రచ్చ బండ

అప్పుడే మేల్కొని ఉంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలస్యం అమృతం విషం అని పెద్దలు ఊరకే అనలేదు. అలస్యం చేస్తే విషమ పరిస్థితులు వస్తాయని, చేయి దాటి పోతుందనేది ఉద్దేశ్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా అదే జరిగింది. నీటి పారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో టి.కాంగ్రెస్ ఆలస్యంగా మేల్కొంది. నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా మార్చి చివరన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో సినిమా తెరలు పెట్టి సినిమా చూపిస్తామంటే తాము హాజరుకాబోమని, అసెంబ్లీ పవిత్రకు భంగం వాటిల్లుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ రోజున సభకు హాజరుకాలేదు. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు గంటల పాటు అనర్గళంగా ప్రాజెక్టులపై ప్రసంగించడం, మిగతా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధాలు చెప్పడం జరిగింది. ఈ ప్రజెంటేషన్‌ను బహిష్కరించడంపైనా కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం రాలేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదైతేనేం చివరకు సభకు హాజరుకాలేదు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో అన్నీ అబద్ధాలే చెప్పారని, తామూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల్లో ఎండగడతామని చెబుతూ వచ్చారు. కానీ అడుగులు ముందుకు పడలేదు. చూస్తూ, చూస్తూ ఏకంగా ఐదు నెలలైంది.
ఈ నెల 17న (బుధవారం) టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి స్మారక భవనంలో కొంత సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రవణ్ మూడు నెలల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం శ్రమించి, 150 స్లైడ్సు సిద్ధం చేశారు. ప్రజెంటేషన్ చూద్దామని వచ్చిన నాయకులను, కార్యకర్తలను, మీడియాను మూడున్నర గంటల పాటు కట్టేశారు. చివరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్, ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా మధ్యలోనే వెళ్ళిపోయారు. ఇంత వాదనను ఆనాడే చెప్పి ఉంటే బాగుండేదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ నిండు సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గత ప్రభుత్వాలను తూర్పార పట్టినప్పుడు ప్రశ్నించకుండా, ఇప్పుడు విడిగా ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఏమి సాధించారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోనీ ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి చేసిన రెండు, మూడు రోజులకే ఇచ్చారా? అంటే అదీ లేదని, సుమారు ఐదు నెలల గడువు తీసుకున్నారని, దీంతో కెసిఆర్ చెప్పిన దానికి సరైన సమయంలో కౌంటర్ ఇచ్చినట్లుగా లేదని, ప్రజలు మరచిపోయిన తర్వాత ఇప్పుడు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. పైగా ఒకవైపు పుష్కరాలు, మరోవైపు నయాం ఎన్‌కౌంటర్, ఆయనతో అధికారులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న వారి పేర్లు వెలుగులోకి రావడంతో, మీడియా, ప్రజల దృష్టి ఆ దిశగా మళ్ళింది. అటువంటి సమయంలో టి.పిసిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నష్టపోయిందన్న భావన వ్యక్తమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దీటైన జవాబు ఇవ్వాలనుకున్నప్పుడు ఆనాడు అసెంబ్లీకి హాజరై ముఖ్యమంత్రిని నిలదీసి ఉంటే సరిపోయేదని ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీయకుండా ఇప్పుడు ప్రచారం కోసమే కాంగ్రెస్ ఇదంతా చేసిందన్న విమర్శలనూ ఎదుర్కొనక తప్పదన్నది కొంత మంది నేతల భావన.
ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఇంతగా ఆవేదన చెందుతూ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న నాయక శ్రేణులంతా ఇదివరకే పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌పై వత్తిడి ఎందుకు తేలేకపోయారంటే, దానికి సమాధానం ఉండదు. నీటి ప్రాజెక్టులపై మేమూ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ ఇదివరకే ప్రకటించినందున ఎట్టకేలకు బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలను ఎండగడతామని చెబుతూ, రెండు సార్లు తేదీలు ఖరారు చేసి వాయిదా వేసారు. ఇటీవల తేదీ ఖరారు చేసినా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో వాయిదా పడింది. ఇలా వాయిదా వేయడం వల్ల నవ్వుల పాలు అవుతున్నామని పార్టీ నాయకులు ఆవేదన చెందారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినందున, తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రెండు నెలల క్రితం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్ మధుసూదనాచారిని కలిసి విజ్ఞప్తి చేయగా, స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో అసెంబ్లీలో పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్‌కు అనుమతి రాదన్న భావనతో బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఉన్న రావి నారాయణ రెడ్డి స్మారక భవనంలో ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు. మిగతా ప్రతిపక్షాలకూ ఆహ్వానాలు పంపించగా, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట రెడ్డి హాజరయ్యారు. మిగ తా పార్టీలు సీరియస్‌గా పట్టించుకోలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయకుండా బయట ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతం పోద న్న భావన లేకపోలేదు. కేంద్రంలోనైనా, రాష్ట్రాలలోనైనా ప్రజా సమస్యలపై, వివిధ అంశాలపై ప్రభుత్వాలను నిలదీసేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక. అటువంటి వేదికను ఉపయోగించుకోకుండా మరో వేదిక ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడమో లేదా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాలు విసరడం ద్వారానో ఫలితం ఉంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ.

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి