ప్రకాశం

భలే మంచి ‘బెయిల్’ బేరము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, మార్చి 17: న్యాయస్థానాల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తూ కాసుల కక్కుర్తికి పాల్పడుతున్నారా? డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా కొంత మంది ‘రింగు’ మాస్టర్లు బెయిళ్ల వ్యవహారాన్ని నడి బజారులో బేరానికి పెట్టారా? ఈ ప్రశ్నలకు నేడు పలువురు ఔననే భావం వెలిబుచ్చుతున్నారు. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తేటతెల్లం చేస్తున్నాయి. ఒక వైపు చీరాల్లో బెయిల్ ఇప్పిస్తానంటూ ఓ కానిస్టేబుల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. మరో వైపు కందుకూరులో ఏకంగా న్యాయమూర్తిని విధుల నుంచి తప్పించాలంటూ అక్కడి న్యాయవాద సంఘం ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. న్యాయం కోసం సమాజంలో ఎక్కువ శాతం మంది బాధితులు కోర్టులను ఆశ్రయిస్తారనేది వాస్తవం. న్యాయస్థానంలో అయితే తమకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం వారిని ఆ దిశగా అడుగులు వేయిస్తుంది. ఓ కేసులో బెయిల్ ఇప్పిస్తానంటూ రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్న చీరాలకు చెందిన కానిస్టేబుల్ గత నెలలో అనిశా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో పోలీసు అధికారులతో పాటు న్యాయ అధికారులు ఉలిక్కిపడ్డారు. కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి బెయిల్ ఇప్పించగలడా అన్న సందేహం తలెత్తింది. ఈ విషయంలో ఓ కోర్టులో పని చేసే ఓ వ్యక్తి రాయబారం నడిపినట్లు సమాచారం. గతంలో రెండో పట్టణ పోలీసు కార్యాలయం తరఫున కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేసిన పై వ్యక్తి మధ్యవర్తిగా సదరు ఉద్యోగి బేరానికి తెరలేపినట్లు తెలుస్తుంది. పట్టుబడిన రూ.60 వేలలో వీరిద్దరికి చెరో రూ.5వేలు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు చీరాల్లో కొత్త కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొద్ది నెలల క్రితం సంచలనం రేపిన కాల్‌మనీ వ్యవహారంలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 2 వారాల తర్వాత రిమాండ్‌లో ఉన్న అతనికి బెయిల్ మంజూరైంది. అందుకోసం లక్ష రూపాయలు ఖర్చయినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి. అయితే అది కేవలం లక్ష కాదని, దాదాపు రూ.5 లక్షలు వివిధ స్థాయిల్లో చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు మధ్యవర్తులెవరైనా ఇటువంటి సాహసానికి ఒడిగడుతున్నారా లేక అందిన కాడికి దండుకుందామన్న అత్యాశతో నిజంగానే బెయిళ్లను బేరానికి పెట్టారా అన్నది తేల్చాల్సి ఉంది. అప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణలో మూడో స్తంభంగా నిలిచే న్యాయస్థానాన్ని అశ్రయించే ప్రజలకు వాటిపై నమ్మకం ఏర్పడుతుంది.