ప్రకాశం

ఉపకార వేతనాల గడువు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, డిసెంబర్ 16 : ఉపకార వేతనాల దరఖాస్తు గడువుపెంచాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం దర్శి పట్టణంలో విద్యార్థులు కదం తొక్కారు. గత ప్రభుత్వంలో ఉపకార వేతనాల దరఖాస్తుకు ఎలాంటి గడువులు విధింపు లేకుండా అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్ 5వతేదితో ఉపకార వేతనాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు విధించి విద్యార్థి లోకానికి తీరని అన్యాయం చేసిందని వాపోయారు. వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షులు కె సురేష్‌రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉపకార వేతనాల దరఖాస్తుకు 4వ తరగతి నుండి ఇంటర్ వరకు స్టడీ సర్ట్ఫికెట్లు అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ, పిజి, బిఇడి విద్యను అభ్యసిస్తున్న సుమారు ఐదు వేల మంది విద్యార్థులు సర్ట్ఫికెట్ల కోసం నానాపాట్లు పడుతున్నారన్నారు. గతంలో విద్యను అభ్యసించిన పాఠశాలలు కొన్ని ఎత్తి వేశారని, అలాంటి విద్యార్థులకు సర్ట్ఫికెట్లు లభించడం కష్టతరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఉపకార వేతనాలను విద్యార్థులకు అందకుండా చేయాలనే దురుద్దేశ్యంతో ఇలాంటి ఆంక్షలు విధిస్తుందని దుయ్యబట్టారు. దరఖాస్తు గడువును పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పట్ల పక్షపాత ధోరణి మానుకొని సక్రమంగా వ్యవహరించాలని లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్నీ ప్రధాన వీధుల్లో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని,దరఖాస్తు గడువును పొడగించాలని నినాదాలు చేస్తూ పట్టణంలో కదం తొక్కారు. ఈ ర్యాలీలో పట్టణంలోని అన్నీ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ మస్తాన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో మానవ హారంగా ఏర్పడి కొంత సేపు ట్రాఫిక్‌ను నిలిపి వేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సంధిరెడ్డి నరేంద్రరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ వ్యాపారులపై కొరడా
సబ్‌డివిజన్ల వారీగా పోలీసుల దాడులు
జిల్లాలో పలుచోట్ల కేసులు నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,డిసెంబర్ 16:రాష్టవ్య్రాప్తంగా కాల్‌మనీ వ్యవహరం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా వడ్డీవ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం జిల్లాలోని మార్కాపురంలో రెండు కేసులు, కొమరోలులో ఒకకేసు నమోదుఅయింది. వడ్డీవ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి వారివద్ద నుండి విలువైన ప్రాంసరీనోట్లతోపాటు పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఖాళీ డాక్యుమెంట్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. కాల్‌మనీ వ్యవహరంపై జిల్లాలోని పోలీసులు సబ్‌డివిజన్ల వారీగా రెండు గ్రూపులుగా విడిపోయి ముమ్మర దాడులు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. అందులోభాగంగా జిల్లాలోని మార్కాపురం, కొమరోలు మండలాల్లో మూడుకేసులను పోలీసులు నమోదు చేశారు. విజయవాడ కాల్‌మనీ వ్యవహరం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం కావటంతో జిల్లాలోని పోలీసులు అప్రమత్తమై పలువురు అనుమానిత కాల్‌మనీదారులపై దాడులు నిర్వహించేందుకు సన్నద్ధవౌతున్నారు. విజయవాడ సంఘటన జరగకముందుకాకుండా వడ్డీవ్యాపారులపై పోలీసులు దాడులు నిర్వహించి ఉంటే ఈ వ్యాపారానికి ఆదిలోనే బ్రేకులు పడేవన్నవాదన అన్నివర్గాల్లో వినిపిస్తొంది. ప్రధానంగా సామాన్య, మధ్యతరగతిప్రజలపైనే వడ్డీవ్యాపారులు దృష్టిసారిస్తుంటారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తిరిగి అసలు, వడ్డీలు చెల్లించకపోతే మాత్రం వారి గృహాలు, ఆస్తులను స్వాధీనం చేసుకోవటం జరుగుతున్న సంఘటనలు జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి. గతంలో ధర్మవడ్డీ రూపాయి నుండి రూపాయిన్నర వరకు వడ్డీవ్యాపారులతోపాటు ఇతరులు వసూలు చేసేవారు, కాని మారిన రోజుల నేపధ్యంలో ఐదురూపాయల నుండి పదిరూపాయల వరకు వసూలు చేస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వడ్డీవ్యాపారుల కోరల్లో నలుగుతున్నారు. కొంతమంది వ్యాపారులు అయితే వంద రూపాయలకు 20రూపాయలు కూడా వసూలుచేస్తూ రైతులను నిలువునాదోచుకుంటున్నారు. జిల్లాలోని కొంతమంది ఉప్పువ్యాపారులుసైతం ఇదే కోవలో వ్యాపారుల బారినపడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు బ్యాంకర్లు సహకరించకపోవటంతోనే రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్న వాదన వినిపిస్తొంది. మొత్తంమీద జిల్లాలోని వడ్డీవ్యాపారులపై జిల్లాపోలీసుయంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించటంతో తొలుతగా మూడుకేసులు నమోదు అయ్యాయి.

చీరాలలో తనిఖీలు
చీరాల/ చీరాలరూరల్, డిసెంబర్ 16: పట్టణంలోని కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లలో వన్‌టౌన్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాల్‌మనీ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులను విచారించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. హయ్యర్‌పేటకు చెందిన ఓ కాల్‌మనీ వ్యాపారితో పాటు అదే వ్యాపారంలో ఉన్న రైల్వే ఉద్యోగి ఇళ్లను సోదా చేశారు. కొంతమంది వ్యాపారులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనిపై డిఎస్‌పి జయరామరాజు, వన్‌టౌన్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కాల్‌మనీ వ్యాపారుల జాబితాను సిద్ధం చేశామన్నారు. దానికి అనుగుణంగా వ్యాపారులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదని, ఏ వ్యాపారుల నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదన్నారు.

కొమరోలులో రూ 30 లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు స్వాధీనం
కొమరోలు, డిసెంబర్ 16: విజయవాడ కాల్‌మనీ ప్రకంపనాలు కొమరోలు వరకు చేరాయి. స్థానిక ఎస్సై టి బాలకృష్ణ తమ సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి ఆకస్మికంగా వడ్డీ వ్యాపారులుగా అనుమానం ఉన్న ఏడుగురి గృహాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ సీతారామయ్య ఇంట్లో 30లక్షల విలువ చేసే 42 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. పోలీసుల దాడులతో మండలంలోని వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ఉద్యమం
- విరసం నేత కళ్యాణరావు
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 16:విశాఖ ఏజెన్సీలోబాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టాలని విరసం నేత కళ్యాణరావు పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక ఎన్‌జివో హోంలో పిడిఎం ఆధ్వర్యంలో విశాఖ ఏజెన్సీలో రాష్ట్రప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నంచేస్తూ జీవో 97ను విడుదల చేసి ఆదివాసిలను భయబ్రాంతులను గురిచేయాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రౌండ్‌టేబుల్‌సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి పిడిఎం రాష్టక్రమిటి సభ్యుడు బి మోహన్‌రావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా విరసం నేత కళ్యాణరావు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, బర్రెలప్రాంతంలో ఉన్న 3030 ఎకరాల్లో బాక్సైట్‌ను తెలుగుదేశంప్రభుత్వం జీవో 97ద్వారా ఆన్‌రాక్ కంపెనీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఆదివాసీలు ముఖ్యమంత్రి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. ఈ ఉద్యమాన్ని బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలను దించి ఏజెన్సీ ప్రాంతాన్నిపోలీసు మయం చేసి బాక్సైట్ తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. గిరిజన ఉద్యమాలకు సంఘీభావంగా ప్రకటించాలని కోరారు. పిడిఎం రాష్ట్రప్రధానకార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీనిక్షేపాలను దోపిడి చేయాలనే ప్రభుత్వవిధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాభావనంపాడు పోర్టు, విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు, అమరావతిరాజధాని, పవర్‌పాంట్లు, రసాయినిక పరిశ్రమలను తీరప్రాంతాల్లో ఏర్పాటుచేయటంకోసం ఆదివాసీలను, మత్స్యకారులను, రైతులను,దళితులను లక్షలాది మందిని నిర్వాసితులు చేస్తున్నారన్నారు.దీనికి వ్యతిరేకంగా బలమైన ప్రజాఉద్యమాన్ని చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు వెంకట్రావు, నీలం నాగేంద్రం, బి పద్మా, జె ఆంజనేయులు, పేరం సత్యం, నాగరాజు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు
ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలి
- జనవరి నాటికి జడ్‌పి నూతన భవన నిర్మాణ
పనులు ప్రారంభం
- జడ్‌పి చైర్మన్ ఈదర హరిబాబు వెల్లడి
ఒంగోలు, డిసెంబర్ 16: ఉపాధిహామీ కార్యక్రమాన్ని జిల్లాలో కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అమలుచేసేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జడ్‌పి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జడ్‌పి చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే అమలు చేస్తున్న ఈ ఉపాధిహామీ పథకం కార్యక్రమం అమలు జరిగేందుకు జిల్లాలోని ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఓడిపోయిన ఎంపిటిసిలు, ఓడిపోయిన సర్పంచ్‌లు, ఓడిపోయిన వార్డు సభ్యులు అందరూ గ్రామాలలోకూలీలచే జరిగే ఉపాధి హామీ పథకం పనులు బాగాజరుతున్నాయా లేదనే విషయాన్ని పరిశీలించడంతోపాటు ప్రజాప్రతినిధులు ఒక్క రోజైనా ఈ పథకం పనులలోభాగస్వాములై జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. మన దగ్గర కూడా ప్రజలకు అవసరమైన అన్ని వౌళిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఇటీవల జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. కరవును ఎదుర్కొని అభివృద్ధిని సాధించాలంటే అందరూ కులమత, రాజకీయలాలకు అతీతంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, పాలనాలయాలు, అదీ ఇదీ అనే తేడా లేకుండా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, పాత్రికేయులు కలిసి సమష్టిగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 100 రోజులు పని కల్పించినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు సంవత్సరానికి 150 పనిదినాలు కల్పించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ , జడ్‌పి సిఇఓ సహకారంతో అవినీతిరహిత పాలన అందించేందుకు, అన్ని శాఖలలో సుపరిపాలన అందించే దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పరిపాలనా సౌలభ్యం కోసం త్వరలో పాత జడ్‌పి కార్యాలయం ఖాళీస్థలంలో తిరిగి నూతన కార్యాలయ భవన నిర్మాణానికి జనవరి నెలాఖరు లోపు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు హరిబాబు తెలిపారు.

కాంట్రాక్టు పద్ధతిలో 500 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
* వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ వెల్లడి
మార్కాపురం టౌన్, డిసెంబర్ 16: వైద్యవిధాన పరిషత్‌లో రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో కాంట్రాక్టు విధానంలో 500 వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 7వైద్యవిధాన పరిషత్ వైద్యశాలల్లో 27 స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ అనంతరం పక్షంరోజుల్లో పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వైద్యుల పోస్టుల భర్తీ చేస్తున్నప్పటికీ పట్టణాలను వదిలి గ్రామాలకు వైద్యులు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, ఒకవేళ వచ్చినా తప్పనిసరి పరిస్థితుల్లో సెలవుపై వెళ్తుండటంతో ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించలేకపోతున్నామన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదని, అందులో పశ్చిమప్రాంతంలోని మార్కాపురం అంటే ఇష్టపడటం లేదన్నారు. మార్కాపురం, కంభం వైద్యశాలల్లో వైద్యుల కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నామని, త్వరలో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 2016 జనవరి 1వతేదీ నుంచి వైద్యసేవల్లో విశేష మార్పులు వస్తున్నాయని, ఈ మార్పుల ద్వారా రోగులకు నాణ్యతతో కూడిన విస్తృత సేవలు అందించనున్నట్లు తెలిపారు. వైద్యశాలలో అందుబాటులో ఉన్న రొటీన్ టెస్టులతోపాటు అందుబాటులో లేని 43రకాల పరీక్షలను మెడల్ డయోగ్నోస్టిక్ ద్వారా అందుబాటులోనికి తెచ్చామన్నారు. బయోట్యాగింగ్ విధానం, డిజిటల్ ఎక్స్‌రే విధానం కూడా ఏరియా వైద్యశాలలో అందుబాటులో ఉంటుందన్నారు. పశ్చిమప్రాంత ప్రజల అవసరార్థం జిల్లా వైద్యశాలను మార్కాపురంకు తరలించాలని వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చక్కా మాలకొండ నరసింహారావు, సభ్యులు ఆర్‌కెజె నరసింహాంలు జిల్లా కోఆర్డినేటర్‌ను కోరగా, సంబంధిత వైద్యశాలను చీరాలకు బదలాయించే ప్రయత్నం జరుగుతుందని, ఈమేరకు సిటీస్కాన్ యంత్రాన్ని కూడా ప్రభుత్వం ఆ ప్రాంతానికి అందచేసిందన్నారు. పశ్చిమప్రాంతంలో వైద్యశాల అవసరం ఉన్నప్పటికీ వైద్యులు వచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ వైద్యశాలకు 45మంది వైద్యుల అవసరం ఉంటుందని, 100 పడకల వైద్యశాలలో ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసుకోలేని పరిస్థితులో ఉన్నామన్నారు. ఉన్న 100పడకల వైద్యశాలను అన్నిరకాలుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేద్దామన్నారు. డిఎంహెచ్‌ఓ యాస్మిన్ మాట్లాడుతూ జిల్లాలోని పిహెచ్‌సిలలో 29 వైద్యుల పోస్టులు, 40కిపైగా స్ట్ఫా నర్సుల పోస్టులు ఖాఖీగా ఉన్నాయన్నారు. త్వరలో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియ నడుస్తుందన్నారు. బాలింతలు, గర్భిణులను వైద్యశాలకు తరలించి రాకపోకలు జరిపేందుకు జనవరి మొదటివారంలో 102 వాహనాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలిపారు. ప్రతి క్లస్టర్‌కు ఒకటి చొప్పున జిల్లాలో 18 వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలోని బ్లడ్‌బ్యాంకు, లేబర్ రూం, మెడికల్ స్టోర్‌రూం, ల్యాబ్, ఎక్స్‌రే తదితర విభాగాలను వారు పరిశీలించారు. ఈ సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్ ఎల్ రవీంద్రనాథ్, వైద్యులు పగడాల లక్ష్మీరెడ్డి, పిచ్చిరెడ్డి, పద్మినీ, అనూష, భాను, లక్ష్మీ, లత తదితరులు పాల్గొన్నారు.