ప్రార్థన

నూతన సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనను క్రీస్తు నందున్న యెడల వారు నూతన సృష్టి; పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను. - 2 కొరింథీ 5:17
మనస్సు క్రొత్తదైతే క్రొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, పాత వాటిని ఇష్టపడదు, పాత ఆలోచనలు మనకు తెలుసు, కొడదామనిపిస్తుంది. తిడదామనిపిస్తుంది. ఒక్కొక్కసారి చంపేయాలనిపించేంత ఆలోచనలు, లేక చచ్చే ఆలోచనలు, ఇతరులవి ఆశించే ఆలోచనలు. అసూయకరమైన ఆలోచనలు, దొంగ ఆలోచనలు, మోహపుటాలోచనలు, మోసపూరిత ఆలోచనలు, ద్వేషపూరిత ఆలోచనలు, కుట్రలు కుతంత్రాలతో కూడిన ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి. అవి మనకు మాత్రమే తెలుసు. ఇంకా మన పార్ట్‌నర్స్‌కి, స్నేహితులకి కూడా కొన్ని అర్థవౌతాయి. ఆలోచనలు ఆకాశాన్ని ఎక్కుతాయి. పాతాళానికి వెళ్తాయి. భూలోకమంతా ఎవరెవరినో చుట్టి తట్టి వస్తాయి. మనుషుల మీదకు మనుషుల లోపలకు కూడా వెళ్లి వస్తుంటాయి. ఎవరికీ తెలియదని అనుకోవటం పొరపాటు. మన అంతరీంద్రియములను ప్రభువెరుగును. మన ఊహలలోని తలంపులన్ని ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు. తలంపు పుట్టక మునుపే ఎరిగినటువంటి దేవుడు మన ప్రభువు.
అందుకే హృదయము అన్నిటి కంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని, దాని గ్రహింప గలవాడెవడని ప్రశ్నిస్తూ, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అనే నేను హృదయములను పరిశోధించువాడను. అంతరేంద్రియములను పరీక్షించువాడనని యిర్మియా 17వ అధ్యాయము 9,10 వచనాలలో తెలియజేస్తున్నాడు. అంతేకాదు నరుల హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. ఎల్లప్పుడు అంటే నీవు పుట్టినది మొదలు నీవు చనిపోయే వరకని అర్థం. నిన్ను విడువను ఎడబాయను అని సెలవిచ్చిన ప్రభువు మనలను విడువడు ఎడబాయడు మనతోనే ఉండి మన ఊహలన్ని తలంపులన్ని కోరికలన్ని దురాశలన్ని చూస్తూ మార్కులు వేస్తూనే ఉంటాడు. మన టీచర్స్ సంవత్సరానికి ఒక్కసారే మనలను పరీక్ష చేస్తారు. అయితే ఒక గొప్ప సంగతి మనం గుర్తుంచుకోవాలి. కష్టనష్టాలు బాధలు కీడులు సమస్యలు వచ్చినప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. తగిన రీతిలో సహాయపడుతుంటాడు. కానీ తప్పుడు ఆలోచనలు సరి చేసుకోటానికి సమయమిస్తుంటాడు. ఆలోచనలు ఆచరణలోనికి రాకముందే సరి చేసుకుంటే మంచిది. ఆచరణలో పెడితే ఇక అనేకమైన మార్పులు కష్టాలు నష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది.
శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య మీద చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు వారిని ప్రభువు ప్రశ్నించాడు. తమలో తాము అనుకుంటున్న మాటలు కూడా ప్రభువుకు వినపడతాయి. ఇశ్రాయేలీయుల యాత్రలో సణుగుడు గొణుగుడు కూడా ప్రభువు విన్నాడు. వారిని శిక్షించాడు. అయితే ఈ కృపాకాలములో మాత్రం మన మనస్సులు మార్చటానికే ప్రయత్నిస్తున్నాడు. ఓపిక పడుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు యాజకులు తమలో తాము ఆలోచించి, దేవాది దేవుడు మీదనే దురాలోచనలు చేసిచేసి చివరకు వారి ఆలోచనలు ఆచరణలో పెట్టనే పెట్టారు. ప్రభువును సిలువ వేయించారు. ఎంతటి పాపానికి ఒడికట్టారో చూడండి. దానికి వారు కోరుకున్నట్టే అనేక హింసలు పెట్టబడ్డారు. చంపబడ్డారు. దేశ దిమ్మరులై అనేక సంవత్సరాలు ఆయా దేశాలలో తలదాచుకొని చివరకు ఇప్పుడు తమ దేశానికి ఒక ఉనికి కలిగించుకున్నారు. ఇది కూడా దేవుని కృపయే. అర్థమైతే చాలా మంచిది. దేవుని మీద దురాలోచనలు చేసినా, దేవుని పోలికలో సృష్టించబడిన మానవుని మీద దురాలోచన చేసిన అది గొప్ప పాపమే. పాపానికి శిక్ష ఉండనే ఉంది. క్షమాపణ కూడా ఉంది. అది తప్పు తెలిసికొని ప్రభువు దగ్గర ఒప్పుకుంటే. ఒప్పుకొనకుండా ఇంకా దురాలోచనల్లో ఉంటే తీర్పు లోనికి రావలసి వస్తుంది. ఇక్కడ తీర్పులకు వాయిదాలుంటాయి. సిటీ కోర్టు కాకపోతే హైకోర్టు అవీ కాకపోతే సుప్రీంకోర్టులు ఉంటాయి. కానీ ప్రభువు ఇచ్చే తీర్పులో ఆలస్యమే ఉండదు. వేరే కోర్టులు లేవు. నరకమే. ఇది తప్పించుకోవాలంటే మన మనస్సులు మారాలి. నూతన పరచబడాలి. ఎందుకంటే పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నది. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును గదా? మనుష్యుల దృష్టిలో చాలామంది మారినట్లుంటారు. ఉపయోగము లేదు పూర్తిగా మారవలసిందే. ఎందుకంటే పరిసయ్యులు ప్రభువును మాటలతో చిక్కున పెట్టవలెనని ఆలోచించి పన్నిచ్చుట న్యాయమా? కాదా? అని అడిగినపుడు యేసు వారి చెడుతనమెరిగి - వేషధారులారా! ననె్నందుకు శోధించుచున్నారు? అని మత్తయి 22:18 లో అడిగిన సంగతి మనకు తెలుసు. మన ఆలోచనలలో దేవుణ్ణి ఎంతగా శోధిస్తున్నామో బాధపెట్టుచున్నామో ఒకసారి ఆలోచిద్దాం. పాత మనస్సును మార్చివేద్దాం. ఎంత కప్పిపెట్టినా ఎంత అదుపు చేద్దామన్నా మనకు కుదరదు గనుక పాత మనసును మార్చి క్రీస్తులో నూతన మనసును పొందుకొందాము. నూతన ఆలోచనలు నూతన తలంపులు కలిగి ఉందాము. అది హృదయములో ఎంత నెమ్మది, సంతోషము కలుగజేస్తుందో, ఎంత సమాధానముగా ఉండునో గదా! అందుకే యేసయ్య ‘పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనసు పొందుడ’ని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. శరీరానుసారమైన ఆలోచనలు కూడా మరణమే.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఎప్పుడు శరీరాన్ని ఎలా పోషించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా సుఖించాలి అనే ఈ రంధి తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా నేను నా సుఖము అన్నట్టు ఉంటారు. మనస్సు మారితే ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడని చెప్పుచు క్రీస్తు కొరకే జీవిస్తారు.
మనసు మారితే ఇక మాట కూడా మారిపోద్ది. వారి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. ఎలా ఇంత మార్పు వచ్చింది, నిన్నటి వరకు బూతులు చిరాకు కోపంతో మాట్లాడినవాడు ఇంత సడన్‌గా మార్పేంటి అని ఆలోచిస్తారు. వనస్థలు కొంతమంది దేవుని తెలిసికొన్న తరువాత వాళ్ల తల్లిదండ్రులతో వారు మాట్లాడే తీరు అబ్బురపరచినవట. సింగపూర్‌లో ‘కార్నర్ స్టోన్ చర్చ్’ పాస్టర్ నెల్సన్ డేవిడ్ గారు ఎంతో సంతోషముతో ఆ సంఘపు వనస్థల మార్పు గురించి తెలియజేశారు. అంతకుముందు తిట్టి అరుస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడినవారు ఇప్పుడు ప్రేమగా సమాధానంగా మాట్లాడుతున్నారట. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాటలు కోపము రేపును. -సామెతలు 15:1. దయగల, కృపగల మాటలు సమాధానపరచే మాటలు వస్తాయి. మాటల్లో క్రొత్తదనం అందరికీ అర్థవౌతోంది. అందరూ ఇష్టపడతారు.
మాటలే కాదు చూపులు కూడా మారిపోతాయి. దయగల చూపులు చల్లని చూపులు ఆశీర్వదించే చూపులు చూస్తారు. బెదరగొట్టే చూపులు మారిపోయి ఆదరించే చూపులు మొదలౌతాయి. మనుషులను నమిలి మ్రింగివేసే చూపులు, మోసపు చూపులు, దొంగ చూపులు, చిలిపి చూపులు మారిపోయి, దయగల చూపులు చూస్తారు. అహంకార దృష్టి కూడా మారిపోతుంది. యెహోవాకు అసహ్యములైన వాటిలో అహంకార దృష్టి ఒకటి. తరువాత కల్లలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములును లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. - సామెతలు 6:16-19.
మాటలు చూపులు చేతలు నడకలు తిండి తిప్పలు వ్యవహారాలు అన్నీ మారి నూతనవౌతాయి. శరీరమే మనది కానీ ఏలేది క్రీస్తే. అలా మారిన వారిలో మార్పును చూసిన తల్లిదండ్రులు, ఆ యేసు మాకు కూడా కావాలని కోరుకున్నారు. నిజమే కదా తిని త్రాగి ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ కొట్లాటలు గొడవలు ఇంట్లో బయట చేస్తూ చూసిన వారిని కొడుతూ తిడుతూ ఉండే మనిషి మారితే ఆ ఇంట్లో వారికి ఎంత సంతోషముంటుంది. దానికి కారకులెవరో వెంటనే కనుగొని కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ మార్పు మనుషుల ద్వారా కానే కాదు. అయితే త్రాగుడు మానిపించవచ్చు. లేకపోతే గొడవలు కొట్లాటను మాన్పించవచ్చు. కానీ ప్రేమను మాత్రం పుట్టించలేరు. కోపం ఉంటే అవి పెరిగి పెరిగి పెద్దవై మరల మామూలు స్థితికి అంటే పాత జీవితానికే వస్తారు. అయితే పరిశుద్ధాత్మ శక్తితో మారితే ఆ మార్పులో పాత జీవితం పోయి నూతన జీవితం వస్తుంది. ప్రేమగల జీవితం మొదలౌతుంది. శత్రువులను సహితం ప్రేమించే మనసు ఉంటుంది. హింసించు వారి కొరకు ప్రార్థనలు చేయగలరు. కీడుకు ప్రతికీడు గాని దూషణకు ప్రతిదూషణమైన చేయరు. అందరి యెడల సమాధానముగా ఉంటూ మేలు చేయటానికే ప్రయత్నిస్తుంటారు. ఉన్నదానిలో చేయగలిగిన మేలు చేస్తూ ఇతరులపై ఆధారపడక దేవుని చిత్తానే్న నెరవేరుస్తారు. సొంత కార్యాలకన్నా దేవుని కార్యాల యందు ఎక్కువ మక్కువ ఉంటుంది. అలా పూర్తిగా మారినప్పుడే దేవుడు ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగించి అనేకుల రక్షణకు కారణవౌతాము. నరకము నుండి తప్పించగలము.
దేవుని శక్తితో మనలను పూర్తిగా తగ్గించుకుంటేనే ప్రభువు శక్తి పూర్తిగా మనలోకి వస్తుంది. అప్పుడే ఆయన ప్రేమ శక్తి మనలో నూటికి నూరుపాళ్లు ఉంటుంది. ఏ మాత్రం తగ్గినా, కల్తీ జరిగినట్లే. కల్తీ వస్తువులను మనమే వాడము. మరి దేవుడు వాడుకుంటాడని ఎలా చెప్పగలము. ప్రభువు కోసం తగ్గించుకున్నవారు గొప్పగొప్ప కార్యాలు, అద్భుతాలు చేశారు. దేవుని నమ్ముకుంటే వచ్చే ఈ మార్పు కోసం దేవునికి వందనాలు. మనమంతా ఆయన రూపులోనికి మార్చబడవలెనని ప్రభువు కోరిక, దీని కోసం ఆయన పడిన కష్టము అంత ఇంత అని చెప్పలేము. దేవునికి మనపైన ఉన్న ప్రేమ అపారమైనది. దాని ఎత్తు పొడవు వెడల్పును కొలువలేము. అంత గొప్ప ప్రేమతో నింపబడతాము గనుక పరిస్థితుల ప్రభావము మన మీద పడదు. ఎంత కష్టమైనా ఇబ్బందులైనా ఇరుకులైనా బాధలైనా హింసలైనా కరవైనా ఇక ఏదీ కూడా మన మీద ప్రభావము చూపలేవు.
మీరు అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయి ఉండగా దేవుడు మనలను క్రీస్తుతో కూడ బ్రతికించెను. పాపము చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొన్నారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సయితము మన యెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి యున్నారనియు, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి యున్నారు. అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని ఎఫెసీయులకు అపొస్తలుడైన పౌలు భక్తుడు వ్రాశాడు.
ఆదాము వరుసలో అందరు మృతి పొందవలసినదే. చూస్తూనే ఉన్నాము. అయితే మన పాపములను సిలువకు కొట్టి మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు వరుసలో అందరము బ్రతికింపబడుదుము. శరీరాను సారముగా ప్రవర్తిస్తే బాధపడవలసినదే. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల బ్రతుకుదురు.
జల ప్రళయం వల్ల మనస్సు మారలేదు, అగ్ని వల్ల మనసులు మారలేదు. కానీ క్రీస్తు మనస్సును ధరించుకొంటేనే మార్పు వస్తుంది. అప్పుడు మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాప జోలి ఉండదు. పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆట పాటలు త్రాగుబోతుల విందులు ఇక ఉండవు.
క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన దేవుని కుమారుల వౌతాము. క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందితే క్రీస్తును ధరించుకుంటాము. క్రీస్తుతో కూడ సిలువ వేయబడితేనే క్రీస్తు మనతో జీవిస్తాడు. విశ్వాసము ద్వారానే క్రీస్తు మన హృదయాలలో జీవిస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటేనే ఆయన యందు నిలిచి యున్నట్టు, మనమాయనలో (ఆయన మాటలలో) నిలిచి యుంటేనే, ఆయన మనలో నిలిచి ఉంటాడు.
క్రీస్తు మన హృదయములో ఉన్నాడంటే, ఆయన మాటలు మనలో ఉన్నట్టు, అప్పుడే ఆయన మనస్సును మనము కలిగి ఉంటాము. గనుక మన మాటలు చూపులు చేష్టలు ఆలోచనలు వ్యవహారాలు అన్నీ మారిపోయి నూతన పరచబడతాయి. నూతన స్వభావము వస్తుంది. అబద్ధాలుండవు. జారత్వము అపవిత్రత కాముకత్వము దురాశ విగ్రహారాధన అనే ధనాపేక్షలుండవు. సాధ్యమైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉంటాయి. మనసు మారి రూపాంతరము చెంది కొందరు అపొస్తలులుగా ప్రవక్తలుగా బోధకులుగా అద్భుతములు చేయువారిగా స్వస్థపరచు కృపావరములు గలవారిగా ఉపకారములు చేయు వారిగా ప్రభుత్వములు చేయువారిగా నానా భాషలు మాట్లాడేవారిగా అవుతారు. మనకిచ్చిన తలాంతులు నమ్మకముగా చేసి క్రీస్తు తోటి వారసులవౌతాము.
ఇలా క్రీస్తులో నూతన సృష్టిగా మారితేనే నూతన భూమి నూతన ఆకాశము లోనికి ప్రవేశించగలం.
మనము ఆయన వాగ్దానమును బట్టి కనిపెట్టే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లోనికి ప్రవేశించగలము. వాటి యందు నీతి నివసించును.
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును. జ్ఞాపకమునకు రావు - యెషయా 65:17
పాత జీవితములోనే ఉంటే మనము మరువబడుతాము. నూతన సృష్టిగా మారి ప్రభువైన క్రీస్తుతో నిత్యత్వంలో ఉండటానికి క్రొత్త భూమి క్రొత్త ఆకాశములోనికి ప్రవేశించుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.

- మద్దు పీటర్ 9490651256