ప్రకాశం

హిట్లర్‌ను తలపిస్తున్న మోదీ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, మార్చి 20 : దేశంలో మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు నియంత హిట్లర్ పాలనను గుర్తుచేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మీ పేర్కొన్నారు. సోమవారం దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి పొట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన ఆవేదన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఏ పూట ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారన్నారు. తమ డబ్బుకు భద్రత లేకుండా పోయిందని, చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టుకున్న సొమ్మును కూడా మోదీ నిర్ణయంతో బ్యాంకుల నుండి తిరిగి తీసుకోలేని పరిస్థితులు దాపురించాయన్నారు. కోటీశ్వరులెవ్వరూ బ్యాంకు క్యూ లైన్లలో నిలబడలేదని, పేద వారే తమ పనులు పొగొట్టుకొని బ్యాంకు క్యూ లైన్లలో రోజుల తరబడి నిల్చున్నారన్నారు. మోదీ తనదైన ముద్ర కోసం నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. మోదీ పాలన ను చూస్తుంటే తనదైన ముద్ర కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి మోదీ రాజ్యాంగాన్ని తయారు చేస్తారేమో అన్న ఆవేదన కలుగుతుందన్నారు. బ్రిటీష్ కాలం నుండి ప్రత్యేకంగా ప్రవేశ పెడుతున్న రైల్వే బడ్జెట్ ను మోదీ ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లోనే కలిపి పెట్టడం ఆయన పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అర్హులైన పేదలను ప్రక్కన పెట్టి తమ కార్యకర్తలకే పధకాలను కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. బాబు వస్తే జాబ్ వస్తుందని బాబు వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు ఊడి అనేక మంది రోడ్డున పడ్డారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్లానింగ్ కమీషన్ ఒప్పుకోలేదని చెప్పుతున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రైతు రుణమాఫీని ఏ కమీషన్ ను అడిగి హామీ ఇచ్చిందని ప్రశ్నించారు. గత రెండున్నర సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల ఆవేదనను వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆవేదనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా ఆవేదన ను ప్రజా బ్యాలెట్ల ద్వారా వ్యక్తం చేయడానికి ప్రజా బ్యాలెట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాడేందుకు ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అని వెంకయ్య నాయుడు , పదిహేను సంవత్సరాలు అని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి సరైన నిధులు రావని , పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు కూడా ముందుకు రారన్నారు. టిడిపి ఎంపిలు కూడా ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా బిల్లులో పొందు పర్చినవే అమలు చేస్తున్నారే తప్పా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా వలన ఆయా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రసంగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రత్యేక హోదా తోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని, ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆమె తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజకీయ వారసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని, వైకాపా అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తికి మాత్రమే వారసుడని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి దర్శి నియోజక వర్గ ఇన్‌చార్జి కొండారెడ్డికి జిల్లా కాంగ్రెస్ వెనె్నంటే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఐసిసి వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి చంద్రశేఖర్‌యాదవ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు జివి రాజ్‌విమల్, కిసాన్ సంఘం అద్యక్షులు రాజగోపాల్‌రెడ్డి, చీరాల ఇన్‌చార్జి నిశాంత్, మార్కాపురం ఇన్‌చార్జి , పిసిసి అధికార ప్రతినిధి సైదా, సంతనూతలపాడు ఇన్‌చార్జి వేమా శ్రీనివాసరావు, కనిగిరి ఇన్‌చార్జి పాశం వెంకటేశ్వర్లు, పర్చూరు ఇన్‌చార్జి క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హ్యాట్రిక్ సాధించిన విఠపు
కొనసాగుతున్న పట్ట్భద్రుల ఓట్లలెక్కింపు
యండపల్లి, వేమిరెడ్డి మధ్యనే ప్రధానపోటీ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,మార్చి 20:చిత్తూరు,నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలుపొందారు. దీంతో పిడిఎఫ్ పక్షంతోపాటు, మద్దతు తెలిపిన వైకాపా శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ముచ్చటగా మూడోసారి ఎంఎల్‌సిగా విఠపు గెలుపొందటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తవౌతుంది. గతంలో విఠపు పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రెండువిడతల ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అదేవిధంగా పట్ట్భద్రుల నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ పూర్తిఅయ్యేసరికి అర్ధరాత్రి పట్టే అవకాశాలున్నాయి. ఉదయం ఎనిమిదిగంటలనుండి కట్టలు కట్టేపనిలో ఎన్నికల సిబ్బంది నిమగ్నంకాగా వాటిని ప్రాధాన్యత ఓట్ల పరంగా లెక్కించేసరికే అర్ధరాత్రి పట్టనుంది.
ఇదిలా ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పిడిఎఫ్ అభ్యర్థిగా విఠపు బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశంపార్టీ తరపున అన్నమనేని వాసుదేవనాయుడుతో పాటు పలువురు పోటీలో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొంది. తొలిప్రాధాన్యత ఓటింగ్‌లో విఠపుకు స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల ప్రకారం విఠపు గెలుపొందారు. ఈ ఎన్నికలను పిడిఎఫ్‌పక్షానికి చెందిన ఉపాధ్యాయులతోపాటు, ఇతర ఉపాధ్యాయ సంఘాలు, వైసిపినేతలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. పిడిఎఫ్ అభ్యర్ధులను గెలిపించాలని వైకాపాకు చెందిన పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వాసుదేవనాయుడు గెలుపును కాంక్షిస్తూ ముగ్గురుమంత్రులు పి నారాయణ, శిద్దా రాఘవరావు, రావెల కిశోర్‌బాబుతోపాటు, జిల్లాలోని శాసనసభ్యులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు హోరాహోరి ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఉపాధ్యాయ నియోజకవర్గం తరపున పోటీచేసిన అభ్యర్ధి మాత్రం నామమాత్రంగా రావటం జరిగింది. మొత్తంమీద ఉపాధ్యాయ నియోజకవర్గంనుండి విఠపు గెలుపొందటం పట్ల ఆ పక్షానికి చెందినశ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి మధ్యనే ప్రధానమైన పోటీ జరుగుతుంది. ఎవరికి వారే నువ్వా, నేనా అన్నట్లు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికలను పిడిఎఫ్ పక్షానికి చెందిన నేతలతోపాటు, వైకాపా నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వేమిరెడ్డి గెలుపుకోసం తెలుగుతమ్ముళ్లు సర్వశక్తులు ఒడ్డారు. ముగ్గురు మంత్రులు, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లాలో తిష్టవేసి ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. మొత్తంమీద ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలుపొందటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
కలెక్టర్ సుజాతశర్మ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,మార్చి 20:జిల్లాలో తాగునీటి చేతిపంపులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంనుండి తహశీల్దార్లు, ఎంపిడిఒలు, వైద్యాధికారులు, పశువైద్యాధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో తాగునీరు, పశువులకు గడ్డి, తాగునీరు తొట్లనిర్మాణం, వడగాలులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనిగిద్దలూరు, కనిగిరి తదితర ప్రాంతాల్లో చేతిపంపులుబాగా ఎండిపోతున్నాయన్నారు. ఇది తీవ్రపరిణామని రాబోయే రెండునెలలు ఎండలు తీవ్రంగా ఉండి మంచినీటి సమస్యలు తలెత్తె అవకాశం ఉందని, బోరుబావులు తవ్వినతరువాత నెలరోజుల్లోనే ఎండిపోతున్నాయన్నారు. బోరుబావుల తవ్వకానికి సాధ్యాసాధ్యాలు సక్రమంగా పరిశీలించాలని, వాటికి తప్పనిసరిగా రీచార్జీ నిర్మాణాలను ఏర్పాటుచేయాలన్నారు. మరమ్మత్తు చేయాల్సిన చేతిపంపులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. చేతిపంపుల మరమ్మతులపై చీరాల డిఇ తప్పుడు నివేదిక ఇవ్వటంపై జిల్లాకలెక్టర్ అసహనం వ్యక్తంచేస్తూ లెక్కలు సరిగా చూపకపోయినా నిధులు పక్కదారి పట్టిన ఎంపిడిఒలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న బోరుబావుల జాబితా ఎంపిడిఒల దగ్గరనుండి తీసుకోవాలని, అక్కడ ఏప్రియల్ నెలలో నీటినిల్వ నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పశువులకు పశుగ్రాసం, తాగునీరు కొరతలేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకోసం గ్రామాల్లో రైతులతో అవగాహన శిబిరాలు ఏర్పాటుచేసి ఎవరికి ఎన్ని సైలేజ్ గడ్డిమూటలు కావాలో వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో పశువైద్యశాలల్లో రైతుల డిమాండ్ మేరకు సైలేజ్‌గడ్డి నిల్వలు అందుబాటులో ఉంచుకుని సబ్సిడీతో వారికి సరఫరా చేయాలన్నారు. గ్రామాలవారీగా, రూట్‌వారీగా షెడ్యూలు తయారుచేసుకుని రైతులకు గడ్డిని అందించాలన్నారు. జిల్లాలో 274గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అందులో 74గ్రామాల్లో 160పశువుల తొట్లు అవసరం ఉందని గుర్తించామన్నారు. మండలాల వారీగా ఆ జాబితా తీసుకుని అంచనాలు రూపొందించి ఉపాధికూలీలతో తొట్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అందుకోసం పశుసంవర్థకశాఖాధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న దృష్ట్యా వడదెబ్బతగిలేప్రమాదం ఉన్నందున ప్రజలు ముఖ్యంగా వృద్దులు, పిల్లలు, కూలీలు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించాలన్నారు.వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బతగిలితే ఏవిధంగా ఎదుర్కొవాలనే అంశంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యపర్చాలన్నారు. అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాలు, అంగన్‌వాడీకేంద్రాల వద్ద ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్దంగా ఉంచామన్నారు. ఆర్‌టిసి బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. గొర్రెలు, మేకలు, పాడిపశువులు, కోళ్ళను వడదెబ్బనుండి ఏవిధంగా రక్షించుకోవాలో ముందస్తు జాగ్రత్తలు రైతులకు, పెంపకందార్లకు వివరించాలన్నారు. జన్మభూమి అర్జీలను నాణ్యతాప్రమాణాలతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లో డిఆర్‌డిఎ పిడి మురళీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరెడ్డి, పశుసంవర్ధకశాఖ జెడి రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పనితీరుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం
- బిజెపి జాతీయ మహిళా మోర్చా నేత పురంధ్రీశ్వరి
దర్శి, మార్చి 20 : కేంద్ర ప్రభుత్వ పనితీరుకు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బిజెపి జాతీయ మహిళా మోర్చా నేత, జిల్లా బూత్ కమిటీ ఇన్‌చార్జి దగ్గుపాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. సోమవారం దర్శి ఆర్‌అండ్‌బి కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని ధనికుల పార్టీగా చిత్రీకరించినందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్రను పేద ప్రజలు ఛేదించారన్నారు. పెద్దనోట్ల రద్దును పేదలు సమర్థించారని పేర్కొన్నారు. పేదరికాన్ని నర నరాన జీర్ణించుకున్న ప్రధాని మోదీ పేదరికాన్ని నిర్మూలించేందుకు జన్‌ధన్ యోజన పథకం నుండి అనేకరకాల సంక్షేమ పథకాలను, సంక్షేమానికి సుదూరంలో ఉన్న పేదవాడిని అందజేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఎపికి బిల్లులో పెట్టిన అంశాలతో పాటు సాంకేతిక సమస్య అయిన ప్రత్యేక హోదాను పక్కన పెట్టి అంతకు మించిన ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్రప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. రాష్ట్భ్రావృద్దిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ప్రధానమైందని గుర్తుచేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి నుండి కమిటీలు నియమిస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బూత్‌లెవల్ కమిటీలు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల రమణారావు, జిల్లా యువమోర్చ అధ్యక్షులు డి శివాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి లక్ష్మీ నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కాకర్ల ఆంజనేయులు, జిల్లా నాయకులు తిండి నారాయణరెడ్డి, మాడపాకుల శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో
ఇద్దరు కార్మికులు మృతి
* పలకల ఫ్యాక్టరీలో ప్రమాదం
మార్కాపురం, మార్చి 20: పలకల ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వేములకోటకు చెందిన ఎలికపాటి కోటమ్మ (40), గుండం శివారెడ్డి (32) రోజుమాదిరిగానే ఫ్యాక్టరీకి వచ్చి పలకలకు పాలిష్ పడుతుండగా ఆ ప్రాంతమంతా నీటిచెమ్మతో ఉండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ యజమాని సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు శివారెడ్డికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలు ఎలికపాటి కోటమ్మకు ఒక కుమార్తె ఉండగా ఇటీవల వివాహం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మార్కాపురం సిఐ బత్తుల శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.

వడగండ్ల వానకు నేలపాలైన వరిపంట
-- తడిసిన మిర్చి --
మర్రిపూడి, మార్చి 20: మండలంలో సోమవారం కురిసిన వడగండ్ల వానకు వరిపంట నేలపాలైంది. మిర్చి పంట తడిసిపోయింది. మండలంలోని వేమవరంలో సోమవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు దాదాపు 40 ఎకలాల్లో కోతకు వచ్చిన వరిపంట నేలపాలైందని రైతులు తెలిపారు. అకాల వర్షానికి నిలువునా రాలిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావంతో బోర్లకింద సాగుచేస్తున్న వరిపంట చేతికందే సమయంలో అకాల వర్షాలు రావడం తమకు శాపంగా మారిందని రైతులు బోరున విలపించారు. వ్యవసాయశాఖా అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అదే విధంగా కూచిపూడి, మర్రిపూడి, గార్లపేట గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట తడిసినట్టు రైతులు తెలిపారు. కళ్లాల్లో ఆరబెట్టుకున్న మిర్చి అకాల వర్షాలకు తడిసిందన్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.