రదర్శన అమ్మకాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చీరాల, వేటపాలెం, ధర్మవరం, మాధవరం, ఉప్పాడ చీరలు చీరాలు, గుంటూరు, నెరిజరీ చీరలు, సిల్క్ చీరలు, కాటన్ చీరలు, పొందూరి పంచలు, కాటన్ షర్టింగ్స్, చీరాల , మంగళగిరి డ్రస్ మెటీరియల్స్, అమ్మనబ్రోలు, ఉలిచి, ఈతముక్కల లుంగీలు, షర్టింగ్స్ మొదలగు చేనేత ఉత్పత్తులు తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ చేనేత వస్త్ర ప్రదర్శలు ఈనెల 1వ తేది నుండి 8వ తదివరకు ఉంటుందన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు, ఒంగోలు నగర ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ సతీమణి శైలజ, చేనేత జౌళిశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు కమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సింగరాయకొండ, ఫిబ్రవరి 1: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం కలికవాయి రోడ్డు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు చిత్తూరుకు చెందిన ఎం రాజేష్, చెన్నైకు చెందిన కుమార్ అనే ఇద్దరు మిత్రులు వారి స్నేహితులను కలిసేందుకు కారులో విజయవాడకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున కలికవాయి రోడ్డు సమీపంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో చిత్తూరుకు చెందిన రాజేష్ అక్కడికక్కడే మృతిచెందగా, చైన్నైకు చెందిన కుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న సింగరాయకొండ ఎస్‌ఐ వైవి రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన కుమార్‌ను 108 సహాయంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుమార్ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలి
ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఒంగోలు ఎంపి వైవి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 1:ప్రకాశం జిల్లా అవతరించి 46 వసంతాలు పూర్తిచేసుకుని 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1970 సంవత్సరం ఫిబ్రవరి 2న జిల్లా అవతరించిందని, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటుచేశారని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అవతరించి 47సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి జిల్లాను ఆదుకోవాలన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లాలో రాష్ట్రం ఎలాంటి ప్రోత్సాహాలు కాని, పరిశ్రమలను కాని ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు కేంద్రం నుండి నిధులను రాబట్టేందుకు తన వంతు కృషిచేస్తానని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
మార్కాపురం, ఫిబ్రవరి 1: ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సర్ట్ఫికెట్ల కోసం కాలేజీకి వెళ్ళిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్కాపురం గ్రామీణ ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు సోమవారం తెలిపారు. ప్రకాశంజిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం విజయలక్ష్మీ స్థానిక శామ్యూల్‌జార్జి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ పూర్తిచేసిందని, అయితే గతనెల 20వ తేదీన టిసి తీసుకునేందుకు కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గత పది రోజులుగా వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు, ఆమేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.