క్రీడాభూమి

రంజీ ట్రోఫీ విజేత ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 26: రంజీ ట్రోఫీ క్రికెట్‌లో మాజీ చాంపియన్ ముంబయి రికార్డు స్థాయిలో 41వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. పుణేలోని ఎంసిఎ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి కేవలం మూడు రోజుల్లోనే సౌరాష్ట్ర జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇంత త్వరగా విజయం సాధిస్తుందని ఎవరూ పెద్దగా ఊహించకపోయినప్పటికీ బౌలర్లు చక్కగా రాణించి ఆ జట్టుకు ఈ నాటకీయ విజయాన్ని అందించారు. 8 వికెట్ల నష్టానికి 262 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబయి జట్టు కేవలం 6 పరుగులకే ఇక్బాల్ అబ్దుల్లా (15) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో నైట్ వాచ్‌మన్ సిద్ధేష్ లాడ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని సౌరాష్ట్ర బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన అతను అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు టెయిలెండర్ బల్వీందర్ సంధు (34-నాటౌట్) సహకారంతో 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి నిష్క్రమించాడు. దీంతో ముంబయి జట్టు 371 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టును ముంబయి బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. ముఖ్యంగా శార్దూల్ థాకూర్ (5/26) నిప్పులు చెరిగా బౌలింగ్‌తో సత్తా చాటుకోగా, బల్వీందర్ సంధు (2/21), ధవళ్ కులకర్ణి (2/34), అభిషేక్ నాయర్ (1/26) తమ వంతు రాణించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో సౌరాష్ట్ర ఘోరంగా విఫలమైంది. చటేశ్వర్ పుజారా (27), షెల్డన్ జాక్సన్ (13), కెప్టెన్ జయదేవ్ షా (17), చిరాగ్ జానీ (11), జయదేవ్ ఉనద్కత్ (16-నాటౌట్) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు రాబట్టలేకపోవడంతో 115 పరుగులకే ఆలౌటైన సౌరాష్ట్ర జట్టు ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ముంబయి బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (117) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. రంజీ ట్రోఫీ క్రికెట్‌లో ముంబయి టైటిల్ సాధించడం గత మూడు సీజన్లలో ఇదే తొలిసారి. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకూ 45 సార్లు ఫైనల్‌కు చేరుకున్న ముంబయి జట్టు రికార్డు స్థాయిలో మొత్తం 41 సార్లు టైటిళ్లను కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకోగా, కేవలం ఎనిమిది టైటిళ్లతో కర్నాటక జట్టు రెండో స్థానంలో నిలిచింది.