మీ వ్యూస్

రిలీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ బాగా నటించారు. అంజలితో డ్యూయెట్లు చిత్రీకరణ బాగుంది. ఆయన కెరీర్‌లో సూపర్‌హిట్ చిత్రమిది. దర్శకత్వ ప్రతిభ, బాలకృష్ణ ఫైట్స్, డైలాగ్ డెలివరీ రాణించాయి. బాలకృష్ణ అభిమానులకు చక్కని రిలీఫ్.
-అన్నా గురుమూర్తి, ఏలూరు

సంక్రాంతి విజేతలు
సంక్రాంతి పండుగకు సినిమాలు అందరికీ నచ్చేలావస్తే నిజంగా పండగే. దాదాపు నాలుగైదేళ్లుగా సంక్రాంతి సీజన్‌లో సరైన సినిమాలు రావడం లేదు. ఈసారి మాత్రం నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్, శర్వానంద్‌లు మంచి మంచి చిత్రాలతోనే పోటీకి దిగారు. సంక్రాంతి పందెం కోళ్లన్నీ విజయాలను బాగానే అందుకున్నాయి. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయినా, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలు పండగ సీజన్‌లో ప్రేక్షకులకు నచ్చి నవ్వులు పూయించాయి. నాన్నకు ప్రేమతో చిత్రం అందరికీ అర్థంకాకపోవడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. ఇక మాస్ హీరో బాలకృష్ణ అందించిన డిక్టేటర్ ఆయన చెప్పిన విధంగానే బి, సి సెంటర్లలో దుమ్ముదులుపుతోంది. ఎవరి టేస్ట్‌కి తగ్గ సినిమాలు చూడటానికి వాళ్లకు అవకాశమిస్తూ పండగ సీజన్ చక్కగానే సాగిపోయింది.
-ఎం.రామ్‌కుమార్, ముదినేపల్లి

ధైర్యే సాహసే..
అంజలిని ధైర్యేసాహసి అని పొగడాల్సిన అవసరం లేదు. తమిళులు సృష్టించిన విలక్షణ పాత్రల్లో వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాల్లో రాణించింది. సీతమ్మవాకిట్లో కూడా విలక్షణ డైలాగులే ఆమెని రక్షించాయి. మిగిలిన చిత్రాల్లో ఆమె పాత్రలు, నటన సామాన్యంగానే ఉంటాయి. ఎవరైనా చేయగలిగినవే అవి. స్టార్ నటికి తక్కువ, కొత్త నటికి ఎక్కువస్థాయి ఆమెది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా నటించింది తప్ప చిత్రాన్ని మొత్తం తన భుజస్కంధాలపై సింగిల్‌గా మోసింది లేదు. ఈమె తప్ప మరెవరూ చేయలేరు అనిపించే పాత్రలే లేవు. తెలుగులో ట్రాన్స్‌జండర్, లింగమార్పిడి అంశాలు ఏమేరకు ఆకట్టుకుంటాయో ఎవరు చెప్పగలరు?
-కె సుభాష్, శ్రీనగరం

శ్రీశ్రీకి నచ్చిన..
మహాకవి శ్రీశ్రీకి నచ్చిన చిత్రం 1951లో వచ్చిన పాతాళభైరవి. కాకమ్మ, పిచికమ్మ వంటి కథని అత్యద్భుతంగా తీశారు అని ప్రశంసించారు. ఎన్నిసార్లు చూస్తున్నా ఎప్పటికప్పుడు అదే మొదటిసారిగా చూస్తున్నట్టుగా అనిపింపజేసే చిత్రాలలో పాతాళ భైరవి ఒకటి అని చెప్పారు. నిజమే. ఆయన చెప్పిన మాట అక్షరాల నిజం. ఎప్పటికప్పుడు ఆ సినిమా కొత్తగా అనిపించే మాట కూడా నిజమే. పాతాళభైరవి ఎంత గొప్ప చిత్రమో శ్రీశ్రీ చెప్పిన మాట కూడా అంతే గొప్ప. కాకమ్మ, పిచ్చికమ్మ కథ అత్యద్భుతంగా తీశారు అనడంలోనే గొప్పతనం కనిపిస్తుంది.
-ఎన్ మధుసూధనరావు, హైదరాబాద్

ఎడారిలో కోయిల
దివంగత నటుడు రంగనాథ్ వ్యక్తిత్వాన్ని ఎడారిలో కోయిల వ్యాసంలో చక్కగా విశే్లషించారు. మంచి తాత్వికుడు, కవి, మృదుస్వభావి, అజాతశత్రువు, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకశైలిని సృష్టించుకున్న రంగనాథ్ తెరపైనేకాక రియల్ జీవితంలో కూడా హీరోగా నిలిచారు. తన జీవిత భాగస్వామి ఆరేళ్లపాటు మంచానికి పరిమితమైతే వచ్చిన సినిమా అవకాశాలను వదులుకొని, రేయింబవళ్లు ఆమెకి సేవచేసి భర్త అనే పదానికి నిర్వచనంగా నిలిచాడు. మంచికి, మానవత్వానికి ప్రతిరూపంగా రంగనాథ్ కడుపున పుట్టినవారు సినీ పరిశ్రమ అభిమానులు వదిలేసినా నిలువెత్తు ఒంటరితనం, శూన్యం ఆయనను ఆవహించి క్షణక్షణం నరకంతో పోరాడినట్టుగా అయింది. చివరికి గెలవలేక తన దారి చూసుకొని, నేటి కుటుంబ వ్యవస్థలోవున్న డొల్లతనాన్ని ప్రేమానురాగాల రాహిత్యాన్ని చూపి, పశువుల్లా బతుకుతున్న వైనాన్ని తేటతెల్లం చేశాడు రంగనాథ్. అందుకే ఎడారి కోయిల అయ్యాడు.
-ఎం కనకదుర్గ, తెనాలి

టైటిల్ బాగుంది
ఫెంటాస్టిక్ ఫోర్ టైటిల్ బాగుంది. ఆ చిత్రాలకు ఫెంటాస్టిక్ అనిపించుకునే సత్తా వుందా? అనేది వేరే ప్రశ్న. దశాబ్దం క్రితం వరకు సినిమాలు నిలిచి, వంద రోజులు ఆడేవి. ఇప్పుడలా కాదు శుక్ర, శని, ఆది మూడు రోజుల్లోనే కోట్లు దండుకోవాలి. అందుకే వందలు, వేలు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఉన్న థియేటర్లనే నాలుగు చిత్రాలు పంచుకోవాలి. అంతేకాదు ఎక్కువ రోజులు ఆ థియేటర్లని నిలుపుకోవాలి. ఎవరెన్ని థియేటర్లను గుప్పిట్లో పెట్టుకోవాలో ఈపాటికే పథకాలు సిద్ధం చేసుకుంటారు. గెలిచే గుర్రం ఏదో, కాలు విరిగి కూలబడేదేదో, కాలు విరిగినా కుంటుతూ అయినా గమ్యం చేరేది ఏదో? నిలుపుకున్న థియేటర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. అది నేటి సూత్రం.
-సదా ప్రసాద్, గొడారిగుంట

ఆసక్తిగా విశే్లషణ
శ్రీకృష్ణ పాండవీయం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాణిక్యేశ్వరి విశే్లషణ ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్‌ను మహోన్నత దర్శకునిగా నిలబెట్టిన పౌరాణిక చిత్రరాజం ఇది. నూతన పాత్రలతో ప్రతిభావంతులను, మరికొన్ని ముఖ్యపాత్రలలో కొత్తవారిని తీర్చిదిద్దడం ఎన్టీఆర్‌కే సాధ్యం. ఎన్టీఆర్, సముద్రాల, టివిఎస్ శర్మ, టివి రాజు, రవికాంత్ నగాయిచ్‌ల కలయికలో వచ్చిన పౌరాణిక చిత్రాలు తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖస్థానం పొందాయి. శ్రీకృష్ణపాండవీయంలో శకుని పాత్ర చిత్రీకరణ, రుక్మిణి కళ్యాణ ఘట్టంలో కనియన్ రుక్మిణి అన్న పోతనగాని పద్య చిత్రీకరణ దర్శకుని ప్రతిభకు నిదర్శనం. ఈ చిత్రాన్ని రంగుల్లో చూడాలని ఆశగా వుంది.
-పివి నారాయణాచార్యులు, లూటుకుర్రు

భానుమతి
ఈవారం శరత్‌కాలంలో శతమతుల భానుమతి సేకరణకర్త సూక్ష్మంగా వివరించిన ఆమె జీవిత గ్రంథం చదివి అనుభూతి చెందాము. కళాత్మకమైన ఆనందాన్ని అందరం ఆస్వాదించాం. బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితగాథను ఆమె పూర్వాశ్రమం గురించి వెనె్నలలో ఆమూలాగ్రంగా ప్రచురించాలని కోరుకుంటున్నాం.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం