ప్రార్థన

సిలువలో క్రీస్తు పలికిన మొదటి మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమ’ని చెప్పెను - లూకా 23:34
చేయని నేరానికి సిలువలో వ్రేలాడుతూ క్రీస్తు పలికిన మాటలు ఇవి. అసలు సిలువ వేయవలసిన ఘోరమైన నేరమేమియు చేయలేదు ప్రభువు. ఈయన యందు ఎటువంటి నేరము నాకు కనబడుట లేదని పిలాతు ప్రధాన యాజకులతోను జన సమూహములతోను చెప్పెను. అయినా వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని జన సమూహము కేకలు వేశారు. మతాన్ని పట్టుకొని ఆచారాలను పట్టుకొని కేకలు పెడుతున్నారు తప్ప అసలు క్రీస్తు నిజ రక్షకుడని తెలుసుకోలేక పోయారు. ఇప్పటికీ పరిస్థితులు ఇంచుమించు అలానే ఉన్నాయి. యూదుల తెలివితక్కువ తనానికి మరణానికి తగిన నేరమేమియు చేయకపోయినా క్రీస్తును సిలువ వేశారు. మన పాపాలకు వెల చెల్లించటానికే ప్రభువు వధకు తేబడిన గొఱ్ఱెపిల్లవలె వౌనంగా వున్నాడు తప్ప, ఏదో నేరము చేసినందుకు కానే కాదు. సిలువ వేయమని కేకలు వేసిన వారందరు ప్రభువు బోధను విన్నారు. అద్భుతాలను చూశారు. గొప్ప కార్యాలను చూశారు. ఏదో ఒక మేలు వారు కానీ వారి కుటుంబంలో ఎవరో ఒకరు పొందినవారే. రోమా సైనికులు మాత్రం ఏమీ ఎరుగరు కనుక వారి పనులు వారు చేస్తూ ఈయన కూడా పెద్ద దొంగ అనుకున్నారు.
ఈ సిలువ యాత్ర హవ్వ ఆదాము పాపము చేసినప్పుడు మొదలైంది; ఇక్కడ ఈ గొల్గొత కొండ మీద లోక రక్షకుని సిలువతో ముగిసింది. ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక జీవిత పాఠాలు నేర్పించారు. వాటిని పాటిస్తే జీవితము సుఖమయము. దానిలో ఒక విషయము క్షమాపణ. శత్రువుల కొరకు ప్రార్థించమని. ఆయన మనకు నేర్పిన పాఠాలు ఇప్పుడు ఇంత ఘోరమైన సిలువ యాతనలో ఆయనే చేస్తున్నాడు. ఆ ప్రార్థనే తండ్రీ వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చేస్తున్న ప్రార్థన.
అప్పటికే సుమారు కొన్ని గంటల నుండి ప్రభువును పట్టించుకున్న వారు ఎవరూ లేరు. దాహము ఆకలి వొళ్లంతా గాయాలు రక్తము కొరడా దెబ్బలతో తెగి వ్రేలాడుతున్న చర్మము.. హేళన మాటలు. తలకు ముళ్ల కిరీటము చేతులలో కాళ్లలో సీలలు... నిద్ర లేదు. తీవ్రమైన ఎండ. ఇవన్నీ ఒకపక్క ఉంటే, శిష్యులు ఎవరూ ఆ పరిసరాలలో లేరు - ఒక్క యోహాను తప్ప. చుట్టూ ఉన్నవారు అనరాని మాటలు అంటున్నారు. అసలు నీవు రక్షకుడవైతే నిన్ను నీవు రక్షించుకోమని అరుస్తున్నారు. వారికి అసలు సంగతి అర్థం కావటంలేదు. ఆయన వచ్చిందే లోకాన్ని రక్షించడానికి. ఆయన లోక రక్షకుడు. ఆయన మనలాగా స్వార్థపరుడై తనను తాను రక్షించుకున్నట్లయితే మనకు నరకమే. మనకు రక్షణ దొరికేది కాదు. ఆయన మన పాపములను ధరించి వాటిని సిలువకు కొట్టి మనకు విమోచన అనుగ్రహించాడు. అది తండ్రి చిత్తము.
మన తల్లిదండ్రులు వారి సంగతి వారు చూసుకొని స్వార్థముగా ఉన్నట్లయితే మనము ఈ స్థితిలో వుండేవారము కాదు. అటువంటి నిస్వార్థమైన తల్లిదండ్రుల పిల్లలు పెరిగి స్వార్థపరులుగా మారుతున్నారు. ఎందుకో తెలియదు. స్వార్థము నానాటికీ పెరిగిపోతోంది. ప్రభువు నేర్పించింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. తన ప్రాణానే్న బలిగా అర్పించి లోకాన్ని రక్షించిన యేసు ఇవ్వటం ఏంటో మనకు సిలువలో తెలిపాడు. ప్రాణమే ఇచ్చి నిస్వార్థంగా ప్రేమించిన యేసును ప్రేమించేవారు నిస్వార్థంగా ఉంటే, పరలోక దేవునికి కుమారులము కుమార్తెలము అవుతాము. స్వార్థముగా ఉంటే ఆ కుటుంబములో సభ్యత్వముండదు.
క్రీస్తు మానవాళి పాపమంతటికి సిలువలో పరిహారం చెల్లించాడు. కాబట్టి ఇక పాపము చేస్తూనే ఉండమని కాదు గానీ వాటిని ఒప్పుకొని సిలువ రక్తములో కడుగబడి క్షమాపణ పొంది ఇక పాపము చేయకూడదు. మాటతోనేమి చూపుతోనేమి క్రియతోనేమి తలంపుతోనేమి ఆలోచనతోనేమి పాపము చేయకూడదు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధముగా ఉండాలి. అప్పుడే దేవునికీ మనకూ మధ్య సమాధానము ఉంటుంది.
క్షమించ లేకపోవుట వల్ల లోకములో అనేకమైన సమస్యలు వస్తున్నాయి. చిన్న విషయాలు గానీ పెద్ద విషయాలు గానీ క్షమించలేక కొట్లాటలు పోట్లాటలు తిరుగుబాట్లు చింపుకోవటం చంపుకోవటం జరుగుతున్నాయి. క్షమాగుణము లేని కారణముగా బట్టలు చింపుకున్నంత సులువుగా ఒకరినొకరు చంపుకుంటున్నారు. బట్టలు కొనుక్కోవచ్చు. ప్రాణాలు కొనలేము. సంబంధాలు తిరిగి అతుకుట లేదు. కుటుంబ సంబంధాలు ఎంతో విలువైనవి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు కూడా క్షమించ లేకపోవుట వల్ల కుటుంబ సంబంధాలు చెదిరిపోతున్నాయి.
పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్తెఫెనును రాళ్లతో కొట్టి చంపే సమయములో అతడు మోకాళ్లూని - ప్రభువా! వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. అలాగే క్రీస్తు క్షమాగుణము కలిగినటువంటి ‘గ్రాహెమ్ స్టెయిన్స్’ దంపతులు కుష్ఠు వ్యాధిగ్రస్తుల మధ్య పరిచర్య చేస్తూండగా, ‘గ్రాహెమ్’ను వారి ఇద్దరు కుమారులను కాల్చి చంపిన వారిని క్షమించమని గ్లాడీ స్టెయిన్స్ కోరింది. అక్కడే పరిచర్యను కొనసాగిస్తున్నది. భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోలేక, ఓర్పులేక కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ఏ నేరము చేయని క్రీస్తు ఆయనను సిలువ వేస్తున్న వారిని క్షమించాడు. రాళ్లతో చంపుచున్న వారిని క్రీస్తు అనుచరుడు క్షమించమని మోకాళ్లూని ప్రార్థించాడు. కొడుకులను భర్తను కాల్చి చంపిన వారిని క్షమించమని మిసెస్ గ్లాడీ స్టెయిన్స్ కోరింది. వీరితో పోల్చుకుంటే మనము క్షమించలేనివి ఏమి ఉంటాయి. చిన్నచిన్న విషయాలు క్షమించుకుంటూ ఉంటే మనస్సు ఎంత నెమ్మదిగా ఉంటుందో గదా. క్షమించితేనే దేవునికి కుమారులమవుతాము. ఎంత ఆధిక్యత. కుమారులము అయితే ఏంటి కాకపోతే ఏంటి అని కొంతమంది దేవుని బిడ్డలు క్షమించలేక వారి అర్హత పోగొట్టుకుంటున్నారు.
దేవుని గూర్చిన జ్ఞానము మరుగై యుండెను. అది లోకాధికారులలో 2వేల సంవత్సరాల క్రితము ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి యుండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు. దేవుని గురించిన జ్ఞానము లేనివారు దేవుని ప్రేమ గురించి తెలియని వారు యేసును సిలువ వేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
సరే! దేవుని క్షమాగుణం తెలియని వారు క్షమించలేక పోవచ్చు మరి దేవుని క్షమాగుణము ఎరిగినటువంటి వారి సంగతేమిటి? వారు కూడా క్షమించలేక పోతున్నారు. ఏదో పైకి క్షమించినట్లు చేస్తున్నారు కానీ హృదయము క్రోధము కోపముతోనే ఉంటుంది. తన కోపమె తన శత్రువు. జాగ్రత్త!! హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు గనుక, మనము హృదయ పూర్వకముగా క్షమించకపోతే మనకు కూడా క్షమాపణ ఉండదు.
క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా క్షమించాడో మనము గ్రహించాలి. మన పాపము మనకు తెలుసు. మన జన్మ కర్మ పాపములు చూపులతో మాటలతో చేష్టలతో ఆలోచనలతో చేసినవి లెక్క చూస్తే అవి ఎంతో ఘోరమైనవి. లెక్కించలేము. అన్ని తప్పులు ఉండి చిన్న తప్పులు చేసిన వారిని క్షమించలేము. కంటిలో దూలమున్నా ఎదుటివాని కంటిలో నలుసును కనుగొంటున్నారు.
ఎన్నిసార్లు క్షమించాలి? అన్న ప్రశ్నకు ప్రభువిచ్చిన జవాబు. అపరిమితమైన క్షమాపణ. ఏడు మారులే కాదు డెబ్బది ఏళ్ళ మారులు మట్టుకని ప్రభువు సెలవిచ్చాడు. దానిని ఉపమాన రీతిగా ఒకడు అప్పు చెల్లించవలసినది మూడు కోట్ల అరవై లక్షలు. అయితే తాను అంత చెల్లించలేనని రాజును వేడుకొన్నప్పుడు, ఆ రాజు అతని క్షమించాడు. మూడుకోట్ల అరవై లక్షల అప్పు క్షమించబడి ఏబది రూపాయలు అప్పు ఉన్నవాడిని క్షమించ లేకపోయినందుకు, సంగతి తెలుసుకున్న రాజు మొదటి వానిని చెరసాలలో వేయించెను. బాధ పరచువారికి వానిని అప్పగించెను. (మత్తయి 18:21-35)
ప్రభువు చెప్పిన మాట - మనము ఇతరులను క్షమిస్తేనే ఆయన మనలను క్షమిస్తాడు. 50 రూపాయల విలువ గల చిన్న తప్పులు క్షమిస్తేనే 3.6 కోట్ల విలువైన తప్పులు క్షమించబడతాయి. క్రీస్తు నేర్పిన క్షమాగుణాన్ని అలవరచుకొని, మన కుటుంబీకులూ బంధువులను స్నేహితులను క్షమించుకుంటూ దేవుడిచ్చే సమాధానము పొందుకొని దేవుని రాజ్యానికి వారసులమగుదము. దేవుని మాట ప్రకారము నడిచి ఆయన రాజ్యానికి వారసులమై శాంతి సమాధానాలతో మనమందరము ఉండాలని ప్రభువు కోరిక.
ఆనాడు జీవాధిపతికి సిలువ వేస్తున్నారన్న సంగతి రోమీయులకు, యూదా మత పెద్దలకు తెలియదు, తెలియక సిలువ వేయమని కేకలు పెట్టారు. అయినా వారిని క్షమించమని తండ్రిని వేడుకున్న యేసు మాదిరి, మనము కూడా క్షమించటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.
మన కోసం ఎవరూ చేయలేని గొప్ప కార్యాన్ని చేసి, తన ప్రాణానే్న బలిగా అర్పించిన ప్రభువుకు యుగయుగములకు మహిమ కలుగును గాక.
ప్రియ చదువరీ! దేవుని పోలికతో చేయబడిన తోటివారిని క్షమించి దానివల్ల వచ్చే అపారమైన దేవుని బహుమానము పొందుకో. అవకాశం పోతే రాదు. శాంతి సమాధానముతో సంతోషముగా జీవించు.

-మద్దు పీటర్ 9490651256