ప్రార్థన

ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని యెంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు - కీర్తనలు 32:1-2.
పరిహారము నొందుట కాని పాపమునకు ప్రాయశ్చిత్తము నొందుట గాని సామాన్యమైన పని కాదు. మన పాపములను క్షమించటానికి ప్రభువు చేసిన యజ్ఞము వర్ణనాతీతము. ప్రేమతో మన పాపాలు కడగాలనే మనస్సు వచ్చింది. కృపతో మన పాపములు క్షమించాడు. మనుషులు అయితే లేని తప్పులు మనలో చూయించి మనలను చెడుగా చూయించి, వారినేమో మంచిగ చూయించుకోవాలనుకుంటున్న రోజులివి. అయితే ఏ పాపమెరుగని యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొలువబడుచున్న మన ప్రభువు, సమీపింపరాని తేజస్సులో ఉన్న యేసు, దేవుని స్వరూపము గలవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే మన పాపములు క్షమించడానికి రిక్తునిగా చేసికొనెను.
ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు - దుమ్ము ధూళియైన మానవ రూపానికి తగ్గించుకోవటమే గొప్ప కార్యమైతే, మానవ రూపము ధరించుకోవటమే కాదు, ఒక సేవకుని స్థితికి తగ్గించుకున్నాడు. దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా వచ్చి తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు. మామూలు మనుష్యులే లేనిపోనివి చెప్పి వాళ్ల ‘స్థాయి’ చాలా గొప్పదని చూయించుకోవాలనుకుంటారు. అయితే ప్రభువు తనకున్న ఆధిక్యతలన్నీ తగ్గించుకొని, రాజుగా రావలసినటువంటి ప్రభువు ఒక సేవకునిగా మన మధ్యకు వచ్చాడు.
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను.
తగ్గింపు ఒక ఎత్తు, అయితే తాను చేయని దానికి శిక్ష అనుభవించటం ఇంకొక ఎత్తు. మన పాప భారమంతా ఆయన మీద మోసికొని సిలువకు కొట్టివేయబడ్డాడు. కొట్టారు. తిట్టారు. నెట్టారు. ఉమ్మివేశారు. కొరడాలతో కొట్టారు. చేతులతో గుద్దారు. అనరాని మాటలన్నారు. హేళన చేశారు. కాళ్లలో చేతులలో శీలలు గుచ్చారు. తలపై ముళ్లకిరీటం పెట్టారు. చిన్న మాట కూడా పడలేని లోకం కోసం తన ప్రాణానే్న పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక! ఇలా అష్టకష్టాలు పడి మన పాపాలకు సిలువపైన వెల చెల్లించాడు. ఇంత గొప్ప యజ్ఞం చేసి మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకే మన పాపములను క్షమించే హక్కు ఉంది. ఇంత కష్టపడి తెచ్చిన ఈ రక్షణను పొందుకోటానికి ఒక మార్గము కూడా చూయించాడు.
అదే రక్షణ మార్గము యేసు మార్గము. దాని కోసం మనము చేయవలసినదల్లా ఒక్కటే. మన పాపములను మనము ఒప్పుకోవాలి. సర్వజ్ఞానియైన ప్రభువు ఎదుట ఏమీ దాచలేమని తెలిసి కూడా ఎందుకో పాపాలను కప్పుకొని తిరుగుతూ ఉంటారు. సాధ్యమైనంత కాలము దాచిపెట్టటానికే ప్రయత్నిస్తారు. అది కూడా పాపమే. దేవుని దగ్గర దాచటం పాపమే. దావీదు మహారాజు వ్రాసిన కీర్తన 32వ అధ్యాయము 5వ వచనము ప్రకారం ప్రభువు సన్నిధిలో తన అతిక్రమములను ఒప్పుకోవాలనుకున్నాడట. వెంటనే పాప దోషాన్ని పరిహరించాడు ప్రభువని వ్రాసుకున్నాడు. ఎందుకోగాని తప్పులు చాలా తేలికగా చేస్తారు. నోరు పారేసుకుంటారు. కానీ వాటిని దిద్దుకోమంటే మనుషులకు కుదరటం లేదు. ప్రభువేమో క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు.
పాపాలు క్షమించటం తేలిక కాదు. రోగాలు బాగు చేయటం తేలిక కాదు. అవి దేవాది దేవుని ప్రాణమంత విలువైంది. తన కృప చొప్పున క్షమిస్తానని ప్రభువంటే ఒప్పుకోలేక పోతున్నారు.
ఒక్కొక్కసారి సాతాను వలలో పడి అసలు నాలో ఏ తప్పు లేదనుకుంటున్నారు. మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. - 1 యోహాను 1:8-10.
పాప క్షమాపణ పొందటం గొప్ప ధన్యత. ప్రమాదములో తుక్కుతుక్కు అయిన కారు రిపేర్‌కి ఇస్తే, దాన్ని బాగుచేసి, కొత్తదిగా రంగులు వేసి ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంతకు మించిన సంతోషం ఈ ధన్యతలో ఉంటుంది. ఈ సంతోషాన్ని కొలువలేము. క్షమాపణను కొనలేము. మనం సొంతగా రిపేర్ చేయటానికి ఎంత చేసినా మన ప్రయత్నాలు వృథా అయిపోతాయి. డబ్బులతో పరిష్కరించలేము. మాటలతో అసలు ఉపయోగము లేదు. చివరకు ప్రాణాలిచ్చినా ఉపయోగము లేదు. జీవితకాలమంతా ప్రయత్నించినా అది మానవుని తరం కాదు. అందుకే ప్రభువు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. కారణం దేవునికి వ్యతిరేకంగా చేశాము కాబట్టి, మనుషులతో అయితే సరిచేసుకోవచ్చు. మరి దేవునితో సరి చేసుకోలేము. అంత కఠినమైన దానిని, ప్రభువు తేలికగా క్షమిస్తానంటున్నాడు. కాకపోతే మనం ఒప్పుకోవాలి. మనకేమో కప్పుకోవటం అలవాటై పోయింది. చిన్నచిన్న తప్పులు ఒప్పుకుంటే సరిపోతుంది కానీ మనస్సు ఎందుకో ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు. పోలిక ఎక్కువైంది. నేను చేసింది చాలా చిన్న తప్పే గదా. వారు వ్యభిచారము చేశారు. పెద్దపెద్ద దొంగతనాలు చేశారు. నాదేముంది చాలా చిన్న తప్పే అనుకుంటారు. కాదు అలా అనుకునేటట్లు సాతానుడు మనలను మభ్యపెడతాడు. వాడి మాయలో పడి మనము నిజమే గదా నేను చేసింది తప్పే కాదు అనుకుంటారు. అలా కప్పికప్పి చివరికి అది పెద్ద దూలంగా మారుతుంది. అయినా ఎదుటి వాని కంటిలో నలుసు కనపడుతుంది గానీ మన కంట్లో ఉన్న దూలాన్ని గ్రహించలేక పోతున్నాము. దావీదు మహారాజు కూడా దూలమంత తప్పు తన కంటిలోనే పెట్టుకుని చాలా మంచివాణ్ణి అన్న భావనతో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన సంగతి విని ఎంతో కోపంతో మండిపడ్డాడు. పాపము చేసిన స్ర్తిని చూసి పాపుల కోపము మండిందట. అలానే దావీదు మహారాజు తాను చేసిన వ్యభిచారము నరహత్య మోసము మరచిపోయి నాతాను చెప్పిన ఉపమానములో చిన్న గొఱ్ఱెపిల్లను దొంగిలించిన ఐశ్వర్యవంతుని పైన కోపము వచ్చింది. బహుగా కోపించుకొని - యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడని తీర్పు ఇచ్చాడు. ఎవరి తప్పులు వారికి కనపడుట లేదు. సరే ఎవరైనా ధైర్యము చేసి చెప్పినా అది నచ్చక నిన్ను నీవు చూసుకో చాలు అన్నట్టున్నారు.
మార్టిన్ లూథర్ సంఘములో ఉన్న తప్పును చూయిస్తే తనను చంపటానికి ప్రయత్నించింది ఆనాటి లోకం. ఇప్పుడూ అలానే ఉంది. మంచి చెబితే నచ్చటం లేదు. మాకంతా తెలుసు. మేము కరెక్ట్ అన్న ధోరణిలోనే ఉన్నారు. తప్పు తెలుసుకుని ఒప్పుకొని సరిచేసుకుంటే ఉండే ఆనందమే వేరు. అలా దావీదు మహారాజు ఐశ్వర్యవంతుడు దరిద్రుని గొఱ్ఱెపిల్లను దొంగిలించాడని బహు కోపముతో ఉన్నప్పుడు నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అని చెప్పినప్పుడు ‘నేను పాపము చేసితిన’ని తెలుసుకొని తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదు చేసిన పాపమంతటిని పరిహరించెను. ఎంత పాపమైనా ప్రభువు క్షమించటానికి సిద్ధమే. అయితే మనము ఒప్పుకోవాలి. క్షమించబడ్డ వారు విమోచన పొందుకున్నవారు ఇక నూతన సృష్టి. పాతవి గతించిపోవును. మనము ఒప్పుకుంటే - నీ దోషములన్నిటిని క్షమిస్తాడు నీ సంకటములన్ని కుదురుస్తాడు. ఒప్పుకోకుండా కప్పుకుంటూ తిరిగితే దేవుని చెయ్యి మన మీద బరువుగా ఉంటుంది. విశ్రాంతి ఉండదు. ఎప్పుడూ దానిని కప్పుకొని తిరిగే ప్రయత్నములో అలసిపోతారు. అలా కప్పి జీవితాంతం భారముతో బ్రతికినా విమోచన దొరకదు. అది చిన్న తప్పైనా సరే వెంటనే ఒప్పుకుంటే ప్రభువు క్షమించి, ఇహ ఎన్నటికి దానిని జ్ఞాపకముంచుకొనడు. ఇదే సువార్త. యధార్థతలో సంతోషముంటుంది ఆనందముంటుంది.
దేవుడు వేయి వేల మందికి కృప చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికిని రప్పించును. ఇది అప్పుడే ప్రకటించారు. -నిర్గమ 34:7
మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు - 1 యోహాను 2:1-2.
ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు. మన పాపములకే కాదు సర్వలోకమునకు శాంతికరమై యున్నాడు.
ఆదిలో ఆదాము కూడా ఇంతే. తినకూడదని చెప్పిన పండు తిన్నాడు. దేవుడు వచ్చి అడిగినప్పుడు, తప్పైందని ఒప్పుకున్నట్లయితే ఎంత బాగుండేదో గాని, ఒప్పుకోటానికి బదులు తన భార్యమీద చివరకు దేవుని మీద నెపము వేశాడు. నీవిచ్చిన (అవ్వ) ఈ స్ర్తి వల్లే ఆ పండు తిన్నాను. నా తప్పు ఏమీ లేదు అన్నట్లు మాట్లాడాడు. అంతా తెలిసిన ప్రభువు వారిరువురిని ఏదేను వనము నుండి బయటకు తోలివేశాడు. జాగ్రత్త! తప్పు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. లేకపోతే దేవుని రాజ్యములో నుండి వెలివేయబడతాము.
అయితే సిలువ మీద ఉన్న దొంగలలో ఒకడు, ఆ సిలువ వారి తప్పులకు సరైనదేనని ఒప్పుకొని, ప్రభువును క్షమించమని వేడుకున్న వెంటనే విమోచించబడి అప్పటికప్పుడే ప్రభువుతో పరదేశులోనికి వెళ్లాడు.
మన ప్రార్థనలు ప్రభువు సన్నిధికి చేరి, మనకు జవాబు రావాలంటే, ముందు మన పాపములు కడుగబడాలి, మన దోషాలు క్షమించబడాలి. దీనికి ప్రభువు ఎల్లప్పుడు సిద్ధమే.
భక్తిహీనులు తమ మార్గము విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. -యెషయా 55:7.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడుటలేదు గాని అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరెరుగరా అని పేతురు, పొంతు గలతియ కప్పదొకియ ఆసియ బితునియ అను ఆయా దేశాలలో చెదరియున్న వారికి వ్రాశాడు. ఇది ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడే మనకు కల్పించి ఉచితముగా ఇస్తుంటే, ఎందుకో లోకానికి అది చులకనగా ఉంది. అసలు ఆయన పిలుపును పట్టించుకోవటం లేదు. ఇదే అనుకూల సమయము. నేడే రక్షణ దినం. సమయం పోనియ్యక సిద్ధపడితే మంచిది. ప్రభువు పిలుపు నందుకొని ఆయన దగ్గరకు వచ్చి మన పాపములన్ని అంటే రహస్య పాపములు కూడా ఒప్పుకొని ఆయన రక్తములో కడుగబడి విమోచన పొందుకుని నిర్దోషులముగా నీతిమంతులముగా తండ్రి ఎదుట నిలువబడుటకు సిద్ధపడుదాము.
వాస్తవానికి మనము దేవుని ప్రేమించినందుకు ఇంత గొప్ప యజ్ఞము చేయలేదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు తన కుమారుని పంపెను. అందులో ప్రేమ ఉంది.
దేవుని ముందు నిర్దోషిగా వుంటే ఆనందము సంతోష సమాధానాలే కాదు, నిర్దోషులు నీతిమంతులు చేసే ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు.
ఎవడైన దైవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ప్రభువు వాని మనవి ఆలకించును. వాస్తవానికి మనము భక్తులమే కాని దేవుని చిత్తము జరిగించుటలో మాత్రము చాలా వెనుకబడి ఉన్నాము. దేవుని పనిలోనే ఉంటున్నాము గాని మనకు తోచినట్లు మన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాము. ఇది కూడా పాపమే. దేవుని భక్తులు దేవుని పనిని దేవుడు చెప్పినట్లు మాత్రమే చేయాలి. అప్పుడే మన మనవులు ఆలకిస్తాడు.
ఇది దేవుని ప్రేమతో కూడిన గొప్ప ప్రణాళిక. మనలను నీతిమంతులముగా చేయాలనేది దేవుని కోరిక. దానిలో ఆశీర్వాదం సమాధానం శాంతి ఉంటాయి. అంతమాత్రమే కాదు దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఆధిక్యత కలుగుతుంది. ఎంత భాగ్యమో చూడండి. అంతేకాదు మన మనవులు విజ్ఞాపనలు ఆలకిస్తాడు.
ఏలియా మన వంటి స్వభావముగల మనుష్యుడే, వర్షింపకుండునట్లు ప్రార్థింపగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. భూమి తన ఫలమిచ్చెను.
అంతేగాని మన తప్పులు అతిక్రమములు దాచుకొని, ప్రార్థించినా, ఉపవాసాలుండి, ఏడ్చినా రొమ్ము కొట్టుకున్నా ఉపయోగము లేదు. కనుక ముందు ప్రభువు సన్నిధిలో మన అతిక్రమములు ఒప్పుకొని, ఆయన ఇచ్చే నీతిని కప్పుకొని సంతోష సమాధానాలతో జీవించటానికి లోకమంతటికి ఆహ్వానముంది. అంత మంచి అవకాశాన్ని పొందుకొని ప్రభువులో నూతన పరచబడి నూతన బలముతో నూతన శక్తితో నూతన మనస్సుతో జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకందరికి సహాయము చేయునుగాక.
ఎవరైనను క్రీస్తునందున్న యెడల వారు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను.

- మద్దు పీటర్ 9490651256