జాతీయ వార్తలు

రాహుల్ గుప్పిట్లో మోదీ ‘గుట్టు’!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం తనవద్ద ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటు ముందు పెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వడంలేదని రాహుల్ ఆరోపించారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, సిపిఎం పక్షం నాయకుడు కరుణాకరన్, ఎన్‌సిపి నాయకుడు తారిక్ అన్వర్ సహా మొత్తం పదహారు ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి రాహుల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ నలుగురు నాయకులతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, ఉపనాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ‘నేను లోక్‌సభలో మాట్లాడితే నరేంద్ర మోదీ గాలి బుడగ పేలిపోతుంది. ప్రధానమంత్రి వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం నా వద్ద ఉంది’ అని రాహుల్ ఆవేశంతో చెప్పారు. ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ తనకు లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతి గురించి వెల్లడిస్తానని పలుమార్లు చెప్పారు. నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారాన్ని కేవలం లోక్‌సభలోనే ఎందుకు వెల్లడించాలని, బయట పత్రికల ముందు లేదా కోర్టులో బయట పెట్టవచ్చు కదా అంటూ మీడియా ప్రశ్నలకు రాహుల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘అమేథీ లోక్‌సభ సభ్యుడిగా లోక్‌సభలో మాట్లాడే హక్కు నాకున్నది. అందుకే లోక్‌సభలో మాట్లాడాలని అనుకుంటున్నా’ అని అన్నారు. తాను లోక్‌సభలో మాట్లాడితే ఆయన బండారం బయట పడుతుందనే భయంతోనే నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. తానంటే నరేంద్ర మోదీకి భయమని పలుమార్లు వ్యాఖ్యానించటం గమనార్హం. నరేంద్ర మోదీ పార్లమెంటు నుంచి ఎందుకు పారిపోతున్నారని రాహుల్ పలుమార్లు ప్రశ్నించారు. ‘నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నియమాల గొడవ లేకుండా మేము చర్చకు సిద్దపడ్డాం. ఇదే విషయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్‌కూ చెప్పాం. అయితే ప్రభుత్వం చర్చకు అంగీకరించటం లేదు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు’ అని ప్రధాని, ఎన్డీయే ప్రభుత్వాన్ని రాహుల్ దుయ్యబట్టారు. ‘చర్చ జరపటం ప్రభుత్వానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. నేను లోక్‌సభలో ఎక్కడ నోరు తెరుస్తానోనని మోదీ భయపడుతున్నారు. ఎందుకంటే మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం నా వద్ద, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల వద్ద ఉంది’ అని రాహుల్ చెప్పారు.
చరిత్రలో మొదటిసారి అధికార పక్షం సభ్యులు పార్లమెంటులో చర్చకు అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మోదీ భయపడే బదులు సభకు వచ్చి నోట్ల రద్దుపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటంతో పాటు ఆయన వాదన కూడా ఎంత సేపయినా వినిపించి నిర్ణయాన్ని దేశ ప్రజలకు వదిలివేయాలని రాహుల్ గాంధీ సూచించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ వ్యక్తిగతంగా తీసుకున్నందున ఆయన వ్యక్తిగతంగా దేశానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వాదించారు. మోదీ పార్లమెంటు నుండి సంగీత కచేరీలకు, బహిరంగ సభలకు పారిపోతున్నారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్షం ఒక నెల నుండి లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరపాలనుకుంటోంది. అయితే తాము లోక్‌సభలో మాట్లాడేందుకు ప్రభుత్వం, మోదీ అంగీకరించటం లేదు’ అని ఆరోపించారు. లోక్‌సభలో మాట్లాడటం ఎంపీల హక్కని, దానిని ఎలా అడ్డుకుంటారని రాహుల్ ప్రశ్నించారు. మోదీ వంకలు వెతకటం మానివేసి పార్లమెంటుకు రావాలని హితవు పలికారు. రాహుల్‌తో పాటు సుదీప్ బందోపాధ్యాయ, కరుణాకరన్, తారిక్ అన్వర్ కూడా మోదీపై విమర్శలు గుప్పించారు.