సంపాదకీయం

‘దారి’ దోపిడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాజ్య ప్రపంచీకరణ పేరుతో వ్యవస్థీకృతమై ఉన్న ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- అవినీతిని విస్తరింపచేస్తుండడం ప్రభుత్వాలు పట్టించుకోని ‘రహస్యం’! లంచాలు ఇవ్వడం, పుచ్చుకోవడం అన్నది అన్ని దేశాల్లోనూ నేరమే. కానీ, కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ వాణిజ్య సంస్థలు ఇతర దేశాల్లో లంచాలు ఇవ్వడాన్ని చట్టబద్ధంగా ప్రోత్సహిస్తున్నాయి. అమెరికా వంటి దేశాల ప్రభుత్వాలు ఈ లంచాలను ‘అనివార్య వాణిజ్య వ్యయం’- అలవబుల్ బిజినెస్ ఎక్స్‌పెండేచర్- అన్న ముద్దుపేరుతో చట్టబద్ధం చేశాయి. అందువల్ల ఆయా దేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలోని ‘నిర్వాహకుల’కు ధారాళంగా లంచాలను ఇవ్వగలుగుతున్నాయి. ఈ ‘నిర్వాహకులు’ రాజకీయ వేత్తలు, ప్రభుత్వ ఉన్నత అధికారులు! ఇలా లంచాలను ఇవ్వడం ద్వారా దశాబ్దులుగా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశంలోను, ఇతర ప్రవర్ధమాన దేశాలలోను ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సంపన్న దేశాల సంస్థల స్వభావం మన దేశంలో పుట్టి పెరిగిన వాణిజ్య సంస్థలకు సైతం వంటపట్టడం ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- ప్రభావం. ఈ అవినీతి- ‘అవినీతి’ అన్న పేరుతో కాక ‘విరాళం’, ‘సమ్మానం’, ‘వాణిజ్య ప్రదర్శనం’, ‘ఆతిథ్యం’- ‘స్పాన్సరింగ్’- వంటి ఆకర్షణీయమైన నామధేయాలతో చెలామణి అవుతోంది. అందువల్ల ఏది అవినీతి? ఏది కాదు? అన్న ‘హంస క్షీర న్యాయం’ ఆధునిక స్వేచ్ఛా విపణిలో పనిచేయదు. ‘పాలలో నీటిని కలిపినట్టయితే హంస నీటిని వదిలిపెట్టి పాలను మాత్రమే తాగుతుందట’! ఇదీ ‘హంస క్షీర న్యాయం’! ఈ ప్రాకృతిక న్యాయం ప్రపంచీకరణ ఏర్పాటు చేస్తున్న కృత్రిమ వ్యవస్థకు అన్వయం కావడం లేదు. హంసలే లేవు.. శతాబ్దుల పాటు హంసలను చంపి భోంచేశారు! అందువల్ల ‘బహుళ జాతీయ సంస్థలు’ యథేచ్ఛగా మన దేశంలో పాతికేళ్లుగా లంచాలను వెదజల్లాయి. బహుళ జాతీయ సంస్థలు మన దేశంలో అవసరం లేని సేవారంగాలలో, పర్యాటక రంగాలలో, స్థిరాస్తి, నిర్మాణ రంగాలలో చొరబడిపోవడానికి ఈ ‘అనివార్య వాణిజ్య వ్యయం’ చక్కగా దోహదం చేసింది. ఇలా లంచాలిచ్చిన సంస్థలపై ఆయా సంపన్న దేశాల్లో అభియోగాలు దాఖలు కావు- ‘అనివార్య వ్యయం’ కాబట్టి. కానీ పుచ్చుకున్న మన దేశస్థులపై మన ప్రభుత్వ విభాగాలు నేరారోపణ చేయవచ్చు. అనివార్య వ్యయం పేరుతో లంచాలిచ్చిన విదేశీయ సంస్థలకు వ్యతిరేకంగా కూడ మన ప్రభుత్వ పరిశోధక విభాగాలు చర్యలు మొదలు పెట్టడం ముదావహం.. ‘్భరత జాతీయ మహాపథ నిర్వహణ సంస్థ’- నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా- ఎన్‌హెచ్‌ఏఐ-కు చెందిన కొందరు అధికారులకు వ్యతిరేకంగా కేంద్ర నేరపరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబీఐ- వారు అవినీతి అభియోగం నమోదు చేయడం ఈ చర్యలకు నిదర్శనం.
సిఎమ్ స్మిత్ అనే అమెరికాకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా కూడ సిబీఐ అవినీతి అభియోగాన్ని నమోదు చేసిందట. ఈ సంస్థకు అనుబంధంగా మన దేశంలో పనిచేస్తున్న వాణిజ్య సంస్థ 2011-2016 సంవత్సరాల మధ్య ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతోను, బయటివారితోను కుమ్మక్కయి రహదారుల నిర్మాణపు ఒప్పందాలను కుదుర్చుకుందట! ఈ ‘కుదిరిక’లో భాగంగా ‘స్మిత్’ సంస్థ దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల లంచాలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు , ఇతరులకు లంచాలుగా చెల్లించిందట. ఇతరులు బహుశా రాజకీయ వేత్తలు కావచ్చు, మధ్యవర్తులు- దళారీలు కావచ్చు. రాజకీయ వేత్తలు, ఉన్నతాధికారులు, దళారీలు, వ్యాపార పారిశ్రామిక ఘరానాలు ‘దుష్ట చతుష్టయం’గా ఏర్పడి పోవడం ప్రపంచీకరణ వల్ల విస్తరిస్తున్న అవినీతికి మాధ్యమం. ఇలా లంచాలను పుచ్చుకున్నవారు ఇలాంటి సంస్థలు నిర్మించే ‘మహాపథాల’ను, రాచబాటలను పర్యవేక్షిస్తున్నవారు! కానీ ఈ అమెరికా సంస్థకు వ్యతిరేకంగా అవినీతి చర్యలు లేవు. ఎందుకంటే ఈ లంచం- అనివార్య వాణిజ్య వ్యయం. అందువల్ల ‘స్మిత్’ సంస్థ ఈ వ్యయం గురించి అమెరికా న్యాయ మంత్రిత్వశాఖ వారికి ధైర్యంగా వెల్లడించింది. అమెరికా ప్రభుత్వానికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలను చెల్లించడం ద్వారా ఈ అక్రమాన్ని క్రమబద్ధీకరించుకొందట! కానీ మన దేశంలో ఇలా అవినీతిని క్రమబద్ధీకరించడానికి వీలు లేదు, అలాంటి చట్టాలు ఏర్పడలేదు. అందువల్ల కేంద్రీయ పర్యవేక్షణ మండలి- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్- సీవీసీ- వారు పసికట్టి వెల్లడించి ఆదేశించిన తరువాత మన ప్రభుత్వం మేలుకొంది. గత ఏడాది జూలైలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించడంతో దర్యాప్తును ఆరంభించిన సీబీఐ ఇపుడు ఈ అభియోగాలను నమోదు చేసిందట!
దేశాల సరిహద్దులను చెరిపివేసి ప్రపంచాన్ని మొత్తం ఒకే వాణిజ్య వాటికగా మార్చడం ప్రపంచీకరణ లక్ష్యం. ఈ వాణిజ్య వాటికలో సంపన్న దేశాల మల్టీనేషనల్ కంపెనీ- ఎంఎన్‌సి-లు అమ్ముతున్నాయి, ప్రవర్ధమాన దేశాల ప్రజలు కొంటున్నారు. ఇదీ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ! కానీ స్వేచ్ఛా వాణిజ్య విపణి వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ప్రపంచ వాణిజ్య సంస్థ- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- రూపొందించిన సమాన నియమావళి మాత్రం అవినీతి విషయంలో సమానంగా వర్తించడం లేదు. మనదేశంలో ‘లంచం’ అని అంటున్నాం, అమెరికాలో అది లంచం కాదు, అనివార్య వ్యయం. ఇతర దేశాల విషయంలో మాత్రమే అమెరికా వంటి దేశాలు ఈ అనివార్య వ్యయాన్ని చేయడానికి తమ ఎంఎన్‌సీలకు అనుమతినిస్తున్నాయి. అంతర్గతంగా మాత్రం ఈ సంస్థలు ఇలా అనివార్య వ్యయాన్ని చేయడానికి వీలు లేదు. తమ సమాజంలో అవినీతిని అనుమతించని ఈ దేశాల ప్రభుత్వాలకు- తమ సంస్థలు ఇతర దేశాల్లో అవినీతిని వ్యాప్తి చేయడం తప్పుకాదు. అందువల్లనే ‘వాల్‌మార్ట్’ వంటి అమెరికా సంస్థలు ప్రచారం పేరుతో, అనివార్య వ్యయం పేరుతో వందల వేల కోట్ల రూపాయలను ఇతర దేశాల్లో ఖర్చు చేశాయి, చేస్తున్నాయి. ‘స్మిత్’ వంటి సంస్థలు రహదారులను నిర్మించి, నిర్వహించి అప్పగించే ప్రణాళికలో భాగంగా మన దేశంలో నిర్మిస్తున్న ‘క్షిప్రచాలక మహాపథాలు’- ఎక్స్‌ప్రెస్ హైవేలు- దోపిడీకి రాచబాటలు అవుతుండడానికి కారణం ఇదే! ఇలా ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు ఏళ్ల తరబడి వాటిని నిర్వహిస్తూనే ఉన్నాయి. ‘నిర్వహించడం’ ప్రయాణీకులను దోపిడీ చేయడానికి మారుపేరు. ఈ రహదారులపై వంద, యాబయి కిలోమీటర్లకొక చోట ‘శుల్క ద్వారాల’-టోల్ ప్లాజాల-ను ఏర్పాటు చేశారు. అన్ని రకాల వాహనాల చోదకుల నుంచి భారీగా టోల్ ట్యాక్స్- ప్రయాణ శుల్కం- వసూలు చేస్తున్నారు. ఈ భారీ వసూళ్లకు తార్కికమైన, సమంజసమైన ప్రాతిపదిక ఏమిటన్నది అంతుపట్టని వ్యవహారం. ఈ రహదారులపై పయనిస్తున్న వారికి వాహనాలకు అయ్యే ఇంధన వ్యయం కంటే ఈ ‘పన్ను’ అధికంగా ఉండడం అనేక సందర్భాలలో నెలకొన్న వైపరీత్యం!
ఈ నిర్మాణ సంస్థలు ఖర్చు పెట్టినది ఎంత? టోల్‌ప్లాజాల వద్ద దండుకుంటున్నది ఎంత? జనం నిరవధికంగా ఈ శుల్కం చెల్లిస్తూ ఉండవలసిందేనా? ప్రభుత్వరంగంలోని రోడ్డు రవాణా సంస్థల వంటి సార్వజనిక వ్యవస్థలకు సైతం ఈ ప్రయాణ శుల్కం నుంచి మినహాయింపు లభించడం లేదు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రయాణ సేవా సంస్థల నష్టాలు పెరగడానికి కారణం ‘రహదారి నిర్వాహకులు’ శుల్కం వసూలు చేస్తుండడం. సార్వజనిక వాహనాలపై సుంకం వసూలు చేయరాదని ప్రభుత్వాలు నిబంధన విధించి ఉండవచ్చు. కానీ లంచాలు మరిగిన రాజకీయ వేత్తలకు, అధికారులకు ఈ ధ్యాస లేదు.