ప్రార్థన

దైవ చిత్తము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక’ - మత్తయి 6:10
నేను మీ దేవుడైన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను - లేవీ 11:44
పరిశుద్ధుడు నిత్య నివాసి ప్రేమామయుడు కరుణామయుడు కృపా సత్య సంపూర్ణుడు నీతిమంతుడు వెలుగైన దేవుడు, మనలను కూడ అలానే ఉండమని కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తమై ఉంది.
మానవుడు పాపము చేసి పరిశుద్ధతను కోల్పోయి, దేవుని సన్నిధిని కోల్పోవటము ఒకటైతే, దుష్టత్వముతో జీవించడము అలవాటు అయింది. ఇష్టమొచ్చినట్లు జీవిస్తున్నారు. మోసాలు అబద్ధాలు దొంగతనాలు దోపిడీలు నరహత్యలు గొడవలు కొట్లాటలు వ్యభిచారము పగ ద్వేషం యుద్ధాలు క్రోధము కక్షలు భేదములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు ఓర్వలేనితనము అపవిత్రత లోకములో నిండిపోయి ఉంది.
శాంతి సమాధానము సంతోషము పరిశుద్ధత నీతి కలిగి ఒకరికొకరు గౌరవించుకొంటూ, ప్రేమించుకొంటూ, సహాయముగా ఉంటూ ఉండాలని దేవుని చిత్తమై యున్నది.
మనిషి ఎంత ప్రయత్నించినా సాధించలేని స్థితి ఇది. ఏదో ఒక దారిలో పడిపోయి పాపములోనే మునిగి తేలుతూ ఉన్నాడు. ఆశ ఉంది మంచిగా ఉండాలి ఇక త్రాగవద్దు, కొట్లాటలకు పోవద్దు, ఎవరినీ కష్టపెట్టవద్దు అని ఏవేవో చేస్తున్నాడే గానీ పాపము నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఒకవిధంగా పాపానికి బానిసత్వం చేస్తున్నాడు. విడుదల కోరుకుంటున్నారు కానీ వీలుపడటంలేదు.
అటువంటి పరిస్థితులలో దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మన మధ్యకు పంపించాడు. ఆయన చిత్తమేమిటో మనకు క్రీస్తు ద్వారా తెలియజేశాడు. అది ఎలా నెరవేర్చాలో యేసు జీవితము ద్వారా మనకు మాదిరి చూయించాడు. మన పాపాలను కడుగుటకు ఆయన పరిశుద్ధ రక్తము ధారపోశాడు. క్రీస్తు తండ్రికి విధేయుడై తన్నుతాను తగ్గించుకొని సామాన్య మానవునిగా ఈ లోకానికి వచ్చి, ప్రేమించటం ఎలానో క్షమించటం ఎలానో ఓర్చుకోవటం ఎలానో, తాళుకోవటం, కోపపడకుండా ఉండటం, మత్సరము లేకుండా ఉండటం, అపకారమును మనసులో ఉంచుకొనకుండా, స్వప్రయోజనము విచారించుకొనకుండా ఉండటం ఎలానో, దీర్ఘశాంతము కలిగి యుండటం, సమాధానముగా ఉండటం, సంతోషంగా ఉండటం, మంచితనము కలిగి ఉండటం ఎలానో అన్నీ ముప్పై మూడున్నర సంవత్సరాలలో చూయించి చివరి సిలువ యాత్రలో ఆయన చెప్పినవన్నీ చేసి మాదిరి ఉంచాడు. ఇవన్నీ కేవలము మన మార్పు కోసమే. పాపము వీడి పరిశుద్ధముగా ఉండటానికి, దేవుని రాజ్యానికి వారసుల మవటానికి నరకము నుండి నన్ను నిన్ను తప్పించటానికి ఇది అంతా చేశాడు.
దేవుని ముఖ్య ఉద్దేశము (చిత్తము) మనము పరలోక రాజ్య వారసులమవ్వాలని. ఈ లోకములో మన తల్లిదండ్రులే మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసు. మన సుఖాన్ని సంతోషాన్ని మేలును కోరుకుంటారు. ఏ కష్టమూ మనకు రాకూడదని కోరుకుంటారు. దానికి వారు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి మనకు సమకూరుస్తారు. అయితే మన దేవుడు పరమ తండ్రి మనకు కూడ తండ్రి, మన తల్లిదండ్రులకు, మన పితరులకు కూడ తండ్రి గనుక మనలను ఇంకా ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో కదా! మన పాపాలకు జీతము నరకము గనుక ఆ నరకములో ఎవడూ పడి నశించకూడదని, ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి, మన పాపములకు బదులు ఆయనకు సిలువ వేసి, ఆయన చిందించిన రక్తములో మనకు పాప విమోచన కలిగించి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులముగా చేశాడు.
యోహాను 6:40 - కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన పునరుత్థానమును నమ్మి, యేసు సిలువ మరణము నా కొరకే అని నమ్మి ఆయనను వెంబడిస్తే తప్పక నిత్య జీవము దొరుకుతుంది.
అయితే కుమారుడు తండ్రి మాట ఎలా విన్నాడో, అలానే క్రీస్తును మనము వెంబడించాలి. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను - యోహాను 12:26. అప్పుడే క్రీస్తు ఉన్న రాజ్యములో మనము కూడా ఉండగలము.
మనలను కుమార్తెలనుగా కుమారులుగా చేసికోవటం, పరిశుద్ధులుగా చేయటం ఆయన పరిశుద్ధ రాజ్యానికి వారసులుగా చేయటం నిత్యము ఆయన రాజ్యములో ఆయనతో జీవించటం దేవుని చిత్తము. మనమొక చోట, దేవుడు గనుక ఆయన ఎక్కడో సమీపించరాని చోట ఉండటం కాదు. ఆయనతో ఆయనలో ఉండాలని ప్రభువు ఆశ. ఆయన చిత్తము.
యేసు -‘పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను - మత్తయి 12:50.
దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును - 1 యోహాను 2:17.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. - మత్తయి 7:21.
ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్య అనేకులు ప్రభువు కావాలనుకుంటున్నారు. కానీ ఆయన మాటల ప్రకారము, ఆయన చిత్త ప్రకారము జీవించటం లేదు. దాని వలన ఉపయోగముండదు. నీ దానధర్మాలు ఉపవాసాలు, ప్రార్థనలు, యాచనలు, ఉపయోగపడవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటము ముఖ్యము. యేసయ్య కుమారుడై యుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, తండ్రి చిత్తప్రకారము మానవునిగా ఈ లోకానికి వచ్చి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నదని యోహాను 4:34లో మనకు తెలిపాడు. యేసు తన స్వంత నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. తండ్రితో అనునిత్యము సహవాసము కలిగి ఉంటూనే ఉన్నాడు. రాత్రి ప్రార్థన, ఉదయ ప్రార్థన, వేకువజామున ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన.. ఇలా ప్రార్థనా జీవితములో తండ్రితో ఎడబాయని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకముతో ఎటువంటి పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ లోక సహవాసము దేవునితో వైరమే. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి విరోధి - యాకోబు 4:4.
కాబట్టి సహోదరీ సహోదరులారా! పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై యున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. -రోమా 12:1,2.
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందుకాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలయునో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. -1 థెస్సలో 4:3-5
ఆయన చిత్తాన్ని జరిగించే వారు బలశూరులు. ఎందుకంటే వారి మాట దేవుడు వింటాడు. దేవుడు ఎవని మాటలు వింటాడో, ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడో వారే లోకములో శక్తిమంతులు.
క్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననునదియే -1 యోహాను 5:14.
దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి దావీదు మహారాజు వ్రాసుకున్న మాటలు - నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్తమ్రు నా అంతర్యము నున్నదని, ఇంకొక ప్రార్థనలో నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమ భూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దీనిని బట్టి ఆయన చిత్తప్రకారము నడుస్తుంటే, మన మార్గము సరాళముగా ఉంటుందని. ఆయనకు ఇష్టులైన వారికే భూమి మీద సమాధానము. మనకేమో మన ఇష్టప్రకారమే చేయాలని కోరిక. అయితే దానివల్ల కలిగే లాభనష్టాలు దేవునికి స్పష్టముగా తెలుసు. అందుచేత మనమేది ఎప్పుడు చేయవలెను ఎలా చేయవలెనో ప్రభువు తెలియజేస్తూ ఉంటాడు. అలా చేస్తే మనకు జరిగే మేలు, లేకుంటే జరిగే కీడు ప్రభువుకు బాగా తెలుసు. ఏ వయసులో ఏది చేయాలో కూడా ప్రభువుకు తెలుసు. భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతముగా యున్నదో మన విషయములో అంత ఉన్నతమైన తలంపులు గల దేవుడు. ఆయన చిత్తాన్ని పాటిస్తే అంత ఉన్నత స్థాయికి చేరుకోగలవు. ఆయన చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగించాలి. ఏ పనైనా మొదలుపెట్టే ముందుగా ప్రభువు చిత్తమేమిటో తెలుసుకోవాలి. అంతేకాని ముందు మొదలుపెట్టి తరువాత ప్రార్థించడం కాదు. యాకోబు పత్రికలో 4:15 ప్రకారము ప్రభువు చిత్తమైతే మనము ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంతేకాని మన ఇష్టమొచ్చినట్టు కాదు.
కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. -ఎఫి 4:22-24.
పాపముతో పోగొట్టుకున్న దేవుని స్వరూపమును యేసు రక్తములో కడుగబడి తిరిగి పొందుకోవాలన్నదే దేవుని చిత్తము.
గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక - ఆమేన్.

-మద్దు పీటర్ 9490651256