ప్రార్థన

సిలువపై - (క్రీస్తు పలికిన ఐదవ మాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయ)
‘నేను దప్పిగొనుచున్నాను’ అనెను - యోహాను 19:28
* * *
జీవాధిపతి జీవాహారము జీవజలమై యున్న యేసుప్రభువు ఆకలి గొన్నాడు. దప్పిక గొన్నాడు. ప్రాణమిచ్చాడు. ఎంత తగ్గింపో చూడండి. ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువు, మహిమోన్నతుడు, మహిమను వదులుకొని మామూలు మనిషిగా ఒక సేవుకునిగా వచ్చాడు. శిష్యుల పాదాలను కడిగి, ప్రార్థన సమయములో సాగిలపడినట్లుగా చూస్తున్నాము. ఆ కొండ మీద రాళ్లూ రప్పలు ముళ్ల మీద సాగిలపడి ప్రార్థించటం చూస్తే అంతకు మించిన తగ్గింపు ఉండదేమో అనిపిస్తుంది. నీ కోసం నా కోసం ప్రభువు ఇంత తగ్గించుకున్నాడు. జీవాధిపతి తన ప్రాణాన్ని ధారపోశాడు. జీవాహారమైన ప్రభువు ఆకలి గొన్నాడు. జీవ జలమైన ప్రభువు దాహము గొన్నాడు. మన కొరకు ప్రభువు సమస్తాన్నీ వదులుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ధనవంతుడై యుండియు మనము తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మన నిమిత్తము దరిద్రుడాయెను.
జీవ జలనిధి అయిన దేవుడు సర్వశక్తిగల దేవుడు. నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. రక్తముగా మార్చాడు. ఆవిరిగా మార్చాడు. చిరిగిపోకుండా మేఘాలలో బంధించాడు. తగిన సమయములో తొలకరి వానలు కడవరి వానలు కురిపించే దేవుడు, ఎక్కువ నీరు అవసరము లేని సమయములో మంచులాగా చిన్న కణములుగా పంపగల దేవుడు. సముద్రమును రెండు పాయలుగా చేసి ఎండిన నేలన ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, వడిగా పారే నీటిని ఆపి మార్గము చేశాడు. చేదు నీటిని మధురముగా మార్చిన ప్రభువు. ఎడారిలో బండ నుండి నీటిని రప్పించిన దేవుడు. తుఫానును గద్దించి ఆపిన దేవుడు. నీ కోసం నా కోసం రిక్తునిగా చేసికొని దప్పికగొన్నాడు.
ఆ దేవుని దప్పిక తీర్చగలుగుతున్నామా? అప్పుడు రోమా సైనికులు చేదు చిరకను అందించారు. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనము కూడ ప్రభువు దాహాన్ని తీర్చలేక పోతున్నామనిపిస్తుంది. ప్రభువు కోరుకునేది పరిశుద్ధత. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నలక ఉంటూనే ఉంది.
అయితే కోపమో అసూయనో ద్వేషమో క్రోధమో దురాశనో ధనాశనో ఏదో ఒక నలక ప్రతి ఆత్మమలో ఉంటుంది. ఇప్పుడు ప్రభువు ఆత్మల దాహము గొని ఉన్నాడు. ప్రతి ఆత్మలో ఏదో ఒక నలక ఉంటుంది. జాగ్రత్త! ఇప్పుడు మనము ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తములో కడుగబడి ప్రభువు దాహాన్ని తీర్చటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.
6వ మాట
‘సమాప్తమైనది’ -యోహాను 19:30
* * *
యేసు ప్రభువు సిలువలో పలికిన 6వ మాట ‘సమాప్తమైనది’ అనే మాట. యేసు శిష్యులతో చెప్పిన మాట. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నదని. వచ్చిన పని తుదముట్టించిన తరువాత పలికిన మాట ఇది, సమాప్తమైనదని.
సమాప్తమైనది అంటే? ఏ విషయం ముగించాడు. ఆయన యజ్ఞము, బలి యాగము ముగిసింది. పాపికి మారుగా ఆయన సిలువలో బలి పశువుగా మారి నీ పాపములు నా పాపములు సిలువలో కొట్టివేయుట ముగిసింది. సర్వలోక పాపములకు ఆయన ఒక్కసారే బలి అయ్యాడు. లోక పాపములను ఆయన తీసివేశాడు. ఆయన సిలువపై కార్చిన రక్తముతో మానవకోటిని విమోచించాడు. పాప విముక్తిని కలుగజేశాడు. దీనికి ముందు పాపవిముక్తి కొరకు పశువులను బలి ఇచ్చేవారు. అది ఏటేటా జరిగేది. అయితే ఆ బలులు ఇవ్వటం కూడా సమాప్తమైనది. ఇక మానవుల పాపాలకు పశువులను బలిగా ఇవ్వవలసిన అవసరం లేదు. అది కేవలం తాత్కాలికమే. అయితే క్రీస్తు చేసిన యజ్ఞము ఒక్కసారే ముగిసింది. ఇక మనము చేయవలసినది క్రీస్తు మన పాపముల నిమిత్తము రక్తము చిందించాడని, యేసు క్రీస్తు రక్తములో మన పాపములు కడుగబడినవని, నమ్మి బాప్తిస్మము పొందితే రక్షింపబడతాము.
మన పాపములు మనము కడుగలేము. ఏమి ఇచ్చినా, ఎన్ని బలులర్పించినా మన పాపములు పోయేవి కాదు. కానీ క్రీస్తు చిందించిన పరిశుద్ధ రక్తములో కడుగబడి శుద్ధులవౌతాము. ఈ కార్యమును చేయకుండా సాతానుడు అనేకసార్లు అడ్డుపడి ఈ యజ్ఞాన్ని ఆపివేయటానికి ప్రయత్నించి, ప్రభువు పుట్టిననప్పుడే చంపటానికి ప్రయత్నించాడు. అలా మనకు అప్పగించబడిన పనులు ముగించకుండా నిలిపివేయటానికి అనేక శోధనలు పెట్టుచుంటాడు. జాగ్రత్త! ప్రభువిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని సాతానుని కుతంత్రాలనూ మోసాల నన్నింటినీ ఎదిరించి మన కప్పగించిన పనిని తుదముట్టించాలి. సాతానుని మోసాలను ఎదిరించాలంటే మనము ఆయన వాక్య ఖడ్గమును ధరించాలి.
చివరకు సిలువ దగ్గర ఎంత శోధన ఉందో చూడండి. నీవు రక్షకుడవైతే నిన్ను నీవు రక్షించుకోమని హేళన చేశారు. చనిపోయిన వారిని లేపుట కూడా చూసినటువంటి వారే గానీ శోధించారు. వారి శోధన మాటలకు చెవినిచ్చినట్లయితే ప్రభువు సిలువ యజ్ఞము పూర్తయ్యేది కాదు.
దేవుని అపారమైన ప్రేమ, ఆయన నీతిగల తీర్పు సిలువలో కలిసినవి. ఆయన నీతిగల తీర్పు - పాపి శిక్షించబడాలి. మరణించాలి. అయితే దేవుని అపారమైన ప్రేమ ఆయన కుమారుడినే బలిగా అర్పించి మరణించవలసిన మనకు విమోచన కలుగజేసింది.
అంతేకాదు - ప్రభువు మానవాళికి బోధించవలసిన విషయాలన్నీ ఎంతో క్షుణ్ణంగా తెలియజేశాడు. వాటిని పాటించి ఒక మాదిరిగా మనకు ఉంచాడు. ప్రార్థనా జీవితము ఎలా ఉండవలెనో, సాతానుని ఎలా ఎదిరించాలో? అది కూడా పూర్తిగా తెలియజేశాడు.
మనలను కూడా ఏదో ఒక పని నిమిత్తమై దేవుడు ఎన్నుకున్నాడు. మనకు అప్పగించిన పనులు మనము కూడ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనముందున్న పందెములో ఓపికతో పరుగెత్తి పౌలు వలె, నా పరుగులు తుదముట్టించితిని అని చెప్పగలగాలి. క్రీస్తు మాదిరి మనకు అప్పగించిన పనులు సమాప్తము చేయగలుగుటకు ప్రయత్నిద్దాం.
దేవుడిచ్చిన రక్షణను కొనసాగిస్తూ మన పరుగు సమాప్తము చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.
7వ మాట
‘తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను’ -లూకా 23:46
* * *
ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అది చిన్నదైన పెద్దదైన పాపము పాపమే. వాస్తవానికి అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు. మన పాపాలకు వెల చెల్లించి మరణము నుండి తప్పించటానికే ప్రభువు ఈ లోకానికి నరావతారిగా జన్మించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనుష్య కుమారుడు యేసు ప్రభువు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా లోకమంతటి తరపున తన ప్రాణము నియ్యటానికే వచ్చాడు. మనమింక పాపులమై యుండగా అవిధేయులమై ఉండగా, శత్రువులమై యుండగా తన ప్రాణమును బలిగా ఆ సిలువపై ఇచ్చేటప్పుడు యేసు ప్రభువు పెట్టిన కేక ఇది. తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.
దేవునిపై ఉన్న విశ్వాసముతో దావీదు కూడ ఈ మాటను కీర్తన 31:5 వచనములో చూస్తున్నాము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే. నా కొండ నీవే. నా కోట నీవే. నా దాగుచోటు నీవే అని దావీదు ఎల్లప్పుడు మహోన్నతుని చాటుననే ఉండేవాడు. మానవునిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువు కూడా తండ్రి యందు విశ్వాసము కలిగి తన ఆత్మను అప్పగించాడు.
దావీదు ఈ సంగతులను ముందుగానే ప్రవచించాడు. కీర్తన 16:9-10.
నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడ సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనీయవు. కనుకనే ఆత్మను తండ్రికి అప్పగించాడు యేసయ్య.
ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను - 1 తిమోతి 2:6
మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి వీటన్నింటి నుండి రక్షించటానికి పాప విమోచన కొరకే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. దైవ కుమారుడైన క్రీస్తు నా రక్షణార్థమై తన ప్రాణము అర్పించాడు. నా కొరకు బలి అయ్యాడు అని నమ్మితే రక్షణ ఉచితం. దీనిని తేలికగా తీసికోవద్దు. ప్రభువు ప్రాణాలిచ్చి తెచ్చిన రక్షణ.
అందరూ మన కొరకు బలియైన క్రీస్తులో రక్షింపబడాలని నా ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256