ప్రకాశం

హోరాహోరీగా గుండురాయి పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గ్రామీణ క్రీడలు హోరాహోరీగా నిర్వహించారు. అందులో భాగంగా శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని సావరపాలెంలో శనివారం జిల్లాస్థాయి గుండురాయి పోటీలు నిర్వహించారు. 110 కిలోల బరువున్న గుండురాయిని 5 నిమిషాల వ్యవధిలో ఎక్కువ సార్లు పైకెత్తిన వ్యక్తి విజేతగా నిలుస్తాడు. స్థానిక ప్రయివేటు పాఠశాల్లో పిఇటిగా పనిచేస్తున్న గొర్ల గోపి నిర్ణీత వ్యవధిలో 16 సార్లు గుండురాయిని ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. అదేవిధంగా 15 సార్లు ఎత్తిన కుమార్ రెండోస్థానంలో, 12 సార్లు ఎత్తిన పోతురాజు మూడో స్థానంలో నిలించారు. వారికి వరుసగా రూ.3,016, రూ.2,016, రూ.1,516 బహుమతి అందజేశారు. వరుసగా రెండోసారి గోపి ఈ పోటీల్లో విజేతగా నిలవడం గమనార్హం. పోటీలను తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను
ఆదర్శపాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
కామేపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాలొన్న మంత్రి గంటా

ఒంగోలు, జనవరి 15 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శపాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం కామేపల్లి గ్రామంలో జిల్లా విద్యాశాఖ ద్వారా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రాథమిక వసతులను కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగువేల కోట్లరూపాయలు వెచ్చించనుందని ఆదిశగా అవసరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేకంగా వౌలిక వసతులకోసం బడ్జెట్ కేటాయించేవిధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. విశాఖలోని మధుర వాడదగ్గర ఉన్న చంద్రం స్కూలును అన్నిరకాల వౌలికవసతులు కల్పించి ఆదర్శపాఠశాలుగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించినట్లు చెప్పారు. ఆదర్శ పాఠశాలను పరిశీలించేందుకు ఢిల్లీ నుండి కేంద్రం ఒక బృందాన్ని పంపించినట్లు ఆయన తెలిపారు. కామేపల్లిలోని జడ్‌పిహెచ్ స్కూలును కూడా ఆదర్శపాఠశాలుగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాల సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను జన్మించిన గ్రామంలో సంక్రాంతిసంబరాలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామమంతా పండగ వాతావరణ కన్పించిందని గ్రామీణ ఆటల పోటీలు చూడటం జరిగిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మనకు స్వంతమైన కళలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.
అందరుకలిసి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని మంత్రి సూచించారు. సంక్రాంతి పండగను రాష్టప్రండగగా అధికారికంగా ప్రకటించి సంక్రాంతి సంబరాలకు జిల్లాకు కోటిరూపాయలు కేటాయించిందన్నారు. సమాజంలోని నిరుపేదకుటుంబాలు పండగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రన్న సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను ఉచితంగా అందించామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యర్రగొండపాలెంలో 12కోట్లరూపాయలతో మెగా ప్రభుత్వ మోడల్ డిగ్రీకాలేజి భవన నిర్మాణాలు పూర్తిచేసేందుకు నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పెద్దారవీడు మండలంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు విషయమై కేంద్రంలో పెండింగ్‌లో ఉందని వారితో మాట్లాడి త్వరితగతిన మంజూరు చేయిస్తానని తెలిపారు. అలాగే పుల్లలచెరువు మండలంలో జూనియర్ కాలేజి మంజూరుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి తనశక్తి మేరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రెవిన్యూడివిజన్లల్లో ఆదర్శపాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. జరుగుమల్లి మండలానికి జూనియర్ కాలేజి కావాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారని తెలియచేస్తూ కామేపల్లిలో రెండుఎకరాల స్థలం అందిస్తే ఇక్కడే జూనియర్ కాలేజి ఏర్పాటుకు మంజూరు ఉత్తర్వులు అందించే ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కామేపల్లిలో రోడ్లు, డ్రైనేజి నిర్మాణాలు పూర్తి చేసేందుకు కోటిరూపాయలు ఖర్చు అవుతుందని ప్రతిపాదించారని వెంటనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్‌ను 30 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు తన వంతు కృషిచేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ప్రతిఒక్కరు విద్యను అభ్యసించాలన్నారు. విద్యద్వారానే ప్రపంచంలోని విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని పిల్లలను చదివించాలని వారి ఆలోచనలను లక్ష్యాలను తల్లిదండ్రులు గుర్తించి ప్రొత్సాహం అందించాలని ఈవిషయంలో విద్యాశాఖాధికారులు ఆలసత్వం చూపకుండా మంచిఫలితాలు వచ్చేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఆడపిల్లలు ఉన్నచోట సరైన మరుగుదొడ్లు లేవని, పాఠశాలలకు ప్రహారిగోడలు లేవని,కనీస వసతులు లేవని, ఈసమస్యలను అధికమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సరైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు గుర్తుచేశారు. నాయుడుపాలెంలోని పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అభివృద్దిపరుద్దామని తెలుపుతూ తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల్లోని అన్నింటిని చంద్రంపాలెం ఆదర్శపాఠశాల తరహాలో అమలుచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొండెపిశాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ వీధి భాగావతం, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దులు, జానపద కళలు కనుమరుగుఅవుతున్నాయని వీటిని ప్రొత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తతరానికి మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు అందించాల్సి ఉందన్నారు. కామేపల్లి గ్రామాభివృద్దిలో మంత్రి గంటా పాత్ర ఎంతో ఉందన్నారు. ఈకార్యక్రమంలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు పాల్గొని మాట్లాడారు. తొలుత కామేపల్లినుండి పోలేరమ్మ దేవస్ధానం వరకు ఒక కోటి 32లక్షల రూపాయల వ్యయంతోనిర్మించిన సిసిరోడ్లను మంత్రి గంటా ప్రారంభించారు. పోలేరమ్మ దేవస్ధానంలో అదనపుగదులు, షాపింగ్ కాంప్లెక్స్‌ను దాతల సహాయంతో నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం కామేపల్లిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక కోటి 64లక్షలరూపాయలతో సర్వశిక్షా అభియాన్ గ్రాంట్‌తో అదనపు తరగతులనిర్మాణానికి మంత్రి శంఖుస్ధాపన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వినూత్న రీతిలో ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను మంత్రి అభినందించారు. జడ్‌పి హెచ్‌ఎస్ ఆవరణలో ఏర్పాటుచేసిన వ్యవసాయ, వైద్య ఆరోగ్య, పశుసంవర్థక, శిశు, మహిళా సంక్షేమశాఖ స్టాళ్లను మంత్రి సందర్శించారు. కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. పోలేరమ్మ గుడిలో మంత్రి పూజలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆర్‌జెడి పార్వతి, డిఇఒ సుప్రకాష్, వయోజన విద్యాశాఖాధికారి సత్యనారాయణ, కందుకూరు ఆర్‌డిఒ మల్లికార్జున, సర్పంచ్ రాంబాబు,మండల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కోలాహలంగా రివర్స్ ఆటల పోటీలు
యద్దనపూడి, జనవరి 15: మండల పరిధిలోని పూనూరులో ఉప సర్పంచ్ బత్తుల రాము, సహకార సొసైటీ అధ్యక్షుడు ఈదల రవి ఆధ్వర్యంలో ఆదివారం రివర్స్ ట్రాక్టర్, స్లో మెటార్ సైకిల్, సైకిల్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్‌పోటీలు జరిగాయి. రివర్స్ ట్రాక్టర్ పోటీల్లో మొత్తం 22 మంది పాల్గొన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.5,116, రూ.3,116 అందజేశారు. స్లో మోటార్ సైక్లింగ్‌లో 15 మంది, స్లో సైకిలింగ్ పోటీలో 10 మంది పాల్గొన్నారు. ఈ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
* ఒకరికి తీవ్ర గాయాలు
కొనకనమిట్ల, జనవరి 15: మండలంలోని ఎదురాళ్ళపాడు ముసివాగు వంతెనపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పిన్నిక తిరుపతయ్య (54), హర్షవర్థన్‌రెడ్డి మోటారుసైకిల్‌పై పొదిలి వైపు నుంచి ఎదురాళ్ళపాడుకు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈప్రమాదంలో మోటారుసైకిల్ వెనుకవైపు కూర్చున్న తిరుపతయ్య అక్కడికక్కడే మృతిచెందగా, హర్షవర్థన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినట్లు బంధువులు తెలిపారు.

భర్త వేధింపులు తాళలేక
భార్య ఆత్మహత్యాయత్నం
కందుకూరు, జనవరి 15: భర్త వేధింపులు తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని భార్య నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక పట్టణ ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తికి గత 8 సంవత్సరాల క్రితం పొన్నలూరు మండలం ముప్పాళ్ళకు చెందిన కల్యాణి అలియాస్ సుమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరికి వివాహం అయిన నాలుగు సంవత్సరాల పాటు వివాహ జీవితం సాఫీగా సాగింది. అనంతరం భర్త హరిప్రసాద్ పనికి వెళ్లకుండా భార్యపై ఆధారపడి జీవిస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం సేవించేందుకు నగదు కోసం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం భార్య పుట్టింటికీ వెళ్ళగా అక్కడ కూడా ఆమెకు ఆదరణ అంతంత మాత్రంగానే లభించగా బంధువులు సర్దిచెప్పగా తిరిగి భర్త ఇంటికి వచ్చింది. ఈనేపథ్యంలో శనివారం ఉదయం భర్త నగదు కోసం భార్యను వేధించగా ఆమె తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఇరుగుపొరుగు బాధితురాలిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని రిమ్స్‌కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.