ప్రార్థన

నేనెంతటి వాడను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ప్రభువా! యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? - 2 సమూయేలు 7:18.
గొఱ్ఱెల కాపరియైన దావీదును దేవుడు ఎన్నుకొని గొప్ప రాజుగా చేశాడు, అంతేకాదు నలు దిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేశాడు. తరువాత దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివసించుచున్న దావీదు, తన పూర్వపు స్థితిని జ్ఞాపకమునకు తెచ్చుకొన్నాడు. పశువుల కాపరిగా ఎండకు ఎండి వానకు తడిసి పొలములలోనే ఉండెడివాడు. తండ్రి అప్పగించిన పనిని ఎంతో నమ్మకముగా చేస్తూ ఉన్నాడు. ఈ దినాలలో పనులను నమ్మకముగా చేసేవారు కొదువయ్యారు. మనుషులు చూసేటప్పుడు ఒక పద్ధతి.. చూడనప్పుడు ఒక పద్ధతి. ఎవరూ చూడనప్పుడు ఎవరి ఇష్టం వారిది. ఎవరి కిష్టమైన ఛానెల్స్ వారికి, ఎవరికిష్టమైన ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్. ఎవరి ఇష్టం వారిది. కానీ దావీదు మాత్రము అలా లేడు. దేవుని స్తుతిస్తూ, తండ్రి అప్పగించిన పనిని మాత్రము నమ్మకముగా చేస్తూ ఉన్నాడు. మధ్యలో పిలిచి యుద్ధములో ఉన్న సహస్రాధిపతికి వేయించిన గోధుమలు ఒక తూముడు, పది రొట్టెలు, పది జున్నుగడ్డలు పంపి, అన్నల క్షేమము కనుగొని ఆనవాలు ఒకటి తీసుకురమ్మని పంపినప్పుడు, తండ్రి మాటను లక్ష్యపెట్టి యుద్ధ స్థలమునకు వెళ్లాడు. తండ్రి మాటను సన్మానించాడు. తండ్రి మాటకు విధేయుడై యుద్ధ్భూమికి వెళ్లటానికి వెనుకాడలేదు. మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానింపుమని ఆజ్ఞాపించిన దేవుడు గమనిస్తూనే ఉన్నాడు.
ఆ ఆజ్ఞ లోకమంతటికి గనుక మనలను కూడ గమనిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా లేదా, విధేయత చూపిస్తున్నామా లేదా అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఆజ్ఞతో కూడిన ధన్యత కనుక, ఆజ్ఞను పాటించే వారిని ఆశీర్వదించాలి గనుక గమనిస్తూనే ఉంటాడని గమనించాలి.
ఈ లోకంలో తల్లిదండ్రులను మోసం చేయవచ్చు, చెప్పిన పని కాకుండా ఏ సినిమాకో ఏ ఆటలకో వెళ్లి, చేయమన్న పని చేయకుండా వచ్చి, అబద్ధాలతో కప్పిపెట్టి తప్పించుకోవచ్చు. కానీ ప్రభువైతే ప్రతి సంగతి గమనిస్తూనే ఉంటాడు. వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి చూస్తూనే ఉంటాడు. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవచ్చు. కానీ ప్రభువు ఆడిన మాట తప్పడు కనుక చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త!
తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన ఆజ్ఞ వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రభువిచ్చిన ఆజ్ఞను మనము పాటిస్తున్నామా లేదా అని ఆయన కనిపెడుతూనే ఉంటాడు. ఏది చేస్తున్నా ఎప్పుడు చేస్తున్నా మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించాలి. ఏ పని చేసినా అది మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా చేయాలి. కొంతమంది పనులు చేస్తారు కానీ గొణుక్కుంటూ చేస్తారు. మార్కులు పడకపోవచ్చు. జాగ్రత్త! ఎలాగో చేస్తున్నారు గనుక విసుకుపడక కోపపడక గొణగక చేస్తే ఆశీర్వదం తప్పకుండా వస్తుంది.
దేవుని యందు విశ్వాసం లేనివారు మనుష్యులను మెప్పించే పద్ధతిలోనే ఉంటారు. మనుష్యులు మెచ్చుకోవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం ఉండదు. అదే పని, అన్ని గంటలు చేసినా మనుష్యులను మెప్పించేటట్టు చేస్తే మాత్రం ఉపయోగముండదు. మనుష్యులు చూసినా చూడకపోయినా అప్పగించిన పనులు చేస్తుంటే మాత్రం దేవుని ఆశీర్వాదం తప్పక దొరుకుతుంది.
అయితే దావీదు మాత్రం తండ్రి మాటకు విధేయుడై యుద్ధ్భూమికి రానే వచ్చాడు. ఇంకేముంది? సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్ధులై యున్నారు. సౌలు సైన్యము ఒకప్రక్క ఇశ్రాయేలీయులందరు ఇంకొక ప్రక్క ఏల లోయలో ఉన్నారు.
అయితే ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఆరు మూళ్ల జేనెడు ఎత్తు మనిషి, తలకు రాగి శిరస్త్రాణము, యుద్ధ కవచము ధరించెను. ఆ కవచు అయిదువేల తులముల రాగి ఎత్తు గలది. కాళ్లకు రాగి కవచము నుజముల మధ్య రాగి బల్లెముండెను. అతని ఈటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది. ఆ ఈటె కొన బరువు ఆరు వందల తలముల యినుము ఎత్తు గలది. వాడు సవాలు చేసి మీలో ఒకడు రండి. నేను ఒక్కడినే ఫిలిస్తీయుల పక్షమున వచ్చి యుద్ధము చేయుదమనెను.
సౌలు, అతని సైన్యము, బలాఢ్యుడైన గొల్యాతు ఆకారాన్ని చూచి బహు భయముతో ఉన్నారు కానీ దావీదు మాత్రము సైన్యముల కధిపతియగు యెహోవా ముందు ఓడిపోబోతున్న గొల్యాతును చూస్తున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని ముందు, జీవము గల దేవుని ముందు, దుమ్ము ధూళి వంటి వాడైన గొల్యాతును అతని ఓటమిని చూస్తున్నాడు. దావీదులో ఉన్న విశ్వాసము గొప్పది. తాను మందను కాయుచున్నప్పుడు సింహమును తరిమి చంపి, అది తీసికొని వెళ్తున్న గొఱ్ఱెను విడిపించిన సంగతి, ఎలుగుబంటిని చంపిన సంగతి జ్ఞాపకము చేసికొని, జీవముగల దేవుని తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిస్తీయుని కూడా వాటిలో ఒకదాని వలె చేయగలనని నమ్మాడు.
ప్రభువు చెప్పిన మాట ‘నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే’.
ఫిలిస్తీయుడు నమ్ముకున్నది తన సొంత బలాన్నీ, కత్తి ఈటె బల్లెమును. కానీ దావీదు నమ్ముకున్నది మాత్రము సైన్యముల కధిపతి యగు యెహోవాను. ఆయన పేరిట యుద్ధానికి నిలువబడి యున్నాడు. తన బలమైన నమ్మకమే తనకు విజయమిచ్చింది. వడిసెలతో విసరిన రాయి ఫిలిస్తీయుని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. వెంటనే దావీదు పరుగెత్తికొని పోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండ వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు శూరుడు చనిపోవుట చూచి పారిపోయిరి.
ఇప్పుడు కూడా సాతానుడు ఫిలిస్తీయుని ఆర్థిక రూపములో, అనారోగ్యం రూపములో, కష్టాల రూపములో నష్టాల రూపములో ఇంకా అనేక రకాలుగా రావచ్చు. అయినా జీవముగల దేవుని శక్తితో వాడిని విశ్వాసముతో కూల్చవచ్చును.
నిజముగా జీవముగల యెహోవా యందు విశ్వాసముంచిన వారిని ఆయన రక్షించి కాపాడుతాడు. సాతానుడు నాలుగు దిక్కులలో ఎటు నుండి వచ్చినా దేవుడు మనకు విజయమిస్తాడు. నెమ్మదినిస్తాడు.
దేవుని ఆజ్ఞను నమ్మి తండ్రిని గౌరవించిన దావీదు యుద్ధ్భూమిలో సైన్యముల కధిపతియగు యెహోవా మీద నమ్మకముతో యుద్ధ శూరుడైన గొల్యాతును హతమార్చి ఇశ్రాయేలీయులకు విజయాన్ని చేకూర్చాడు. దానికి ప్రతిఫలముగా దేవుడు తనను హెచ్చించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
గొఱ్ఱెలకాపరియైన దావీదు ఇప్పుడు ఇశ్రాయేలీయుల రాజై దేవదారు మ్రానుతో కట్టిన నగరిలో నివసించుచు, దేవుని మందసము డేరాలో ఉండుటకు ఇష్టపడక, దేవునికి ఒక మందిరము కట్టవలెనని ఆశ పడ్డాడు. దాని కొరకు ఆయన సమకూర్చిన బంగారమే రెండు లక్షల మణుగులు, పదికోట్ల మణుగుల వెండి, తూచ శక్యము గానంత ఇత్తడి, ఇనుము. చూడండి. తనను ఆశీర్వదించిన దేవునికి దావీదు సమకూర్చిన సామాగ్రి ఎంత ఉందో? దీనిని బట్టి దావీదు ఎంతగా దేవుని, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. నిజముగా దేవునికి కావలసినది మన హృదయము కానీ బంగారము వెండి ఇత్తడి ఇనుము కానేకాదు. పెద్దపెద్ద భవనాలు అసలే కాదు.
ఇంకొక సంగతి. తన ఆజ్ఞలు గైకొనిన వారిని, తన యందు విశ్వాసముంచే వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. సామాన్య కాపరిని రాజుగా చేయుట దేవుని దృష్టికి కొంచెమే. కానీ మానవులమగు మనకు అది ఊహించని పరిణామము. ఊహకందవు కూడా. ఆయన యందలి విశ్వాసముతో ఆజ్ఞలను అనుసరించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. భద్రపరుస్తాడు. కాపాడుతాడు. కునుకక నిద్రపోక కంటికి రెప్పవలె కాపాడుతూనే ఉంటాడు. ఈ లోకములో హెచ్చించటమే కాదు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆయన రాజ్యంలో మనకు స్థానమిస్తాడు. ఆయన రాజ్యము ఉన్నత రాజ్యము. నీతి సంతోషము సమాధానములు ఆ పరిశుద్ధ రాజ్యములో ఉంటాయి. యుగయుగాలు తరతరాలు ఆయనతోనే ఉందుము. ఆయన ఉచితమైన కృపా బాహుళ్యము ఆయన మారని ప్రేమ మనలను అంతగా హెచ్చిస్తుంది. ఆయన రాజ్యాన్ని చిన్నబిడ్డ వలె మనము అంగీకరించాలి. లేకుంటే మనకు ఆయన రాజ్యములో ప్రవేశముండదు. ఆయన రాజ్య విషయములో ఈ లోక జ్ఞానము తెలివి వాడకూడదు. పసిబిడ్డల వంటి మనస్తత్వము కలిగి ఉండాలి. తండ్రిని పసిపిల్లవాడు ఎంతగా నమ్ముతాడో అటువంటి పూర్తి నమ్మకము దేవుని యెడల కలిగి ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవారై నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 14:20లో చెప్పినట్లు బుద్ధి విషయమై పసి పిల్లలుగా ఉండకూడదు, కారణము క్రీస్తును అంగీకరించుట వలన సర్వజ్ఞానియైన దేవునికి కుమారులవౌతాము గనుక దైవజ్ఞానము కలిగి ఉండాలి. అయితే దుష్టత్వ విషయములో శిశువులుగా ఉండాలి. శిశువులు దేవుడిచ్చిన బహుమానము. అంటే పరిశుద్ధమైనటు వంటి మనస్సు గలవారు. కోపం, ద్వేషం, అసూయ, మోసం ఇంకా ఇలాంటి విషయాలు ఎరుగనటువంటి వారు. ఎవరైనా కొట్టినా, తిట్టినా నా స్నేహితుడు కొట్టాడు అని చెప్తాడు కానీ వెంటనే వాడిని మరిచిపోయి దూరము పెట్టడు. నొప్పి తగ్గే కొలదీ తిరిగి స్నేహితుని దగ్గరకు వెళ్తాడు. అది పిల్లల మనస్తత్వం. పెద్దలైతే చిన్న పొరపాటు అక్క చెల్లి చేసినా అన్న తమ్ముడు చేసినా తిరిగి జీవిత పర్యంతము వారితో మాట్లాడరు. చూడరు. కలవరు. అందుకే పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి అర్హులని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇటువంటి విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవుని శక్తిని పూర్తిగా నమ్మాడు. గొల్యాతు దేవుని ముందు ఒక గడ్డిపువ్వ వంటి వాడేనని గ్రహించి, గొప్ప దేవుని వైపు చూస్తూ గొల్యాతు మీద యుద్ధానికి వెళ్లి ఓడించగలిగాడు.
దావీదుకున్న విశ్వాసము మనకు కూడా ఉంటే అది ఆశీర్వాదము. చాలామంది దేవుని యందు విశ్వాసముందని వారికి వారనుకుంటున్నారు. గొల్యాతు లాంటి సమస్యలు చిక్కులు అవమానాలు నిందలు దూషణలు ఆర్థిక ఇబ్బందులు వస్తే విశ్వాసములో నిలువక పడిపోతారు. విశ్వాసికి గొల్యాతు లాంటి సమస్యలు రావచ్చు. పోతిఫర్ భార్య రూపములో శోధనలు రావచ్చు. పౌలు లాగ చెరసాల అనుభవము, ఆకలిదప్పులతో కూడినటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు. అన్నింటిలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దావీదు తన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని ఆశీర్వాదము ఊహించలేనన్ని పొందుకున్నాడు. తన మట్టుకే కాదు తన సంతతి మీద కూడా ఆశీర్వదముంచి వారిని కూడా హెచ్చించి, వారి రాజ్యాన్ని స్థిరపరచుతానని, నిత్యముగా స్థిరపరచెదనని వాగ్దానాన్ని పొందుకున్నాడు. నేనతనికి తండ్రినై యుందును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గానీ నిన్ను స్థాపించుటకై కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను - 2 సమూయేలు 7:14-15
ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఆ వంశము నుండి లోకరక్షకుడు జన్మించే ఆధిక్యతను కూడా ఇచ్చాడు. దావీదు విశ్వాసమును బట్టి చేసిన కార్యాలకు ప్రతిఫలముగా అనేక తరాలకు అశీర్వాదముగా ఉన్నాడు. దావీదు చేసిన ప్రార్థనను అంగీకరించాడు.
యెహోవా నా ప్రభువా మేలు దయ చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయ చేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చుచున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక - 2 సమూయేలు 7:28-29.
ఇలా నిత్యమైన ఆశీర్వాదము మనకు కూడా ఇవ్వాలని, మనలను మన సంతానాన్ని కూడా హెచ్చించి ఉన్నత స్థితిలో ఉంచాలని ప్రభువు ఆశ. మనలను హెచ్చించటానికి ఉన్నత స్థలములో ఉంచటానికే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. అయితే అవి ఊరకనే రావు. ప్రభువు నందు విశ్వాసముంచాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. దావీదు వలె ప్రభువును స్తుతించాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. దేవుని హృదయానుసారుడని దావీదు ఎలా అనిపించుకున్నాడో అలాంటి జీవితం మనము కూడా జీవించాలి. అప్పుడు ఊహించలేనంత ఉన్నత స్థితికి మనలను కూడ హెచ్చిస్తాడు. రాజుగా చేయుట, దేవుని దృష్టికి పెద్ద పని కాదు. పక్షిరాజు వంటి యవ్వనాన్ని ఇవ్వటం మనలను నూతన పరచటం మన కోరికలను తీర్చటం ప్రభువుకు పెద్ద పని కాదు.
నీ నుంచి నీ సంతతికి కూడా వేయి తరాల వరకు కృప చూపే దేవుడు. అల్పులమైన మనలను అత్యున్నతుడైన దేవుడు ఎన్నుకొని ఉన్నత స్థితికి హెచ్చించుటకై కావలసిన విశ్వాసాన్నీ విశ్వాసానికి కర్త.. దానిని కొనసాగించువాడునైన ప్రభువు మనకందరికీ అనుగ్రహించునుగాక.
దావీదు ఇంతగా హెచ్చించబడటానికి అంటే గొఱ్ఱెల కాపరి నుండి రాజుగా హెచ్చింపబడటానికి మొదటి కారణం తండ్రి మాటకు విధేయుడవ్వటమే.
తండ్రికి విధేయత అంటే దేవుని ఆజ్ఞకు లోబడుటయే.

- మద్దు పీటర్ 9490651256