ప్రకాశం

అక్రమ సంబంధం అనుమానంతో వివాహిత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, మార్చి 5: అక్రమ సంబంధం అనుమానంతో ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామానికి చెందిన గార్లపాటి అరుణ (22)ను నాలుగేళ్ళ క్రితం యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామానికి చెందిన గార్లపాటి బాలవీరయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే బాలవీరయ్యకు వరుసకు తమ్ముడు అయ్యే అడ్డగిరి బాలవెంకటేశ్వర్లు ఈనెల 2వ తేదీన వారి ఇంటికి వెళ్ళి మీ అమ్మ నుంచి ఫోన్ వచ్చిందంటూ 3వ తేదీన మీ చెల్లెలికి పెళ్ళిచూపులు జరుగుతాయని నమ్మబలికాడు. దీంతో భర్త బాలవీరయ్య అరుణను కొప్పుకొండ వెళ్ళి కార్యక్రమం చూసుకొని రావాల్సిందిగా చెప్పిపంపాడు. దీంతో అడ్డగిరి బాలవెంకటేశ్వర్లు అరుణను మోటారుసైకిల్‌పై ఎక్కించుకొని కొప్పుకొండకు వెళ్లగా చెల్లెలి పెళ్ళిచూపులు ఉంటే నేను నీకు చెప్పనా.. ఎందుకు అతని మోటారుసైకిల్‌పై వచ్చావంటూ అరుణ తల్లి మందలించి అత్తగారి ఇంటికి వెళ్ళాలని చెప్పడంతో ఆమె వెనుతిరిగి అదే మోటారుసైకిల్‌పై గుడిపాడు వచ్చేందుకు బయలుదేరారు. కాగా, బాలవెంకటేశ్వర్లు అరుణను గుడిపాడుకు తీసుకువెళ్ళకుండా మార్కాపురం వెళ్ళివద్దామంటూ తీసుకువెళ్ళి తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామ సమీపంలో రాజులకుంట వద్ద దారుణంగా హత్యచేసి పలకల గనులలో పడవేశాడు. అటు అత్త ఇంటికి వెళ్ళక, ఇటు పుట్టింటిలో ఉండకపోవడంతో అనుమానం వచ్చిన అరుణ కుటుంబ సభ్యులు వినుకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు సమాచారం సేకరించి తాడివారిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో హత్య చేసినట్లు గుర్తించి తాడివారిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డివైఎస్పీ రాంబాబు, పొదిలి సిఐ శ్రీనివాసరావు, తాడివారిపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. కాగా, అడ్డగిరి బాలవెంకటేశ్వర్లుతో అక్రమ సంబంధం నెరుపుతూ ఇటీవల కాలంలో అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తితో మాట్లాడుతున్నట్లు అనుమానం వచ్చి నిందితుడు బాలవెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసువర్గాలు తెలుపుతున్నాయి. ఏదిఏమైనా హత్య జరిగిన తీరు స్థానికులను కలవరపరుస్తోంది. అరుణను హత్యచేసి సుమారు 60 అడుగుల లోతులో ఉన్న పలకల గనుల్లో ఒంటిపై దుస్తులు లేకుండా పడవేయడం, అదే సమయంలో రెండు పెద్దబండరాళ్ళ మధ్య మృతదేహాన్ని ఉంచి ఎవరికీ కనిపించకుండా బండ అడ్డం పెట్టడం చూస్తే ముందుగా వేసుకున్న ప్రణాళికతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితుని నుంచి సమాచారం లేకుంటే హత్య జరిగిన ప్రదేశం కానీ, మృతదేహం ఉన్న ప్రాంతం కానీ వెలుగులోకి వచ్చేదికాదు. కాగా, అరుణ తన చెల్లెలు పెళ్ళిచూపులకు వెళ్తూ నగదు, బంగారు నగలతో వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే అరుణ మృతదేహం వద్ద ఎలాంటి నగదు, నగలు లభ్యం కాకపోవడంతో నిందితుడు అపహరించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

టిడిపి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
- మంత్రి శిద్దా రాఘవరావు పిలుపు
దర్శి, మార్చి 4 : శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు బలపర్చిన పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి అభ్యర్థులు వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, వాసుదేవ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు 40 శాతం ఫిట్‌మెంట్ పెంచడం, 58 నుండి 60 సంవత్సరాలకు రిటైర్‌మెంట్ వయస్సును పెంచడం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే టిడిపి అభ్యర్థులైన వాసుదేవనాయుడు, పట్ట్భారామిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రం ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 190 రోజుల్లో రాష్ట్రానికి కావాల్సిన అన్నీ వసతులతో కూడిన వెలగపూడిలో సచివాలయాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. నదులు అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018కి పూర్తిచేసి కరవురహిత ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధిపనులు చేపట్టడం జరిగిందన్నారు. దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చెందడానికి అన్నీ అవకాశాలు ఏర్పాటు అయ్యాయన్నారు. ఇప్పటికే అనేక దేశాల కంపెనీలు దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. ఎమ్మెల్సీ రామక్రిష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబుకు ఉన్న దీక్షాదక్షితలు ఎనలేనివని కొనియాడారు. రానున్న శాసనమండలి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టులను గెలిపించడం వలన రాష్ట్రానికి ఉపయోగం ఉండదని , అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించడం వలన అభివృద్దికి బాటలు వేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపిపి పూసల సంజీవయ్య, ఎయంసి చైర్మన్ సూరే చిన్న సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొర్రే సుబ్బారెడ్డి, ముండ్లమూరు ఎంపిపి వెంకట్రావు, ప్రముఖ విద్యా సంస్థల అధినేత వైవి సుబ్బయ్య, సర్పంచ్ జిసి గురవయ్య, కనీస వేతన సంఘం డైరెక్టర్ శోభారాణి, ముండ్లమూరు జడ్పిటిసి నాగరాజు, జిల్లా సహకార సంఘం డైరెక్టర్ చంద్రవౌళి, మండల ఉపాధ్యక్షులు మారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిపి లు నూనె విజయకుమారి, పి బాలయ్య, టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, టిడిపి నాయకులు కొల్లి బ్రహ్మారెడ్డి, మానం రమేష్, వరగాని పౌలు, మగ్బుల్ బాషా, పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జెసి ప్రభాకర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
రోజాను చూస్తే సిఎంకు వణుకు
పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి
వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,మార్చి 5: దివాకర్ ట్రావెల్స్ అధినేత జెసి ప్రభాకర్‌రెడ్డి తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని, జెసి ప్రభాకర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఆదివారం స్థానిక జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఆర్థిక సహాయం అందించి వారికుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పిడిఎఫ్ అభ్యర్థులైన యండపల్లి శ్రీనివాసరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, జిల్లాలోని పార్టీక్యాడర్ అంతా పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మరంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయటం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని కాని ఆ హామీ ఇంతవరకు అమలుకాలేదని ఆయన ధ్వజమెత్తారు. ఎంఎల్‌సి ఎన్నికలు జరుగుతున్నందున గ్రాడ్యూయేట్లకు కూడా నిరుద్యోగభృతి ఇస్తానని ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. తమపార్టీకి చెందిన శాసనసభ్యురాలు రోజా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వణుకుపుడుతుందని ఆయన ఆరోపించారు. రోజాను అసెంబ్లీకి మరోసారి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి బాలినేని ధ్వజమెత్తారు. విలేఖర్ల సమావేశంలో కందుకూరు, కనిగిరినియోజకవర్గాల ఇన్‌చార్జులు తూమాటి మాధవరావు,బుర్రా మధుసూదన్‌యాదవ్, వైకాపా రాష్టన్రాయకులు కెవి రమణారెడ్డి, చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

నగల దుకాణంలో భారీ చోరీకి విఫలయత్నం
మేదరమెట్ల, మార్చి 5 : గుర్తు తెలియని వ్యక్తులు నగల దుకాణంలో భారీ చోరీకి విఫలం యత్నం చేసిన సంఘటన మేదరమెట్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని నాభిశిల సెంటర్‌కు దగ్గరలో ఉన్న రామనాధం కాంప్లెక్స్‌లో సత్తార్ అనే యువకుడు బంగారు, వెండి నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అదే కాంప్లెక్స్‌లో ఇతని దుకాణం పక్కనే ఉన్న మరో నగల దుకాణంలో కొద్ది రోజుల క్రితం చోరీ జరిగింది. అప్పుడు ఆ కేసును పరిశోధించిన పోలీసు అధికారులు అక్కడ ఉన్న దుకాణాలన్నింటిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని దుకాణా యజమానులను పోలీసులు అదేశించారు. వారి ఆదేశాల మేరకు సత్తార్ కూడా తన షాపులో సిసి కెమెరాను ఏర్పాటు చేసుకున్నాడు. శనివారం షాపు మూసి వేసిన తరువాత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపుకు ఉన్న సిమెంట్ కిటికీలు పగులకొట్టి షాపులోకి ప్రవేశించి సిసి కెమెరా వైర్లు తెంచేశారు. అక్కడ ఉన్న బీరువాను తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంత సమయం గడిపినా ప్రయత్నం ఫలించకపోవడంతో ఒట్టి చేతులతో వెనుదిరిగారు. అతను బీరువా ఉన్న గదిలో నుండి ముందు గదిలోకి రాకపోవడంతో బీరువాలోని నగదుతో పాటు షోకేస్‌లలో ఉన్న సుమారు 20 లక్షల కు పైగా విలువ కలిగిన దొంగలు దొంగ పాలు కాకుండా భద్రంగా ఉన్నాయి. ఆదివారం ఉదయం యజమాని సత్తార్ షాపు తాళాలు తెరిచి చూసి అక్కడ పరిస్థితులను గమనించి మేదరమెట్ల ఎస్‌ఐ వై పాండు రంగారావుకు ఫిర్యాదు చేశారు. మేదరమెట్ల ఎస్‌ఐ, అద్దంకి సి ఐ హైమారావుకు విషయం తెలియజేయగా సిఐ హైమారావు ఒంగోలులోని క్లూస్ టీం ఎస్‌ఐ బ్రహ్మయ్యకు సమాచారం అందించి క్లూస్ టీం సిబ్బందితో కలిసి మేదరమెట్లలోని నగల దుకాణానికి వచ్చి సంఘటన పూర్వా పరాలను విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో ఆర్మీ జవాను మృతి
కొమరోలు, మార్చి 5: మండలంలోని కసినేపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బండారు నారాయణ (32) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గుండెపోటుతో మరణించినట్లు ఆదివారం సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నారాయణ గత 12 సంవత్సరాల కిందట ఆర్మీలో చేరారు. కాగా, ఇటీవల సెలవుపై ఇంటికి వచ్చి గత పదిరోజుల కిందట తిరిగి రాజస్థాన్ వెళ్ళారు. శనివారం రాత్రి భోజనం చేస్తుండగా నారాయణకు గుండెపోటు వచ్చిందని, వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందాడని అధికారులు సమాచారం అందించారు. నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్మీ జవాను నారాయణ మృతి చెందిన సమాచారం అందడంతో కొమరోలుతోపాటు స్వగ్రామమైన కసినేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విద్యుదాఘాతంతో
బాలుడు మృతి
పెద్దదోర్నాల, మార్చి 5: విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక జెండాచెట్టు సమీపంలోని వీధిలో బంకు వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన ఎర్త్ వైర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై గ్రామానికి చెందిన బోగోలు వెంకటేశ్వర్లు (11) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పిడిఎఫ్ అభ్యర్థులకు వైకాపా
సంపూర్ణ మద్దతు
- ఒంగోలు ఎంపి వైవి
ఒంగోలు అర్బన్,మార్చి 5:శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు, రాష్టన్రాయకులు జాలా అంజయ్య, నగరపార్టీకార్యదర్శి జివి కొండారెడ్డి మర్యాదపూర్వకంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవిని తన నివాసంలో కలిశారు. ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులైన విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని, తమపార్టీ పూర్తిసహాయసహకారాలు అందించాలని వారు ఎంపిని కోరారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానంగా వేసవిలో తాగునీరు, పశుగ్రాసం, పంటలకు మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఇలాంటి విషయాల్లో తప్పకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరుపున పోరాటం చేస్తామని ఎంపి తెలిపారు. పార్టీఅధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తామని సిపిఎం నాయకులకు హామీ ఇచ్చారు.