ప్రార్థన

ఆత్మతో సత్యముతో ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను - యోహాను 4:24.
దేవుడు ఆత్మ గనుక మనము కూడా ఆత్మపూర్ణులమవ్వాలి. వాస్తవానికి మనము శరీరానుసారులము. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటాము. అయితే శరీరానుసారమైన మనస్సు మరణము. కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు. శరీరాశ భావము గలవారు దేవుని సంతోషపరచలేరు.
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. దేవుని ఆత్మ మీలో నివసించి యున్న యెడల మీరు ఆత్మ స్వభావము గల వారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.
ఎంతో స్వతంత్రముగా ఉన్న మనలను నేత్రాశ శరీరాశ జీవపు డంబములలో ఏదో మేలు చేసినట్టుగా ఇంకా ఎక్కువ స్వతంత్రత దొరకుతుందని భ్రమలో పెట్టి, మన స్వాతంత్య్రాన్ని పోగొట్టి, మనకు తెలియకుండా పాప బానిసత్వములో బంధించి వేశాడు సాతానుడు. బానిసత్వములో ఉన్నాము గనుక, మేలైనది చేయాలనే ఆశ ఉంటుంది. కానీ చేయలేము. కీడే జరుగుచున్నది. కారణము మనము పాపానికి బానిసలము.
శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దురాలోచనలు, నర హత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవ దూషణలు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారము, అహంభావము, అవివేకము.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుకే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారినప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండినవారై కొండెగాండ్రును అపహాసకులును అహంకారులును దేవ ద్వేషులును హింసకులును బింకములాడే వారును చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిధేయులును అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును నిర్దయులునైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి యుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. - రోమా 1:28-32.
ఈ శరీర కార్యములకు సమ్మతించినా, వాటిలో సంతోషించినా అది కూడా శరీరానుసారమే. పైన తెలుపబడిన శరీర కార్యాలకు స్పందించిన వారందరు శరీర సంబంధులే. శరీర కార్యములు చేయకూడదు వాటికి స్పందించకూడదు. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ శరీర కార్యము. అయితే ఆత్మానుసారులు, కీడుకు కీడు, దూషణకు దూషణ చేయక దీవిస్తారు. ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా నున్నది. గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు - గలతీ 5:16.
పరలోక రాజ్యము సమీపించి యున్నది. మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను - మత్తయి 3:2
నేత్రాశ శరీరాశ జీవపుడంబును జయించిన యేసు పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచ్చు ప్రకటింప మొదలుపెట్టెను - మత్తయి 4:17.
ఆత్మయై యున్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు సర్వశక్తిగల దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు తన్ను తాను తగ్గించుకొని మామూలు మనిషిగా ఈ లోకానికి వచ్చి, మన విమోచనార్థము తన ప్రాణము నర్పించి మృత్యుంజయుడై తిరిగి లేచి, తనను అంగీకరించిన వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చాడు. ఆత్మ దేవుని కుమారులమై ఆత్మానుసారముగా జీవించి నిత్య జీవానికి వారసుల మవ్వాలని దేవుని ఆశ!
మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను - గలతీ 4:6.
ఆత్మానుసారులే పరలోక రాజ్యానికి అర్హులు.
దేవుడు ఆత్మస్వరూపి. క్రీస్తును అంగీకరించిన వారికి తన ఆత్మను అనుగ్రహించాడు. పాపములో ఆత్మానుసారముగా చనిపోయిన మన శరీరాలను పాపమేలుతోంది. ఈ సంగతి ముందు గ్రహించాలి. దేవుడు అనేక రీతులుగా మనకు ఈ సంగతి తెలియజేస్తూనే ఉన్నాడు. శరీరము నిష్ప్రయోజనమని, మన్నైనది చివరకు మంటి పాలౌనని తెలియజేస్తున్నాడు. మనకు కూడా తెలుస్తుంది. ఎంతటి వారైనా చివరకు మంటిలో కలిసిపోవాలని. అయినా ఈ శరీరాన్ని పూజించి, శరీరాశలు నెరవేర్చుకొనేందుకు దేవుని విషయానే్న మర్చిపోయి శరీరానుసారమైన జీవితానే్న జీవిస్తున్నారు. శరీర ఆశీర్వాదాలలోనే సంతోషపడుచున్నారు. అసలు మన ఆత్మీయ స్థితి ఏంటి? ఎలా ఉన్నామన్న సోయ లేకుండా బ్రతుకుతూ, ఉన్న ఆత్మను కూడా ఆర్పివేస్తున్నారు.
దేవుడు కావాలి. ఆయన ఆశీర్వాదాలు కావాలి. దేవాలయానికి వెళ్లాలి. అందరూ మనలను భక్తిపరులని అనుకోవాలి. అందరిలా ఆరాధించాలి. అందరూ మనము మంచి ఆరాధన చేస్తున్నామని అనుకోవాలని ఆశపడుతున్నారు. అయితే ఆత్మతో ఆరాధిస్తేనే నీవు చేసే ఆరాధన చెల్లుతుందని ప్రభువు సెలవిస్తున్నాడు.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను - యోహాను 4:24. అలా ఆత్మతో ఆరాధిస్తేనే దేవునికి చెల్లుతుంది. అంటే శరీరముతో ఆరాధిస్తే ఉపయోగము లేదు. ఇక్కడ ఇంకో ప్రమాదము కనపడుతున్నది. మనము చేసే ఆరాధన దేవునికి చెల్లకపోతే, సాతాను ఖాతాలో పడుద్దేమో?! తెలియకుండా సాతానుని ఆరాధిస్తున్నావేమో? అందుకే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము అని పౌలు భక్తుడు రోమా పత్రిక 8:7లో వ్రాశాడు.
యేసు ప్రభువు ఈ లోకములో పలికిన మొదటి మాట - ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది - మత్తయి 5:3.
ప్రభువు దృష్టిలో దుమ్ము ధూళి వంటి వారమైన మనము, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆయన అగాపే ప్రేమ ముందు, ఆయన అనంత శక్తి ముందు ఆయన క్షమాపణ ముందు ఆయన పరిశుద్ధత ముందు మనమేంటో గ్రహించాలి. ప్రభువు దృష్టిలో మనలను మనము తగ్గించుకోవాలి. అప్పుడాయన మనలను హెచ్చిస్తాడు.
మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు.
తగ్గింపు కూడా దేవుని వరమే. ముందు మన స్థితి విసరి వెళ్లి తిరిగి రాని గాలి వంటి వారమని, దేవుడు సర్వములో వ్యాపించి యున్నాడని గుర్తెరగాలి. మనము నీతి అనుకున్నది ప్రభువు పరిశుద్ధత ముందు మురికిగుడ్డ వంటిదని, మనము వెలుగులో ఉన్నామనుకుంటూ చీకటిలోనే ఉన్నామని గుర్తెరగాలి. అసలు వెలుగును గుర్తించాలి. అంగీకరించాలి. ఆత్మలో మన దీన స్థితి చెప్పాలి. ఆ స్థితిని గ్రహించి ఆత్మ నింపుదల కొరకు ప్రార్థించాలి. అప్పుడు ఆత్మను ధారాళముగా మనలో నింపుతాడు. ఆత్మపూర్ణులమైన తరువాత, ఆత్మ ఫలము ఫలిస్తుంది. ఆత్మపూర్ణులమై చేసే ఆరాధన, హృదయ పూర్వకముగా చేసే ఆరాధన ఆత్మ దేవునికి చెల్లుతుంది.
మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. - ద్వితీ 6:4-5.
దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గము లన్నింటిలో నడచుచు ఆయనను ప్రేమించి సజీవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించాలి. నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చూడుము. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. -ద్వితీయ 10:12-14.
శరీర కార్యాలతో శరీరానుసారమైన మనస్సుతో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి - ఎఫెసీ 4:30.
దావీదు చేసిన ప్రార్థన మనమూ చేయాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి దృఢపరచుము - కీర్తన 51:10-12.
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉంది. -రోమా 5:5.
దేవుని రక్షణ ప్రణాళికను ఎరిగిన వారు ఆయన శక్తిని ఎరిగినటు వంటి వారు ఆయన ప్రేమను రుచి చూసిన వారు ఆయన అద్భుతాలను ఎరిగిన వారు ఆశ్చర్య కార్యాలను ఆయన మహాబలమును ఎరిగినటువంటి వారు ఆయనను ఆరాధించకుండా ఉండలేరు.
మనము చేసే ఆరాధనయైనా, విమోచన వర్తమానమైనా ఆత్మ నడిపింపుతో చేయాలి. అప్పుడే సత్యాన్ని గ్రహించి ఆత్మను పొందుకుంటారు. వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆరాధన మన రక్షణానందాన్ని దేవుని సత్యాన్ని వాక్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఆరాధన మన నిజ స్థితి ఏమిటో దేవుని గొప్పతనమేమిటో ఆయన స్థానమేమిటో తెలియజేస్తుంది.
ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన వల్ల దేవుని మహిమ ఘనత ప్రభావము, మనకు శక్తి శాంతి సమాధానము సంతోషము. ఆత్మారాధనలో మన ద్వేషము ప్రేమగా, దుఃఖము సంతోషముగా, ఆందోళనలో సమాధానము అసహనములో దీర్ఘశాంతము, క్రూరత్వానికి బదులు దయాళుత్వము.. పాపానికి బదులు మంచితనము, దేవుడు లేడనే వారికి దేవుని మీద విశ్వాసము, అహంకారము సాత్వికముగా, మొండితనము ఆశా నిగ్రహముగా మారతాయి.

-మద్దు పీటర్ 9490651256