క్రీడాభూమి

రహానే ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ 5/267 డిక్లేర్
దక్షిణాఫ్రికా లక్ష్యం 481
ప్రస్తుత స్కోరు 2/72
చేయాల్సిన పరుగులు 409

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకాన్ని నమోదు చేసిన యువ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించాడు. రహానే అజేయ శతకంతో రాణించగా, ఐదు వికెట్లకు 267 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రత్యర్థి ముందు 481 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచాడు. అసాధ్యంగా కనిపిస్తున్న ఈ లక్ష్యాన్ని ఛేదించడం కంటే డ్రాకోసం ప్రయత్నించడమే మేలన్న విధంగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 72 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత, ఫాలోఆన్ ఇవ్వకూడదని నిర్ణయించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి, ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 190 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆటను కొనసాగించి కోహ్లీ వికెట్‌ను 211 పరుగుల వద్ద కోల్పోయింది. అతను 165 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లతో 88 పరుగులు చేసి కేల్ అబోట్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. అనంతరం రహానే, వృద్ధిమాన్ సాహా భారత్ స్కోరును 100.1 ఓవర్లలో ఐదు వికెట్లకు 267 పరుగులకు చేర్చారు. రహానే సరిగ్గా వంద పరుగుల మైలురాయికి చేరిన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు.
భారీ లక్ష్యం
పిచ్ స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటే 481 పరుగులను భారీ లక్ష్యంగానే పేర్కోవాలి. దీనిని సాధించడం అసాధ్యమని తేలిపోవడంతో, సాధ్యమైనంత నింపాదిగా ఆడి, మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం ఒక్కటే మార్గంగా దక్షిణాఫ్రికా ఎంచుకుంది. అయితే, రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే డీన్ ఎల్గార్ అవుటయ్యాడు. అతను నాలుగు పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో రహానే క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. టెంబ బవూమా 117 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అశ్విన్ బౌలింగ్‌లో బవూమా క్లీన్ బౌల్డ్ కావడంతో 49 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ హషీం ఆమ్లా, ఎబి డివిలియర్స్ జట్టును ఆదుకునే బాధ్యతను తన భుజాలపైకి తీసుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 38.4 ఓవర్లలో 44 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి క్రీజ్‌లో ఉన్నారు. ఆమ్లా 23, డివిలియర్స్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా, మరో రోజు ఆట మిగిలి ఉంది. చివరి రోజైన సోమవారం వీరు ఎంత సేపు పోరాటాన్ని కొనసాగిస్తారో చూడాలి. (చిత్రం) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 127, రెండో ఇన్నింగ్స్‌లో 100 (నాటౌట్) పరుగులు చేసిన ఆజింక్య రహానే
స్టార్ల సరసన స్థానం
* మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 100 పరుగులు సాధించి, కెరీర్‌లో ఆరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక, ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలను నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్ విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ల సరసన స్థానం సంపాదించాడు. గవాస్కర్ మూడు పర్యాయాలు ఈ ఫీట్ సాధించగా, ద్రవిడ్ రెండు పర్యాయాలు రెండు రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలను సాధించాడు. హజారే, కోహ్లీ చెరొకసారి రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలను అందుకోగా రహానే ఇప్పుడు వారితో చేరాడు.
ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒక బ్యాట్స్‌మన్ సెంచరీలు చేసిన సంఘటన భారత్‌లో చోటు చేసుకోవడం ఇది ఏడోసారి. ఇంతకు ముందు ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా), చిదంబరం స్టేడియం (చెన్నై) స్టేడియాల్లో మాత్రమే ఈ విధంగా రెండు ఇన్నింగ్స్‌లోనూ ఒకే బ్యాట్స్‌మన్ సెంచరీలు నమోదు చేశాడు. కోల్‌కతా ఐదు, చెన్నైలో రెండు పర్యాయాలు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
భారత్‌లో ఐదేళ్ల తర్వాత ఈ విధంగా ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ ఒక బ్యాట్స్‌మన్ శతకాలు నమోదు చేశాడు. ఇంతకు ముందు, 2010లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రస్తుత దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీం ఆమ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 114, రెండో ఇన్నింగ్స్‌లో 123 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. అద్భుత బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్లా ఈ సిరీస్‌లో వైఫల్యాల బాటలో నడుస్తున్నాడు.
ఓవర్‌కి ఓ పరుగు
రెండో ఇన్నింగ్స్‌లో 481 పరుగులు చేసి భారత్‌ను ఓడించడం అసాధ్యమని స్పష్టం కావడంతో దక్షిణాఫ్రికా డ్రాపై దృష్టి కేంద్రీకరించింది. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ క్రీజ్ వద్ద నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మ్యాచ్ నాలుగో రోజున 72 ఓవర్లు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 72 పరుగులు చేసింది. సగటున ఓవర్‌కు ఓ పరుగు మాత్రమే రావడం ప్రేక్షకులను ఎంత అసహనానికి గురిచేసి ఉంటుందో ఊహించుకోవచ్చు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 117.5 ఓవర్లలో 334 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 44, ఆజింక్య రహానే 127, రవిచంద్రన్ అశ్విన్ 56, కేల్ అబోట్ 5/40, డేన్ పిడిట్ 4/117).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 49.3 ఓవర్లలో 121 ఆలౌట్ (ఎబి డివిలియర్స్ 42, టెంబా బవుమా 22, రవీంద్ర జడేజా 5/30, ఉమేష్ యాదవ్ 2/32, అశ్విన్ 2/26).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 190): మురళీ విజయ్ సి విలాస్ బి మోర్కెల్ 3, శిఖర్ ధావన్ బి మోర్కెల్ 21, రోహిత్ శర్మ బి మోర్కెల్ 0, చటేశ్వర్ పుజారా బి ఇమ్రాన్ తాహిర్ 28, విరాట్ కోహ్లీ ఎల్‌బి అబోట్ 88, ఆజింక్య రహానే నాటౌట్ 100, వృద్ధిమాన్ సాహా నాటౌట్ 23, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (100.1 ఓవర్లలో 5 వికెట్లకు) 267.
వికెట్ల పతనం: 1-4, 2-8, 3-53, 4-57, 5-211.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 21-6-51-3, కేల్ అబోట్ 22-9-47-1, డేన్ పిడిట్ 18-1-53-0, ఇమ్రాన్ తాహిర్ 26.1-4-74-1, డీన్ ఎల్గార్ 13-1-40-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 481): డీన్ ఎల్గార్ సి రహానే బి అశ్విన్ 4, బవూమా బి అశ్విన్ 34, హషీం ఆమ్లా నాటౌట్ 23, డివిలియర్స్ నాటౌట్ 11, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (72 ఓవర్లలో 2 వికెట్లకు) 72.
వికెట్ల పతనం: 1-5, 2-49.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 12-7-16-0, అశ్విన్ 23-13-29-2, రవీంద్ర జడేజా 23-16-10-0, ఉమేష్ యాదవ్ 9-6-6-0, శిఖర్ ధావన్ 3-1-9-0, మురళీ విజయ్ 2-0-2-0.