ప్రకాశం

ముఖ్యమంత్రి జిల్లాకు ఇచ్చిన హామీలు ఎప్పటికి పూర్తయ్యేనో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 16 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు ఇచ్చిన హామీలు నాలుగున్నరేళ్లలో పూర్తి కాలేదని, ఇక మిగిలిన నాలుగునెలల పాలన కాలంలో నెరవేరుతాయా అన్న చర్చ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. నాలుగున్నరేళ్ల వ్యవధిలో జిల్లాలో ఒక్క మేజర్ ప్రాజెక్టు కాని, మైనర్ ప్రాజెక్టు కాని పూర్తికాలేదు. కేవలం గుండ్లకమ్మ ప్రాజెక్టు 90 శాతం పూర్తయినా ఇంతవరకు పూర్తిస్థాయిలో నిర్మాణం జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టును కొంతభాగం పూర్తిచేసి జాతికి అంకితం చేసి నీటిని విడుదల చేశారు. కాని ఈ నాలుగున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ ద్వారా వచ్చే సంవత్సరం జనవరి నాటికి నీరు విడుదల చేస్తామని ప్రతిసారి ముఖ్యమంత్రి సభలో ప్రకటిస్తూనే ఉన్నారు. కాని ఆచరణలో ఏ మేరకు నీటిని విడుదల చేస్తారో అనేది అర్థంకాకుండా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వెలిగొండ ప్రాజెక్టుపై పెట్టి ఉంటే ఈ పాటికే మొదటి టనె్నల్ ద్వారా నీరు విడుదలయ్యేదన్న వాదన పశ్చిమప్రాంత నేతలు, ప్రజల నుంచి వినిపిస్తోంది. కొరిశపాడు ఎత్తిపోతల పథకం పనులు సైతం నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు దొనకొండను పారిశ్రామిక హబ్‌గా తయారుచేస్తామని ప్రకటనల వర్షం కురిపిస్తున్నారు. కాని దొనకొండలో ఇంతవరకు అభివృద్ధి వైపు అడుగులు పడలేదు. 10 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది, త్వరలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రి చెప్తున్నప్పటికి ఆచరణలో ఏ మేరకు ఈ నాలుగు నెలల స్వల్పకాల వ్యవధిలో పనులు ఏ విధంగా పూర్తవుతాయన్న చర్చ ఆ ప్రాంత ప్రజల నుంచి వినిపిస్తోంది. అసలు దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రధానంగా నీటి వసతి ముఖ్యమని, ఆ వసతి పూర్తిస్థాయిలో ఎక్కడ ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తామని, దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఇప్పటివరకు ముఖ్యమంత్రితోపాటు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. నిమ్జ్ ఏర్పాటు కోసం 3100 ఎకరాల భూమిని సైతం సిద్ధం చేశామని, తీరా కేంద్రప్రభుత్వ ధోరణితో ముందుకు కదలని స్థితి నెలకొందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలోని నాగరాజుపల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను రూ.135.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికి ఇంతవరకు దానికి శంకుస్థాపన జరగలేదు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన అడుగులు పడలేదు. కందుకూరు నియోజకవర్గంలో హార్టికల్చర్ కాలేజి మంజూరు చేయగా, 196 ఎకరాల భూమిని అప్పగించారు. కాని పనులు మాత్రం మొదలు పెట్టలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మైనింగ్ యూనివర్శిటీ, కందుకూరు నియోజకవర్గంలో వెటర్నరీ కాలేజి ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు హామీలిచ్చారే తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి నాలుగున్నరేళ్లు పూర్తయినప్పటికి ఇంతవరకు ముఖ్యమంత్రి ఇచ్చిన మేజర్ హామీల ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంమీద నాలుగున్నరేళ్ల కాలంలో జరగని అభివృద్ధి కేవలం స్వల్పకాలిక వ్యవధిలో పూర్తవుతుందా అన్న చర్చ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.

రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనాపరులు కావాలి
* ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి
ఒంగోలు అర్బన్, అక్టోబర్ 16 : రాష్ట్ర అభివృద్ధి కోసం ఆవేశపరులు వద్దని, ఆలోచనాపరులు కావాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌బాబు, ఎమ్మెల్యేలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేవలం పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఇప్పటివరకు ఎవ్వరూ విమర్శలు చేయకుండా ఓపికగా ఉన్నామన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా విమర్శలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్దానం కోసం పోరాటం చేశారని చెప్పుకుంటున్న పవన్‌కల్యాణ్ అదే ప్రాంతంలో తిత్లీ తుఫాన్ వచ్చి ఊరు మొత్తం కొట్టుకొనిపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్కడే ఉండి ప్రజల బాగోగులు చూస్తున్నారని తెలిపారు. పవన్‌కల్యాణ్ మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుపతి వెళ్తున్నారని, విజయవాడలో ఆనందంగా పార్టీ కార్యాలయం ప్రారంభించుకుంటారే తప్ప బాధితుల గోడు నీకు పట్టాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాంటి పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌బాబులను విమర్శించడం మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌శాఖా మంత్రి లోకేష్ ఉద్దానంలో ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలను దాచిపెట్టి ఛాయ్ అమ్ముకునే వాడినని చెప్పి దేశ ప్రధాని నరేంద్రమోదీ ఈ దేశాన్ని దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఛాయ్ అమ్ముకునే బతుకుల్ని కాని, బీసీల బతుకులను ఏమీ మార్చలేదని విమర్శించారు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వం లేకుండా పవన్‌కల్యాణ్ సినీ రంగంలో హీరో అయ్యేవాడా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవితో పాటు రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా పనిచేసి చిరంజీవిని గెలిపించుకోలేని వ్యక్తివి నేడు తెలుగుదేశం పార్టీని గెలిపించామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడం కోసం సొంత అన్నపై చేసిన రాజకీయాలన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. సినీ రంగంలో పవన్ కల్యాణ్‌ది వారసత్వమే, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా పవన్‌ది వారసత్వమేని తేల్చిచెప్పారు. అలాంటి పవన్‌కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌బాబుపై వారసత్వ రాజకీయాలు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారసత్వ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, అందుకు నిదర్శనమే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రాజకీయాల్లో నారా లోకేష్ సొంతంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడాలని, లేనిపక్షంలో ప్రజాకోర్టులోనే తాము కూడా విమర్శలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.