ప్రకాశం

జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పర్చూరు మండలం అడుసుమల్లి వద్ద సాకివాగు పొంగి ప్రవహిస్తుండటంతో పర్చూరు- గుంటూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో రైతులు సాగుచేసిన పత్తి, మిర్చిపంటలు మునిగిపోయాయి. ఈ వర్షం వల్ల జిల్లాలోని రైతాంగానికి ఎలాంటి నష్టం లేదని జిల్లా వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ ‘ఆంధ్రభూమి ప్రతినిధికి’ తెలిపారు. ఈ వర్షాలు రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మినుము, పత్తి, వరినాట్లను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గిద్దలూరు మండలంలోని అకవీడు-చోళ్లవీడు మధ్య గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా అర్ధవీడు మండలం బొల్లాపల్లి- వీరభద్రాపురం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గిద్దలూరులోని బ్రహ్మేశ్వర రిజర్వాయర్ మట్టికట్ట తెగిపోవడంతో నీరంతా వృధాగా పోయింది. ఇదిలాఉండగా రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలోను భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా నెలసరి సరాసరి వర్షపాతం 133.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 127.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం సరాసరిన 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పర్చూరు మండలంలో 77.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లల్లో ఈ విధంగా ఉన్నాయి. యద్దనపూడి మండలంలో 71.2 మిల్లీమీటర్లు, మార్టూరులో 53, సంతమాగులూరులో 50.4, అర్ధవీడులో 43.6, కారంచేడులో 41.8, చీరాలలో 39.6, వేటపాలెంలో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకొల్లులో 28, బల్లికురవలో 27.2, జెపంగులూరులో 27.2, అద్దంకిలో 23.4, పుల్లలచెరువులో 20.6, గిద్దలూరులో 19.4, కొరిశపాడులో 18.2, చినగంజాంలో 17.4, బేస్తవారిపేటలో 16.6, రాచర్లలో 16.4, యర్రగొండపాలెంలో 13.2, సింగరాయకొండలో 11.8, ఒంగోలులో 10.4, మార్కాపురం, కంభంలో 9.2, ముండ్లమూరు, మద్దిపాడులో 7.8, తాళ్లూరులో 7.2, జరుగుమల్లిలో 6.8, సంతనూతలపాడులో 6.4, త్రిపురాంతకంలో 4.6, పెద్దారవీడులో 4.6, కొమరోలులో 3.8, తర్లుపాడు, కొత్తపట్నంలో 3.6, దోర్నాలలో 3.4, దర్శి, పిసిపల్లిలో 3.2, ఉలవపాడులో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కురిచేడులో 2.6, దొనకొండ, చీమకుర్తిలో 2.4, కందుకూరులో 2.2, మర్రిపూడిలో 1.6, టంగుటూరులో ఒక మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. మొత్తంమీద పలు మండలాల్లో భారీవర్షం కురవగా, మరికొన్ని మండలాల్లో మాత్రం స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇదిలాఉండగా రానున్న రోజుల్లో జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు నగరంలో డ్రైనేజి సమస్య జఠిలంగా ఉంది. ఇటీవల ఒంగోలు నగరంలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, మురికికాల్వలు పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
* జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి

ఒంగోలు, సెప్టెంబర్ 22 : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఉదయం విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్లతో భారీ వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణనష్టం కలగకుండా చూడాలని, అలాగే ఆస్తినష్టాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్తలు చేపట్టి నష్టాలను నివారించాలని సూచించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడితే ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని, అందరూ సీరియస్‌గా తీసుకొని చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వరదలు, విపత్తులకు సంబంధించిన వివరాలను కంట్రోల్ రూమ్‌కు అందించేలా చూడాలని, నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు. గంట గంటకూ వర్షపాతం తెలుసుకొని సమాచారం పొంది తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు పంపిన సమాచారం ఎంత వాస్తవమో తెలుసుకొని పంపాలని సూచించారు. ప్రధానంగా భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశముందని, గుర్తించి వాటిని తొలగించాలని, అవసరమైన సిబ్బందిని, యంత్ర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. విపత్తుల సమయంలో ప్రజల సహకారం పొందాలన్నారు. భారీ వర్షాల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు అవసరమైన ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏ ప్రాంతంలో అధిక వర్షపాతం ఉందో తెలుసుకొని అక్కడ తగిన సహాయక చర్యలు చేపట్టాలని, మీకు ఏం అవసరం ఉందో తెలిపితే ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా చెరువులు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోకాజ్‌వేలో వరద నీరు ప్రవహించే సమయంలో ఎటువంటి వాహనాలు ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. భారీవర్షాలు కురుస్తున్నందున 24 గంటలు అసెస్‌మెంట్ చేసి నష్టాలను నివారించాలన్నారు. విపత్తుల సమయంలో ప్రజలను ప్రమాదం నుంచి రక్షించే కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులందరూ బాధ్యతగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మాట్లాడుతూ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఆర్‌డివో కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ యం హరిజవహర్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ నర్సింగరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ మర్దన్‌ఆలీ, పిఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, జెడి అగ్రికల్చర్ మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ రమేష్, ప్లానింగ్ డిడి భరత్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో వేర్వేరు కేసుల్లో తొమ్మిదిమంది దొంగలు అరెస్ట్
*25 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
* జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ వెల్లడి
ఒంగోలు, సెప్టెంబర్ 22: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడిన తొమ్మిదిమంది దొంగలను పోలీసులు అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.25 లక్షల విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లాఎస్‌పి త్రివిక్రమవర్మ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ మాట్లాడుతూ జిల్లాలోని దర్శి పోలీసుస్టేషన్ తోపాటు ఒంగోలు తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో 16 కేసుల్లో నిందితులైన సియస్ పురం మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన చింతల సిసింద్రి తోపాటు, ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన తోట వంశీకృష్ణ, గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్‌లోని ఇస్లాంపేటకు చెందిన కోటా ప్రేమ్‌కుమార్, చీమకుర్తి టౌన్‌లోని కంచుకోట బజార్‌కు చెందిన చల్లా హరికృష్ణ, అనసాని అశోక్‌లను గురువారం జిల్లాలోని సంతమూగులూరు పోలీసుస్టేషన్ పరిధిలోని బల్లికురవ బస్‌స్టాండ్ సెంటర్ శివారులోని సంతమాగులూరు గ్రామం కెజి రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 16 లక్షల 20వేల రూపాయల విలువ కలిగిన 540 గ్రాముల బంగారం , 30వేల రూపాయల విలువైన 505 గ్రాముల సిల్వర్ వస్తువులు, 6 లక్షల విలువైన ఐదు మోటారు బైక్‌లు, 50 వేల రూపాయల విలువైన ఒక ల్యాప్‌ట్యాప్, ఒక ట్యాబ్, ఒక కెమెరా కలిపి మొత్తం సుమారు 23 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును ఫిర్యాదుదారులకు అందజేయనున్నట్లు ఎస్‌పి తెలిపారు. విలేఖర్ల సమావేశంలో దర్శి డిఎస్‌పి రాంబాబు, ఒంగోలు పట్టణ డిఎస్‌పి జి శ్రీనివాసరావు, సిఐలు రాఘవేంద్రరావు, భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.

గుండ్లకమ్మ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి
* కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో 1077 టోల్‌ఫ్రీ ఏర్పాటు * జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి

ఒంగోలు, సెప్టెంబర్ 22 : భారీ వర్షాల కారణంగా గుండ్లకమ్మకు భారీగా వరదనీరు చేరుతుందని, గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని జిల్లా కలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వీడియో సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టరేట్‌లో భారీ వర్షాలకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లో 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌ను, అలాగే ల్యాండ్ ఫోన్ నెంబర్ 08592-281400ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులందరూ ప్రధాన స్థావరాల్లో ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని, అలాగే వాగులు, వంకల వద్ద హైఅలర్ట్ చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో వివిధ శాఖలకు చెందిన విద్యుత్, ఆర్‌అండ్‌బి, అగ్రికల్చర్, పశుసంవర్థకశాఖ, ఉద్యానవన శాఖ, డిఎంహెచ్‌వో, పోలీసు, జల వనరులశాఖ, ప్రాజెక్టుల శాఖల నుంచి ఒక అధికారి విధుల్లో ఉంచాలని కలెక్టర్ సూచించారు. వరద ఉద్ధృతి ఉన్న చోట ప్రమాద నివారణ చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ముందస్తు ప్రణాళికలతో జిల్లాలో ఏలాంటి అస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదం నుంచి రక్షించిన వారికి తగిన పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
డివిజన్ కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు తెరవాలి
జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకునేందుకు వీలుగా జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను తెరవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ వర్షాల కారణంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై డిఆర్‌వో, ఆర్డీవోలు, అదనపుఎస్‌పి, డిఎస్‌పిలు, నీటి పారుదలశాఖ, ఎస్‌పిడిసిఎల్ ఎస్‌ఈలు, జిల్లా పంచాయితీ అధికారి, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు పడుతున్న దృష్ట్యా ఏ ప్రమాద సంఘటన జరిగినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఒంగోలుతో సహా డివిజన్ కేంద్రాల్లో నిరంతరం పనిచేసే కమాండ్ కంట్రోల్ కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్ కేంద్రాలకు అందిన సమాచారాన్ని జిల్లా కేంద్రాలకు చేరవేయాలన్నారు. రాచర్ల మండలంలో వరద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నట్లు తెలుస్తోందని, కొన్ని వాహనాలు నిలిచిపోయాయన్నారు. గుండ్లకమ్మ, ముసి, పాలేరు తదితర నదుల ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడైనా చెరువులకు గండిపడినా, రహదారులు దెబ్బతిన్నా, విద్యుత్ స్తంభాలు పడిపోయినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లినా, ప్రాణనష్టం వాటిల్లినా అలాంటి సమాచారాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరవేయడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు కృషి
* జడ్పీ చైర్మన్ ఈదర హామీ
చీరాలరూరల్, సెప్టెంబర్ 22: జిల్లా పరిషత్ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు హామీ ఇచ్చారు. మండల పరిధిలోని ఈపూరుపాలెం పంచాయతీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్లో చదువుతున్న విద్యార్థినుల సంఖ్య, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధికంగా విద్యార్థినులు చదువుకుంటున్న ఈపూరుపాలెం బాలికోన్నత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు పరిశీలనకు వచ్చిన ఆయన ప్రహరీ నిర్మాణానికి జిల్లా పరిషత్ నిధుల నుంచి ఐదు లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే హైస్కూల్లో విద్యార్థినులు తాగేందుకు శుద్ధ జలాన్ని అందించేందుకు, ఆట పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయడంతో పాటు వసతులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈపూరుపాలెంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు జడ్పీ నిధుల నుంచి కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అంకితభావంతో విద్యనందించాలని సూచించారు. వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయన వెంట ఎంపిడివో శ్రీరామచంద్రమూర్తి, ఎంపిపి గవిని శ్రీనివాసరావు, సర్పంచ్ సరోజిని, జడ్పీటిసి అరుణ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
చీరాల, సెప్టెంబర్ 22 : రెండు బైక్‌లు ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన బైపాస్ రోడ్డుపై గురువారం చోటు చేసుకుంది. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేటపాలెం మండలం కఠారివారిపాలెంకు చెందిన బడుగు జ్యోతి (40) బాపట్ల మండలం కర్లపాలెంలోని పుట్టింటికి రెండు రోజుల క్రితం వెళ్లింది. తమ్ముడు యర్రం కోటయ్య తన బైక్‌పై ఆమెను ఎక్కించుకుని కఠారివారిపాలెంలో దించేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామాపురం రోడ్డు వద్దనున్న మన్నం ఆపార్ట్‌మెంట్స్ వద్ద ఇద్దరు యువకులు బైక్‌పై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వారు ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతిభా పురస్కారాలకు ఆరుగురు విద్యార్థులు ఎంపిక
ముండ్లమూరు, సెప్టెంబర్ 22: మండలంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. మోడల్ స్కూల్లో చదివిన ఎం విజయకుమార్‌రెడ్డి, అమిషా, అమృత, సూర్య, మారెళ్ల జడ్పీ హైస్కూల్లో చదివిన అమరతేజ, కెజిబివి స్కూల్లో చదివిన భారతిబాయి ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. విద్యార్థులను మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ పి పద్మావతి, కెజిబివిఎస్ ఎస్‌ఓ సునీత, ఎంఇవో కె వెంకటేశ్వర్లు అభినందించారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
* సర్వశిక్షా అభియాన్ పిడి సుధాకర్
చీరాలరూరల్, సెప్టెంబర్ 22: ప్రజలను దోమల బారి నుంచి రక్షించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రత్యేక అధికారి, సర్వశిక్షా అభియాన్ పిడి ఆర్ సుధాకర్ సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రత్యేకాధికారి సుధాకర్ అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరూ కర్తవ్యంగా తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలను మొక్కుబడిగా కాకుండా అధికారులు సమర్థవంతంగా నిర్వహించి రోగాలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. ప్రతి పంచాయతీలో సెక్రటరీ, విఆర్వోలు సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దేవేంద్రనాధం, ఎంపిడివో శ్రీరామచంద్రమూర్తి, ఇవో ఆర్‌డి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నల్లమలలో భారీ వర్షం..పొంగిపొర్లిన సగిలేరు
* స్కూల్ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
గిద్దలూరు, సెప్టెంబర్ 22: నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సగిలేరు వాగు పొంగిపొర్లింది. దీంతో ఈప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగు పొంగిపొర్లడం వలన ఈప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి బోర్లలో నీరు లభించే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు. ఇదిలా ఉండగా సగిలేరు వాగులో కెఎస్‌పల్లి సమీపంలోని ప్రతాప్‌రెడ్డికాలనీకి వెళ్ళి వస్తున్న స్కూల్ బస్సు సుగాలితాండ సమీపంలో సగిలేరు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తుండటం, వరద పెరుగుతుండటం గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు ఆ బస్సు వద్దకుచేరి బస్సులోని పిల్లలను ప్రవాహం నుంచి బయటకుతీసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సుకు తాళ్ళు కట్టి బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
చెరువులకు, కుంటలకు జలకళ
యద్దనపూడి, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంది. యద్దనపూడి, చిలుకూరివారిపాలెం, పోలూరు గ్రామాల వద్ద వాగుల వద్ద చప్టాపై నీరు ప్రవహిస్తూ కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు చుక్క నీరు లేక సాగు చేసిన పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. గత 20 రోజుల నుంచి కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు పంటలు తిప్పుకుని పచ్చబడటంతో రైతుల్లో ఖరీఫ్ పంటలపై ఆశలు చిగురించాయి. ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో చేపట్టిన పంట సంజీవని కుంటల్లో జలకళ సంతరించుకుంది. గ్రామాల్లో వృధాగా పోయే నీటిని ఒడిసి పట్టేందుకు నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టడంతో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఆ చెరువులకు నీరు చేరి జలకళ కనిపిస్తోంది. పంట కుంటలు, చెక్‌డ్యాంలకు పూర్తిస్థాయిలో వాన నీరు చేరుతోంది.

డెయిరీని లాభాల బాటలోకి నడిపిస్తాం
* డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు దీమా
* ఏకగ్రీవంగా ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక

ఒంగోలు, సెప్టెంబర్ 22 : రానున్న రెండేళ్లల్లో ఒంగోలు డెయిరీని లాభాల బాటలోకి తీసుకొస్తామని డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు దీమా వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు డెయిరీ పాలకవర్గంలోని ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక జరిగింది. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పాలకవర్గంలో ఉన్న ఇద్దరిని ఏకగ్రీవం చేయగా, కొత్తవారికి మరొకరికి చోటు దక్కింది. కనిగిరి నియోజకవర్గానికి చెందిన పులి వెంకటేశ్వరరెడ్డి, అద్దంకి నియోజకవర్గానికి చెందిన కనపర్తి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా పాతవారే ఎన్నికయ్యారు. కాగా కొండెపి నియోజకవర్గానికి చెందిన చెన్నయ్య స్థానంలో అదే నియోజకవర్గానికి చెందిన నార్నె కోటయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీగా యంత్రాంగాన్ని మోహరించింది. బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత జరిగిన సభలో డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ డెయిరీని లాభాల బాటలో పయనింపచేసేందుకు కృషిచేసి రానున్న రోజుల్లో రైతులకు బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు. తాను చైర్మన్‌గా ఎన్నికై 13 సంవత్సరాలైందని, ఆ సమయంలో డెయిరీ అనేక ఒడిదుడుకుల్లో ఉందని, దాన్ని లాభాల బాటలో పయనించేందుకు కృషి చేశానని తెలిపారు. ఆ సమయంలో అధికారులు, పాల ఉత్పత్తిదారులకు బోనస్‌లు ఇచ్చినట్లు తెలిపారు. పాల ఎగుమతులు సైతం పెరిగినట్లు తెలిపారు. పాల ఫ్యాక్టరీకి ఆరుకోట్ల రూపాయలు ఖర్చయిందని, కాని ఆ ఫ్యాక్టరీ తగలబడిపోవటంతో నష్టాలు వచ్చాయన్నారు. రానున్న రెండేళ్లలో డెయిరీ లాభాల బాటలోకి వెళ్తుందన్నారు. పాల ఉత్పత్తిదారులకు డెయిరీపరంగా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డెయిరీ జనరల్ మేనేజర్ శివరామయ్య, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.