ప్రార్థన

విశ్వాస డాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి’ -ఎఫెసి 6:11

‘విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.’ -ఎఫెసి 6:16

‘వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును.’ -రోమా 10:17

యేసుక్రీస్తు రక్షకుడని మనలను రక్షించటానికే ఈ లోకానికి మానవునిగా వచ్చాడని, దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొనని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొని, ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, మరణము జయించి తిరిగి లేచిన సంగతిని విశ్వసించాలి.
విశ్వాసమే మన విజయము. లోకాన్ని మరణాన్ని జయించిన క్రీస్తు విజయము మనలో ఉన్నప్పుడు మనము కూడా లోకాశ శరీరాశ జీవపుడంబమును సులువుగా జయించగలము. క్రీస్తును నమ్ముట వలన మనము దేవుని కుమారులముగా కుమార్తెలముగా, క్రీస్తునందు విజయులముగా జీవించగలము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆవగింజంత విశ్వాసముంటే గొప్ప కార్యములు చేయగలరని ప్రభువు సెలవిస్తున్నాడు.
బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు యేసును గూర్చి విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. కేకలు మొఱలు ఏడ్పులు హృదయము యొక్క మూల్గులు కూడా వినగలిగిన యేసు నిలిచి వానికి దృష్టి కలుగజేసి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెనని చెప్పాడు. వెంటనే అతడు చూపు పొందెను. ఆత్మీయ గ్రుడ్డితనములో ఎందరో ఉన్నారు. వారికి ఆత్మీయ చూపు ఇస్తాడు. గ్రుడ్డివారిని చూడలేని గ్రుడ్డివారు ఎందరో ఉన్నారు. అందరినీ వెలిగించటానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
శతాధిపతి తన దాసుని స్వస్థపరచమని ప్రభువును ప్రార్థించినపుడు -యేసు -నేను వచ్చి స్వస్థపరచెదనని అతనితో చెప్పెను. కానీ ఆ శతాధిపతి ‘ప్రభువా! నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. నా దాసుడు స్వస్థపడున’ని చెప్పిన మాటకు యేసు అతని విశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ‘నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక’ అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను.
యేసు ప్రభువునే ఆశ్చర్యపరచేటంత దృఢ విశ్వాసముగల శతాధిపతి లాంటి వారు అనేకులు ఉన్నారు. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నారు. ‘ఒక్కమాట సెలవియ్యండి నా దాసుడు స్వస్థపరచబడతాడు, నీ అధికారము నాకు తెలుసు. నీ మాట చూపు కృప కరుణ దయ నాకు చాలు అన్న శతాధిపతికి ఉన్న విశ్వాసము, మనము కలిగి ఉండాలి. మాటతో సర్వసృష్టిని చేసిన ప్రభువు శక్తిని మనము నమ్మాలి. మరణాన్ని గెల్చి లేచిన శక్తిని నమ్మాలి.
దేవుని శక్తిని ఎరిగిన అబ్రహాము ఆయన పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్లెను. ఎక్కడికి వెళ్లవలయునో ఎరుగకనే బయలువెళ్లెను.
విశ్వాసములో ఓపికగా ఉండాలి. అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మి గర్భఫలము కొరకు 25 సంవత్సరములు ఓపికతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. విశ్వాసములో ఉన్న శక్తిని శారాలో చూడవచ్చు. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుకొనుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆకాశ నక్షత్రములను లెక్కించలేమని అవి ఇసుక రేణువుల వలె ఉన్నాయని దేవుడు ఆదిలోనే ఈ సత్యాన్ని అబ్రహామునకు తెలియజేశాడు.
మొదటిలో నక్ష్రతాలు సుమారు 1500 ఉండవచ్చు అనుకున్నారు గానీ రానురాను టెలిస్కోప్ ద్వారా సుమారు 10 ట్రిలియన్ గేలాక్సీలు ఉన్నాయని, ఒక్కొక్క గేలాక్సీలో 100 మిలియన్ నక్షత్రాలు ఉండవచ్చునని ఉజ్జాయింపుగా తెలియజేశారు. చివరకు నక్షత్రాలను లెక్కించటమంటే సముద్ర తీరములోని ఇసుక రేణువులను లెక్కించినట్లే ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు.
అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి వందేళ్లకు పుట్టిన కుమారుని బలిగా అర్పించటానికి సిద్ధపడ్డాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయులు పొడి నేలను నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు కూడా అలాగు చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసులకు అవిశ్వాసులకు భేదము ఇదే. క్రీస్తునందు విశ్వాసులు మరణము నుండి జీవమునకు దాటిపోవుటకు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నీతి కార్యములు జరిగించిరి. వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. అగ్నిబలమును చల్లార్చిరి. ఖడ్గ్ధారను తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారద్రోలిరి. కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి. రంపములతో కోయబడిరి. శోధింపబడిరి. ఖడ్గముతో చంపబడిరి. అయినను విశ్వాసాన్ని వీడలేదు.
విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై యున్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నవాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడని నమ్మవలెను. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. క్రీస్తు నందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని బైబిల్ చెప్పుచున్నది. అందుకు ఈ దీనుడు సజీవ సాక్షి. ప్రభువు నందు విశ్వాసముతో పౌలు భక్తుడు - బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమన్నాడు. విశ్వాసులు కలవరపడరు. క్రీస్తునందు ఈ విశ్వాసము ఎలా వస్తుంది?
దేవుని ప్రార్థన చేయువారు రక్షింపబడతారు. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి యున్నది.
ప్రభువు మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. లోకపు మాటలు బలహీనపరుస్తాయి. భయపెడతాయి. పునరుత్థానము జీవమునై యున్న యేసు ప్రభువును నమ్మినవారు చనిపోయినను బ్రతుకును. బ్రతికి యేసునందు విశ్వాసముంచు వారు ఎన్నటికిని చనిపోడు. ఆత్మీయ మరణముండదు. ఈ యేసు మనతో ఉండగ మనకు విరోధి ఎవడు? యేసుతో ఉండకపోతే సాతాను చేతిలో పడటమే. దేవుని నమ్మిన వారిని మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎతె్తైనను లోతైనను సృష్టింపబడినది ఏదైనను క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను.
బలవంతుడైన దేవుని నమ్మినవారు ధైర్యంగా ఉంటారు. ఆయన ఆలోచనలు నమ్మినటు వంటివారు ఉన్నత స్థితికి వెళ్తారు. ఆయనను నమ్మినటు వంటి వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. సాతాను వేసే ఆశ్చర్యపరిచే బాణాలు బలహీనపరచేవి, దిగులు పరచేవి, సమస్యలు శోధనలు కలుగజేసే బాణాలు. ఇంక అనేక కుతంత్రపు బాణాలు వేసినా విశ్వాసము అనే డాలు వలన తప్పించుకోగలము. ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చిన ప్రభువుకు వందనాలు. క్రీస్తే మన విశ్వాసము. ఆయనే మన డాలు. మన కొండ కోట మన ఆశ్రయ దుర్గము. ఆయనే మన కాపరి. దివారాత్రులు కునుకక నిద్రపోక కాపాడుతాడు. ఆయనను నమ్మి ఆశ్రయించినట్లయితే సాతానుడు మన దగ్గర ఉండలేడు. వెలుగు ఉన్న చోట చీకటికి తావెక్కడిది? దేవునికి లోబడి సాతానుని పారద్రోలుదాము. క్రీస్తు అనుగ్రహించిన విజయమును చేపట్టి విశ్వాస డాలును పట్టుకొని ఈ లోక యాత్రలో విజయాలతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256