ప్రార్థన

పరిశుద్ధ నామము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ నామము పరిశుద్ధపరచబడునుగాక -మత్తయి 6:10
యేసు ప్రభువు నామము పరిశుద్ధమైనది. ఆయన దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేతను భక్తుల చేతను కొనియాడబడుచున్నాడు. యేసు ప్రభువు ఈ లోకములో జీవించిన జీవితము మనకు మాదిరి. ఆయనను అంగీకరించి అనుసరిస్తున్న వారు కూడా పరిశుద్ధముగా జీవించి ఆయన పరిశుద్ధ నామమును మహిమపరచాలని పరిశుద్ధ దేవుని కోరికయై ఉన్నది. దేవుడు సెలవిచ్చిన మాట, ‘నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను’ - లేవి 11:44.
అయితే పాపములో పుట్టి పాపములో పెరిగిన మనిషి, చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో పాపము లేకుండా జీవించలేడు. పరిశుద్ధముగా ఉండాలని కోరిక ఉంది గానీ పరిశుద్ధత పొందుకోలేని సమయములో తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపి, మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఆయన పరిశుద్ధ రక్తమును చిందించాడు. దేవునికి స్తోత్రములు. యేసు ప్రభువు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. -తీతు 2:14
ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకు దాసులమునై యుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క జయము, మానవుని యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియా మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. రక్షకుడైన యేసు ప్రభువును అంగీకరించినవారు ఆయన శ్రమ మరణ పునరుత్థానమును బట్టి దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండుటకు అధికారము ఉన్నది.
అయితే మరల పడిపోకుండా పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలంటే వాక్యము విని విధేయించాలి. వాక్యానుసారముగా నడుస్తూ ఉంటేనే మన జీవితాలు శుద్ధిగా ఉంటాయి. అంటే వాక్యమై యున్న యేసు ప్రభువును దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. ఆనందముతో ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాదు వాక్యమనే ఆ ద్రాక్షవల్లిని అంటే క్రీస్తుకు అంటుకట్టబడాలి. మునుపటి దినములలో ఈ లోకానికి అంటు కట్టబడి ఉన్నాము గనుక లోకాశల ప్రకారము జీవించి, చెడు తలంపులతో, శరీరాశలతో నేత్రాశతో మునిగిపోయి జారత్వము అపవిత్రత కాముకత్వము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఫలించాము. దానివల్ల జరిగిన నష్టము మనకు తెలుసు.
యేసు ప్రభువు మాటలు అంగీకరించిన వారు పవిత్రులు. ప్రభువు కావాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదము కావాలి. ఐశ్వర్యము కావాలి. స్వస్థత కావాలి గానీ ఆయన మాట ప్రకారము మునుపటి విషయాలు వదలిపెట్టలేక పోతున్నారు. ఆయన యందు నిలిచి ఉంటే, మనయందు ఆయన ఉంటాడు గనుక పరిశుద్ధత మనలో ప్రవహిస్తుంది.
ఎవరు పరిశుద్ధమైన క్రీస్తు వాక్యములో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆయనకు వేరుగా ఉండి మనము చేయగలిగింది ఏమీ లేదు.
నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. -యోహాను 15:7
మీరు బహుగా ఫలించుట వలన అంటే పరిశుద్ధ జీవితము జీవించుట వలన తండ్రి మహిమ పరచబడును. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుతుంది.
ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము -క్రీస్తు పరిశుద్ధతకు, వాక్యానికి అంటుగట్టబడితే మనలో ఈ ఫలము కనబడుతుంది. ఈ ఫలము కనబడినప్పుడు పరిశుద్ధమైన దేవుని నామము మహిమ పరచబడుతుంది. ఈ ఫలము లోకానికి వెలుగు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రిని మహిమపరచునట్లు లోకములో ఈ వెలుగును ప్రకాశింపనీయాలి.
లోకము కోరుకునేది మంచితనాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ప్రేమను. లోకమే కాదు మనము కూడా మంచినే కోరుకుంటాము. ఈ మంచి మనలో ఫలించాలి అంటే పరిశుద్ధుడైన యేసు మాటలకు అంటుకట్టబడాలి. ఆయన అమూల్యమైన మాటలతో ఆశీర్వాదపు మాటలతో మన హృదయము నింపబడి ఉండాలి. ఆ మాటలను దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు ఆకువాడక ఫలిమిచ్చు చెట్టువలె ఉంటాము. దేవుని మాటలు మనలో లేకపోతే ఆకు వాడిపోయి, ఫలాలు ఎండిపోతాయి. అనవసరమైన ఫలాలు ఫలిస్తుంటాయి. ఒక్కసారి ఈ ‘లెంట్’ దినాలలో మనలను పరీక్షించుకుందాం. ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నామో? కోపము అసూయ జారత్వము కాముకత్వము దురాశ ధనాశా.. ఆలోచించండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది? -రోమా 2:24
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యమందు మనలను ప్రతిష్ఠ చేయటానికి యేసు తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. మనలో వున్న కళంకము ముడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన జీవితము కొరకు తన్ను తాను సిలువకు అప్పగించుకొన్నాడు. విధేయుడై అన్నిటిని ఓర్చుకొన్నాడు. తృణీకరించబడ్డాడు. విసర్జించబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగా వ్యాధి ననుభవించువాడుగా మనుషులు చూడనొల్లని వాడుగా ఎన్నికలేని వాడుగా మొత్తబడిన వానిగా బాధింపబడి శ్రమనొంది గాయపరచబడి నలుగగొట్టబడి అన్యాయపు తీర్పునొంది సిలువ వేయబడి చనిపోయి మూడవ దినమున లేఖనముల ప్రకారము తిరిగి లేచి తండ్రిని మహిమపరచాడు. అధికముగా హెచ్చింపబడ్డాడు. తండ్రి పరిశుద్ధ నామమునకు మహిమ తెచ్చాడు. క్రీస్తులో మనము పరిశుద్ధులమయ్యాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. అన్ని పరిస్థితులలో ఈ పరిశుద్ధతను నిలువబెట్టుకోవాలి.
యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించటానికి, ఆయన జనితైక కుమారుని ఈ లోకానికి పంపి, తన పరిశుద్ధ రక్తములో మనలను కడిగి పరిశుద్ధపరచి, ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నాడు. ఈ ప్రేమకు ఏమి ఇవ్వగలం తిరిగి ప్రేమించటం తప్ప.
ఆ పరిశుద్ధమైన తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా మనలను చేయటానికి ప్రేమతో తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపిస్తే, అదే ప్రేమను మనకు చూయించిన -గ్రాహమ్ స్టెయిన్స్ -దంపతులను బట్టి దేవునికి వందనాలు. జనులుగాని జనుల మధ్య దేశము గాని దేశము వచ్చి రోగుల మధ్య అదీ కుష్టురోగుల మధ్య ముప్పై సంవత్సరాలు సేవచేసి, వారి సుఖాన్ని, సౌకర్యాలను కూడా లెక్కచేయకుండా వాతావరణ పరిస్థితులను పట్టించుకోకుండా సేవ చేసిన దానిని బట్టి దేవుని ప్రేమ వారిలో ఎంత ఉందో అర్థవౌతుంది. దానికి ఫలితంగా భర్తను కుమారులిరువురిని కాల్చివేసినా మిసెస్ గ్లాడీ స్టెయిన్స్‌లో ఉన్న ప్రేమ మాత్రం కాలిపోలేదు. తల్లి కూతురు ఇరువురు కూడా వారి పరిశుద్ధతను కోల్పోలేదు. యేసు ప్రభువు చూపిన క్షమాపణ చూయించి తండ్రిని మహిమపరచి దేవుని ప్రేమలో ఎంత త్యాగముందో చూయించి, తిరిగి ఆ జనము మధ్యనే పరిచర్యను కొనసాగిస్తున్నారు. యవ్వన కుమార్తె వైద్య వృత్తి చేయాలని చదువును కొనసాగిస్తుందట.
ఎంతో వెల చెల్లించి ఇచ్చిన ఈ పరిశుద్ధ జీవితమును పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధ పట్టణములో దేవుని కుటుంబములో సదా జీవించటానికి ఏ సమయమైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా, శోధనలైనా ఎదుర్కొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయును గాక.
అందరితో సమాధానమను పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. -హెబ్రీ 12:14
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి యున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. -1 పేతురు 1:14-16

-మద్దు పీటర్ 9490651256