ప్రకాశం

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 14: మళ్లీ ఎండలు మండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఎండలు, మరోపక్క ఎత్తుగాలులతో రైతులు సాగుచేసిన పంటలు వాడుముఖం పడుతున్నాయి. ఈ సమయానికి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురిసి భూమి పదును చేరి రైతులు సాగుచేసిన పంటలన్ని కళకళాలాడాల్సి ఉండగా అందుకు భిన్నంగా జిల్లాలో వాతావరణం ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో గురువారం సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా వడగాల్పులతో కూడిన ఎత్తుగాలులు వీస్తుండటంతో ప్రజలు కూడా అనారోగ్యం పాలౌతున్నారు. ఒక్కొక్క రోజు ఆకాశం మేఘావృతం అవుతోందే తప్ప వర్షం వర్షించని పరిస్థితి నెలకొంది. గతంలో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవటంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలను సాగుచేశారు. కాని ఈనెలలో వర్షాలు లేక ఎండలు భగ్గుమంటుండటంతో బోర్లల్లోను నీరురాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల 35వేల 857 హెక్టార్లల్లో వివిధ పంటలను రైతులు సాగుచేయాల్సి ఉండగా కేవలం ఇప్పటివరకు సుమారు 38వేల హెక్టార్లల్లో మాత్రం సాగుచేశారు. ప్రధానంగా జిల్లాలోని పలుప్రాంతాల్లో సజ్జ, పెసర, నువ్వు, కంది,పత్తి పంటలను నామమాత్రంగానే సాగుచేశారు. రైతులు సాగుచేసిన పంటలు సైతం ఎండలకు వాడుముఖం పడుతున్నారు. ముఖ్యంగా కొత్తపట్నం మండలంలో వేరుశనగ పంటను సాగుచేసిన రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. సక్రమంగా నీరు అందక వేరుశనగ పంట వాడుముఖం పట్టింది. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం,బేస్తవారిపేట, దొనకొండ, రాచర్ల, కనిగిరి, కంభం, తాళ్ళూరు, గిద్దలూరు మండలాల్లో భూగర్భజలాలు నానాటికి అడుగంటిపోతుండటంతో ఆయాప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలునగరానికి సైతం నాలుగురోజులకోక సారినీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సక్రమంగా మంచినీరు అందటం లేదని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ దృష్టికి కూడా నగర ప్రజలు తీసుకువచ్చారు. జిల్లాలోని పొదిలి, పామూరు, కనిగిరి, అద్దంకి తదితర ప్రాంతాల్లోను మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామతీర్థం, గుండ్లకమ్మ జలాశాయాల్లోను నీటిమట్టం గణనీయంగా పడిపోవటంతో ఆయకట్టుపరిధిలోని రైతులతోపాటు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గుండ్లకమ్మ కెపాసిటి 3.659 టిఎంసిలు కాగా అడుగంటిపోయాయి. కాగా కొమ్మమూరు కాల్వకింద నాటిపైడ్, నాన్‌నోటిఫైడ్ చెరువుల్లో ఎక్కువశాతం అడుగంటిపోయాయి. రానున్న రోజుల్లో కూడా జిల్లావ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ఖరీప్‌సాగుపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోదావరి నదిలో మాత్రం వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో మాత్రం నీరు లేకుండాపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల్లోను నీరు అడుగంటిపోయింది. ఈలాంటి తరుణంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నాగార్జున సాగర్ డ్యాంనుండి జిల్లాకు తాగు,సాగునీరు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ఎండలు మండుతుండటంతో ఉప్పు ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. దీంతో రైతాంగం మొత్తం ఆ ఉప్పు ఉత్పత్తిచేసే పనిలో నిమగ్నమై ఉంది. మొత్తంమీద తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మాత్రం జిల్లాలో కరవు పరిస్థితులు రానున్న రోజుల్లో విలయతాండవం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.