రాజమండ్రి

దిబ్బరొట్టె ( కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నగారూ! ఎల్లుండి మనం షిరిడీ వెళ్లబోతున్నామని నేను పెట్టిన పోస్టింగుకి వంద లైకులొచ్చాయండీ..’ ఆనందంగా చెప్పాడు మా పెద్దోడు అభిషేక్.
‘ఏమిటో ఈ ఫేస్‌బుక్ గోల. ప్రతి చిన్న విషయాన్నీ పదిమందితో పంచుకోనిదే నిద్రపట్టదేమో నీకు’ కాస్తంతా తీక్షణంగా వాడి కళ్లల్లోకి చూశాను.
‘డాడీ! అదే పోస్టింగుకి నాకైతే 121 లైకులొచ్చాయి’ అదేదో ఘనకార్యం చేసినవాడిలా చెప్పాడు మా చిన్నోడు చంద్రకాంత్ ఉరఫ్ చందూ.
‘డాడీ, గీడీ వద్దు. ముద్దుగా తెలుగులో ఎంచక్కా నాన్నా అని పిలువు. ఆతర్వాతే నువ్వేది చెప్పినా వినేది’ కసురుకున్నాను.
‘అలాగే నాన్నా...!’ నూతిలోంచి వచ్చినట్లుంది వాడి మాట.
‘ఇలా నువ్వెన్నిసార్లు చెప్పలేదూ. అయినా ఏరోజుకారోజు నీకు కొత్తే. అసలీ ఫేస్‌బుక్‌ను ఎవడు కనిపెట్టాడ్రా? నిద్ర లేచిన దగ్గర్నుంచీ పడుకోబోయే వరకు ప్రతిఒక్కరూ ఇళ్లల్లో కంప్యూటర్స్‌కు అతుక్కుపోతున్నారు. దీనివల్ల పిల్లలు పాడైపోతున్నారు’ ఒక్కసారిగా విసుగూ, అసహనం నాలోంచి తన్నుకొచ్చాయి.
‘పోయి చదువుకో. ఈసారి సెమ్‌లో మార్కులు అదరగొట్టాలి. ఆ తర్వాత వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేయాలి. సరేనా!’ అని చందూకి చెపితే ‘ఒకే.. ష్యూర్!’ అంటూ భారత్ క్రికెటర్ అశ్విన్‌లా గాల్లో బౌలింగ్ యాక్షన్ చేస్తూ లోపలికెళ్లాడు.
***
మేము షిరిడీ వెళ్లేరోజు రానేవచ్చింది. నా శ్రీమతి, నేను కలిసి రెండు బ్యాగుల్లో సామాన్లు సర్దేశాం. రైల్లో తినేందుకు ఫలహారాలు మా అమ్మగారు సమకూర్చగా, ఇతరత్రా చిరుతిళ్లను మా పిల్లలిద్దరూ బజారుకెళ్లి కొనుక్కొచ్చుకున్నారు.
మళ్లీ మామూలే! వాట్సప్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ తాజా స్టేటస్ అప్‌డేట్ చేసేశారు.
ఆరోజు ఆదివారం. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా భోజనాలు ముగించుకుని నర్సాపూర్ - నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఆ సాయినాథుడి దర్శనానికి బయల్దేరాం. రాత్రి రైల్లో తినేందుకు డిన్నర్ ఆర్డర్ చేద్దామని మా పెద్దోడు అడిగాడు. ‘వద్దు. పొద్దున తిన్న ఫ్రైడ్ రైస్ నాకింకా అరగలేదు. నాలుగు బిస్కెట్లు తిని కోక్ తాగి పడుకుందాం’ మధ్యలో కలగజేసుకున్నాడు మా చిన్నోడు.
‘అవేమీ కాదు కానీ.. మీ బామ్మ వండిన దిబ్బరొట్టె తీసుకొచ్చా. నలుగురం తలోముక్కా తిని మజ్జిగ తాగితే కడుపులో హాయిగా ఉంటుంది’ సూచించింది మా ఆవిడ.
పిల్లలిద్దరికీ ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పిందన్న ఏకైక కారణంతో ‘సరే..!’ అంటూ తలలాడించారు.
కోచ్‌లో అంతా వెజ్ బిర్యానీలు తినడంలో నిమగ్నమయ్యారు.
‘మనం కూడా ఇక తినేద్దాం అమ్మా’.. పిల్లలిద్దరూ హడావుడి చేశారు.
మా ఆవిడ పాలిథిన్ కవర్‌లో చక్కగా చేసిన ప్యాక్‌ను విప్పుతుండగానే కోచంతా ఘుమఘుమలాడింది.
బిర్యానీలు తింటున్నవారంతా ఒక్కసారిగా తలెత్తి మావంక చూశారు.
మా ఆవిడ కళ్లల్లో ఏదో తెలియని ఆనందం.
నాలుగు పేపర్ ప్లేట్లలో నాలుగు ముక్కలు పెట్టి వెల్లుల్లి దట్టించిన ఆవకాయ పచ్చడి వేసింది నంజుకోవడానికి. ఇంకేముంది అందరి నోళ్లల్లో నీళ్లూరడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఎర్రెర్రగా కాలిన రొట్టె ముక్కను పిల్లలిద్దరూ తుంచి పచ్చట్లో అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ.. ‘వావ్.. అదుర్స్!’ అన్నారు ఒకేసారి.
‘అమ్మా! ఈ దిబ్బరొట్టె చాలా బాగుంది. మరి ఇంట్లో ఎప్పుడూ వండవేం?’ అనడిగాడు మా చిన్నోడు.
‘దూరప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా దిబ్బరొట్టెలు తీసుకెళ్లడం మీ బామ్మ అత్తగారి కాలం నుంచీ అలవాటట. మీ బామ్మ, తాతగారు ఊళ్లెళ్లేటప్పుడు ఇలాగే తీసుకెళ్లేవారు. ఆ తర్వాత మనం కూడా మీ చిన్నప్పుడు తిరుపతి, షిరిడీ, మదురై వెళ్లినప్పుడు దిబ్బరొట్టెల్ని కాల్చి తీసుకెళ్లి రైల్లో తిన్నాం. అయినా మీరు మర్చిపోయి ఉంటారులే’.. కాస్త విడమర్చి చెప్పింది.
టిఫిన్ తినడం పూర్తయింది.
‘బాహుబలి సినిమా చాలా బాగుంది.. శ్రీమంతుడు చాలాచాలా బాగుంది. మా బామ్మ చేసిన దిబ్బరొట్టె మరీమరీ మరీ బాగుంది’ అంటూ ఇద్దరూ మొబైల్‌లో ఫేస్‌బుక్ తెరిచి చకచకా స్టేటస్ అప్‌డేట్ చేసేశారు.
గంటసేపట్లోనే ఇద్దరికీ 90 వరకూ లైకులొచ్చాయి.
‘నాన్నా! ఇప్పటివరకు ఇంత స్పీడుగా లైకులొచ్చింది మన దిబ్బరొట్టెకే’.. ఆనందంగా అరిచారు. టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు ధోనీ కళ్లల్లో మెరిసే మెరుపులు మా చందూగాడి కళ్లల్లో కనిపించాయి.
***
బాబావారి దర్శనం పూర్తిచేసుకుని ఇంటికెళ్లేలోగానే దిబ్బరొట్టె మీద పెద్ద చర్చే నడిచింది మా నలుగురి మధ్యా.
అప్పటివరకు బిగ్ హాట్‌కేక్ తిన్నామని కాస్త స్టైలిష్‌గా పోస్టింగు పెట్టిన మా అభికి బోలెడన్ని ఫోన్‌కాల్స్ రావడంతో వెంటనే దాన్ని దిబ్బరొట్టెగా ఎడిట్ చేశాడు రవ్వంత గర్వంతో. రైల్లో తిరిగి వెళ్లేటప్పుడు మధ్యమధ్యలో నెట్‌వర్క్ కవరేజీ లేకపోవడంతో పిల్లలిద్దరూ ఒకింత అవహనానికి కూడా లోనయ్యారు - మంచి టాపిక్‌పై చేస్తున్న చాటింగ్‌కు బ్రేక్‌పడటంతో.
ఇంటికెళ్లాక వాళ్ల బామ్మ చేతులు పట్టుకుని ఊపేస్తూ.. ‘ఇన్నాళ్లూ ఆ దిబ్బరొట్టె రుచి మాకెందుకు చూపించలే’దంటూ గొడవ చేశారు.
‘దాందేముందిరా!.. మీకు నచ్చదేమోనని రొట్టె చేయడం మానేశాను. తింటామంటే నేనెందుకు చేయను. మళ్లీ సాయంత్రమే రొట్టె పోస్తాను. రేపు ఉదయం తిందురుగాని.. మంచి హుషారొచ్చింది మా అమ్మకు.
రేప్పొద్దున దాకా ఆగడమెందుకు? సాయంత్రమే తినేస్తాం.. ఆతృతతో అడిగాడు అభి.
‘రాత్రి రొట్టె కాల్చాక ఒక నిద్ర చేసి ఉదయం తింటే ఇంకా రుచిగా ఉంటుందిరా భడవల్లారా!’ చెప్పింది బామ్మ.
‘సరేలే బామ్మా.. అసలీ దిబ్బరొట్టె ఏ కాలం నాటిది? దీనె్నలా తయారుచేస్తారు? కాస్త వివరంగా చెబితే రాసుకుంటా’ కలం, కాగితం తీసుకొచ్చడు చందూ.
బామ్మ చెబుతుంటే మనవడు రాసుకుంటూ పోతున్నాడు ఆసక్తిగా. ఆ తర్వాత ప్లేట్లో పెట్టిన దిబ్బరొట్టెను అన్ని కోణాల్లోంచి ఫొటోలు తీశారు.
వాళ్ల బామ్మ చెప్పిన తయారీ విధానాన్ని తెలుగులో టైప్ చేసి ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌లో పెట్టారు.
కొద్దిసేపట్లోనే పోస్టింగుకు వందలాది లైకులు వచ్చిపడ్డాయి. చాలామంది పిల్లలేకాదు, పెద్దవారు కూడా ఆసక్తికరమైన కామెంట్లు రాశారు.
రెండు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లిన మా చందూను స్నేహితులంతా ప్రత్యేకంగా అభినందించారు. అసలే పోజులుకొట్టే మా చిన్నోడు అప్పట్నుంచి జోరు మరికాస్త పెంచాడు.
రెండు రోజుల తర్వాత..
ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా దిబ్బరొట్టె ఫొటోలతో ఎడాపెడా పోస్టింగులు కనిపించాయి.
వాళ్లంతా మా అమ్మ చెప్పినట్లు ఇంట్లో దిబ్బరొట్టె చేయించుకుని తిన్నాక ఆనందానుభూతితో ఆ పోస్టింగులు పెట్టినట్లు నాకు అర్థమైంది.
ఇన్నాళ్లూ ఫేస్‌బుక్ అంటే కాలక్షేపం కోసమేనన్న తలంపు నుంచి నేను మెల్లగా బయటపడ్డాను. పిజ్జాలు తప్ప అనాది కాలం నుంచి ఉన్న ఈ దిబ్బరొట్టె రుచి తెలియని వారందరికీ ఫేస్‌బుక్ చేసిన మేలును చూసి సంబరపడ్డా. అప్పుడు తెలిసింది నాకు.. సోషల్ నెట్‌వర్క వల్ల ప్రమాదాలే కాదు.. ఇలాంటి ప్రమోదాలు కూడా ఉంటాయని!

- శర్మ సిహెచ్,
చరవాణి : 9505507528
పుస్తక పరిచయం

నానీలతో ‘శ్రీశ్రీ’ని సందేశపర్చిన ‘పృధ్వి’
ప్రతులకు
పి ఉషారాణి
3-888, ఎం.జి.వీధి
రామకృష్ణానగర్
రాజమహేంద్రవరం - 1
ఫోన్: 0883 - 2461179
చెకచెకా చదివింపజేసి చకచకా ఆలోచించేలా ఉన్నాయి శ్రీశ్రీ నానీలు. చదును చేసి పదును పెట్టిన అక్షరాలు అవి మరి. చమర్చవు కాని చలింపచేస్తాయి. శ్రీశ్రీని చదవని వారు శ్రీశ్రీని తెలియని వారు ఉండరంటే ఆశ్చర్యం కదూ! శ్రీశ్రీని తెలుసుకుని ఆయనంటే ఇష్టంతోను, కవిత్వంలో ఒక ప్రక్రియలో అదీ నానీలుగా చెప్పడంలో మొదటిసారి. ఆ పనిని ముందు వరుసలో పెట్టారు ఎస్సార్ పృధ్వి. తొలి తెలుగు పాఠకుడెవడూ శ్రీశ్రీని ఎరుగకుండా ఉండలేడు. ఆయన మహాప్రస్థానాన్ని చదవకుండాను ఉండరు. ఆకాశ మార్గాన సంచరించే కవిత్వ రథాన్ని భూమార్గం పట్టించిన వాడు. అందుకే ఆయన అక్షరం పోటెత్తిన ఖడ్గం అంటున్నారు కవి పృధ్వి.
మహాప్రస్థానం కావ్యం మనల్ని ఉద్యుక్తుణ్ణి చేసి ఉద్వేగపరిచే గేయం... వస్తున్నాయి... వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. అవెలా భూమార్గం పట్టి జనం గుండెల్లో దూరాయో 4 పాదాల్లో చెప్పారు. ఆ నానీ ఇది.. ‘జగన్నాథ చక్రాలు/్భమార్గం పట్టాయి/పీడిత జనాలు/హారతి పట్టాయి’. కవితా కన్యకను వరించడానికి అక్షరాలన్నీ తారల ప్రక్క తళుక్కులీనేవి. కవిత్వమంటే అంత అందని ఎత్తు. వాటిని చిత్తు చేశాడు శ్రీశ్రీ. కవి పృధ్వి ఒక నానీలో ఈలా చెప్తున్నాడు. ‘నక్షత్రాలు/అదిరి చూశాయి/అవును/అక్షరాలా మజాకా!’ కవితా సృష్టికి కొత్త బీజం తొడిగాడు. వెదికి వెదికి పట్టుకున్నాడు. అందుకే అయ్యింది’ ఆయన కన్ను/కొత్త చూపుల గన్ను/సాటిలేనిది/శ్రీశ్రీ పెన్ను’. భావుకతను బయటపెట్టడంలో మంచి పట్టున్న వారు పృధ్వి. కవిత్వానికి అనర్హం కానిది ఏదీ లేదన్న వాణ్ణి ఎలా ఉటంకించాడో చూడండి. ‘ఈ జ్వాల/ఆనాటి అగ్గిపుల్లదే/ముట్టించిన వాడు/జగజ్జెట్టి శ్రీశ్రీ’. అగ్గిపుల్ల సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం అన్న కవిని ఎలా జ్వలింప చేశాడో ఈ నానీయే దానికి ఉదాహరణ.
పుటకి నాలుగు పాదాలున్న నానీలను మూడు వరసల్లో పేర్చి ఒక అందమైన కవితా పద చిత్రాన్ని సృష్టించడం సామాన్యం కాదు. దాన్ని అనితర సాధ్యం చేశారు సుబ్రహ్మణ్యేశ్వర్రావు గారు. మధ్యలో ఈయన పేరు ప్రస్తావనేంటని ఆశ్చర్యపోకండి పొట్టి అక్షరాల్లోని పొడుగు పేరాయనిది. శ్రీరంగం శ్రీనివాసరావంటే తెలియని వాళ్లకు శ్రీశ్రీ అనగానే ఠక్కున గుర్తొచ్చేస్తారు. అలాగే పృధ్వి అంటే చప్పున గుర్తుపట్టేయచ్చు. నానీలు సృష్టింపబడ్డాక వందల సంఖ్యలో సంపుటాలు వెలువడ్డాయి. అయితే పృధ్వియే మూడు సంపుటాలు వెలువరించారన్నది ఇక్కడ గమనార్హం. శ్రీశ్రీ గురించి పృధ్వి ఎంత అవలోకించారో ఈ నానీలు చదివితే తెలుస్తుంది. ఈ కావ్యం ముందు మాటలో నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్ గోపి గారన్నట్టు శ్రీశ్రీ నానీలు అంటే శ్రీశ్రీ కవిత్వం. శ్రీశ్రీ కవిత్వ ఫంక్తులు నానీల రూపంగా తెచ్చి మనల్ని పలకరిస్తారు కవి పృధ్వి. ఈ సందర్భంలోనే డాక్టర్ ఎన్ గోపి గారి మరో మాటను ప్రస్తావించుకోవాలి. ‘ఏ పత్రికైనా ధారావాహికంగా ప్రచురిస్తే బాగుండు’నంటారు. నిజమే ఆ పని సగం ఆంధ్రభూమి ‘మెరుపు’ పూర్తి చేయడం మన పత్రికకు గర్వకారణం.
కవి ఎలా పుట్టాలో కవి ఎలా పుడతాడో అభివ్యక్తీకరణలో ఎంత గొప్పగా చెప్పారో ఈ నానీ చూస్తే తెలుస్తుంది. ‘స్వప్నాలు పగిలించి/తూర్పుకి పయనం/వాస్తవాలు వెలిగించి/జనంలోకి జ్వలనం’. జనం కోసం పుట్టే కవి తప్పక ఇలానే జ్వలిస్తాడు. అది శ్రీశ్రీయేనని వేరేగా చెప్పనవసరం లేదు. వాస్తవమైనా ఊహైనా శబ్దాన్ని ఆశ్రయించకుండా కవితగా రూపెత్తదు. ఒకోసారి కవి ఊహాశక్తి. భావనా శక్తి, వస్తుజ్ఞానం ఉన్నంతగానే ఉండొచ్చు కానీ వాటికి తూగే శబ్ద శక్తి కవికి లేకపోతే కవిత కండ పుష్టితో జనె్మత్తదు. కావ్యాధ్యయనం లోంచే కాదు, బహుళ జనాధ్యయనం లోంచి కూడా ఈ శక్తిని చేరుకోవచ్చంటారు సుప్రసిద్ధ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. కవితను గొప్పగా పలికించే శక్తి శబ్దం. లయాత్మకంగా సాగే గుణంలోదే గేయం. అలాంటి శబ్దశక్తితో కవితలన్నీ గేయాలుగా ఆలపించుకునే కవిత్వం శ్రీశ్రీ సొంతం. ఆయనెన్నో పాటలు రాశారు. అయినప్పటికీ ఆయన కవితలు గేయాలుగా పాడుకునే గుణం అనుభవసారంగా సంపాదించుకున్న భావనా శక్తి వస్తు జ్ఞానం శబ్దశక్తి శ్రీశ్రీలో పుష్కలంగా ఉన్నాయి. వాటనన్నిటిని పుక్కిట పట్టి ప్రేరణగా కవి పృధ్వి శ్రీశ్రీ నానీల్ని చైతన్య శీలంగా అందించారు. దాన్ని ఎలా పొదిగారో చూడండి. ‘అక్షరాల నిండా/శబ్ద శక్తి/ఆలోచనల నిండా/ ఊహాశక్తి అంటూ వర్ణించారు. ‘ప్రపంచమొక / పద్మవ్యూహం / తెగించావా / తొలుగుతుంది సందేహం’ అంటారు. నిజమే మరి అలాంటి అనేకానేక విషయాలను రగిలించిన శ్రీశ్రీని బహుచక్కగా ఆవిష్కరించారు.
జన శ్రేయస్సుకు కవిత్వం ఎలా ఉపయోగపడుతుందో చెప్తూనే నూతన ప్రక్రియ గొప్పను చక్కగా విశదీకరించారు. శ్రీశ్రీని నానీని మిళితం చేసిన ఒక చక్కని నానీ... మంచికోసం / అక్షర సేద్యం / మనిషి కోసం / ఆధునిక పద్యం’. అలాగే కవి గురించి చెబుతూ మహాకవి శ్రీశ్రీ గురించి ఎలా పోలికను గుప్పెటపట్టి విప్పారో చూడండి. ‘కాలాన్ని / జయించిన వాడు - కవి / యుగాన్ని / తట్టిన వాడు - మహాకవి’/. శ్రీశ్రీ సాహిత్యాన్ని ముఖ్యంగా ‘మహాప్రస్థానాన్ని’ అవలోకించి నానీల రూపంలో మనలోకి ఆవహింప చేశారు పృధ్వి. ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీని సాహిత్యంలో మరింత సజీవ పరిచేలా మననపరిచారు. ఓ మంచి ప్రయత్నం బహుదా ఫలించాలి. ఆస్వాదించటానికి ఆరగించుకోటానికి ‘శ్రీశ్రీ నానీల’ శతకం సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు మనలోకి పునర్‌చలనం చెందే శ్రీశ్రీని ఇప్పుడు మరోసారి చైతన్యమయం చేశారు.
-రవికాంత్, 9642489244

మినీకథ

పుణ్యభూమి

చాలా సంవత్సరాల క్రితం హఠాత్తుగా రెండు దేశాల మధ్య భీకర సంగ్రామం జరిగింది. ఈ పోరులో ఒకటి గెలిచింది. ఒకటి ఓడిపోయింది. కాని ఇరువైపులా ఆయుధ నష్టం, ప్రాణనష్టం జరిగింది. వేలాది సైనికులు మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. వికలాంగులయ్యారు. పరాజయం పాలైన దేశానికి చెందిన సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. కొందరు యుద్ధఖైదీలకు పెట్టే హింసలకు భయపడి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. అలా పలాయనం చిత్తగించిన ఇద్దరు సైనికులు ఒక అడవిలో రాత్రి వేళ ప్రవేశించి తాత్కాలిక రక్షణగా ఒక కొండ గుహలో మిణుగురు పురుగుల కాంతి సహాయంతో బ్రతుకు జీవుడా అంటూ దాక్కున్నారు. ఇద్దరూ చాలా నీరసంలో ఉన్నారు. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. నిద్రాహారాలు లేక ప్రాణానికి తెగించి రాత్రింబవళ్లు మూడు దినాలు భయాందోళనలతో నడిచి నడిచి ఉన్నారేమో విపరీతంగా అలసిపోయి తూలిపోతున్నారు. అందుకే గుహలో రాళ్లపై సోలిపోయి విశ్రమించారు. కాని శతృభయం పోలేదు.
రేపు ఉదయం గుహ నుండి బయటపడి సురక్షిత ప్రదేశంలో స్థిరపడితే ప్రాణాలు దక్కుతాయని ఆలోచించుకుంటున్నారు. వారి అదృష్టం కొద్దీ గుహలో క్రూర జంతువులు, పాములు, తేళ్లు, విషకీటకాలు లేవు. కాని చీకటి దట్టంగా ఉన్నా మిణుగురు కాంతి ఉంది. ‘స్నేహితుడు తెల్లవారగానే ఈ గుహని, అడవిని వదిలి వెళ్లకపోతే ఆకలికంటే ముందు క్రూర మృగాలకు ఆహారమైపోతాము, లేదా యుద్ధ ఖైదీలుగా చిక్కిపోతాము గనుక ప్రాణానికి తెగించి కాపాడుకున్న ప్రాణాలతో మనం బతికి ఉండాలి, సహజ మరణ పర్యంతం జీవించాలి అని ఇద్దరూ ఒకరికొకరు కూడబలుక్కున్నారు. ధైర్య స్థైర్యాలు కూడదీసుకున్నారు. ఆత్మవిశ్వాసం తెచ్చుకున్నారు. తర్వాత మనల్ని రక్షించే సురక్షిత ప్రదేశం ఎక్కడ ఉంది? అన్నాడొక సైనికుడు. ‘మిత్రుడా! నా అంచనా ప్రకారం మనం ఇండియా దరిదాపుల్లో ఉన్నాము. ఆ దేశంలో ప్రవేశిస్తే మన ప్రాణాలు పోవు. దేశభద్రత దృష్ట్యా మనల్ని నిర్బంధించినా గాని ప్రాణహాని జరగదు. అన్నాడు రెండో సిఫాయి. అయినా మొదటి వాడు సంశయిస్తుంటే....
‘ఫ్రెండ్! ఎప్పుడైనా ప్రకృతి వికటించి ప్రపంచం ఎడారిగా మారిపోయినా గాని ఇండియాలో తాగడానికి నీళ్లు, తినడానికి ఫలాలు దొరుకుతాయి. భారత్ వేద భూమి, సస్యశ్యామల దేశం అంటూ నిలబడి బయటకు చూశారు. చీకటి పోయి వెలుగు రాబోతోంది. ఇద్దరూ గుహ నుండి బయటకు వచ్చేసరికి సూర్యుడు ఉదయించాడు. ఆ కాంతిలో తామున్నది భారత్ భూభాగంలోనని గ్రహించి ఆనందంతో కౌగలించుకున్నారు. తర్వాత తమ కాళ్లకి ఉన్న పాదరక్షలు తీసివేసి వేద భూమిని గౌరవించారు.

- కృష్ణ మాధవరపు,
కాకినాడ, తూ.గో. జిల్లా

మనోగీతికలు

కన్నతల్లయ్యి
కడుపు నింపుతుంది..
కష్టం చేసిన ప్రాణాన్ని
నిలుపుకునేందుకు
‘నల్ల’తో నాలుగు
మెతుకులు తింటే
కడుపునిండి చల్లగుంటుంది

బాలింత అమ్మకు
‘నేరేడొండి’ పెడితే
సేపుకొచ్చి
బుజ్జాయి బొజ్జ నింపుతుంది

‘గొడ్డు’ చాకిరిలో
పనిభారం పంచుకునోడికి
పునీళ్ల పిసరు ముద్ద
గొంతు దిగనంటే
‘గేరికాళ్ల’ కూరై
గుట్క పడుతుంది

ఎంగిలి పడతావా
పొట్టపేగులు ఉడికిన దాగుంటావా
అన్న నీ ఎగతాళికి
ఎరుకనా!
‘పొట్ట పేగులు’ గోంగూర రుచి
ఆకలి మంటకు
మండే పొట్టకు తెలుస్తుంది తప్పా...

ఎండిన డొక్కలకు
ఎంగిలి మెతుకులు దొరక్కపోతే
‘ఎండుతునక’లైన
ఎద్దుకూర
వెలివేయిబడ్డ బ్రతుకుకు
ఆసరా అవుతుంది

పాలు
జున్ను
పెరుగు
మీగడ
మజ్జిగ
వెన్న
నెయ్యి
చివరాకరకు
పంచకమంటూ
బ్రతుకున్నంత కాలం
దోచుకుతిన్నది మీరైతే
బ్రతికేదానికి
దాచుకు తిన్నది మేము

తంగేడి చెక్కెసి
‘తోలూ’నీ
చెప్పుచేసీ
డప్పేసీ చెపుతున్నా
నీ సావెట్లోకట్టి
గాటీనీ
అరకు దున్ని
కామందువైన నీకు
కాయకష్టం చేసి
కామధేనువైతే!
కుడితే తాపి
గడ్డిమేపి
పేడదీసి
పాలెరైన మాకు
కడుపు నింపి
కన్నతల్లయ్యింది!

- ముప్పవరపు కిషోర్
సెల్: 94940 94697

వాడి చిరునామా కావాలి
చదువులు కొనిపించి
కులాల మీద నడిపించి
మన మనసుల్ని మతంతో
మసి చేస్తున్న వాడి చిరునామా కావాలి!

ఆటపాటలకు దూరం చేసి
అంతరాల అంతస్థులు నిర్మించి
నేటి బాలల బాల్యాన్ని చిదిమేస్తున్న
వాడి చిరునామా కావాలి!
మాతృభాషను మృతభాషగా చేసి
నా సంస్కృతి సాంప్రదాయాలపై దాడిచేసి
నన్ను పరాయికరణ చేసిన వాడి
చిరునామా కావాలి!

విష సంస్కృతిని సూదిమందు చేసి
నా నరనరాల్లోను జవజీవాల్లోను
సత్తువ లేకుండా నన్ను నపుంసకున్ని చేసిన
వాడి చిరునామా కావాలి!
మన కాలాన్ని చిదిమేసి
సినీమాయాజాలంలో
సెల్లేంద్రజాలంలో అంతర్జాలం వలవేసి
మనల్ని సన్నాసులుగా మారుస్తున్న
వాడి చిరునామా కావాలి!

మృత్యువును ప్రాధేయపడి
ఒక్క క్షణం అనుమతి కోరి
చివరి క్షణంలో అయినా
మానవ సంబంధాలే
నిజమైన సంబంధాలని
వాడి సమాధిపై నిలబడి గొంతెత్తి
అరవాలని ఉంది..

- కె అప్పారావు (శివ), పెద్దాపురం, సెల్: 98664 98753

శాంతం
వెనె్నలలా విరబూసేది
విసుగును దూరం చేసేది
పూలతావిలా వ్యాపించి
అందరినీ ఆకర్షించేది
మదిలో మధురత నింపేది
మహనీయునిగా మార్చేది
ఆత్మీయులను పెంచేది
అసూయ-ద్వేషం తృంచేది
పగల శగలను ఆర్పేది
ఎడబాటును తొలగించేది
మనుషుల మనసులు కలిపేది
ఒకే బాటలో నడిపేది
మనిషికి వినయం తెచ్చేది
ఓర్పును నేర్పుగ నేర్పేది
నాగరికునిగా మలిచేది
నరునకు కీర్తిని ఇచ్చేది
వెలుగు బాట చూపించేది
జన్మను ధన్యం చేసేది
వసంతాన్ని మరిపించేది
శాంతం-శాంతం-శాంతం

- వెలగల
సత్యనారాయణరెడ్డి
కొంకుదురు,
బిక్కవోలు మండలం
తూర్పుగోదావరి జిల్లా

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- శర్మ సిహెచ్