ప్రసాదం

పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ తెలిసినవాడు దేవుడు. అన్నీ తెలుసు అనుకునేవాడు జీవుడు. అహం బ్రహ్మాస్మి దేవుడు. అహం బ్రహ్మాస్మి అనుకునేవాడు జీవుడు. బంధనాల్లో ఇరుక్కునేవాడు జీవుడు. భవబంధాలు లేనివాడు దేవుడు. అన్నింటా తానై ఉండేవాడు దేవుడు. అన్నీ తానే అనుకునేవాడు జీవుడు. మోహింపబడేవాడు దేవుడు. మోహంలో ఉండేవాడు జీవుడు. విశ్వ పరిరక్షకుడు దేవుడు. విషయలోలత్వంతో ఊగేవాడు జీవుడు. ఉర్రూతలూగేవాడు జీవుడు. ఉర్విని ఉర్రూతలూగించేవాడు దేవుడు. అనంత కరుణాంతరంగుడు దేవుడు. అరిషడ్వర్గాలతో ఉక్కిరిబిక్కిరయ్యేవాడు జీవుడు. దీనభక్త పరాయణుడు దేవుడు. దీనత్వంతో దేబిరించేవాడు జీవుడు. మనసు దోచేవాడు దేవుడు. మనసు చేసే మాయలో పడేవాడు జీవుడు. ఊగిసలాడేవాడు జీవుడు. ఉర్విజనులను ఉద్ధరించేవాడు రూప రహితుడు దేవుడు. రూప మోహితుడు జీవుడు. ఊగించేవాడు దేవుడు. ఊయలలా ఊగేవాడు జీవుడు. కళ్యాణమూర్తి దేవుడు. కల్లోలమూర్తి జీవుడు. షిరిడీ సాయినాథుడు సశరీరుడై వున్న రోజులవి. శ్యామా అనే భక్తుడుండేవాడు. షిరిడీ సాయినాథునికి సహాయకుడిగా ఉండేవాడు. షిరిడీ సాయినాథుడ్ని సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించినవాడు. ఆరాధిస్తున్నవాడు శ్యామా. శ్యామాకి సర్వం సాయినాథుడే. షిరిడీ సాయినాథుడు ప్రతివారిని రెండు అడిగేవాడు. ఒకటి శద్ధ (విశ్వాసం) రెండు సబూరీ (ఓర్పు). ఇంకేమీ ఎవరినీ అడిగేవారు కాదు. భక్తులు కూడా రెండింటి ప్రతీకగా రెండు రూపాయలు ఇచ్చేవారు. ఇప్పటికీ ఆ రకంగా ఇస్తుంటారు భక్తులు. అది ఆనవాయితీ. అదేవిధంగా ఓ రోజు పోస్ట్‌మెన్ సాయినాథుడికి మనీఆర్డర్ రెండు రూపాయలు వచ్చిందని సాయినాథునికోసం వచ్చేడు. ఆ సమయాన షిరిడీ సాయినాథుడు అక్కడ లేరు. పోస్ట్‌మెన్ ఆలోచించేడు. శ్యామా గురించి తెలిసినవాడుకాబట్టి, మళ్లీ తను రావాల్సిన అవసరం లేకుండా శ్యామా సంతకం తీసుకుని ఆ రెండు రూపాయల్ని శ్యామాకి ఇచ్చేసాడు, సాయినాథుడు రాగానే ఇచ్చేయమని చెప్పి. శ్యామా రెండు రూపాయలు తీసుకున్నాడు. పోస్ట్‌మెన్ వెళ్లిన తరువాత శ్యామాకు ఓ ఆలోచన వచ్చింది. రెండు రూపాయల మనీ ఆర్డర్ సంగతి నాకు నేనుగా బాబాకి చెప్పను. అతను భగవంతుడు కదా, మనీఆర్డర్ సంగతి తెలుస్తుంది. అడగలేదనుకో, తెలుసుకోలేదనుకో బాబా సంగతి తేలిపోతుంది. భగవంతుడో కాదో ఈ ఘటనతో తెలుస్తుంది. ఎంత విశ్వాసంవున్నా ఓ చిన్న సందేహం శ్యామాకి రాగా ఆ నిర్ణయానికి వచ్చేడు. చేతిలో వున్న రెండు రూపాయల్ని ప్రక్కనున్న స్థలంలో పాతిపెట్టేసాడు. సాయినాథుడు వచ్చి అడిగితే ఇద్దామని, లేకపోతే ఇవ్వనుగాక ఇవ్వను. అని అనుకున్నాడు శ్యామా. సాయినాథుడు రానే వచ్చాడు. ఈ మాట ఆ మాట మాట్లాడేరు కానీ మనీఆర్డర్ సంగతి అడగలేదు, శ్యామా కూడా చెప్పలేదు. మర్నాడు కూడా అన్ని విషయాలు శ్యామాతో బాబా మాట్లాడేడుగానీ రెండు రూపాయల సంగతి బాబా అడగలేదు, శ్యామా చెప్పనూ లేదు. వారం గడిచింది రోజులు గడుస్తున్నాయి. బాబా రెండు రూపాయల ఊసే ఎత్తడంలేదు. శ్యామాకి ఎక్కడో అనుమానం ఎక్కువవుతోంది. ఆందోళన పడుతున్నాడు. ఓ వైపు విశ్వాసం, మరోవైపు పెరుగుతున్న అనుమానంతో అనుక్షణం మదన పడుతున్నాడు శ్యామా. నెల అయ్యింది. ఆయన అడగలేదు. శ్యామా చెప్పలేదు. నెలలు గడుస్తున్నాయి కానీ రెండు రూపాయల విషయ ప్రస్తావనే తేవడంలేదు బాబా. ఆరు నెలలైంది. ‘ఈయన భగవంతుడేనా?’ అనే సందేహం శ్యామాని పీడిస్తోంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు రాత్రి శ్యామా ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయేరు. శ్యామా పెళ్లాం పిల్లలూ కట్టుబట్టలతో మిగిలేరు. భోరున ఏడుస్తున్నారు శ్యామా కుటుంబమంతా. శ్యామా దుఃఖానికి అంతే లేదు. మెల్లగా తెల తెల్లవారుతోంది. వెంటనే శ్యామా బాబా దగ్గరికి పరుగు పరుగున వచ్చేడు. బోరు బోరున ఏడుస్తూన్నాడు. జరిగినదంతా బాబాకి చెప్పుకుంటున్నాడు. కంటికీ మంటికీ ఏకధారన ఏడుస్తున్నాడు. ‘‘బాబా నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు బాబా. ఉన్నదంతా దోచేసారు. పెళ్లాం పిల్లలం అందరం కట్టుబట్టల్తో మిగిలేం బాబా! మీరే ఏదో ఒకటి చేయాలి. మీరే దిక్కు బాబా.. మీరే దిక్కు!’’ అని ప్రార్థిస్తున్నాడు శ్యామా. ప్రాధేయపడుతున్నాడు. బాబా కాళ్ళమీద పడ్డాడు. బాబా ఏం మాట్లాడటంలేదు. బాబా కాళ్ళు పట్టుకుని అతి దీనంగా ఏదో ఒకటి చేసి ఈ కష్టం నుంచి గట్టెక్కించండి బాబా అని మరీ మరీ బతిమాలుతున్నాడు శ్యామా. బాబా అంతా చూస్తున్నారు. శ్యామా కాళ్ళా వేళ్లా పడుతున్నాడు. అప్పుడన్నారు సాయినాథుడు శ్యామాతో- ‘‘చూడు శ్యామా! మీ ఇంటిలో దొంగలు పడి అంతా దోచుకుపోతే, నీ బాధ చెప్పుకోవడానికి, ఏడ్చుకోవడానికి నేనున్నాను శ్యామా. ఆర్నెల్ల క్రితం నా రెండు రూపాయలు ఒకడు దొంగిలించేడు. నేనెవరితో చెప్పుకోవాలి? నా బాధను చెప్పుకోవడానికి నాకెవరు ఉన్నారు శ్యామా!’’ సూటిగా అసలు విషయం సమయం చూచి బైటపెట్టేరు బాబా. శ్యామా బుర్ర గిర్రున తిరిగింది. శ్యామాకి అవగతమైంది. ‘‘క్షమించండి బాబా’ కన్నీరు పర్యంతమయ్యేడు శ్యామా. పశ్చాత్తాపపడ్డాడు.
అపరాధం మన్నించమన్నాడు శ్యామా. మనం చేసే పరీక్షలకు భగవంతుడు లొంగడు. నిజానికి భగవంతుడ్ని పరీక్ష చేసే పరికరాలు మన దగ్గర లేవు. మన కొలతలకి కొలమానాలాకి అతడు అతీతంగా ఉంటాడు. పరిశోధనలకి ప్రయోగాలకి అందనంత ఎత్తులో ఉంటాడు. దొరకనంత దూరంగా ఉంటాడు. అతడ్ని పట్టుకోగలిగిది, పట్టి ఉంచేది, బంధించేది, బంధన చేసేది భక్తి ఒక్కటే. భక్తిని పెంచుకుందాం. భగవంతుణ్ణి బంధించుకుందాం. బంధనలనుండి విముక్తులవుదాం.
*

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669