ప్రకాశం

ఆర్టీసీ బస్సు - డిసిఎం వ్యాన్ ఢీకొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, జూలై 15: ఆర్టీసీ బస్సు, డిసిఎం వ్యాన్ ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని తాడివారిపల్లి జంక్షన్ సమీపంలో కోటయ్యకుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మద్యం మత్తులో డిసిఎం వాహన డ్రైవర్ అతివేగంగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును రాసుకుంటూ పోవడంతో బస్సులో కూర్చున్న ప్రయాణికుని శిరస్సు తెగి డిసిఎం వ్యాన్‌కు వేలాడుతూ సుమారు 15కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగా మొండెం మాత్రం ఆర్టీసీ బస్సులోనే రక్తపుమడుగులో పడిఉంది. తోటి ప్రయాణికులు బేస్తవారపేట పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమై సంబంధిత వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తివివరాలిలా ఉన్నాయి. కనిగిరి ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కంభం నుంచి కనిగిరి బయలుదేరగా బేస్తవారపేటలో ఓ ప్రయాణీకుడు బస్సు ఎక్కి కనిగిరికి టిక్కెట్టు తీసుకున్నాడు. బస్సు తాడివారిపల్లి జంక్షన్ సమీపంలోని కోటయ్యకుంట వద్దకు చేరుకోగా ఎదురుగా లోడ్‌తో వస్తున్న డిసిఎం వ్యాన్ అతివేగంతో వచ్చి బస్సును రాసుకుంటూ పోయింది. ఈ సమయంలో ఆర్టీసీ బస్సుడ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఘోరప్రమాదం తప్పింది. అయితే బస్సు చివరి సీటులో కూర్చుని ఉన్న గుర్తుతెలియని ప్రయాణికుని తలభాగం తెగి డిసిఎం వ్యాన్‌కు అతుక్కుపోయింది. కేవలం మొండెం మాత్రమే బస్సులో ఉండిపోయింది. మృతుని వయస్సు 50సంవత్సరాలు ఉంటుందని, తెల్లపంచ, చారలచొక్కా, టవల్, ప్యారగన్ చెప్పులు ధరించి ఉన్నాడు. మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. మృతుని తలభాగం డిసిఎం వ్యాన్‌కు అతుక్కొని నుజ్జునుజ్జుగా మారి రక్తసిక్తంగా గుర్తుపట్టని విధంగా ఉండటంతో మృతుడు ఎవరనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. తాడివారిపల్లి ఎస్సై చౌడయ్య సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం సేవించడమే ప్రమాదానికి కారణం
ప్రమాదానికి కారణమైన డిసిఎం వ్యాన్ డ్రైవర్ అతిగా మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి ముందు ఉన్న తాడివారిపల్లి జంక్షన్‌లో అతివేగంగా వెళ్తున్న డిసిఎం వ్యాన్‌ను చూసి అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. స్పీడ్‌బ్రేకర్లు ఉన్న విషయాన్ని కూడా గుర్తించకుండా వెళ్ళడంతో రోడ్డుపక్కన ఉన్నవారు పరుగులు తీశారు. ఈ విషయం నుంచి తేరుకోకముందే కోటయ్యకుంట వద్ద ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు తెలిపారు.