ప్రకాశం

అమ్మో.. ఎండ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు :ప్రచండభానుడు ధాటికి జిల్లా నిప్పులకొలిమిగా మారింది. వేసవికాలం పూర్తిస్థాయిలో ప్రారంభంకాకముందే భానుడి తీవ్రత పెరిగితో రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళనలో జిల్లాలోని ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఒక్కరోజులోనే మూడుడిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరగటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తవౌతుంది. సాధారణంగా రోజురోజుకు ఒక్కొక్క సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదుఅవుతుంటాయి. కాని ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగటంతో జిల్లాలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల 16వతేదీన 33.3సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదుకాగా, 17వతేదీన 34.5, 18వతేదీన 34.4, 19వతేదీన 35.5 నమోదైంది. కాగా ఆదివారం ఒక్కరోజే 38సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలకు నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఉదయం పదిగంటల నుండే ఎండ తీవ్రత పెరగటంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు సుముఖత చూపలేదు. ఆదివారం కావటంతో ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లకపోవటంతో వారు ఊపిరీపీల్చుకున్నారు. మిగిలిన వారంతా రోడ్లపైకి రాకపోవటంతో ముఖ్యంగా ఒంగోలునగరంలోని పలుకూడలిప్రాంతాల్లో జనసంచారం తగ్గిందనే చెప్పవచ్చు. ఇదిఇలాఉండగా జిల్లావ్యాప్తంగా సోమవారంనుండి పదవతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30గంటలనుండి మధ్యాహ్నాం 12.30గంటల వరకు పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్ధులు పరీక్షా హాళ్ళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఇప్పటినుండే ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు
మెరుగైన సౌకర్యాలు
ఎస్కలేటర్‌ను ప్రారంభించిన ఎంపి వైవి సుబ్బారెడ్డి
ఒంగోలు, మార్చి 20: ఒంగోలు రైల్వేస్టేషన్‌లో కోటి రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఎస్కలేటర్‌ను ప్రారంభించిన అనంతరం ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డితో పాటు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) అశోక్‌కుమార్ తదితరులు ఎస్కలేటర్‌పై ఎక్కి పరిశీలించి ఈ ఎస్కలేటర్ ప్రయాణికులకు చాలా సౌకర్యవంతగా ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రైల్వేస్టేష్టన్‌లో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో తాను గతంలో కేంద్ర రైల్వే శాఖామంత్రిని కలిసి ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్ ఏర్పాటుకు కృషిచేయాలని కోరిన మీదట ఆ మేరకు మంత్రి స్పందించి వెంటనే ఒక కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే పైకి ఎక్కేందుకు ఎస్కలేటర్ ఉందని అయితే కిందకు దిగేందుకు ఎస్కలేటర్ లేదని త్వరలో ఈ విషయాన్ని తిరిగి కేంద్ర రైల్వేశాఖా మంత్రి దృష్టికి తీసుకుపోయి కిందకు దిగేందుకు కూడా ఎస్కలేటర్‌ను ఏర్పాటుచేయాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా అవతలవైపు ఉన్న రెండవ లైన్ రైల్వేప్లాట్‌ఫారంపై ప్రయాణికుల సౌకర్యార్థం మరో సాధారణ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని పక్కనే ఉన్న డిఆర్‌ఎం అశోక్‌కుమార్‌ను ఎంపి సూచించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఒక ఎటిఎంను రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేయాలని డిఆర్‌ఎంకు సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లాలోని శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో శభరి ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపే విధంగా చర్యలు తీసుకున్నందుకు రైల్వేశాఖామంత్రి , రైల్వే ఉన్నతాధికారుకుల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ శభరి రైలు శింగరాయకొండలో నిలపటం ద్వారా జిల్లాలోని 6 నియోజక వర్గాల ప్రజకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ఎంపి తెలిపారు. టంగుటూరు రైల్వేస్టేషన్‌లో కూడా పద్మావతి, సర్కార్ , చెన్నై టు హైదరాబాద్ లాంటి మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం నిలిపే విధంగా చూడాలని ఎంపి వైవి సుబ్బారెడ్డి డిఆర్‌ఎంను కోరారు. అదే విధంగా టంగుటూరు, శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లలో ఇతర ఆధునీకరణ పనులు చేపట్టి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందకు కృషి చేయాలని డిఆర్‌ఎంకు సూచించారు. అదేవిధంగా రాజస్తాన్‌కు చెందిన సుమారు 10వేల మంది వివిధ పనులపై జిల్లాకు వచ్చి నివాసం ఉంటున్నారని, వారు రాజస్తాన్ వెళ్ళాలంటే ఒంగోలులో చెన్నై టు జ్యోతిపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం ఒంగోలు రైల్వేస్టేషన్‌లో చెన్నై టు జ్యోతిపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఎంను ఎంపి వైవి సుబ్బారెడ్డి కోరారు. దీంతో స్పందించిన డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ఒంగోలు ఎంపి తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను తాను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విలేఖర్ల సమావేశం అనంతరం డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ఒంగోలు రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పరిశీలించి రైల్వేస్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఆర్‌యుసి సభ్యులు వేమూరి సూర్యనారాయణ, వైకాపా ఒంగోలు నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ , తదితర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు ఎంపి వెంట వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి, వైకాపా రాష్ట్ర నాయకులు చుండూరి రవి, వైకాపా వాణిజ్య విభాగం అధ్యక్షులు డి క్రాంతికుమార్, నాయకులు ప్రభాకర్, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఎంపి వైవి సుబ్బారెడ్డిని సత్కరించిన వేమూరి సూర్యనారాయణ
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్కలేటర్‌ను ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ప్రారంభించిన సందర్భంగా ఆదివారం డిఆర్‌యుసిసి సభ్యులు వేమూరి సూర్యనారాయణ కలిసి ఒంగోలు రైల్వేస్టేషన్‌లోని సమస్యలను ఎంపి వైవి సుబ్బారెడ్డికి వివరించి అనంతరం శాలువతో సత్కరించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటుచేయాలని ఎంపికి సూర్యవివరించారు.

సెక్యులరిజానికి నిజమైన అర్థం హైందవ ధర్మం
* మంత్రి మాణిక్యాలరావు స్పష్టం
యర్రగొండపాలెం, మార్చి 20: సెక్యులరిజానికి అసలైన అర్థం హైందవ ధర్మం అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం మండలంలోని కొలుకుల గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సభకు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి యక్కలి రాఘవులు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నదే హిందూ ధర్మం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతివ్యక్తిలో దైవత్వం, సేవాతత్వం ఉండాలని అన్నారు. ప్రకృతిని ఆరాధించడం, మనుషులను గౌరవించడం ద్వారా సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. వైపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి దేవస్థానానికి ఇప్పటికే కోటి 70లక్షల రూపాయల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. సరైన ప్రణాళికలు తయారుచేసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొలుకుల గ్రామంలోని పురాతనమైన శివాలయంలో దూప దీప నైవేద్యం పథకం ద్వారా అర్చకులను నియమించనున్నట్లు తెలిపారు. పలువురు గ్రామస్తులు కొలుకుల గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా, దత్తత సాధ్యం కాదని, దేవాలయాల అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందచేస్తానని హామీ ఇచ్చారు. పురాతనమైన దొరువును కోనేరుగా మార్చేందుకు చర్యలు చేపడతానని తెలిపారు. నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిన్నజీయర్‌స్వామి ఏప్రాంతంలో అడుగుపెడితే అక్కడ కరవు కాటకాలు తొలగిపోతాయని అన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ తాను చిన్నజీయర్‌స్వామి ప్రవచనాన్ని ఓ పాఠశాల విద్యార్థిగా ఎంతో శ్రద్ధగా విన్నానని తెలిపారు. ఈసందర్భంగా చిన్నజీయర్‌స్వామి చేసిన ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి శిద్దా లక్ష్మీపద్మావతి, నిర్మల, శారద, విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ అధ్యక్షులు సాయిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా బాలాజీ సేవాసమితి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి వెంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. తొలుత యర్రగొండపాలెంలోని పశువుల వైద్యశాల స్థలాన్ని టిటిడి కల్యాణ మండపం ఏర్పాటుకు మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పరిశీలించారు.

నేటి నుండి శింగరకొండ వార్షిక తిరునాళ్లు
నేడు మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం
అద్దంకి, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి 61వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరగనున్న మహోత్సవాల్లో చివరిరోజైన బుధవారం స్వామివారికి తిరునాళ్లు నిర్వహిస్తారు. శింగరకొండపైన వెలసి ఉన్న క్షేత్రాధిపతి శ్రీలక్ష్మీనరసింహస్వామి శింగరకొండకు వచ్చే భక్తులను కాపాడుతుంటాడని భక్తుల నమ్మకం. క్షేత్రానికి వచ్చిన వారు ముందుగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని, తరువాత కొండ క్రింద వెలసి ఉన్న శ్రీప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చెడి దేవునిగా ప్రసిద్ధికెక్కిన శ్రీస్వామివారికి తమలపాకుల పూజలంటే మక్కువెక్కువ, భక్తులంతా స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేయించడం ఇక్కడ ఆనవాయితీ. దేవాలయం వెనుకభాగంలో ఉన్న భవనాశి తటాకంలో పుణ్యస్నానాలాచరించి, స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. దేవాలయానికి తూర్పు, పడమర భాగాల్లో రెండు కొండలు, వెనుకవైపు తటాకం ఉండి దక్షిణ ముఖంగా వెలసి ఉండడంతో శ్రీస్వామివారు దక్షిణముఖాంజనేయ స్వామిగా ఖ్యాతికెక్కారు. భక్తులు దేవాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించుకొని స్వామివారి దర్శనం చేసుకుని మొక్కుబడులు తీర్చుకుంటుంటారు. దేవాలయం కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ ఆధ్వర్యంలో దేవాలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేవాలయం ముందు గతంలో ఉన్న ఆక్రమణలను తొలగించి భక్తులు వాహనాలు నిలుపుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని, అదేవిధంగా దేవాలయంలో తీర్థప్రసాదాలతో పాటు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, దేవాలయం ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. నేటి నుండి మూడు రోజుల పాటు జరుగనున్న వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో తిరునాళ్ల మహోత్సవాన్ని విజయవతం చేయాలని ఆమె కోరారు. సోమవారంనాడు శ్రీస్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు జరుగుతాయని, మేదరమెట్ల శంకరారెడ్డి గారి చేతుల మీదగా వార్షికోత్సవం ప్రారంభం జరుగుతుందని, మూడురోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా ఆమె కోరారు.
శింగరకొండలో ఆక్రమణల తొలగింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండలో తిరునాళ్ల సందర్భంగా దేవాలయం ముందు ఉన్న ఆక్రమణలను ఆదివారం తొలగించారు. దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుని దుకాణాలు, గుడిసెలు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆక్రమణలను తొలగించారు. దేవాలయం కార్యనిర్వహణాధికారిణి ఆర్.రమణమ్మ నేతృత్వంలో అద్దంకి ఎస్సై సిహెచ్.వెంకటేశ్వర్లు, పోలీస్‌సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, అద్దంకి మున్సిపాలిటీ సిబ్బంది ఆక్రమణల తొలగింపులో పాల్గొన్నారు. ప్రొక్లైనర్‌లతో ఆక్రమణలు తొలగించి, ఆక్రమణదారులను హెచ్చరించారు.
జాతర విద్యుత్ ప్రభలకు నిబంధనలు
శింగరకొండ తిరునాళ్లను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని సిఐ బి ప్రసాదు కోరారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విద్యుత్‌ప్రభల నిర్మాణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ప్రభలపై అశ్లీల నృత్యాల ప్రదర్శనకు అనుమతులు లేవన్నారు. అదేవిధంగా ఒక్కొక్క ప్రభకు 100మైకులు ఏర్పాటు చేసుకోవచ్చునని, వెహికిల్ పాస్‌లు కూడా పరిమితంగానే ఇవ్వనున్నట్లు తెలిపారు. 700మంది పోలీసులతో శింగరకొండ తిరునాళ్లలో పఠిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా సంబంధిత విద్యుత్‌ప్రభ కమిటీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరు ఏర్పాటు చేసుకున్న ప్రభ వద్ద ఆయా కమిటీ సభ్యులు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి 10గంటల నుండి ఒంటిగంట వరకు మాత్రమే ప్రభలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ తరువాత ప్రదర్శనలు చేస్తే చర్యలుంటాయన్నారు. ఈసమావేశంలో ఎస్సై సిహెచ్.వెంకటేశ్వర్లు, ప్రభల ఏర్పాటు కమిటి సభ్యులు పాల్గొన్నారు.
తిరునాళ్లకు ఏడు విద్యుత్ ప్రభల ఏర్పాటు
శింగరకొండ తిరునాళ్లలో ఏడు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయనున్నారు. 1.అద్దంకి తెలుగుదేశం పార్టీకి చెందిన వారిది, 2.వడ్డెర కులానికి చెందిన వారు నిర్మించేది, 3.సందిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్మించేది, 4.శింగరకొండపాలెం టిడిపి, 5.శింగరకొండపాలెం వైసిపిప్రభ, 6.ముప్పవరం గ్రామానికి చెందిన వారు నిర్మించే ప్రభ, 7.బొప్పిడోరిపాలెం గ్రామానికి చెందిన వారు నిర్మించే ప్రభతో కలిపి ఏడు ప్రభలు తిరునాళ్లలో దర్శనమివ్వనున్నాయి.

హత్య కేసులో నిందితుల అరెస్టు
దర్శి, మార్చి 20 : ఆస్తి కోసం కన్న తండ్రి కర్కశంగా తన కుమారుడ్ని హతమార్చిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు తెలిపారు. ఆదివారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి వి శ్రీరాంబాబు మాట్లాడుతూ ఈనెల 4వ తేదిన ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామంలో ముప్పా మోహన్‌రావును కర్కశంగా హత్య చేయడం జరిగిందన్నారు. మృతుని మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కన్న తండ్రే ఆస్తి కోసం హత్య చేసినట్లు తెలిపారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన ముప్పా రామస్వామిని తన పెద్ద తండ్రిముప్పా లక్ష్మీ నర్సు దత్తత తీసుకుని తన యావదాస్తిని ముప్పా రామస్వామి కుమారులైన ముప్పా శ్రీనివాసరావు, ముప్పా మోహన్‌రావుకు చెరో ఐదు ఎకరాలను రాసి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే గత కొంతకాలం క్రితం రామస్వామి పెద్దకుమారుడ్ని ఆస్తి కోసమే ప్రస్తుతం మృతి చెందిన మోహన్‌రావు, తన తల్లి హత్య చేయించినట్లు తెలిపారు. మోహన్‌రావు గతంలో ఐదు లక్షల రూపాయలు తండ్రి రామస్వామికి ఇంటి రిపేరు నిమిత్తం ఇవ్వడం జరిగిందని, అయితే ఆ ఐదు లక్షలు రామస్వామి ఇల్లు రిపేరు చేయించకుండా తన తమ్ముడు కుమారుడు, మరో నిందితుడు అయిన మువ్వా హనుమంతరావుకు ఇవ్వడం జరిగిందన్నారు. తండ్రిపై ఆగ్రహం చెందిన మోహన్‌రావు తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రామస్వామి, హనుమంతరావులు మాట్లాడుకొని మోహన్‌రావును డబ్బులు ఇస్తామని విజయవాడ నుండి పిలిపించడం జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మోహన్‌రావుపై తండ్రి రామస్వామి, హనుమంతరావు దాడి చేసి చంపారని తరువాత మృతుని మోటార్ సైకిల్‌పై పారిపోయారన్నారు. ఆదివారం పోలీసులు నిందితులతో పాటు మోటార్‌సైకిల్‌ను కూడా పులిపాడు శివాలయం వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ సందర్బంగా డియస్‌పి మాట్లాడుతూ ఇవి కేవలం ఆస్తుల కోసమే మానవ సంబంధాలను మర్చి హత్యలు చేసుకోవడం జరిగిందని, ఇవి ఎలాంటి ఫ్యాక్షన్‌కు సంబంధించినవికాని, వర్గాలకు, పార్టీలకు సంబంధించిన హత్యలు కావని తెలిపారు. నేటి సమాజంలో ఆస్తుల కోసం మానవ సంబంధాలను కూడా మరిచి హత్యలను దారి తీస్తున్న సందర్భంలో డివిజన్ పరిధిలోని సివిల్ కేసులను ముందుగా గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన హత్య కేసుల్లోని నిందితులందరిపై రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐ కెవి రాఘవేంద్ర, ముండ్లమూరు ఎస్‌ఐ బాలరంగయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.