ప్రార్థన

క్రీస్తు సిలువపై పలికిన మూడవ మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని తల్లితో చెప్పెను.
శిష్యుని చూచి ‘ఇదిగో నీ తల్లి’ అని చెప్పెను - యెహోవా 19:26-27
సిలువ మీద వ్రేలాడుచు యేసు ప్రభువు పలికిన మూడవ మాట ఇది. ఇక్కడ ఒక కుమారుడుగా తల్లి బాధ్యతను తన ముఖ్యమైన శిష్యునికి ఎలా అప్పగిస్తున్నాడో చూడండి. అంతేకాదు ‘నీ తల్లిని తండ్రిని సన్మానింపుము - అనే ఆజ్ఞను కూడా నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభువు తల్లిదండ్రులకు లోబడి యుండెను అని లూకా సువార్త 2:51వ వచనములో మనకు తెలుస్తుంది. దానిని బట్టి తండ్రి వడ్రంగి గనుక తండ్రి పనిలో సహాయపడినట్లు అర్థవౌతుంది. అందుకే ప్రభువు పెద్దవాడై అద్భుతాలను జరిగిస్తూ, గొప్ప కార్యాలను చేస్తూ పరలోక రాజ్య విషయాలనూ, మర్మాలనూ తెలియజేస్తూ ఉంటే, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు యోసేపు యూదా సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? అని నజరేతు వారు అనుకుంటున్న మాటలు మార్కు 6:3లో కనిపిస్తాయి. ఎంత తగ్గింపు ఉందో యేసయ్యకు చూడండి. ఏమీ లేనివారే ఎగిరెగిరి పడుచున్న ఈ రోజుల్లో, అన్నీ ఉన్నా దేవుని కుమారుడైన యేసు రాజు, రాజభోగాలు సుఖ సౌఖ్యాలు, పెద్ద పెద్ద భవంతులు కోరలేదు. మంచిమంచి వాహనాలు కోరలేదు గానీ, ఒక చిన్న గ్రామము అదీ కూడా మంచి పేరు లేని గ్రామములో ఒక వడ్రంగి వృత్తిలో ఉన్న సామాన్య కుటుంబములో జన్మించి తల్లిదండ్రులకు విధేయుడుగా ఉన్నాడు. యేసయ్య కోరుకుందల్లా మన విమోచన. మానవ విమోచన.
తల్లిదండ్రులను పెద్దలను లెక్కచేయని తరములో ఉన్నాము. తండ్రి వడ్రంగి పనిలో సహాయపడి తండ్రిని, తండ్రి వృత్తిని గౌరవించినట్లు తెలుస్తుంది. పెద్దపెద్ద ఉద్యోగాలు ఉంటే తప్ప ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల సంగతి చెప్పటంలేదు. లేకపోతే ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పుచున్నారు.
తల్లి మరియకు ప్రభువు దూత ప్రత్యక్షమై ‘దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడై యున్నాడు. దేవుని కృప పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని చెప్పిన దగ్గర నుండి, సిలువ వేయబడిన ఈ దినము వరకు ప్రభువును గురించి గొప్పగొప్ప విషయాలు వింటుంది. చూస్తుంది. సంతోషము ఒక ప్రక్క, దుఃఖము ఇంకో ప్రక్క ఉన్నాయి. ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అన్న వర్తమానము సంతోషము కలిగించినా, భక్త సుమియోను చెప్పిన ‘నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసికొని పోవును’ మాట కలవరపెడుతూనే ఉంది. అది ఈ దినము గుర్తుకు వచ్చి ఉంటుంది.
ప్రస్తుతము తండ్రి యోసేపు సంగతి తెలియదు. యేసు ప్రభువుకు 12 సం.ల వరకు యోసేపు ఉన్నట్టు లేఖనాలను బట్టి తెలుస్తోంది. ఆ తరువాత సంగతి వివరింపబడలేదు. గనుక మరియ విధవరాలుగా ఉంటోందని తెలుస్తోంది.
ఒక్క యోహాను భక్తుడు, శిష్యుడు తప్ప శిష్యులెవ్వరూ ఈ సమయములో లేరు. అందరూ విడిచి వెళ్లారు. తల్లి మరియ ఇంకొంతమంది స్ర్తిలు, శిష్యుడైన యోహాను మాత్రము సిలువకు అతి దగ్గరలో ఉన్నారు. తల్లి మరియ స్ర్తి అయినా భయపడక, అంత భయంకరమైన మనుష్యుల మధ్య ధైర్యంగా ఉంది. కుమారునిపై ప్రేమ ఆమెలోని భయాన్ని పోగొట్టింది. నిజమైన ప్రేమలో భయముండదు అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
యోహాను 20:2 - శిష్యులలో యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు యోహాను అని తెలుస్తుంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున అనుకొనుచుండెను- యోహాను 13:23
యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను - యోహాను 21:7. దీనిని బట్టి యేసు ప్రభువును ఎక్కువగా అర్థము చేసుకొన్నవాడు యోహాను అని అర్థవౌతుంది. వాస్తవానికి యేసు ప్రభువు సమాధి నుండి తిరిగి లేచిన తరువాతా ముందు గుర్తు పట్టిన వాడు యోహాను అని తెలుస్తుంది. మిగిలిన శిష్యులు గుర్తుపట్టలేదు - యోహాను 21:4.
మనము ప్రేమించే వారి అడుగుల చప్పుడు కూడా మన గుండెకు అర్థవౌతుంది. హృదయములో ఆనందం కలుగుతుంది.
దీనిని బట్టి ప్రభువును యోహాను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. ఎంతగా ప్రభువును అర్థము చేసుకున్నాడో అర్థవౌతుంది.
యేసు - యోహానును చూచి ‘ఇదిగో నీ తల్లి’ అనగానే అర్థము చేసికొని ఆ గడియ నుండే ఆయన ఆమెను తల్లిగా తన ఇంట చేర్చుకున్నాడు. ఎంత ప్రేమానురాగాలు, ఎంత వినయము యోహాను శిష్యుడు కనపరచాడో చూడండి.
ఈ రోజుల్లో చాలామంది చేసిన వాగ్దానాలు వెంటనే మరచిపోతున్నారు. మనుషుల ముందు ఒక మాట వెనుక ఒక మాట ఉంటుంది. జాగ్రత్త! ప్రభువు గమనిస్తూ ఉంటాడు. మనుషులు ఉన్నా లేకపోయినా ఇతరులు మన పట్ల ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మనుషులు చనిపోయాక వారికి ఇవ్వవలసినవి కూడా ఇవ్వటము లేదు. దీనివల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
దేవుని ఆజ్ఞను నెరవేర్చి తల్లి ఋణము తీర్చుకొని, ఆమెను జాగ్రత్తగా చూసుకొనగలిగిన హృదయానుసారుని వంటి వాడైన యోహానుకు తల్లి బాధ్యతను అప్పగించాడు. దీనినిబట్టి తల్లి మీద ప్రభువుకు ఉన్న ప్రేమ తెలుస్తోంది. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని యోహానును చూయించి చెప్పెను.
‘ఇదిగో నీ తల్లి’ అని యోహానుతో చెప్పిన మాట. శిష్యులందరికీ కాదు. యోహానును మాత్రము తల్లి బాధ్యత వహించమని.
పాత నిబంధనలో దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నట్లు ఇక్కడ యోహాను యేసు ప్రభువుకు హృదయానుసారుడుగా కనపడుచున్నాడు.
యేసయ్య మాదిరి మనము కూడా తల్లిదండ్రుల బాధ్యతను తీసికొని దేవుని ఆజ్ఞను నెరవేర్చి దీర్ఘాయుష్మంతులముగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపునుగాక.
నాల్గవ మాట
ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ‘ఏలీ ఏలీ లామా సబక్తానీ’ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు ‘నా దేవా నా దేవా ననె్నందుకు చెయ్యి విడిచితివ’ని అర్థము. - మత్తయి 27:46
యేసు ప్రభువు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఇది సిలువపైన రెండవ మారు బిగ్గరగా వేసిన కేక. దీనికి ముందు కూడా విత్తనము యొక్క ఉపమానము చెప్పినప్పుడు మంచి నేలను పడిన విత్తనములు నూరంతలుగా ఫలించెను అనే మాటలు పలుకుచు, వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. - యోహాను 7:29. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించునని బిగ్గరగా చెప్పెను. - యోహాను 7:38.
ఇలా మంచి నేలను పడిన విత్తనము నూరంతలుగా ఫలించునన్న విధానము, తండ్రిని ఎరిగిన సంగతి, చివరకు ప్రభువు నందు విశ్వాసముంచువారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును అనే మాటలు మాత్రమే ప్రభువు బిగ్గరగా చెప్పినట్టు తెలుస్తోంది.
నిన్ను విడువను ఎడబాయను. భయపడకుడి దిగులు పడకుడి నీతో ఉంటాను. నిన్ను విడువను ఎడబాయను అని ఇశ్రాయేలీయులతో చెప్పిన దేవుడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను నీతో ఉంటాను అని యెహోషువాతో చెప్పిన దేవుడు - సిలువ వేయబడిన యేసు ప్రభువును విడిచినట్లు తెలుస్తోంది.
దౌర్జన్యము నొందెను. బాధింపబడెను. నిందింపబడెను. అన్యాయపు తీర్పును పొందెను. పిడిగుద్దులు గుద్దారు. కొరడాలతో కొట్టారు. ముళ్ల కిరీటము పెట్టారు. చేతులలో కాళ్లలో సీలలు గుచ్చారు. అయినా వధకు తేబడిన గొఱ్ఱెపిల్ల వలె బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱెయు వౌనముగా ఉన్నట్టు అన్నింటినీ ఓర్చుకుంటూ సిలువను మోసాడు. అంత వేదనలో కూడా నోరు తెరువలేదు. ఒక్కమాటైనా బదులు పలుకలేదు. ఆయన వచ్చిందే మన పాపాలు తీసివేయటానికి మన పాపాలు మోయటానికి వధకు తేబడిన గొఱ్ఱెపిల్ల వలె వచ్చాడు. యోహాను భక్తుడు ఇందుకు సాక్ష్యము. ‘ఇదిగో లోక పాపములు మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల’ - యోహాను 1:29.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్షను అతడు భరించెను. మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. తన ఇష్ట ప్రకారము సిలువను ఎక్కాడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్‌క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్నుతానే మన కొరకు అప్పగించుకున్నాడు.
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. -మత్తయి 20:28
1 తిమోతి 2:6 - యేసు ప్రభువు అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్నుతాను సమర్పించుకొనెను. ఆయన దేవుని స్వరూపము గలవాడై యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్న యేసయ్య ఘోర శ్రమలలో మాట్లాడలేదు. అన్యాయపు తీర్పులో మాట్లాడలేదు గానీ ఇప్పుడు దేవుడు చేయి విడిచినందుకు ‘నా దేవా నా దేవా ననే్నల చేయి విడిచితివ’ని వేసిన కేక ఇది. చెట్టు మొద్దు నుండి కొమ్మను చీల్చినట్టుగా తండ్రి కుమారుల బంధాన్ని చీల్చివేసిన సమయమిది. ఆ బాధను తట్టుకోలేక వేసిన కేక ఇది. ఎటువంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉన్నదో చూడండి. అగాపె ప్రేమలోనికి మనలను కూడా చేర్చుకోటానికి చేసిన యజ్ఞమిది. నిత్యత్వములో ఎన్నడూ విడిపోని వారు ఇప్పుడు నీ కోసం నా కోసం ఇలా చేశారు. ఈ ఎడబాటు తండ్రికి కూడా కష్టమే అయినా ఇష్టముగానే కుమారుని ద్వారా ఈ గొప్ప యజ్ఞము చేయించి అనేకులను నిర్దోషులనుగా, నీతిమంతులుగా చేసెను. అందుకే కుమారుడు తృణీకరింపబడిన విసర్జింపబడిన వ్యసనాక్రాంతుడుగా వ్యాధి ననుభవించినవాడుగా చూడ నొల్లని వాడుగా నలుగ గొట్టబడుట తండ్రికి ఇష్టమైంది. మన మీద దేవునికి ఎంత గొప్ప ప్రేమ ఉందో చూడండి.
తండ్రి ఎడబాటు నిత్యత్వముతో పోలిస్తే చాలా అల్ప సమయము ఈ తక్కువ సమయము కూడా తండ్రిని ఎడబాసి కుమారుడు ఉండలేక పోయాడు. యేసు ప్రభువు శ్రమలను శోధనను శిలువను కూడా భరించాడు కానీ తండ్రి ఎడబాటును తట్టుకోలేక పోయాడు. మన పాపాలన్నీ ప్రభువు మీద పడినందున దుష్టత్వమును చూడలేని నిష్కళంకమైన కన్నులు గల తండ్రి కుమారుని చేయి విడిచినపుడు దేవుని కుమారుడు ఒక్కసారిగా మానవ కుమారునిగా పాపాలన్నీ మోస్తూ వేసిన కేక ఇది. ననె్నందుకు విడిచితివి.
యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభువు చేసిన ప్రార్థన ‘తండ్రీ నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరును మన యందు ఉండవలెన’ని ప్రార్థించిన దానిని బట్టి నిత్యత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై త్రియేక దేవుడుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ త్రిత్వమును అర్థము చేసికోటానికి ఎంతో మంది ప్రయత్నించారు. వారిలో మార్టిన్ లూథర్ ఒకరు. గానీ దాని లోతు తెలియలేదు. మనలను కూడా ఆ పరిశుద్ధ తత్వములోనికి చేర్చుకోవటానికే ఈ సిలువ యజ్ఞము. ఇవన్నీ ఇష్టమే గానీ తండ్రి యెడబాటును మాత్రము కుమారుడు సహించలేకనే ఈ కేక.
ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో ఉండుటకు ఇష్టపడరు. కారణం - వారు చెప్పే పనులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇష్టపడరు గనుక. తల్లిదండ్రులు ఎప్పుడు బైటకు వెళ్తారా లేక తల్లిదండ్రుల నుండి దూరం ఎలా వెళ్లాలి. ఏ సాకులు చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. కారణం వారి ఇష్టమొచ్చినట్లు చేయవచ్చు గనుక. యేసు ప్రభువు ఈ లోకములో తండ్రి ఎడబాటును ఒక్క క్షణము కోరుకోలేదు. తన ఇష్టమొచ్చింది ఏదీ చేయలేదు. తండ్రి మాట ప్రకారమే చేసి తండ్రికి ఇష్టుడయ్యాడు. అంతటి యేసయ్యనే మన పాపముల కొరకు బలి అయ్యే సమయములో తండ్రి చెయ్యి విడిచాడంటే, ఇక మన సంగతి ఆలోచించాలి. మనమెంత జాగ్రత్తగా పరిశుద్ధముగా ఉండాలో ఆలోచించండి. ఈ ఎడబాటును తట్టుకోలేక ‘తండ్రీ! నీ చిత్తమైతే ఈ గినె్న నా యొద్ద నుండి తొలగించుమ’ని ముమ్మారు ప్రార్థించి, చివరకు ‘నీ చిత్తమే సిద్ధించును గాక’ అని వేడుకొనెను. ఇటువంటి సహవాసాన్ని మనము కూడా కోరుకొని తండ్రి చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256