రచ్చ బండ

కెప్టెన్ జట్టులో ఎవరికి వారే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షునిగా కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించారు. కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియమితులై ఏడాదిన్నర అయ్యింది. పార్టీని ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి అటు అధిష్టానానికి, ఇటు పార్టీ నేతలకు కలుగుతున్నది. కెప్టెన్ ఉత్తమ్ వ్యక్తిగతంగా మంచివాడు, నిజాయితీపరుడైనప్పటికీ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారని, ముఖ్యంగా నాయకులను కలుపుకుని నడిపించలేకపోతున్నారని సొంత పార్టీ నేత లే అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి టి.పిసిసి అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్యను అధిష్టానం నియమించింది. అప్ప ట్లో ఆయన పార్టీని నడిపించడంలో విఫలమయ్యారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బేజారెత్తిన అధిష్టానం కెప్టెన్ ఉత్తమ్‌ను ఎంపిక చేసి నియమించింది. కెప్టెన్ ప్రజా సమస్యలపై దూసుకెళ్ళలేకపోతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సన్నగిల్లాయి. కనీసం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులనైనా నిలువరించలేకపోతున్నా రు. తాజాగా లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణలోనే కాదు చివరకు సొంత జిల్లా నాయకులను ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్న విమర్శలు, ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. పైగా జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయ. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాజకీయాల్లో అనైతికత వంటివి చూ స్తుంటే తనకు విరక్తి కలుగుతున్నదని లోగడ వ్యాఖ్యానించిన జానా తాజాగా నల్లగొండలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని చేపడితే తానే ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తానని చెప్పారు. ఆలూ లేదు చూలు లేదు అన్న చందంగా జానా వ్యాఖ్య లు ఉన్నాయని పార్టీ నేతలు గుర్రుమన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉందని, పైగా కాంగ్రెస్ విజయదుందుభి మోగించినా, పార్టీ అధిష్టానమే సిఎల్‌పి నేతను (ముఖ్యమంత్రిని) ఎంపిక చేస్తుందని, అన్నీ తెలిసి ముం దుగానే ఎలా ప్రకటించుకుంటారని, పార్టీలో క్రమశిక్షణ గురించి మాట్లాడే పెద్దలే ఇలా కట్టుదాటడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌గా ముద్రపడిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెప్టెన్ ఉత్తమ్‌ను బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ ఎస్‌సి విభాగం జాతీయ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు, ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా సైతం పార్టీలో సమన్వయం కొరవడిందని గ్రహించారు. కెప్టెన్ ఉత్తమ్ తాజాగా ఢిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాం ధీతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణ బయటకు రానప్పటికీ, రాహుల్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. తను శక్తివంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, తన కంటే బాగా పార్టీని ఎవరైనా నడిపించగలరనుకుంటే వారికి అప్పగించండి అని చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
కెప్టెన్ ఉత్తమ్ కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జీ అయిన మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్‌లో ఉంటే గాంధీ భవన్‌లో పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. మల్లు భట్టివిక్రమార్క సోదరుడు టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి చురుగ్గా పాల్గొంటున్నారు. మల్లు సోదరులే గాంధీ భవన్ కార్యకలాపాలను నిర్వహించుకుంటారా? అని కెప్టెన్ ఉత్తమ్‌కు అనుకూలంగా ఉన్న నేతల వ్యాఖ్య. మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితుల గురించి పోరాటం చేయడంలో టి.పిసిసి వెనుకబడిపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ళ కింద తడకపల్లి రిజర్వాయరును 1.5 టిఎంసిల సామర్థ్యంతో డిజైన్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం 50 టిఎంసిల నిల్వ కోసం మల్లన్న సాగర్ పేరిట డిజైన్ చేయడంతో 16 గ్రామాలు, 21 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నా టి.కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆశించిన విధంగా స్పందించ లేదు. 2013 సంవత్సరంలో చేసిన చట్టం ప్రకారం నిర్వాసితులకు మేలైన పరిహారం చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 123 జివోను తీసుకుని రావడంతో నిర్వాసితులకు మేలు జరగదని ఉద్యమించడంలో వెనుకబడిపోయామని పార్టీ నాయకులు పలువురు అంగీకరిస్తున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ప్రభృతులు ఆందోళన బా ట పట్టారు. మల్లన్న సాగర్ వద్ద టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 48 గంటల పాటు చేసిన దీక్షకు కాంగ్రెస్ కంటే ఎక్కువ ప్రచారం లభించింది. నీటి పారుదల ప్రాజెక్టుల (మిషన్ కాకతీయ)పై ప్రభుత్వ ఆలోచన ఏమిటో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, ఆ సమావేశానికి హాజరై ప్రభుత్వాన్ని నిలదీయడంలో టి. కాంగ్రెస్ విఫలమైంది. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏమిటో ప్రజల్లో ఎండగట్టేందుకు తామూ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించినా, ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యంగా మల్లన్న సాగర్ నిర్వాసితుల వంటి వివిధ అంశాలు, ప్రజా సమస్యలు వచ్చినా వాటిపై ఉద్యమించడంలో వెనుకబడుతున్నామని, జట్టు ను నడిపించే బాధ్యత కెప్టెన్‌పైనే ఉంటుందని టి.కాంగ్రెస్ నేతల భావన.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి