ప్రార్థన

దేవాలయము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వారిని పాడుచేయును. మీరు ఆ ఆలయమై యున్నారు.’ - 1 కొరింథీ 3:16-17
మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైన వాడు మీ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడైయుండి సమీపింపరాని తేజస్సుతో ఉండువాడును, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేతను భక్తుల చేతను నిత్యము కొనియాడబడుచున్న ప్రభువు ఇప్పుడు మన దేహాలలో నివసించటానికి ఇష్టపడుతున్నాడు.
ప్రత్యక్ష గుడారములో ఉండి ఇశ్రాయేలీయులతో వారి మధ్య ఉంటూ, వారి మార్గమంతటిలో తోడుగా ఉన్నాడు. తరువాత సొలొమోను యెరూషలేములో కట్టిన దేవాలయములో ఉన్నాడు. అసలు దావీదు మహారాజు దేవాది దేవునికి ఒక ఆలయము కట్టవలెనని సిద్ధపరచిన వస్తువులు అనేకములు. బంగారము రెండు లక్షల మణుగులు, పది కోట్ల మణుగుల వెండి, ఇత్తడి ఇనుము తూచ శక్యము కానంత. వీటికి తోడు మ్రానులు రాళ్లు, విస్తారమైన శిల్పకారులు కాసే పనివారు వడ్రవారు ఎటువంటి పనినైన నెరవేర్చగల పనివారలను సిద్ధపరచాడు. అయినా దేవుడు దావీదుకు దేవాలయము నిర్మించే అవకాశమివ్వలేదు. చివరకు దావీదు కుమారుడు సొలొమోను ఆ మందిరమును కట్టించెను. దేవాలయ నిర్మాణానికి పట్టిన సమయము 46 సంవత్సరాలు. ఆ దేవాలయము రెండుసార్లు పడగొట్టబడింది. అనేకసార్లు పొరుగు దేశాల చేతిలో పట్టబడింది. ఇశ్రాయేలీయులు చేసిన అత్యధికమైన హేయకృత్యములను బట్టి తిరుగుబాటును బట్టి దేవుడు ఆ స్థలములో నివసించలేదు.
ప్రార్థనలు విజ్ఞాపనములు అర్పణలు బలులు స్తుతియాగములు ఆరాధనలు నిత్యము జరుగవలసిన స్థలము దేవాలయము. కాని పరిశుద్ధ దేవాలయమును వారు అపవిత్రపరచారు. ప్రభువు దృష్టిలో చెడ్డక్రియలు చేశారు. అందుకే ప్రభువు ఆ స్థలమును విడిచివెళ్లారు.
ఆయన మన మీద ఉన్న ప్రేమనుబట్టి ఆయనే శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి మన మధ్య సంచరించి ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరిగించాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెంగు తాకితేనే జనులకు స్వస్థత కలిగింది. అయితే ఆ ప్రభువును సిలువ వేసి చంపారు. మరణము ఆయనను బంధించలేక పోయింది. మృత్యుంజయుడైయ్యాడు. మనకున్న బంధకాలు విడిపించిన ప్రభువును మరణ బంధకాలతో బంధించటానికి ప్రయత్నించారు. కాని మరణ బంధకాలు ఆయన ముందు నిలువలేదు. మరణము ఓడిపోయింది.
ఇప్పుడు ఇక మన దేహాన్ని దేవాలయముగా చేసి మనలో నివసించాలని మనతో సహవసించాలని కోరుకుంటున్నాడు. మన పాపాలన్నిటికి సిలువతో ఆయన విలువ చెల్లించి, మనకు పాపాల నుండి విడుదల కలుగజేసి, శుద్ధ హృదయాలు కలిగిన మనలోనే మనతోనే ప్రభువు ఉండాలని కోరుకుంటున్నాడు.
వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. -యోహాను 17:23
నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. -యోహాను 15:5
చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలని ఏర్పరచుకొని, ప్రత్యేకపరచుకొని పరిశుద్ధపరచి రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తుగా చేసుకొన్నాడు. మన దేహాలు దేవుని వలన అనుగ్రహింపబడినవి మనము మన సొత్తు కాదు. మన కొరకు ప్రాణము పెట్టి మన పాపాలకు వెల చెల్లించిన ప్రభువుకు ఆలయమై యున్నవి. విలువ పెట్టి కొన్నవారము గనుక ఈ దేహములో దేవుని మహిమ పరచాలి.
దేవునికి ఆలయమైన ఈ దేహమును హింసించరాదు, దూషించరాదు అసభ్యంగా ప్రవర్తించకూడదు. హేళన చేయకూడదు. విసికించకూడదు. గాయపరచకూడదు. పచ్చబొట్లు పొడుచుకొనకూడదు.
ఈ దేహము పరిశుద్ధుని నివాసానికి అనువుగా పరిశుద్ధముగా ఉంచాలి. అప్పుడే మన దేహాన్ని దేవాలయముగా చేసికొని పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. దేహములో జారత్వము కాముకత్వము అపవిత్రత ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్ష భేదములు విమతములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు కోపాలు ఉన్నట్లయితే దేహములో పరిశుద్ధత ఉండదు గనుక ప్రభువు ఉండడు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది.
శరీరాను సారమైన మనస్సు ఉన్నవారిలో పరిశుద్ధ దేవుడు ఉండడు. శరీరానుసారమైన మనస్సు లోకానుసారంగా నడుస్తుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి నుండి పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి. దేహము పరిశుద్ధత లేకుంటే అపరిశుద్ధత చోటు చేసుకొంటుంది. అపరిశుద్ధత ఉన్న దగ్గర అపవాదియైన సాతానుడు ఉంటాడు. సాతాను చేత నడిపించబడతాడు. సాతానుడు మనుషులను సమాధానంగా ఉండనీయడు. ప్రేమలు ఉండవు. ద్వేషము పెరుగుతుంది. సహనము కోల్పోతారు. విశ్రాంతత కోల్పోతారు.
మన దేహములో ప్రభువు ఉండాలంటే దేహాన్ని భద్రపరచాలి. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఆయనకు ఇష్టమైనట్టు జీవిస్తే మనకు సమాధానము. ప్రభువుకు దేవాలయమైన ఈ శరీరమును మన ఇష్టం వచ్చినట్టు జీవించి చెడు అలవాట్లకు బానిసలము కాకూడదు. మత్తుమందులకు జూదాలకు వ్యభిచారానికి బానిసలు కాకూడదు. త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా నిద్రమంతులుగా ఉండకూడదు.
అలాగని దేహ పూజ కూడా చేయకూడదు. పరిశుద్ధంగా ఉండాలే కానీ దేహాన్ని ఆరాధించకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీస్తుంది. అది దేవునికి విరోధముగా ఉంటుంది.
మన మనసులలో దేవునికి చోటియ్యకపోతే అట్టివారిని దేవుడు భ్రష్ఠ మనసుకు అప్పగిస్తాడు.
దేవుడు మన దేహములో ఉండటానికి ఇష్టపడుతున్నాడు గనుక పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన దేహములను ప్రభువునకు సమర్పించుకొని ఆయనకు ఆలయముగా ఉంటే, ప్రభువు రాజ్యములో మనకు ప్రవేశము దొరుకుతుంది. ఎందుకంటే నూతన యెరూషలేములో నూతన పట్టణములో సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నాడు -ప్రకటన 21:22. ఈ దేహములో ప్రభువు నివసించటానికి సిద్ధపరచితే, ఆయన ఆలయములోనికి ప్రవేశముంటుంది.
ఈ అల్పకాల జీవితము ప్రభువుకు ఆలయముగా ఉంచినట్లయితే నిత్య రాజ్యములో ఆలయమైన ఆయనలో మనము ఉండగలము. ఇక్కడ ఈ దేహములో ఉన్నప్పుడు ప్రభువును లెక్కచేయకపోతే మన ఆత్మకు పరలోక రాజ్యములో ప్రవేశముండదు. మనకు బాగా తెలుసు. ఈ దేహము మనలను ఏదో ఒక క్షణం విడిచి తిరిగి మంటిలో కలిసి పోతుంది. కాబట్టి దేవుడు మన దేహములో ఇష్టపడనటువంటి కార్యాలు అది సిగరెట్లు త్రాగటమైనా మత్తుమందులైనా జూదాలు లంచాలు దొంగతనాలు వ్యభిచారము లాంటి విషయాలు ఈ నూతన సంవత్సరములో మానివేసి, ప్రభువు నివసించటానికి అనువుగా పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.
తీసుకున్న మంచి నిర్ణయాలను అభినందించి వాటిని కొనసాగించి ఆశీర్వాదాలు అందుకోవాలని ఆశిస్తూ.

-మద్దు పీటర్ 9490651256