ప్రార్థన

నా తండ్రి వ్యవసాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు - యోహాను 15:1.
నా యందు నిలిచి యుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచి యుంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను. తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
యేసు నిజమైన ద్రాక్షావల్లి. ఆయనలో నిలిచియుంటేనే ఫలించగలము. ప్రభువులో నిలిచి ఫలించే ఫలము నిజమైన ఫలము. నిత్యమైన సంతోషము ఇక్కడనే ఉంది.
దేవుడు లోకమును ఒక పొలముగా చేసి తన పోలిక చొప్పున తన రూపులో మానవుని చేసి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని ఆశీర్వదించాడు. ఒక్కసారి ఈ ఆశీర్వాదం లోకమంతా వ్యాపించి అందరూ దేవుని స్వరూపములో ఎదిగి, తోట పూలతో, ఫలాలతో తులతూగుచున్నట్టుగా ఉన్నట్టు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాము. ఒక్కసారి గులాబీ తోటలోనికి వెళితే మంచి సువాసన కనుల విందుగా రంగురంగుల పూలు కనపడుతూ ఉంటే వ్యవసాయకుడు తాను పడిన కష్టమంతా ఎటు పోతుందో గానీ ఆనందముతో సంతోషముతో తృప్తిగా హృదయముంటుంది గదా! ఆ ఆనందాన్ని వర్ణించలేము. ఆ తృప్తి లోకాన్ని జయించిన ఉత్సాహాన్ని ఇస్తుంది.
అక్కడ వరకు ఎందుకు? మన ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు చెప్పినట్లు వింటూ అందరూ కలిసి సంతోషముగా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాము. వాస్తవానికి మన అందరి కోరిక కూడా అదే. అందరూ సంతోషంగా సమాధానముగా ఆరోగ్యముగా ఇతరులకు సహాయముగా ఉంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలని. అలా మన ఇల్లు మన గ్రామము, పట్టణము, రాష్టమ్రు ఉంటే ఎలా ఉంటుందో, అలానే మన దేశం ఉంటే ఎలా ఉంటుందో గదా! వాస్తవానికి దేవుని ఉద్దేశము కూడా అదే కదా. ఆ ప్రేమామయుని రూపులో మనలను చేసి, ప్రేమను ఫలించి అభివృద్ధి చెంది లోకాన్ని ప్రేమతో నింపమని, అంటే పరలోకములో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉండాలని ఆయన కోరిక. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇంత సంతోషకరమైన సమయములో అనుకోకుండా ఎన్ని సమస్యలు చిక్కులు శోధనలు కష్టాలు నష్టాలు మొదలై నరకములా అయింది. కారణం, కారుద్రాక్షలు.
దేవుడు ఆత్మ గనుక ఆత్మానుసారంగా జీవించాలి. అయితే శరీరానుసారముగా జీవించుటం మొదలైంది. తండ్రి చిత్తము మరచిపోయి, లోకానుసారముగా అల్పకాల భోగాలకు అలవాటై, చిన్నచిన్న విషయములలో సంతోషించుచు, అసలు దేవుడిచ్చే నిజ సంతోషాన్ని నిజదేవుణ్ని మరచిపోయి, లోకానికి అలవాటై లోక ఆచారాలకు అలవాటై, వాటికి బానిసలై పోయి, దేవుడాశించిన ఫలాన్ని ఫలించక శరీరానుసారమైన ఫలములు ఫలించి, దేవునికి దూరస్థులయ్యారు. ఇంకేముంది? లోకమంతా అయోమయం అయింది. మంచి ఏదో చెడు ఏదో తెలియటం లేదు. గందరగోళంతో గోళం దుర్గంధముతో నిండి ఉంది. మంచి ఫలాలలాగానే కనపడతాయి కానీ దానిలో ఎంతో కుళ్లు కుతంత్రాలు దాగి ఉంటాయి. ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరిగిపోయింది. అసూయలు కక్షలు క్రోధాలు ఎక్కువై పోయాయి. జారత్వము కాముకత్వము అపవిత్రత అభిచారము మత్సరము భేదములు విమతములు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు పెరిగిపోయాయి. అల్లరితో కూడిన ఆట పాటలకు లోకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో సంతోషముందనుకుంటున్నారు. కాదు. ఆరోగ్యాలు, ఆస్తులు హరించుకు పోతున్నాయన్న సంగతి మరచిపోతున్నారు. శరీరానుసారమైన మనసు మరణము. నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఎక్కువైంది. దానికి సంబంధించిన ఫలములతో లోకం నింపబడి ఉంది. దేవుడు కోరిన మంచి ప్రేమ సమాధానములు కరవై పోయాయి. మనిషిని మనిషి చంపుకుంటున్నారు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సమాధానము కలిగి ఉండవలసిన వారు ఒకరి మీద ఒకరు ఉరులు ఒడ్డుచున్నారు.
అలా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు తాను చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆయన కోరుకున్నది ప్రేమ ఫలం, అయితే ఏవేవో ఫలాలు భూమి మీద నిండిపోయాయి. వాటిలో ముఖ్యమైనవి నరహత్యలు వ్యభిచారాలు ఎక్కువయ్యాయి. స్వార్థం రాజ్యమేలుతోంది. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. మంచి మాటలు ఎక్కడా వినపడటం లేదు. ఏ వార్త చూసినా చెడుగానే ఉంటుంది. అది చూడలేని దేవుడు నీటి ద్వారా సమస్త ప్రాణులను, జీవరాసులన్నింటిని తుడిచివేసెను. అయితే నీతిమంతుడైన నోవాహును తన కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. నోవాహు చేసిన ఓడలో ఉన్న ప్రాణులు కూడా బ్రతికాయి. అయినా పాపము తుడిచిపెట్టబడలేదు. మళ్లీ మొలకలు వచ్చి భూమిని నింపాయి. సొదొమ గొమొఱ్ఱా పట్టణములలో పాపము నింపబడి యుండుట చూచి, వారి అన్యాయమును జారత్వాన్ని వ్యభిచారాన్ని, పురుష సంయోగులను దొంగలను లోభులను త్రాగుబోతులను దూషకులను దోచుకొను వారిని చూచి దేవుని కోపము రగులుకొని అగ్నిని గంధకమును ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములో నివసించు వారి నందరిని నేల మొలకలను నాశనము చేసెను. హవ్వ ఇచ్చిన చిన్న సందులో నుంచి సాతానుడు ఇప్పుడు లోకమంతా వ్యాపించి పాపాన్ని పెంచుచున్నాడు. పాపపు విత్తనాలు జల్లుతూనే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనలో ఏదో ఒక విత్తనము జల్లుతాడు. చెడును పెంచుటలో మంచి వ్యవసాయదారుడు సాతాను. మనలో ఎప్పుడు విత్తనాలు జల్లాలో వాడికి బాగా తెలుసు. గొప్ప గొప్ప వారిలో కూడా వాడు చెడును జల్లి పాడు చేయగలడు. డబ్బు విత్తనాలు జల్లుతాడు. జాగ్రత్త! ఈ విత్తనాలంటే కొంతమందికి బహు ఇష్టం. ధనాపేక్ష విత్తనాలు మనలో పడితే ఇక అంతే. దేవునిని కూడా తాకట్టు పెడుచున్నారు. అంతగా మోసపోతున్నారు.
పిల్లలు పెరిగి పెద్దవారయ్యే సమయములో వారిలో దురలవాట్ల విత్తనాలు జల్లుతాడు. అంతేకాదు. తల్లిదండ్రులను లెక్క చేయని విత్తనాలు జల్లుతాడు. అంతే ఇంకేముంది? అప్పటి వరకు ఎంతో ప్రేమించిన తల్లిదండ్రులను వదిలి ఇష్టమొచ్చిన తిరుగుళ్లకు అలవాటై, తల్లిదండ్రులను లెక్క చేయరు. పట్టించుకోరు. అక్కడితో ఆగడు. సృష్టికర్తను కూడా మరచిపోతారు.
దేవుడు మంచి గోధుమల వెదజల్లి వెళితే, శత్రువు ఎవరూ చూడని రాత్రి సమయములో గురుగులు విత్తి వెళ్లాడు. వాడు విత్తిన గురుగులు బాగున్నట్టుగా ఉన్నవి గనుక గురుగులు లాంటి పనికిరాని వాటికి మనుష్యులు ఆకర్షితులవుతున్నారు. అంటుకట్టబడుతున్నారు. పనికిరాని విషయాలు ఫలిస్తున్నారు. దానివల్ల వారికి నష్టమే. సమాజానికి నష్టమే. చివరకు అది మరణానికి దారితీస్తుంది. కోతకాలములో గురుగులు కాల్చి వేయబడతాయి. గమనించాలి. గోధుమలు గురుగులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. జాగ్రత్త! గురుగులను చూచి మోసపోవద్దు. గోధుమల వలె గురుగులు తయారవుచున్నాయి. గోధుమలకు గురుగులతో పని ఏమి? ఉండకూడదు. వెలుగుకు చీకటితో పొత్తు ఎందుకు? అసలు ఉండదు కదా? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అవిశ్వాసులతో విశ్వాసులు జోడు ఉండకూడదు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యమును చేయువారిని వెంబడించవద్దు. న్యాయము త్రిప్పివేయు వారితో చేరి సాక్ష్యము పలుకకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువకూడదు. పాపుల మార్గమున నిలువకూడదు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. భక్తిహీనుల మార్గము చేరకూడదు. కోపవిత్తునితో సహవాసము చేయకు. క్రోధము గలవారితో పరిచయము కలిగి యుండకు. జారులతో లోభితో తిట్టుబోతుతో త్రాగుబోతుతో దోచుకొను వానితో సాంగత్యము వద్దు. ఈ లోక తళుకు బెళుకులు చూసి, తాత్కాలిక ఆనందము కోసం ఈ లోకముతో సాంగత్యము చేయకూడదు. కారణం ఈ లోక భోగాలతో స్నేహము దేవునితో వైరమే. లోకముతో సాంగత్యము చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి విరోధులుగా అయ్యారు. ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. అసలు దేవుడే లేడనే స్థితికి వచ్చారు.
అయినా మంచి చెడులు తెలుసు గనుక అప్పుడప్పుడు మంచి చేయాలనే ఆశతో కొన్ని మంచి కార్యాలు చేస్తారు. దేవునికి విరోధిగా ఉంటూ నీవు ఏ మంచి కార్యము చేసినా అది చెల్లదు. దేవుని ప్రేమ లేకుండా నీ ఆస్తి అంతా బీదల పోషణ కొరకు ఇచ్చినా, కాల్చబడుటకు శరీరాన్ని ఇచ్చినా ప్రేమ లేకపోతే ఉపయోగము లేదు. అది కూడా దేవుని అగాపె నిండు ప్రేమతో ప్రేమించాలి. నిస్వార్థమైన ప్రేమ వేరు స్వార్థ ప్రేమ వేరు. నిష్కపటమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమించి, చివరకు సిలువలో ప్రాణాలిచ్చాడు. కొంతమంది ప్రేమ ప్రాణాలు తీస్తుంది. ప్రాణం పోసే ప్రేమను కలిగి ఉండాలి. అదే దేవుని కోరిక.
అయితే అపవాది కుతంత్రాలతో మాయ మాటలతో జనులను మాయ మాటలకు అంటుకట్టించి మాయను పుట్టించి లోకాన్ని మాయతో నింపివేసింది. అయోమయములో ఉన్న లోకాన్ని చూచిన కృపామయుడైన దేవుడు ప్రేమామయుడైన దేవుడు, లోకాన్ని ఎంతో ప్రేమించి, తన అద్వితీయ కుమారుని మన మధ్యకు పంపాడు. ఆ యేసు ప్రభువు నందు విశ్వాసముంచిన వారందరు నిత్య జీవము పొందుకొని నిత్యము దేవునితో ఉండాలని ఆయన కోరికయై యున్నది.
వ్యవసాయకుడు కలుపును తీసివేయటానికి, కారుద్రాక్షలు పండిన పంటను తీసివేయటానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలించక, పరలోకము నుండి ఆయన కుమారుడై ప్రభు యేసును మన మధ్యకు పంపాడు. ప్రేమను పండించాలని ఆయన కోరిక. పరలోక ప్రేమను ఈ లోకములోనికి తెచ్చి నాటాడు. యేసు క్రీస్తు ప్రేమాస్వరూపి. అగాపె ప్రేమ ఈ లోకములో నాటబడింది. సృష్టికర్తయైన దేవుని ప్రక్కకు నెట్టి సాతాను వాడి కుయుక్తితో స్వార్థముతో కళంకరమైన మనస్సుతో మోసాలతో ఈ సృష్టిని నింపాలని ప్రయత్నం చేస్తూ చివరకు దేవుడు నాటిన ప్రేమను మొలకలోనే త్రుంచివేయాలని ప్రయత్నించాడు. దేవుని శక్తి ముందు వాడి శక్తి ఎంత? కనుక ఏమీ చేయలేక పోయాడు. ఈ లోకములో ఉన్న చెడును తీసివేయాలని ప్రభువు కోరిక. ప్రేమను తీసివేయాలని మంచిని కొట్టివేసి నీతిని పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. మంచి చెడు మన ముందుంచబడి ఉంది. జీవ మరణాలు మనముందున్నాయి. ఇక మన ఇష్టం. నీ జీవితం నీ ఇష్టం. తేల్చుకో.
మనమింక శత్రువులమై యుండగా దేవుడు తన కుమారుని పంపాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి. ఈ యేసు బోధను మనము విని వెంబడిస్తే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. చేయలేమన్న పనులు చేయగలుగుతాము, మానలేమనుకున్న దురలవాట్లు మానుకోగలము. గొప్పగొప్ప కార్యాలు చేయగలము. ఆయన ఆలోచనలు వింటే మనకు మేలు. ఎందుకంటే భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, మన పట్ల ఆయనకు అంత ఉన్నతమైన తలంపులుంటాయి. ఆయన మాటలు వింటే ఆ ఉన్నతమైన స్థలానికి చేరగలుగుతావు.
నా తలంపేమో నా భార్యను ఏదో ఒక చిన్న ఉద్యోగములో చేర్చాలని ఆశ. దాని కొరకు నా వంతుగా ఎన్నో రకాలుగా లోకపరమైన ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వైపు చూస్తూ ప్రభువుపైన ఆధారపడిన కొంతకాలానికి డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, కృతజ్ఞత కలిగి దేవునికి మహిమగా తన సర్వీస్‌ను ముగించింది. అప్పటి నుండి మా సొంత ఆలోచనలు మానేశాము. ఇంత ఉన్నతమైన ఆలోచనలు ఇచ్చే ప్రభువు మనకు తోడు ఉండగా ఇక మన ఆలోచనలు ఎందుకు? విడువడు ఎడబాయడు, మనుషులను నమ్మితే ఒక్కొక్కసారి వారు మనకు అవసరమైన సమయములో ఉండకపోవచ్చు. కానీ ప్రభువు మనలను విడువడు ఎడబాయడు. మనతోనే ఉంటాడు. నమ్మదగిన దేవుడు. ఇంత ప్రేమగల, దయగల శక్తిగల, బలవంతుడైన దేవుని సత్యవంతుని అంగీకరించితే, మనకు కొండ కోటగా ఉండి, మహోన్నతమైన స్థలములో మనలను ఉంచుతాడు. ఏ అపాయము నీ దరికి చేరదు. ఏ కొదువ ఉండదు. ఏ తెగులు నీ గుడారము సమీపించు. తృప్తి కలిగి ఉంటాము. లోకములో ఎంత ఉన్నా ఏమి ఉన్నా తృప్తి మాత్రం ఉండటము లేదు. ప్రభువు నందు తృప్తి సమాధానము సంతోషముంటుంది. తనను ఎందరంగీకరించిరో వారికందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుని అంగీకరిస్తే, దేవుని పిల్లలమగుటకు అధికారముంది. అది ఇప్పుడే. మరణము తరువాత ఎటువంటి అవకాశముండదు. అందుకే ఈ లోకానికి తన కుమారుని పంపాడు. మరణము తర్వాత ఆయన నిజ దేవుడని, తీర్పు తీరుస్తాడని, మంచి చెడులను వేరు చేస్తాడని తెలిసినను అక్కడ ఉపయోగముండదు.
అందుకే ప్రభువు అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లినని. తండ్రి వ్యవసాయకుడు. కనుక క్రీస్తుకు అంటుకట్టబడాలి. ఫలించాలి. ఎందుకంటే ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఆయన యందు నిలిచి యుండాలి. అప్పుడే ఆ ప్రేమమయును ప్రేమ శక్తి బలము జ్ఞానము మనలోనికి వస్తుంది. మనలో ప్రవహిస్తుంది. మంచి ఫలమిస్తుంది. నిరంతరంగా నిలిచి ఉండాలి. కొన్నాళ్లుండి వెళ్లిపోతే కాదు. కొంతకాలము దేవునితో కొంతకాలము లోకముతో ఉంటే ఉపయోగముండదు. సరియైన ఫలములు ఫలించలేము.
వ్యవసాయకుని ఆశ మనము బహుగా ఫలించాలని, తద్వారా ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదము కలుగుతుంది. మంచి ఫలములు ఫలించకపోతే, అసలు ఫలించకపోతే వ్యవసాయకుడు తీసి పారవేస్తానంటున్నాడు. సమయము ఆసన్నమైంది. ప్రభువు రాకడ అతి సమీపములో ఉంది. ప్రభువు కూడా అతి సమీపములో ఉన్నాడు. మనకు సహాయము చేయటానికి శక్తి బలముల నియ్యటానికి, మనలను ఎవరు త్రుంచి వేయకుండా కాపాడటానికి, ఆయన రెండవ రాకడ వరకు భద్రపరచటానికి, మనకు చెట్లకు తెగులు పట్టినట్టు పాపము పట్టినా, ఆయన రక్తములో మనలను కడిగి శుభ్రపరచి ఫలమును ఫలించటానికి కావలసిన ఎరువు వేస్తూ ఉంటారు. ఆయన మనల నుండి కోరుకునే ఫలం -ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వీకము ఆశానిగ్రహము. ఇంకొక సంగతి ఫలింపని చెట్ల వేరుపైన గొడ్డలి పెట్టబడి ఉంది. జాగ్రత్త! నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వీకము ఆశానిగ్రహములో ఫలించి లోకమంతా నింపబడి ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే ఒక విధమైన సమాధానము మనసులో మొదలౌతుంది. అందరు కోరుకునేది కూడా అదే. కానీ లోకానికి అంటుకట్టబడి ఉండటం వల్ల కారుద్రాక్షలే ఫలిస్తున్నాయి. కోరికైతే మంచి ఫలించాలనే ఉంది మంచి చేయాలనే ఉంది. దీనికి దేవుడు మనకిచ్చిన మార్గము యేసే. యేసు ప్రభువును అంగీకరించి ఆయన మాటల ప్రకారము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే తండ్రితో సహవాసము అంటే దేవాది దేవుడు సృష్టికర్తతో సహవాసము కలిగి ఉంటాము. యేసు ప్రభువు మనకు అన్న యెహోవా దేవుడు మనకు తండ్రి. గనుక మనము ఆయన పిల్లలముగా ఉంటూ ఆత్మ ఫలములు పండించటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256