ప్రకాశం

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుకారుస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జనవరి 20: రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరు కారుస్తోందని వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని పిసిపల్లి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులను ఆయన పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పించి కార్పొరేట్ వైద్యశాలలో సైతం ఉచితంగా వైద్యం అందించారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. నేడు పేదవాడికి ఆరోగ్యశ్రీ వైద్యం అందక క్యాన్సర్, కిడ్నీ తదితర జబ్బులతో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి 910 కోట్ల రూపాయలు కేటాయించగా, ముఖ్యమంత్రి 568 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని, ఇందులో కూడా 365 కోట్ల రూపాయలు బకాయిలకు పోతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి మరో 270 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మొత్తం 850 కోట్ల రూపాయలతో ఆరోగ్యశ్రీ కుంటినడక సాగిస్తోందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా సరైన వైద్యం అందక పేద ప్రజలు అప్పులపాలవుతున్నారని, మరికొంత మంది వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 56 మండలాల్లో 48 మండలాల్లోని 787 గ్రామాల్లో ప్రజలు తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని కనిగిరి, కొండపి నియోజకవర్గాల్లోని ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని, గతంలో నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి ఉండేదని, నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1500 కోట్ల రూపాయలతో సాగర్‌నీరు నల్గొండకు వచ్చేలా చేశారని, నేడు జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే సమస్యకు పరిష్కారం
ఈప్రాంతానికి కూడా వెలుగొండ ప్రాజెక్టు జలాలు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని జగన్ అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాజశేఖర్‌రెడ్డి హయాంలో 4700 కోట్ల రూపాయలు కేటాయిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ప్రాజెక్టును గాలికి వదిలివేశారన్నారు. గతంలో పనిచేయని కాంట్రాక్టర్ నుంచి కాంట్రాక్ట్‌ను తొలగించి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేవారని, చంద్రబాబునాయుడు అలాకాకుండా పనిచేయని కాంట్రాక్టర్‌కు అదనంగా మరో 65కోట్ల రూపాయలు ముట్టజెప్పారని విమర్శించారు. ఈప్రాంత వాసులు కిడ్నీ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి నెలా మందులు, రక్తపరీక్షలకు 16వేల నుంచి 24 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని, ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కగా అమలుచేయాలన్నారు. గతంలో వికలాంగులకు వైద్యం సకాలంలో ఆరోగ్యశ్రీ ద్వారా అందేదని, నేడు ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందన్నారు. రాజశేఖర్‌రెడ్డి పాలనలో 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ 15 నిమిషాల్లో ఇంటికి వచ్చేదని, నేడు ఆ పరిస్థితి లేదని, మందులు లేని 104 వాహనాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 5 నెలలుగా జీతాలు రాక ఆశా వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలో ఫ్లోరిన్ సమస్యపై ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి 2015 నుంచి 10 లేఖలు రాస్తే కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి స్పందించి 996 కోట్ల రూపాయలతో నూతన పథకాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ పథకాన్ని కూడా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాగా, కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వం మార్కాపురం, కందుకూరు, కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలకు డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తూ జీవో నెంబర్ 19ని విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు షంషుద్, తిరుపతమ్మ, వేణుబాబు, నర్సమ్మ తదితరులు వేదికపై నుంచి మాట్లాడుతూ మందులు, డయాలసిస్ చేయించుకునేందుకు తమ పొలం విక్రయించి వైద్యం చేయించుకున్నామని, ప్రస్తుతం తమ వద్ద నగదు లేక వైద్యం మానివేశామని కన్నీటి పర్యంతమయ్యారు. ఆనంతరం జగన్ మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కిడ్నీ వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు వారికి భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, వైకాపా కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మదుసూదన్ యాదవ్‌తో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీనాయకులు పాల్గొన్నారు.