అమృత వర్షిణి

ఆకాశవీణపై ఉదయ రాగం (అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటకు ఎంత శక్తి ఉందో, శబ్దానికీ అంత శక్తీ ఉంటుంది. లేకపోతే నోరు లేని వాద్యాలకు చోటెక్కడ? సాహిత్యాన్ని అర్థం చేసుకుంటాం. సంగీతం ఆనందిస్తాం. సాహిత్యానికి అర్థం చెప్పగలిగినంత తేలికగా సంగీతాన్ని వివరించి చెప్పటం కష్టం. ఎవరి కంఠాల్లో స్వరాలు ఎటువంటి విన్యాసాలతో ఆనందాన్నిస్తాయో, ఎవరూ చెప్పలేరు. అందుకే మాటల ద్వారా చెప్పలేని విషయాన్ని, సంగీతం చెప్పేసి పూర్తి చేస్తుంది - గాయకులైనా, వాదకులైనా సంగీత మాధ్యమం ద్వారానే, మనతో మాట్లాడతారు. మనుషులు సంగీత మాధుర్యానికి లొంగినంత తేలికగా మాటలకు లొంగరు. త్యాగరాజాది వాగ్గేయకారులకు ‘రాగదేవతలు’ ఎదురుగా ప్రచ్ఛన్న రూపంతో వచ్చి నిలబడ్డాయి. వాటి వెనక మాటలు చేతులు కట్టుకుని నిలబడ్డాయి. ఆయన మనసులో, చెప్పదలచుకున్న విషయాలన్నీ శిష్యులకు అర్థమై పోయాయి. మాటల వెనక వున్న స్వరాలను పట్టుకున్నారు. మరో శిష్యుడు మాటలను గుర్తు పెట్టుకున్నాడు.
కావేరి ఒడ్డుకు చేరారు - కూడబలుక్కుని కీర్తన తయారుచేసి, గురువుగారికి వినిపించారు. ఆయన కీర్తనలన్నీ ఇంచుమించుగా అలా వచ్చినవే. సాహిత్యంతో ముడిపడ్డది గాత్ర సంగీతం.
అయితే, గాత్ర సంగీతమంత శక్తివంతంగా, వాద్య సంగీతం ఆకర్షిస్తుందా? సాహిత్యంతో కలిసిన సంగీతంలా, సాహిత్యం ఆసరా లేని, వాద్య సంగీతం శ్రోతకు దగ్గరగా వెళ్లి అతని హృదయాన్ని తట్టుతుందా? పలకరిస్తుందా?
తీవ్రమైన ఉద్రేకాలు, ఉద్వేగాలు ‘నాదం’ ద్వారా వ్యక్తమైనట్లుగా, అంత శక్తివంతంగా, శబ్దం వల్ల కావేమో’ అని చెబుతూ, సుప్రసిద్ధ సంగీత ప్రయోక్త పాలగుమ్మి విశ్వనాథంగారు ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేశారు. ‘బిథొలెన్’ గొప్ప కంపోజర్. ఆయన స్నేహితురాలైన బార్‌నెస్ ఎస్ట్‌మెన్ కుమారుడు మరణిస్తాడు. బిథొలెన్ ఆమె ఇంటికి వెళ్లి కాస్సేపు పరామర్శించి, ‘రా! ఇంటికి రా! మనం సంగీతంతో మాట్లాడుకుందాం!’ అని ఆహ్వానించాడు. తర్వాత గంటసేపు పియానో దగ్గర కూర్చుని ఏమేమో ఆమెకు ప్రశాంతంగా వినిపించసాగాడు. విన్న వెంటనే, వౌనంగా ఆమె ఇంటికి తిరిగి వచ్చి, తన స్నేహితులను కూర్చోబెట్టి, ‘ఆయన నాతో ఎంతో మాట్లాడాడు. చివరకు ఆయన దగ్గర కూర్చోగానే శాంతి లభించింది. ఊరట చెందాను’ అంది.
మరో సంఘటన చెప్పారు. బిథొవెన్ ఓసారి పియానో దగ్గర కూర్చుని సంగీత రచన చేసుకుంటున్నాడు. ఇంతలో ఎవరో స్నేహితులు వచ్చారు. వాళ్లని చూసి ‘బీతొవెన్’ సంగీత రచన చేసిన నొటేషన్ కాగితాల్ని మూసేసి, పియానో మీద ఆ వ్రాసిన సంగీతం వాయించి ‘దీనివల్ల మీకు ఎటువంటి అనుభూతి కల్గుతోంది’ అని అడిగాడట. ‘ఇద్దరు ప్రేమికులు కలుసుకుని తిరిగి ఎడబాటు పొందినట్లుంది’ అని అందరూ ముక్తకంఠంతో చెప్పారట.
వెంటనే ‘బితొవెన్’ మూసి పెట్టి ఉంచిన, తాను తయారుచేసిన నొటేషన్ కాగితం వాళ్లకు చూపించాడు. దాని టైటిల్ ‘రోమియో అండ్ జూలియట్’ అని రాసి ఉంది. దీన్నిబట్టి మాటకు ఎంత శక్తి ఉందో, నాదానికీ అంత శక్తీ ఉన్నట్లేగా?
మరో సందర్భంలో సంగీత కళానిధి డా.పినాకపాణి గారితో ముచ్చటిస్తున్నప్పుడు, సుస్వరంతో నిండిన నాదానుభూతి మనిషిని ఎలా కదిలించేస్తుందో చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వయొలిన్ కళాకారుడు యహుదీ మెనుహిన్ పేరు తెలుసు గదా!
యుద్ధ భూమిలో ప్రాణాలతో బయటపడి, గాయాల పాలైన యుద్ధ సైనికులందరూ వున్న శిబిరాలకు వెళ్లి, వారికి సంగీతంతో మానసిక ప్రశాంతత కలిగించేందుకు, యహుదీని పంపించారు.
మృత్యుముఖంలో నుండి అదృష్టవశాత్తూ బయటపడినా వారిలో ఆందోళన ఇంకా పోలేదు. ఆ బీభత్స దృశ్యాలు నిరాశా నిస్పృహలావరించి, విచ్చలవిడిగా, వికృతంగా పరుగెత్తే సైనికులూ, వారి కళ్లలో ఇంకా మెదుల్తూనే ఉన్నారు. ఆ దృశ్యాలు వారిని వదల్లేదు. అప్పుడు యహుదీ బాగా ఆలోచించాడు. ఆ పరిస్థితిలో వున్నవారికి ఎటువంటి సంగీతం వినిపించాలి, సింఫొనీ వినిపించాలా? వారు అందుకోగలిగేట్లుగా ఏదో సామాన్యమైన సంగీతం వినిపిస్తే చాలునా?
ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి, చివరకు అత్యంత క్లిష్టమైన వాద్యబృంద రచన ఒకటి కంపోజ్ చేసి, ఓ ఇరవై నిమిషాల సేపు వినిపించాడు. అది వింటూ, లేవలేని స్థితిలో వున్న ఒక సైనికుడు అమాంతం మంచం మీద నుండి లేచి వచ్చి యహుదీని కౌగిలించుకుని భోరున ఏడ్చేశాడు.
‘సార్! నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. నాలోని ఆవేదన మాయమైంది. ఏవేవో ఆనందలోకాల్లో విహరిస్తున్నట్లు అనిపిస్తోంది నాకు’ అన్నాడు.
‘దటీజ్ మ్యూజిక్ థెరపీ’. నాదంలో అంత శక్తి ఉంది. ఈ వేళ పాశ్చాత్య సంగీతంలో గాత్ర సంగీతానికీ, వాద్య సంగీతానికీ విడివిడి మార్గాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు మనలాగే వారికీ ‘మెలొడీ’ పద్ధతి సంగీతం ఉంది. ఆ తర్వాత ‘హార్మొనీ’ అనే కొత్త మార్గం తొక్కింది.
ఒక స్వరం తర్వాత ఒక స్వరం కాకుండా, కొన్ని స్వర సముదాయాలను (ఫ్రేజెస్) ఒకేసారి పలికించే పద్ధతి రావడంతో వాయిద్యాల ప్రాముఖ్యత పెరిగింది. కొత్తకొత్త వాద్యాలూ ఆవిర్భవించాయి.
‘సింఫొనీ, సొనాటా’ లాంటి రచనలు ఆవిర్భవించాయి. ఒక్కో వాద్య సమ్మేళనంలో 80 నుంచి 100, 150 వాద్యాలతో ఆర్కెస్ట్రా రూపకల్పన చేస్తున్నారు.
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఓ వాద్యబృందం ఉంది. ఒకప్పుడు గాత్ర సంగీతంతోబాటు, వాద్య సంగీత రచనలు కూడా ప్రసారమయ్యేవి. కొన్నికొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ వాద్య బృంద రచనలు ఎంతో ఆకర్షణీయంగా రూపొందించబడేవి. రేడియో కేంద్రాల నుండి తరచూ వాద్య బృంద రచనలు ప్రసారమవుతూ ఉండేవి. అదంతా గతకాలం - ఇప్పుడు ప్రసార యోగ్యంగా ఉన్నాయో లేదో తెలియదు. బలవంతంగా కూర్చోబెట్టి ఈ వేళ టీవీ సీరియల్స్‌లో వినిపించే నేపథ్య సంగీతానికి, దశ, దిశ లేదు- అర్థం, పరమార్థం, రెండూ లేవు.
ప్రసార మాధ్యమాలలో ఆకాశవాణికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రేడియో ఆవిర్భావంతో, సమాజ స్వరూపమే మారిపోయింది. పల్లెపల్లెకూ సమాచారాన్ని చేరవేయటం సంగీతం వంటి కళలను, కళాకారులను ప్రోత్సహించటంలో ఆకాశవాణి పాత్ర ఎంతో ఉంది. బ్రిటిషు పరిపాలనలో దక్షిణ భారతానికంతకూ అవిభక్త రాష్ట్రానికి రాజధానైన మద్రాసు ఒకటే. అప్పట్లో ప్రారంభమైన రేడియో కేంద్రం (1938 జూన్ 16) 1939లో తిరుచ్చిరాపల్లి కేంద్రం ప్రారంభమైంది. తిరుచ్చి కేంద్రంలో కేవలం తమిళ కార్యక్రమాలే వుండేవి. కాని మద్రాసు నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం - ఈ నాలుగు భాషా ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించే కార్యక్రమాలు రూపొందించబడి ప్రసారమవుతూ ఉండేవి.
1944వ సం.లో ప్రోగ్రాం ఆఫీసర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డా.బాలాంత్రపు రజనీకాంతరావు రేడియో మాధ్యమానికి, మూల పురుషుడు. ఆయన మన తెలుగువాడై త్రివిక్రముడై రాజిల్లిన వ్యక్తి. ఆకాశవాణి వైభవానికి వనె్నలద్దిన ఒక మహాకాంతి మేఘం. ఒక నిరంతర స్వరఝరీ ప్రవాహం. రజని, మూర్త్భీవించిన ఒక శబ్ద రూపం.
రేడియోని ఉద్ధరించటానికే పుట్టిన వ్యక్తి. రేడియో స్థాయిని ఉత్తుంగ శిఖరాల మీద పెట్టి ఈ మాధ్యమానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చి మన మధ్యలో వుంటూ, శత వసంతాల వెలుగులో, ప్రశాంతంగా కాలం గడుపుతున్న ప్రతిభామూర్తి.
ఆ రోజులలో ఆర్.వైద్యనాథన్ అనే జెమినీ స్టూడియోలో పనిచేసే సంగీత ప్రయోక్త ఎస్.బాలచందర్ (వీణ) నారాయణయ్యర్, రజని, పెషావర్ నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ వంటి విద్వాంసులను, కళాకారులను స్టూడియోకు పిలిచి పాత సంగీత వరుసలలో కొత్తదనం ఎలా తీసుకురావచ్చు? పంజాబీ వరుసలలో కొన్నిటికి కొత్త మెరుపులు జోడిస్తే ఆకర్షణీయమైన పాటలు ఎలా సృష్టించవచ్చు? ఇలాంటి కార్యక్రమాలతోబాటు ఈమని శంకర శాస్ర్తీ ఐదు వీణలతో చేసిన ‘ఆదర్శ శిఖరారోహణం’ మరువరానిదీ - చాలా పేరు పొందినదీను. అక్షరాలేమీ లేకుండా, వాద్యగోష్ఠితో, భావరూప కల్పనా, కథా కల్పనా వంటి ప్రయోగాలు చేశారు. విజయవాడ రేడియో కేంద్రంలో నాతో ఉద్యోగం చేసే ఎస్.బి.శ్రీరామమూర్తి అనే ఎనౌన్సర్, సృజనాత్మక కార్యక్రమాలు, ఎన్నో రూపొందించి, జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించిన వ్యక్తి ‘నీలినీడలు’ అనే రూపకాన్ని రూపొందించాడు. నేపథ్య సంగీతం జీవిత రేఖలను ఎలా ప్రతిబింబిస్తుందో చూపించిన మేథావి.
1980-90 సం.ల మధ్య ప్రసారమైన ఆ రూపకానికి ఆకాశవాణి జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. అందులో నా పాత్ర కూడా ఉంది. ఆకాశవాణి వాద్య బృందంలో వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్ర్తీ, ఎం.వై.కామశాస్ర్తీ, పండిట్ రవిశంకర్, పన్నాలాల్ ఘోష్ వంటి ఎందరో హేమాహేమీలు స్వరపరచిన సృజనాత్మక వాద్య బృంద సంగీతం ఎంతో కీర్తిని సంపాదించుకుంది.
ఒకప్పుడు ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియాలో ప్రసిద్ధుడైన సంగీత ప్రయోక్త, విజయరాఘవరావు, అందించిన వాద్య బృంద రచనలన్నీ సర్వజనాదరణ పొందినవే. ఈయన కూడా మన తెలుగువాడే. సినిమా హాళ్లలో 1950-60 సం.లలో సినిమా షోలకు, ముందు ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్ రీల్ చూపిస్తూ ఉండేవారు. సమకాలీన వార్తా వ్యాఖ్యలతో దేశానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం పదిహేను నిమిషాలలో చూపించేవారు. నేపథ్యంలో వాద్య బృందం హాయిగా, ఆహ్లాదంగా వినిపిస్తూ ఉండేది. జాతీయ స్థాయిలో జరిగే క్రీడల కోసం కూడా వాద్య బృంద రచనలు ప్రత్యేకంగా రూపొందించే వారు. మన ఆకాశవాణి కేంద్రాలన్నీ ఒక మధురమైన సంగీత ధ్వనితో ప్రారంభమవుతూంటాయి. గమనించే ఉంటారు. దాన్ని సిగ్నేచర్ ట్యూన్ అంటారు. వందేమాతరం గీతానికి ముందు ఈ ట్యూన్ 2 నిమిషాల సేపు వినిపిస్తుంది. తర్వాత ఆయా కేంద్రాలు ఏయే ధ్వని తరంగాలపై ప్రసారమవుతున్నాయో చెప్తారు (వేవ్ లెంగ్త్).
ఈ సిగ్నేచర్ ట్యూన్ రూపశిల్పి సెచ్‌మన్ వాల్టర్ కాఫ్‌మన్. 1934లో నాజీల నుండి ఇండియా చేరిన యూదు శరణార్థులలో ఒకడు. మన భారతీయ సంగీతానికి ఆకర్షితుడై, ఆకాశవాణి డైరెక్టర్ అయ్యాడు. 14 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. తంబురా నాదంతో వయొలిన్‌పై వినబడే ఈ ట్యూన్ ‘శివరంజని’ రాగంలో కాఫ్‌మన్ కంపోజ్ చేశాడు. విషాద రాగాలలో శివరంజని ఒకటి. ‘బహారోఁ ఫూల్ బర్‌సావో’ వినే వుంటారు. అత్యంత ఆహ్లాదకరమైన సన్నివేశానికి శంకర్ జైకిషన్ 1966లో ‘సూరజ్’ చిత్రానికి చేసిన పాట మహ్మద్ రఫీ పాడారు. అప్పట్లో ఆ పాట గొప్ప హిట్ సాంగ్. ‘మూడ్’ని నిర్ణయించేవి అనుభూతులు, ఆలోచనలు. వాటికి సాకారంగా నిలిచేవి రాగాలు’ అని చెప్పేందుకు సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలివి.
గలగలపారే సెలయేళ్లూ, పచ్చని చెట్లు, పురివిప్పి ఆడే నెమళ్లు, ఇలా చుట్టూ అందాలన్నీ పరచుకుని మనసుని దోచే సన్నివేశానికి, విషాద ఛాయలతో కూడిన ‘శివరంజని’లో పాట చేసి, కృతకృత్యులయ్యారు. ఆ పాట, సంస్కారవంతులైన వారి చెవులకే చేరింది. ఆ ప్రయోగానికి ఆనందించారు. అదీ.. నిజమైన సంగీతం. హృదయాన్ని చేరిన సంగీతం. ‘కనగలిగే మనసుంటే, వినగలిగే చెవులుంటే’ ఇటువంటి సంగీతమే అజరామరమై నిలిచిపోతుంది.
ఆకాశవాణిలో 1936 సం. జులై నుంచి నిర్విరామంగా ఇదే సిగ్నేచర్ ట్యూన్ ప్రసారమవుతూ ఎన్ని మారుతూ వచ్చినా, దీనికి మాత్రం ఏ మార్పు లేదు.
గా;; రిస దా;; రిసదపా;; దసదపా;; వయొలిన్‌పై వినబడే స్వరాలివే - రేడియో కేంద్రాల పుట్టుక నుండి 80 ఏళ్లకు పైగా ఇదే ట్యూన్.
పియానో వాయిస్తున్న కాఫ్‌మన్, సెల్లోపై, ఎడిగో వర్గా, వయొలిన్‌పై ఈ ట్యూన్ వినిపిస్తున్న మెహతాను (ప్రసిద్ధ వాద్య బృంద ప్రయోక్త జుబెన్ మెహతా తండ్రి) చూడవచ్చు.
పాశ్చాత్య దేశాల సంగీతం వొంటబట్టించుకుని భారతీయ సంగీతం మీద మోజుతో భారతదేశ పర్యటనకు వచ్చి, ఇక్కడ ఉభయ సంగీత సంప్రదాయాలను అవగాహన చేసుకుని, అనేక వాద్య బృంద రచనలు ప్రదర్శించిన మేధావి - ప్రయోగాత్మక సంగీత రచనలు చేయటంలో ప్రత్యేకతను సంతరించుకున్న ఈయన, ఫిల్మ్స్ డివిజన్ కోసం వాద్య బృంద రచనలు చేశారు.
భారతీయ సంగీతం ఆత్మ, ఇక్కడ వాగ్గేయకారులలో ప్రతిధ్వనిస్తుంది. ఎన్ని జన్మలకైనా భారతావనిలో పుట్టాలి’ అనేవాడంటే, అతని సంస్కారానికి జోహార్లు అర్పించాలి. పాశ్చాత్యుల దృష్టిలో సన్మార్గం అంటే బహిరంగంగా కంటికి కనిపించే బాహ్య ప్రవర్తన. దీనికి భిన్నంగా ఉండేది భారతీయ మనస్తత్వం. మన నాగరికత, మన సంస్కృతి, మన సంగీతం, అన్నీ ఆత్మను ప్రబోధించేవే. కాఫ్‌మన్‌కు నచ్చినది ఇదే. భోగ భూమి వదిలి కర్మభూమిలో, మన భారతీయ సంగీత వైభవానికి ఆయనిచ్చిన కితాబు.
భారతీయ సంగీతం, రకరకాల బాణీలు, దేశంలో విస్తృతంగా ప్రచారమవ్వడానికి ప్రధాన కారణం గ్రామఫోన్ రికార్డులే. 1940-50 ప్రాంతాలలో ప్రసార సాధనాలు ఏమీ లేని రోజుల్లో పెళ్లిళ్లకూ శుభకార్యాలకు ఎక్కువగా నాగస్వర వాద్యమే ఉండేది.
ఈ వాద్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది టి.ఎన్.రాజరత్నం పిళ్లై. సంగీత కచేరీ స్థాయికి ఈ వాద్యాన్ని తీసుకెళ్లాడు. ఆ వాద్యానికే గౌరవాన్ని తెచ్చాడు. అంతేకాదు - ఆయన పాల్గొనే పెళ్లి ఊరేగింపు మార్గంలో నాలుగైదు కూడళ్లలో మజిలీలు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా చిన్నచిన్న వేదికలు అమర్చి, తన నాద స్వరాన్ని వినిపించేవాడు. పెళ్లి వారితో సంబంధం లేకపోయినా, నాదస్వర వాద్యం వినాలనే కోరికతో ఆసక్తిగా జనం మూగేవారు. తర్వాత కాలంలో క్రమక్రమంగా పాశ్చాత్య వాద్యాలపై మోజు ప్రారంభమైంది. 1940-50 ప్రాంతాలలో ‘నాదముని బాండ్’ అని ఉండేది. మూర్తిత్రయం వారి కీర్తనలు ప్రసిద్ధమైనవి. ఈ నాదముని బాండ్‌పై వినిపిస్తూంటే మంత్రముగ్ధులై, జనం వినేవారు. పాశ్చాత్య వాద్యాల సమ్మేళనంతో ఈ నాదముని బాండ్ ఎంత ప్రసిద్ధమైందంటే వీరు వాయించిన కీర్తనలు గ్రామఫోన్ రికార్డులై ప్రచారమయ్యాయి. రికార్డు ప్లేయర్లుండేవి, ఆ రోజుల్లో. ఇళ్లల్లో ఎంతో ఆసక్తిగా వినేవారు.
సంప్రదాయ సంగీతానికి మనవాళ్లిచ్చిన గౌరవానికి ఇదో తార్కాణం. విజయవాడ ఆలిండియా రేడియోలో ‘వాద్య బృంద వైభవాలు’ అనే కార్యక్రమాన్ని చేస్తూ, రెండు దశాబ్దాల క్రితం శ్రోతలకు ఈ నాదముని బాండ్ సంగీతాన్ని వినిపించాను. సంస్కారవంతమైన మాట మనసును దోస్తుంది. పాట హృదయాలను రంజింపజేస్తుంది. ఈ రెండూ చేయలేని పనిని ఒక్క వాద్య సంగీతం నెరవేరుస్తుంది. దీనికి సామాన్యమైన సంగీతానుభవం సరిపోదు.
*

చిత్రం..పియానోపై కాఫ్‌మన్, వయోలిన్‌పై మెహతా (జుబిన్ మెహతా తండ్రి)

- మల్లాది సూరిబాబు 9052765490