ప్రకాశం

స్కూల్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిసిపల్లి, మార్చి 2: ఓ స్కూల్ బస్సు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న 47 మంది విద్యార్థులు గాయపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం సేవించడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. కరేడు జడ్‌పి హైస్కూల్ విద్యార్థులు 75మంది ఏపి 27సివై 7317 నెంబరు గల ఓ ట్రావెల్స్ బస్సులో విహారయాత్రకు మంగళవారం రాత్రి బయలుదేరారు. మహానంది, యాగంటి తదితర ప్రాంతాలు చూసుకుని స్వస్థలానికి బయల్దేరాలు. కనిగిరి ప్రాంతానికి చెందిన డ్రైవర్ కాలేషా గురువారం వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో కనిగిరిలో బస్సు ఆపి బస్సులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలియకుండా పూటుగా మద్యం సేవించాడు. నిద్రమత్తులో ఉన్న విద్యార్థులు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటాన్ని గమనించలేదు. అయితే కనిగిరి నుంచి బస్సు నడపటంలో కొంత నిర్లక్ష్యం కనపడింది. కనిగిరి నుంచి 16 కిలోమీటర్ల దూరం రాగానే పిసిపల్లి మండలం, పెదఅలవలపాడు సమీపంలో ఉన్న పాలేరు బ్రిడ్జి వద్దకు రాగానే మలుపు తిప్పాల్సి ఉండగా, డ్రైవర్ దానిని పట్టించుకోలేదు. బ్రిడ్జి పై నుంచి బస్సు 20 మీటర్ల లోతులో పడింది. బస్సు నిదానంగా రావడం వల్ల ప్రాణాపాయం తప్పింది. లేకపోతే అందరి ప్రాణాలను గాలిలో కలిసేవి. ఈ సంఘటనలో తొమ్మిదోతరగతి విద్యార్థి శ్రీకాంత్ మెదడుకు గాయం అయింది. మరో 40 మందికి గాయాలైయ్యాయి. వీరిని కనిగిరి వైద్యశాలకు తరలించారు. డాక్టర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి, సుబ్బారెడ్డి, సృజన, రాజ్యలక్ష్మీ, స్రవంతి బృందం ప్రాథమిక చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం 27 మందిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆరుగురి విద్యార్థులు చేతులు, కాళ్లు విరిగాయి. మరో 13మందికి తలపై గాయాలైయ్యాయి. శ్రీకాంత్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో సంఘమిత్ర వైద్యశాలకు తరలించారు. నరసింహారావు, ఆర్ శ్రీనివాసులకు బలమైన గాయాలైయ్యాయి. ప్రమాదం జరిగిన పాలేరు బ్రిడ్జి వద్దకు పోలీస్, రెవిన్యూ యంత్రాంగం హుటాహుటిన చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో బస్సు బ్రిడ్జి క్రింద పడిన తీరును చూసిన వారి గుండె చలించిపోయింది. కాగా బస్సు బోల్తా ఘటనపై మాజీ మంత్రి ముక్కుకాశిరెడ్డి స్పందిస్తూ రాత్రివేళల్లో రోడ్డుపక్కన మద్యం అందుబాటులో ఉండడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మద్యం షాపుల్ని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా బ్రిడ్జి డిజైన్ రోడ్డు లోపం ఉందని, ఆర్‌అండ్‌బి అధికారులు పాలేరు వద్దకు పరిశీలించి డిజైన్ మార్పుచేయాలని మాజీ మంత్రి ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుందని ఆయన తెలిపారు. వైకాపా ఇన్‌ఛార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, తిప్పారెడ్డి తదితరులు బస్సు ఘటనను ఖండించారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పాత కందులు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
* రాష్ట్ర మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ హెచ్చరిక
దర్శి, మార్చి 2 : రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాత కందులు కొనుగోలు చేసి దళారులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ ఆళ్ల శివకోటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆగ్రో కేంద్రం ఆధ్వర్యంలో దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివ కోటేశ్వరప్రసాద్ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా 60 వేల టన్నుల కందులను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నామని, ఇప్పటికే 20 వేల టన్నులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కందులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యాతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. విదేశాల నుంచి నాలుగు లక్షల టన్నులు దిగుమతి అవుతున్నందున ఈ ఏడాది కందుల ధర తగ్గిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఐదు వేల టన్నులు కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నామన్నారు. రైతులను చిరు ధాన్యాల పంటల వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్క్‌ఫెడ్ ద్వారా రాగులు క్వింటా రూ.2,500, కొర్రలు క్వింటా రూ.1800, సజ్జలు రూ.1700లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ఆహార ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెట్‌లో విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ లక్ష్మీతాయారు, సీనియర్ మేనేజర్ ఈ సంజీవరెడ్డి, ఎఎంసి చైర్మన్ సూరే చిన సుబ్బారావు, వెలుగు రిసోర్స్ పర్సన్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల జీవితాలతో
చెలగాటమాడుతున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి
* కేంద్ర మాజీమంత్రి పనబాక పిలుపు
ఒంగోలు అర్బన్, మార్చి 1 : ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోని ఇందిరాగాంధీ ప్రాంగణంలో జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పనబాక మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారం చేపట్టి 32 నెలలు కావస్తుంటే ఇంతవరకు ప్రజాసమస్యలపై స్పందించలేదన్నారు. కేవలం రాజకీయాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయే తప్ప ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నోట్ల రద్దుతో స్వయానా తల్లిని తీసుకువచ్చి బ్యాంకుల్లో నిలబెట్టి తన తల్లిపై పబ్లిసిటి పొందారని మోదీపై విమర్శలు చేశారు. కనీసం మాతృమూర్తికి రెండువేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రధాని ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ పరిపాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. హయాంలో మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చి ఆదుకుంటే ప్రస్తుతం దాచుకున్న నగదును కూడా వారే లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ పేరుతో రాష్ట్రాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందని ఆశ పడ్డ ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాలు రద్దు కాలేదన్నారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు చేవూరి దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కాంగ్రెస్ బడిలో పాఠాలు నేర్చుకున్న వారే నేడు పార్టీలు పెట్టి రాష్ట్రాలను పరిపాలిస్తున్నవారు కాంగ్రెస్‌ను విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల భారతదేశం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. వృద్ధి రేటు 7.6 శాతం ఉండగా నోట్ల రద్దుతో ఆరు శాతానికి దిగజారినప్పటికి ప్రధానిమంత్రి మాత్రం గారడి లెక్కలు చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వాలు స్పందించటం లేదన్నారు. రాజధానికి లైటింగ్‌లు వేసి తిరగటం కాదని, రైతులకు అండగా నిలబడాలని, జనాల్లోకి ముఖ్యమంత్రి వస్తే సమస్యలు తెలుస్తాయని అన్నారు. రాజకీయాలు చేయటం తగ్గించుకుని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పార్టీశ్రేణులు స్పందించాలన్నారు. ఉద్యమాలతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ పాలనలోనే అన్నివిధాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9న జరగనున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, నాయకులు బి చంద్రశేఖర్‌యాదవ్, వేమా శ్రీనివాసరావు, ఎన్ సీతారామాంజనేయులు, ఎం రామకృష్ణారెడ్డి, పాశం వెంకటేశ్వర్లు, నిషాంత్, ఎస్‌కెసైదా, యాదాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేకహోదా కావాలా వద్దా, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 600 పైగా హామీలను నెరవేరుస్తారా అనే అంశాలపై ప్రజాబ్యాలెట్ నిర్వహించారు.

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న
విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్

ఒంగోలు, మార్చి 2 : బస్సు ప్రమాదంలో గాయపడిన కరేడు ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ సుజాతశర్మ గురువారం రిమ్స్ ఆసుప్రతిలో పరామర్శించారు. కర్నూలు జిల్లాలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ విలేఖర్లకు వెల్లడించారు. బస్సు ప్రమాదానికి గురై గాయపడిన 27మంది విద్యార్థులను ప్రాథమిక చికిత్స కోసం స్థానిక రిమ్స్ వైద్యశాలకు తీసుకొచ్చారని తెలిపారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న 27 మంది విద్యార్థుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని, అన్నిరకాల వైద్యచికిత్సలు అందించటం జరుగుతుందన్నారు. శ్రీకాంత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాల కారణంగా స్థానిక సంఘమిత్ర వైద్యశాలలో ఎమర్జెన్సీ సర్జరీ జరిగిందన్నారు. ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అన్నివిధాల వైద్య చికిత్సలను గాయపడిన విద్యార్థులకు డాక్టర్లు అందిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్‌డిఓ కె శ్రీనివాసరావు, రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి, డాక్టర్లు రాజేశ్వరరావు, వెంకయ్య, ఎపి వైద్యవిధాన పరిషత్ ఇన్‌ఛార్జి పాల్గొన్నారు.
జగన్‌పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి
* వైకాపా ఆధ్వర్యంలో నిరసన
ఒంగోలు, మార్చి 2 : వైకాపా రాష్ట్ర అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ వైకాపా ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్‌పై ప్రభుత్వం అక్రమకేసులు నమోదు చేయటం దుర్మార్గమని ప్రసాద్ విమర్శించారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, వైకాపా జిల్లా నాయకులు భీమేష్, నగర మహిళా నాయకురాలు కావూరి సుశీల, వైకాపా నాయకులు వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రత్యేక హోదాతోనే భావితరాలకు భవిష్యత్తు’
ఒంగోలు, మార్చి 2 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎన్‌జివో హోంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఉద్యమానికి విద్యార్థి యువత సిద్ధంగా ఉండాలని ఆ మేరకు జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్టవ్య్రాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే సన్నబియ్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జెఎసి ప్రకాశం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు, ఈ నెల 19న విజయవాడలో విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని ఎపిపిఎస్‌సి గ్రూప్ -2 ప్రశ్నాపత్రంలోని తప్పులను పరిశీలించి మార్కులు కలపాలని ఆయన డిమాండ్ చేశారు.

25 టన్నుల పాతర గడ్డి పంపిణీకి సిద్దం
మర్రిపూడి, మార్చి 2 : మండల కేంద్రమైన మర్రిపూడి పశు వైద్యశాల పరిధిలోని గ్రామాల్లో పశు పోషకులకు సబ్సిడీపై పాతర గడ్డి పంపిణీ చేయనున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ జివి సురేఖ తెలిపారు. 25 టన్నులు పాతర గడ్డి పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. ఒక్కొక్క రైతుకు 360 కేజీల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఒక కేజి రెండు రూపాయలకే ఇస్తామన్నారు. కావాల్సిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు లతో వారి వారి పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని పశువులు ఉన్న పశు పోషకులందరూ సద్వినియోగం చేసుకోవాలని సురేఖ కోరారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన
కారంచేడు, మార్చి 2 : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాలను జోనల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఎఫ్రాయిమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన వసతులను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.

‘గండ్లు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి’
అద్దంకి, మార్చి 2: సాగర్ కెనాల్‌కు గండ్లు పడకుండా పఠిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అద్దంకి మేజర్ కెనాల్‌పై కరణం బలరాంతో పాటు ఎన్‌ఎస్‌పి ఎస్‌ఇ శారద, ఇఇ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ఎన్‌ఎస్‌పి కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు సాగునీరు అవసరమైన సమయంలో కట్టకు గండ్లు పడటంతో సాగునీరు వృధాగా పోవడమే కాకుండా సమయానికి కావాల్సిన సాగునీరు అందించలేకపోతున్నారన్నారు. కాల్వపై నిత్యం పర్యవేక్షణ చేయించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అద్దంకి మేజర్‌కు రావాల్సిన వాటా సాగునీరు రావడం లేదని, సకాలంలో పూర్తిస్థాయిలో నీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని, ముందస్తుగా నియోజకవర్గంలోని మంచినీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలరాం వెంట టిడిపి నాయకులతో పాటు ఎన్‌ఎస్‌పి అధికారులు ఉన్నారు.

జాతీయస్థాయ వాలీబాల్‌లో సెయింటాన్స్‌కు మూడోస్థానం
చీరాల, మార్చి 2 : వడ్డేశ్వరంలోని కెఎల్ విశ్వవిద్యాలయంలో ఇటీవల జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించారు. కోనేరు లక్ష్మయ్య మెమోరియల్ ట్రోఫి 2017 పేరుతో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కేరళ, తమిళనాడు, పాండచ్చేరి, కర్ణాటక, అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి మొత్తం 30 జట్లు పాల్గొన్నాయి. లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో కర్ణాటక జట్టుపై స్థానిక సెయింటాన్స్ కళాశాల జట్టు విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టు ట్రోఫీతో పాటు రూ.10 వేల నగదు బహుమతి గెలుచుకుంది. జట్టు క్రీడాకారులను గురువారం కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రధానాచార్యులు డాక్టర్ పి రవికుమార్, పిడి అన్నం శ్రీనివాసరావు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి తదితరులు అభినందించారు.

పన్నులు చెల్లించాలంటూ వినూత్న ప్రదర్శన

చీరాలటౌన్, మార్చి2: పురపాలక పరిధిలో ఇంటి పన్ను చెల్లించాలని కోరుతూ 24, 25, 26 వార్డుల్లో గురువారం వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అధికారులు డప్పు బృందంతో కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఇంటింటికి తిరిగి పన్ను చెల్లించని వారి ఇంటి ముందు బైఠాయించి పన్ను చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ నూరు శాతం పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పన్ను డిమాండ్ రూ.6.42 కోట్లు కాగా నేటి వరకు రూ.4.9 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. రూ.90 లక్షల మేర నీటి పన్ను బకాయిలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా రూ.30 వేల మొండి బకాయిలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిఇ మాల్యాద్రి, ఆర్‌వో లక్ష్మణ్, రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

‘విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి’
పర్చూరు, మార్చి 2 : విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం అన్నారు. మండల పరిధిలోని వీరన్నపాలెం శ్రీనవ్యభారత ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. తెలియని విషయాలను తెలుసుకునే వరకు పట్టువిడవరాదని తెలిపారు. చిన్నతనం నుంచి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులతో పాటు గ్రామానికి పేరుతేవాలని పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వై సీతారామయ్య, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, సిహెచ్ సురేష్, బుచ్చయ్యచౌదరి, పి పోతురాజు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వంట గ్యాస్ ధర తగ్గించకుంటే ప్రజాఉద్యమం
* సిపిఐ జిల్లా కార్యదర్శి అరుణ స్పష్టం
మార్కాపురం టౌన్, మార్చి 2: కేంద్రప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని, లేనట్లయితే ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ హెచ్చరించారు. గురువారం స్థానిక పూలసుబ్బయ్య శాంతిసంఘం భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలతోపాటు ప్రజలకు ఉపయోగపడే అన్ని సరుకుల ధరలను తగ్గిస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన మోదీ, చంద్రబాబు పాలనపగ్గాలు చేపట్టాక వాగ్దానాలను నెరవేర్చకపోగా అదనపు భారాలను ప్రజలపై మోపుతున్నారన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. గత ఆరు దశాబ్దాల కాలంగా ఎన్నడూ పెంచని విధంగా మోదీ సర్కారు వంట గ్యాస్ ధరలతోపాటు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతోందని విమర్శించారు. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో దాని ప్రభావం ట్రాన్స్‌పోర్టు రంగంపై పడుతోందని, ఆ రంగం సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాగ్రహాన్ని చవిచూడకముందే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని అరుణ పేర్కొన్నారు. ఈసమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాశీం, ఎఐవైఎఫ్ నాయకులు సిహెచ్ రామిరెడ్డి, అందె సురేష్ తదితరులు పాల్గొన్నారు.