ప్రకాశం

కనిగిరి ఘటనలో బాధ్యులపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 22:ఆధ్యాత్మికతను, మానవీయతను చాటేందుకే మదర్సాలను ఏర్పాటు చేశారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ హిదాయత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి మదర్సాలో అప్స అనే విద్యార్థినిపై పైశాచికత్వ దుర్ఘటన బాధపెట్టిందన్నారు. స్థానిక రిమ్స్‌లో చికిత్సపొందుతున్న బాలికను పరామర్శించేందుకు ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. మదర్సాల్లో నైతికమైన మానవీయమైన విధానానికి కట్టుబడి విద్యను అందించటం జరుగుతుందని అలాంటి మదర్సాలో విద్యార్థినులపై చిత్రహింసలు, వికృతచేష్టలు తీవ్రంగా గాయపర్చటం లాంటివి చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ఈసంఘటనను ప్రభుత్వం తీవ్రంగా గుర్తించి వెంటనే విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశాలు జారీచేసిందన్నారు. బాలికలపై కిరాతకంగా వ్యవహరించిన సంఘటనపై కలెక్టర్ సుజాతశర్మ త్రిసభ్యకమిటీ వేశారని, అందులో కందుకూరు ఆర్‌డిఒ, ఐసిడిఎస్ పిడి, మైనార్టీ సంక్షేమశాఖాధికారులు ఉన్నారన్నారు. త్రిసభ్య కమిటీ లోతుగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించేలా చూడాలని సూచించారు. ఈ విషయంపై పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ దుర్ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. బాధితులకు సంబంధించి సమగ్రవైద్యాన్ని అందించాలని రిమ్స్‌హాస్పటల్ డాక్టర్లను కోరామన్నారు. భవిష్యత్‌లో వారికి అవసరమైన విద్య, ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాలను అమలుచేస్తున్నామన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం 710కోట్లరూపాయల భారీ బడ్జెట్ కేటాయించిందన్నారు. పేద, మైనార్టీవర్గాల్లో నిరుద్యోగ నిర్మూలనకు అనేక పథకాలను తీసుకువచ్చిందన్నారు. మూడులక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు నిరుద్యోగ యువతకు అందించటం జరిగిందన్నారు. అందులో లక్ష రూపాయల సబ్సిడీ, రెండులక్షల రూపాయలు బ్యాంకు రుణం కింద ఇవ్వటం జరుగుతుందన్నారు. మైనార్టీ వితంతువులకు, విడాకులు తీసుకున్న వారికి, వికలాంగులకు తాత్కాల్ పథకం కింద 50వేల రూపాయలను వ్యక్తిగత రుణం కింద ఇస్తున్నట్లు, అందులో 30వేల రూపాయలు సబ్సిడీ కింద, 20వేల బ్యాంకు రుణం కింద అందిస్తున్నట్లు తెలిపారు. పేద,మైనార్టీ వర్గాల్లో నిరక్షరాస్యులుగా ఉన్న చేతివృత్తులవారి కోసం ఆదరణ పథకం కింద 50వేల రూపాయలను అందిస్తున్నామని అందులో 30వేల రూపాయలు సబ్సిడీ, 20వేల రుపాయలు బ్యాంకు రుణం ఇవ్వటం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో విద్యను పెంపొందించే విధంగా ఒకటవతరగతినుండి ఐదవతరగతి వరకు ఐదువేలరూపాయల స్కాలర్‌షిప్స్, అదేవిధంగా ఫ్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇస్తున్నట్లు చెప్పారు. ఉన్నతశ్రేణి విద్యలో ఫీజు రీయింబర్స్‌మెంటును అందిస్తున్నామన్నారు. లా గ్రాడ్యూయేట్స్‌కు స్టయిఫండ్, విదేశాల్లో మైనార్టీవిద్యార్థుల ఉన్నత విద్య కోసం పదిలక్షల రూపాయల వరకు ఇస్తున్నామన్నారు. సమాజంలో అందరితోపాటు మైనార్టీ వర్గాల ప్రజలు అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలన్నారు.పేదరికం నుండి బయటకు తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దుల్హాన్ పథకం కింద 488 పేద ముస్లిం జంటలకు రెండుకోట్ల 22లక్షల రూపాయలను ఇవ్వటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పేద ముస్లిం జంటలకు దుల్హాన్ పథకం కింద 55కోట్ల రూపాయలను ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి మైనార్టీవర్గాల ఆత్మబంధువుని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, భద్రత కల్పించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవటంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ఇప్పటివరకు 12వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శాసనమండలిసభ్యుడు మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కనిగిరిలోని మదర్సాలో మానవత్వానికి మచ్చతెచ్చేవిధంగా అక్కడ మహిళా టీచర్ వ్యవహరించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల శరీరంపై వాతలు పెట్టడటం, చిత్రహింసలకు పాల్పడటం, దుర్మార్గంగా వేధించటంలాంటి ప్రభుత్వపరంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకుని త్రిసభ్యకమిటీ నివేదిక, పోలీసు విచారణ నివేదిక అందిన తరువాత ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోని మదర్సాలు ఒక లక్ష్యంతో మానవత్వాన్నిపెంపొందించేవిధంగా మంచివిద్యను, మంచి సన్మార్గంలో నడిచేవిధంగా, ఆధ్యాత్మిక దృక్పథంతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ముస్లిం పవిత్రంగా భావించే మదర్సాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వం ముస్లిం మైనార్టీవర్గాల విద్యకోసం 250కోట్లరూపాయలు కేటాయించిందని, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 160కోట్లు, స్కాలర్‌పిష్ కోసం 50కోట్లు బడ్జెట్‌లో ప్రవేశపెట్టిందన్నారు. రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణాల కోసం 80కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. 13జిల్లాల్లో 11మైనార్టీ రెసిడెన్షియల్‌స్కూళ్లు ఉన్నాయని వాటిని పెంచాల్సి ఉందన్నారు. 8500మసీదుల నిర్మాణాలకు ముఖ్యమంత్రి 15కోట్లరూపాయలు కేటాయించారని, ఒక్కొ మసీదుకు ఐదులక్షలనుండి 10లక్షల రూపాయల వరకు సహాయం అందిస్తున్నామన్నారు. ముందుగా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అప్స అనే బాలికను చైర్మన్, ఎంఎల్‌సి, మహిళా కమీషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఐసిడిఎస్ పిడి విశాలక్ష్మి తదితరులు పరామర్శించారు.