ప్రకాశం

నియోజకవర్గాల పునర్విభజన ఉన్నట్లా.. లేనట్లా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 15 : రాష్టవ్య్రాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఉన్నట్లా, లేనట్లా అని ప్రధాన రాజకీయపక్షాల్లో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అందువలన జిల్లాలోని తెలుగుతమ్ముళ్లకు న్యాయం చేస్తానని ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘంటాపదంగా చెబుతుండగా అదేస్థాయిలో వైకాపా మఖ్యనాయకులు కూడా రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్‌విభజన జరగదని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు తెలుగుతమ్ముళ్లల్లోను, అటు వైకాపా శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గాల పునర్‌విభజన జరిగితే మరో మూడు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 12అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మరో మూడు నియోజకవర్గాలు కలవనుండటంతో 15 నియోజకవర్గాలు కానున్నాయని తెలుగుతమ్ముళ్లు ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్ధంకాక ఇరుపార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్‌విభజన జరగకపోతే మాత్రం పలు నియోజకవర్గాల్లోని తెలుగుతమ్ముళ్లకు బహిర్గతపోరే జరగనుంది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో ఆ నియోజకవర్గాల్లో రాజకీయం రచ్చరచ్చగా మారిందనే చెప్పవచ్చు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, ఇన్‌చార్జి కరణం వెంకటేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇటీవల వృద్ధాప్య పెన్షన్ల విషయంలోనూ ఎంఎల్‌సి కరణం బలరామకృష్ణమూర్తి ఎంపిడిఒను నిలదీసి తన అనుయాయులకు పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలోని ఒకగ్రామంలో గొట్టిపాటి బ్యానర్లను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చించివేయటంతో గొట్టిపాటి వర్గీయులు ప్రతికాలజ్వలలో రగిలిపోతున్నారు. ఈ నియోజకవర్గంలో మాత్రం వీరిద్దరి మధ్య సయోధ్య వచ్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి కసరత్తులు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా గిద్దలూరులో శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జీ అన్నారాంబాబుల మధ్య కూడా కొరవడింది. కందుకూరులో శాసనసభ్యుడు పోతుల రామారావు, ఇన్‌చార్జి దివి శివరాం మధ్య బహిర్గతంగా సఖ్యత బాగున్నప్పటికి అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోను పరిస్థితి ఆ విధంగానే కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో నియోజకవర్గాల పునర్‌విభజన జరిగితేనే తెలుగుతమ్ముళ్లకు బెర్తులు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే మాత్రం ఆ నియోజకవర్గాల్లో పార్టీకి లాభంకంటే నష్టమే ఎక్కువుగా జరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా వైకాపా శ్రేణులు మాత్రం రానున్న ఎన్నికల్లో తమగెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. రాష్ట్రప్రభుత్వంపై బహిరంగంగానే వ్యతిరేకత ఉందని అందువలన తమ గెలుపుఖాయమని వైకాపా నేతలు పేర్కొంటున్నారు. గతంలో గెలిచిన సీట్లకంటే ఎక్కువుగానే గెలుపొందుతామన్న ధీమాలో వైకాపా నాయకులు ఉన్నారు. జూన్‌నెలనుండి జిల్లాలో పార్టీమరింత బలపడేందుకు రాష్టప్రార్టీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎడమొఖం, పెడమొఖంగా ఉన్న బావ,బావమరుదులు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసికట్టుగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మాకంగా పావులు కదుపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. జిల్లాలోని 12నియోజకవర్గాల్లోను పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్ధులు గెలుపొందే విదంగా చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఫ్లొరైడ్ సమస్య జఠిలంగా ఉండటంతో ఈ విషయాన్ని భారతప్రధానమంత్రితోపాటు, కేంద్రమంత్రుల దృష్టికి ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్రప్రభుత్వం ఫ్లొరైడ్ మూలాలను కనుక్కునేందుకు ఒక బృందం జిల్లాకు రావటం జరిగింది. దీంతో జిల్లాకేంద్రమైన ఒంగోలుకు త్వరలోనే ఫ్లొరైడ్‌కు సంబంధించిన ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేసేందుకు కేంద్రప్రభత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తొంది. ముఖ్యంగా ఒంగోలు ఎంపిగా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించటమేకాకుండా సమస్యలను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నారు.కాగా ప్రస్తుతం వైసిపి తరుపున ఉన్న శాసనసభ్యులు, ఇన్‌చార్జులకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్న ప్రశ్న పార్టీశ్రేణుల నుండి వ్యక్తవౌతుంది. ప్రస్తుతం ఉన్న కొంతమంది నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చకుండా వారికి టిక్కెట్లను కేటాయిస్తే మాత్రం రానున్న ఎన్నికల్లోనూ పార్టీ భారీమూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదన ఆ పార్టీనేతల నుండే వినిపిస్తొంది. ఈ విషయంలో ఎంపి వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపాలని ఆపార్టీనాయకులే బహిరంగంగా కోరుతున్నారు. మొత్తంమీద నియోజకవర్గాల పునర్‌విభజన జరుగుతుందా లేదా అనే అంశంపైనే జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైందనే చెప్పవచ్చు.