రచ్చ బండ

లక్ష్యం నెరవేరిందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్ళాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది. ఆ దిశగా అడుగులు వేసి ఈ నెల 19, 20 తేదీల్లో నగరంలో స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినా, ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందన్న ఆత్మావలోకనంలో నేతలు పడ్డారు. ఎందుకంటే రెండు రోజుల సమావేశంలో పూర్తిగా రాజకీయంగా శిక్షణా తరగతులు జరగలేదు. మరోవైపు కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకు విధులు, నిధుల గురించి తెలియజేయలేదు. కేవలం ప్రసంగాలతో ముగించారు. సుమారు వెయ్యి మంది స్థానిక ప్రజాప్రతినిధులు హాజరైనా, మరో 500 మంది కార్యకర్తలు, ఛోటా, బడా నాయకులంతా కలిసి రెండు వేల మంది వరకు హాజరయ్యారు. తొలి రోజున జెడ్‌పిటిసీలు, ఎంపిటీసీలు, ఎంపీపీలకు శిక్షణా తరగతిని ఏర్పా టు చేశారు. రెండో రోజున గ్రామ సర్పంచులకు, ఉప సర్పంచులకు ఏర్పాటు చేశారు. సమాచార లోపమేమోగానీ చాలా మంది సర్పంచులు, ఉప సర్పంచులు మొదటి రోజే హాజరయ్యారు. రెండు రోజులు అవే ప్రసంగాలను వినాల్సి వచ్చింది.
పైగా ప్రసంగాల్లో పస లేకుండా పోయింది. అంటే నాయకులు వారికి సరైన మార్గదర్శనం చేయలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో (2019) కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పోరాటం చేయాలా? అందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు ఏమిటి? ఏయే అంశాలపై పార్టీ ప్రజలతో కలిసి పోరాటం చేయాలి? పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఎంత వరకు అండగా ఉంటుంది? అనే అంశాలపై చర్చ జరగలేదు. అసలు ప్రజా సమస్యలు ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జిల్లాల పునర్ విభజన, రెవెన్యూ మండలాల సంగతేమిటి? ప్రజలకు ఈ అంశాలపై ఎంత వరకు అవగాహన ఉన్నది? దీనిపై ప్రజల్లో అవగాహన ఎలా ఉన్నది? ప్రజల స్పందన ఏమిటీ? అనే కోణంలో చర్చ జరగలేదు. ఎంపీ, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల కంటే కూడా కింది స్థాయి అంటే స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులే ప్రజలకు చేరువలో ఉంటారు కాబట్టి మొదటగా వారి నుంచే సమాచారం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రెండు రోజుల శిక్షణా శిబిరంలో వారి నుంచి ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శ సొంత పార్టీలోనే ఉంది.
స్థానిక ప్రజాప్రతినిధులకు వారికి ఉండే విధులు, నిధుల గురించి తెలియజేసేందుకే శిక్షణా తరగతులు నిర్వహించాలని టి.పిసిసి నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలకు సుమారు మూడేళ్ళ గడువు ఉంది. చివరి ఆరు నెలలు ఎన్నికల హడావుడే ఉంటుంది కాబట్టి రెండున్నర ఏళ్ళేనని భావించాలి. ఈ రెండున్నర ఏళ్ళకు పార్టీ స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలన్న ఆలోచన చేయాలా? లేక ఈ సమయంలో వారికి విధు లు, నిధులు, హక్కుల గురించి ప్రసంగాలతో సమయం వెళ్ళదీయాలా? అని కాంగ్రెస్ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సమస్యలు, వారి గుండె చప్పుడును తెలుసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ముఖ్యమైంది కాబట్టి వారిని ప్రజల్లోకి మరింత కలిసి పోయేలా చూడాలే తప్ప ఈ సమయంలో నిధులు, విధులు, హ క్కుల గురించి పాఠాలు బోధించడం బాగా లేదన్న భావ న కొంత మంది నేతల నుంచి వ్యక్తమైంది.
ఆ రెండు రోజులూ పాఠాల కంటే పాటలతో హోరెత్తించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ రెండు రోజుల పాటు ఇక్కడే గడిపారు. ‘టేబుల్‌పై రివాల్వర్ పెట్టి...మల్లన్న సాగర్ రైతుల వద్ద నుంచి బలవంతంగా భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు..’ అని ఆయన తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మల్లన్న సాగర్ రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ‘మీరు జమీందార్ కావచ్చు, ఇలా ప్రజలను బెదిరించడం భావ్యం కాదు, ఇది నిజాం పాలన కాదు, ప్రజల పాలన..’ అని ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌పై చిటపటలాడారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులకు కోత విధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తున్నారని, ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను కూరగాయలు కొన్నట్లు కొంటున్నారని ధ్వజమెత్తారు. ఇలా ఎప్పటిలా రాజకీయ ప్రసంగం, ఆరోపణలే తప్ప స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయన చేసిన దిశా నిర్ధేశం ఏమీ లేదు.
ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మరో అడుగు ముందుకేసి కేంద్రంలో కొనసాగుతున్న రావణుడి పాలన అంతమొందించేందుకు శ్రీరాముడి వానర సైన్యం సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకు చెక్ పవర్‌తో పాటు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు 10 అధికారాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మణిశంకర్ అయ్యర్ మండిపడ్డారు. స్థాని క సంస్ధలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడితేనే స్థానిక సంస్ధలు బలపడతాయన్నారు. లోగడ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే స్థానిక సంస్ధల బలోపేతానికి రాజ్యాంగంలోని 73, 74 అధికరణాలను సవరించారని చెప్పారు. ఇలా రాజకీయ ప్రసంగాలే కొనసాగాయి. పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ కూడా తెలుగులో జరగలేదు. సగం మంది సమావేశం హాలులో, సగం మంది బయట లాన్ లో కనిపించారు. శిక్షణా తరగతులు సీరియస్‌గా జరగ లేదని, స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులకు దశ-దిశా నిర్ధేశం చేసేలా స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వలేదని పార్టీ నాయకులు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి