రచ్చ బండ

విపక్షాలకు కలిసి రాని ఏడాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు ఈ ఏడాది (2015) కలిసి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి శంకుస్థాపన పేరిట హడావుడి చూపించడం, తెలంగాణలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకెళుతూ, తాజాగా అయుత చండీయాగంతో బిజీగా గడిపేస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది కాంగ్రెస్, బిజెపిలకు ఒకటి రెండు విజయాలు తప్ప ఆశాజనకంగా సాగలేదు. టి.టిడిపి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఆంధ్రలో అధికారంలో ఉన్నందున సరిపోయింది. కానీ తెలంగాణలో మాత్రం టి.టిడిపి పరిస్థితి అంతకంతకు దిగనాసిల్లుతున్నది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు ఇస్తూ ఎసిబికి పట్టుబడడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారంతో పార్టీకి నష్టం వాటిల్లింది, కొంత వరకు చంద్రబాబు నాయుడుకూ వ్యక్తిగతంగా నష్టం జరిగింది.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (కారు) స్పీడుకు విపక్షాలు తట్టుకుని నిలబడలేకపోయాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (టి.పిసిసి) ఈ సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు. అన్నీ చేదు అనుభవాలే. పైగా టి.పిసిసి అధ్యక్షునిగా నియమితులైన కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారధ్యంలో పార్టీ ఏ మాత్రం పురోగమన దిశలో నడవలేదు. రాష్ట్ర విభజన తర్వాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అధిష్టానం నియమించింది. కాగా పొన్నాల పార్టీని సక్రమంగా నడిపించడం లేదన్న విమర్శలు రావడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పొన్నాలను తప్పించి ఈ ఏడాది మార్చిలో కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి టి.పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ నాయకులు ‘కారు’ ఎక్కడం ప్రారంభించినా, నిలువరించలేకపోయారు.
తాజాగా స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల సందర్భంగా ‘బి-్ఫరమ్’ తీసుకున్న పార్టీ అభ్యర్థులు పలువురు టిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ నాయకులు, ద్వీతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోయారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు దానం నాగేందర్ కూడా కొన్ని రోజుల పాటు టిఆర్‌ఎస్‌లో చేరే విషయంలో ఊగిసలాడి చివరకు విరమించుకున్నారు. కెప్టెన్ సారధ్యంలో ఈ ఏడాదిలో పార్టీ ఆశించిన విధంగా బలపడలేదు. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకుడు, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ‘కారు’ ఎక్కేంత వరకూ తెలియక పోవడం, తెలిసిన వెంటనే కెప్టెన్ ఉత్తమ్ డిఎస్‌ను నిలుపుదల చేయలేకపోవడం మరో వైఫల్యం. పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ తాజాగా గులాబీ గూటికి చేరారు. మెదక్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కినా, తాజాగా వరంగల్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఓట్లు బాగా తగ్గిపోయి పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం టి.పిసిసి కొత్త కమిటీ ఏర్పాటుకు నోచుకోలేదు. పొన్నాల లక్ష్మయ్య టి.పిసిసి చీఫ్‌గా ఉన్నప్పుడూ కమిటీని నియమించలేదు. కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టి.పిసిసి చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా కమిటీ ఏర్పాటు కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ఆశించిన విధంగా ఎన్నో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారన్న విమర్శ ఉంది. జానారెడ్డి మెత్తగా మాట్లాడుతారన్న విమర్శ ఉంది. పైగా జానారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘పెద్దలు జానారెడ్డి’ అని సంబోధించడంతో ఆయన ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) పని తీరు కొంత మెరుగ్గా ఉంది. ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ఆందోళనలు చేపడుతున్నది. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితర నేతలు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఇంకా కొంత మంది టిడిపిలోకి వెళ్ళినా, పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి బాగానే కష్టపడుతున్నారన్న భావన అధిష్టానానికి ఉంది. లోగడ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘టిపిసిసి కంటే ఎపిసిసి నాయకులు బాగా ఫైట్ చేస్తున్నారు..’ అని అన్నారు. ఆంధ్రలో వైకాపా అధికార టిడిపి గట్టిగా ‘్ఢ’కొట్టి ముచ్చెమటలు పోయించలేకపోతున్నది.
తెలంగాణలో బిజెపికి ఈ ఏడాది కొంత ఉపయోగపడినా, పార్టీ బలోపేతానికి ఉపయోగపడలేదు. హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. కానీ వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఇక వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కక పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టి.టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్ సమాయత్తమవుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్, టిడిపి శ్రేణులు ఢీలాపడ్డారు. ఏదైనా ప్రతిపక్షాలకు 2015 సంవత్సరం ఆశించిన విధంగా అనుకూలించలేదనే చెప్పవచ్చు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి