రాజమండ్రి

ముద్దుముద్దు ‘మాతల’ బాలరాముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథవారి ‘అమ్మ ప్రేమ’

‘తానో‘లాములు’, తండ్రి పేరెవరయా? ‘దాచా తమలాలు’ ‘నౌ
లే నాపే ర’న ‘నమ్మగాల’నగ నోలిందల్లి ‘కౌసల్య తం
డ్రీ నాఁగా’ననఁబోయి రాక కనులన్ నీర్వెట్ట ‘గౌసల్యనేఁ
గానే కానులె యమ్మనే’యని ప్రభున్ గౌసల్యముద్దాడెడిన్!
(రామాయణ కల్పవృక్షం - బాలకాండ - అవతార ఖండం - 334వ పద్యం)

లేలేత బాల్యదశలోని చిన్నారి రాముని మూడు- మూడున్నరేండ్ల ప్రాయపు ముగ్ధ సుకుమారపు ముచ్చట్ల, మురిపాల, వచ్చీరాని ముద్దుముద్దు మాటలను విని కౌసల్య అనిర్వచనీయ ఆహ్లాద, అనుభూతులతో పొంగిపోతున్న ఘట్టమిది. సార్వజనీన, సార్వకాలిక, సహజ భాష, సరళ భాషా సౌందర్య సమన్వితంగా విశ్వనాథవారు ఈ పద్యరచన చేశారు.
కౌసల్య, రాముల సంభాషణ ఇలా సాగిందట.
కౌసల్య: నాన్నా నీపేరేమిటి?
రాముడు: ‘లాములు’
కౌసల్య: నీ తండ్రి పేరేమిటి? ఎవరు?
రాముడు: ‘దాచాత మాలాలు’ (దశరథ మహారాజు)
కౌసల్య: సరే. మరి నాపేరు?
రాముడు: ‘అమ్మగాలు’ (అమ్మగారు)
కౌసల్య: కౌసల్య కదా నాన్నా?’
కౌసల్య రుూ మాట అనేసరికి రాముడికేడుపొచ్చింది. కళ్ల వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. కొన్ని అడుగుల దూరంగా వెళ్లిపోయి నుంచున్నాడు- బిక్క మొహంతో. కౌసల్యకు దగ్గరగా రాలేదు. కౌసల్యకు రాముడి మనసులోని బాధ అర్థమయింది. తన చిన్నారి తనయుని పసిమనసుకు తన ఒక్కమాటలో ధ్వనించిన అనాత్మీయతా భావం ఏమిటో కౌసల్య మనసుకు తట్టింది. ‘ఈమె తన అమ్మకాదా? కౌసల్య అని ఏదో పేరు చెబుతోందేమిటి? అమ్మ అనేదానిలో తాను అనుభవిస్తున్న సొంతదనం కౌసల్య అనటంలో ఎక్కడుంది? పైగా తానెప్పుడూ ఆ పేరు విన్నట్టు, అన్నట్టూ లేదే! తనకు తెలిసింది ‘అమ్మ’ మాత్రమే. తాను పిలిచేది ‘అమ్మా!’ అని మాత్రమే. ‘కౌసల్య’ అనటంలో తనకు ఏర్పడుతున్న ఈ పరస్పర తాభావనా పూర్వక ఎడబాటు ఏమిటి ఉన్నట్టుండి’ అనే మూగబాధతో తన చిన్నారి రాముని లేతమనసు విలవిలలాడిపోయిందని గ్రహించింది కౌసల్య. వెంటనే ‘నేను కౌసల్యను కాదులే నాన్నా! మీ అమ్మనే’.. అంటూ కౌసల్య తన బిడ్డడిని ముద్దులతో ముంచెత్తింది.
ఈ పద్యంలో మహాకవి విశ్వనాథ లోకజ్ఞతాపరంగా, భాషాపరంగా, భావపరంగా, అనుభూతిపరంగా అద్భుత రచనా శిల్పం చూపించారు.
విశ్వనాథ తన రామాయణంలో సీత, రామాది పాత్రలను అన్నింటినీ నూటికి నూరు పైసలు తెలుగింటి వ్యక్తులుగానే, తెలుగువారల ఆచారాలు, భాషా కాకువులు, సుడికారాలతో నిండి ఉన్నవారుగానే చూపించారు. అది విశ్వనాథ తన మాతృభాష విషయంలో పెంచుకున్న ఆత్మీయత.
‘లాములు’, ‘దాచాత మాలాలు’, ‘అమ్మగాలు’ పదాలు సుందర్భోచిత, పాత్రోచిత సహజ సుందరంగా అమరి, ఇమిడిపోయాయి. ‘దశరథ మహారాజు’ అంటే వచ్చే గణభంగ ప్రమాదాన్ని అలవోకగా సముద్రాన్ని దాటిన హనుమంతునిలాగ దాటేశారు ‘దాచాత మాలాలు’ అనే ముద్దులు మూటగట్టే ముచ్చటైన బాల్యదశా ఉచ్ఛారణా సహజ సౌందర్యపు పంచదారపూతతో! ముఖాముఖి సంభాషణలు ఎప్పుడూ పొడిపొడి మాటల్లోనే ఉంటాయి. ఈ పద్యంలోని తల్లీబిడ్డల ప్రశ్నలు, సమాధానాలు క్రియా పదాలు లేకుండా చాలా తక్కువ పదాలతో సాగిపోయాయి. సందర్భోచిత సంభాషణా సహజ సౌందర్యానికి ఇదీ ఒక ఉదాహరణ. రాముడు కౌసల్య పేరు ‘అమ్మ’ అని చెప్తే కౌసల్య ‘కాదు, నేను కౌసల్యను’ అనగానే రాముడు సంక్షుభితుడైపోయాడు అనే ఊహే అద్భుత గంభీరత, సుందర భావన, అర్ధ్రతాభావాల సమ్మేళనం.
‘ఆత్మావైపుత్రనామాసి (మనిషి యొక్క ఆత్మయే పుత్రుడు) అంటుంది ఉపనిషత్తు. పరమాత్మ యొక్క ఒక సూక్ష్మాంశమే జీవాత్మ అంటుంది వేద వాఙ్మయం. ఏకాత్మతాభావం అమ్మ అనే ఆత్మీయ పదంలో ఉన్నదిగానీ రాముడు, కౌసల్య అంటూ వ్యక్తీకరించే రూప నామ భావార్థాల్లో లేదు. ‘మరి అమ్మ అనే ఈ జీవి పరమాత్మ అయిన తనకు, జీవాత్మ అయిన అమ్మకు తేడాగా రుూ ప్రాపంచిక భావంలో మాట్లాడుతోందేమిటి?’ అంటూ పరమాత్ముడు జీవాత్మ వైపు చూసి ద్రవించిపోయాడు. ఈవిధమైన పరోక్ష గంభీరార్థం కూడా ఇమిడి ఉంది. ఇది విశ్వనాథవారు తరచుగా ప్రస్తావిస్తూ ఉండే ‘జీవుని వేదన’ - పరమాత్మ వైపు నుంచి. ఇదొక చమత్కారం. (ఆయన తన సంభాషణల్లో తరచూ వాడుతూ ఉండే పదం)
రాజుల ఇళ్లలో, క్షత్రియ కుటుంబాల్లో అమ్మను గూడా ‘అమ్మగారూ’ అనే పిలుస్తారు. ఇక్కడ రాముడు కూడా ‘అమ్మగాలు’ అనే అంటాడు. ఇది కవి లోకజ్ఞతకు చక్కని తార్కాణం.
పద్యం చివరలో ‘ప్రభున్’ అన్నాడు కల్పవృక్ష కవి. ‘సుతున్’ అని గాని, ‘శిశున్’ అనిగాని అనలేదు. కౌసల్య మనసుకు రాముడు కేవలం కొడుకు మాత్రమే కాదు, ప్రభువు! ‘ప్రభవతి సమర్థ్భోవతి - ఇతి ప్రభుః, సమర్థుడైన వాడు’ అని ప్రభువు పదానికి అర్థం. రాజు అని కూడా. ప్రతి తల్లీ తన కొడుకును ముద్దాడుతున్నప్పుడు ‘మా మహారాజు! మా దొరబాబు! పెద్దైతే ఏమైనా సాధిస్తాడు. రేపు అన్నిట్లోనూ అగ్రేసరుడై ఉంటాడు. నా బంగారు కొండ’.. అంటూ ఉంటుంది. ఇది ప్రతి తల్లికీ తన బిడ్డడి మీద ఉండే (ఆశీర్బల) విశ్వాసం, ఆశ. ఈ మాతృ సహజ భావనే కౌసల్యకు కూడా ఉన్నదని చెప్పటం కోసం విశ్వనాథ ఇక్కడ ‘ప్రభు’ శబ్దం మాత్రమే వాడారు.
‘ముద్దాడెడిన్’ అన్నారు విశ్వనాథ. ముద్దు పెట్టుకోవటం వేరు. ముద్దాడటం వేరు. ముద్దు పెట్టుకోవటం అంటే ఒక్క ముద్దు అని మాత్రమే అర్థం. ముద్దాడటం అంటే ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ బుజ్జగిస్తూ కొన్ని నిముషాలు గడపటం. రాముడి ఆత్మీయతా భావ దుఃఖాశ్రువులను, బిక్క మొహాన్ని, బుంగమూతిని చూసేసరికి తన రాముడిని ఒక్కసారి ముద్దు పెట్టుకోవటంతో కౌసల్యకు తనివి తీరలేదు. ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎంతగానో బుజ్జగించింది. పిల్లవాడు అలిగినప్పుడు, బుంగమూతి పెట్టినప్పుడు, కన్నీటి బొట్లు బొటబొటా కార్చినప్పుడు ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. ఇంత విస్తృత సహజ సుందర భావం ఉంది ‘ముద్దాడెడిన్’ అని కవి అనటంలో. ఇలా పద్యపు ముగింపు పదంలో కూడా - అంటే - చిట్టచివరి పదంలో కూడా విస్తృతార్థాన్ని ధ్వనింపజేయటం విశ్వనాథకు వెన్నతో బెట్టిన విద్య.
ఈ పద్యంలో కనిపించేది తెలుగు రాముడు - భాషా పరంగా. ఈ విశ్వనాథ ‘రాముడు’ పిల్లలు, పాపలు గలగలలాడుతుండే ప్రతి ఇంట్లోని అలకల రాముడు. ముద్దాడేది మా అమ్మ, మీ అమ్మ, అందరి అమ్మ. సహజ సుందరత తెలుగమ్మలది. ఇక భావానుభూతి రసజ్ఞుడైన ప్రతి పాఠకుడిది. ముద్ర మాత్రం విశ్వనాథది. విశ్వనాథ తానె పోతనకు సాటి. (తానె పోతనకు సాటి, తానెపో తనకుసాటి).

- శ్రీపతి పండితార్యాధుల పార్వతీశం,
హైదరాబాద్.
చరవాణి : 9849779290

పుస్తక సమీక్ష

‘మద్యపానమా?
మానవత్వమా?’
ప్రతులకు:
గౌరవ్,
మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ
సెల్:9032084494

సారా, బ్రాంది, కల్లు, విస్కీ ఏదైనా మద్యం కిందకు వచ్చే మత్తు పదార్థం. నిషానిచ్చే పానీయం. దీనివలన కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడం, బంధాలు తెగిపోవడం, వ్యక్తులు మానసికంగా నష్టపోవడం జరుగుతున్న పరిణామక్రమం. వ్యత్యాసాలు, తారతమ్యాలు లేని కొత్త సంస్కృతికి బీజం ప్రభుత్వ విధానం. బార్లకు బార్లా తెరిచింది సర్కారు. బ్రాందీ షాపులకు పర్మిట్ రూంల వెసులుబాటులో విశాలమైన సీటింగ్ సౌకర్యం దురాచారం కాకుండా గ్రామాలకు బెల్టుషాపులు. ఇలా ప్రజల వద్దకు మద్యాన్ని ఎంత చేరువచేసిందో చూడండి. ఆ ఊరిలోని సారా అంగడి తమ వాళ్లను మృత్యువుపాలు చేసే పిశాచి. ఆ వూరి (గ్రామం) దూబగుంట. సారాభూతాన్ని తరిమికొట్టాలనుకొన్నది రోశమ్మ. కొంగుబిగించింది. కొంపలు ఆర్పే సారా రాక్షసిని పారద్రోలింది. అది ఒకప్పటి కథ.
అయితే తను మరణశయ్యపై ఉన్నా సంపూర్ణ నిషేధాన్ని కోరిన మహిళ. ఆమెకు నివాళిగా ‘మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి’ ‘మద్యపానమా? మానవత్వమా?’ వ్యాస సంపుటిని వెలువరించింది. గౌరవ్ చేసిన ఈ సంకలనంలో తెలుగు రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి ఉద్యమకారలు, భావోద్యమకారులు పదిమంది ఇందులో పాలుపంచుకున్నారు. చివర్న అనుబంధంగా ‘మద్యపాని’ కథను చేర్చారు.
మద్యంపై ప్రభుత్వ వైఖరిని పాలకుల అలసత్వాన్ని ఎండగడుతూ ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు కోరుతూ రాసిన వ్యాసాలు తప్పక పరిశీలించాలి. ఆహ్వానించాలి. కుల నిర్మూలన సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగేశ్వర్ రాసిన ‘మద్యపానం ఒక పరిశీలన’లో బహిరంగంగా మద్యాన్ని విక్రయించడంవల్ల సమాజంలో 70 శాతం మంది కష్టజీవులు, పేదలు తాగుబోతులవుతున్నారంటారు.
ఆ మద్యంవల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. అందుకే స్ర్తికి మద్యం ప్రథమ శత్రువు అంటారు. పీడిత ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్న పాలకుల మద్యం పాలసీలను తిప్పికొట్టండి అంటూ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ ఆలోచించాలనే వ్యాసాన్ని అందించారు. 1992 నుంచి మద్యం వ్యతిరేక పోరాటాన్ని, ఉద్యమం చేసి మద్య నిషేధమే కాదు తయారీని ఆపేయాలనే డిమాండు కారణంగా 1994లో టిడిపి ప్రభుత్వం నిషేధం విధించిందంటారు. పార్టీ ఆంతరంగిక పరిణామాల్లో ఎన్టీఆర్‌ను దించి, బాబు గద్దెనెక్కి రెవిన్యూ లోటు అంటూ అంచెలంచెలుగా నిషేధాన్ని ఎత్తేశారంటారు. దానికిదే ఉదాహరణ 1992లో 98 కోట్ల ఆదాయం వస్తే 2013కి 27వేల కోట్లకు చేరుకోవడం దేనికి దారితీస్తుందో ఊహించవచ్చు. ప్రజల ఆరోగ్యం కన్నా ప్రభుత్వ ఆదాయం మిన్నగా నడుస్తుంది. త్వరలో టీ, కాఫీలు అమ్మే వెండింగ్ మెషిన్ల తరహాలో వైన్, బీరులను అమ్మే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరులో వెండింగ్ వైన్స్ ఉన్నాయి. ప్రత్యేకావసరాన్ని గుర్తించారు కనుకనే ‘కుటుంబానికో రోశమ్మ కావాలి’ అంటారు డాక్టర్ పుట్ల హేమలత. ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేస్తున్నారు. రోశమ్మ ఉద్యమ కారకురాలు ఎందుకయిందో వంటి అనేక విషయాలు వ్యాసంలో సృజించారు.
‘మద్య నిషేధంపై ఎందుకింత అలసత్వం’ అని డా.డి.ఎల్.విద్య ప్రభుత్వ సంకుచిత విధానాలపై ధ్వజమెత్తిన వ్యాసం ఇది. ప్రత్యేక అంశంతో ప్రస్తావించిన విషయాలున్నాయి. తెలుగు పత్రికల పాఠకులు గ్రహింపులో కొత్తపుంతలు తొక్కి మరింత అవగాహనను తమ తోటివారికి అందించే ప్రయత్నంగా దీన్ని రాశారు. ‘సోషల్ డ్రింకింగ్’ మీద ఓ మంచి చర్చనీయాంశ విషయాన్ని తెలిపారు. యువతులు మాత్రం అటువంటి వార్ని పెళ్లి చేసుకోమని సోషల్ మీడియాలోను తమ గళాలు విప్పుతున్నారు. అది పెద్ద నినాదమై ఉద్యమ స్థాయిని అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇక ‘మద్య నిషేధం - ఓ చర్చ’ను రసవత్తరంగా రాశారు సాంస్కృతిక కార్యకర్త దేవి. మద్యం ఎవరికి నష్టం, ఎవరికి లాభం. దానివలన కలిగే ప్రయోజనాలను బాగా చర్చించారు. ఇక్కడొక రెండు వాక్యాలు రాసి చర్చను ఆసక్తికరంచేశారు. చూడండి.
‘మద్య వ్యతిరేక ప్రచారం ఒక ఆత్మ నిగ్రహానికి సంబంధించిన వ్యవహారంగా చేరడం అంటే కొన్ని తరగతుల వారికి నైతిక ఆధిపత్యం కట్టబెట్టడమే. కొన్ని రకాల జీవనశైలులను అందరిపైనా రుద్దడమే. మద్యాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఎక్కువగా చేస్తున్న పొరపాటు ఇదే. ఇది ప్రభుత్వం నెత్తిన పాలు పోసినట్టే. మద్య వ్యతిరేకతను కూడగట్టే ప్రయత్నాలకు పురిట్లోనే సంధి కొట్టినట్టే. సమాజంలోని పలురకాల వివక్షలను కాచి, వడబోసినట్టు చెప్పారు. మనుషుల మానసిక, సామాజిక స్థితిగతులను బేరీజు వేయడానికి అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ పుస్తకంలో ఉపాసిక షర్మిల, అఖిల భారత మహిళా సాంస్కృతిక రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ ప్రమీల, ప్రగతిశీల మహిళా సంఘం సంధ్య, ఆదివాసి మహిళా సంఘం కన్వీనర్ ఆత్రం సుగుణల వ్యాసాలు మద్యపాన ఉద్యమానికి మరింత దోహదకారి కాగలవు.

- రవికాంత్, 9642489244

చిన్న కథ

నేనే తప్పుచేశాను!

‘బావని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని, అలాకాకుండా వేరెవరినో చేస్తే ఆత్మహత్య చేసుకుని చస్తానని’ బెదిరించింది తండ్రిని అమ్ములు.
మేనల్లుడు చంటితో కూతురి పెళ్లి ఘనంగా జరిపించి ‘ఇక జీవితంలో మీరిద్దరూ నా కళ్లపడకూడద’ని శాసించాడు పరంధామయ్య. ఏడాది తరువాత ఒంటరిగా తిరిగి వచ్చింది కూతురు. ‘అమ్ములికి జబ్బు చేసింది. బతికించడానికి ఇరవై లక్షలు ఖర్చయింది. తనను తాను ఒక ధనవంతురాలికి అమ్ముకుని అమ్ములిని బతికించాడు. వాడిప్పుడు ఈ దేశంలోనే లేడు’ అమ్ములిని పుట్టింట్లో దింపిన సౌమిత్రి చెప్పిన కథ ఇది. ‘ఆ వెధవ నా కూతుర్ని మోసం చేసి డబ్బున్నదానితో లేచిపోయాడు’ రంకెవేశాడు పరంధామయ్య.
‘నేను బతికి వున్నంతవరకు నిన్ను విడిచిపెట్టను. ఏ కారణంగానైనా నేను నీకు దూరమైతే నువ్వు మీ నాన్న దగ్గరకి వెళ్లిపోతానని మాటివ్వు’ అని చంటి అడిగినపుడు అలాగేనని వాగ్దానం చేసింది అమ్ములు.
అందుకే పుట్టింటికి చేరింది.
‘చంటిని వాడి మామగారు మోసగాడని తిడుతుంటే భరించలేకపోతున్నానురా’ అని సౌమిత్రి ఏడుస్తుంటే ‘వాడు చేసిన పని మాక్కూడా నచ్చలేదురా’ అన్నారు అతని మిత్రులంతా.
దానితో అసలు విషయం చెప్పేసి భోరుమన్నాడు సౌమిత్రి. ‘అమ్ములుని దక్కించుకోడానికి వేరే రాష్ట్రానికి పోయి తన రెండు కిడ్నీలు, డబ్బులూ ఇచ్చి అమ్ములి ప్రాణం కాపాడిన అతను ఒక నక్షత్రకుడిని వాడి వెంట పంపి కిడ్నీలు తెప్పించుకుని తన కొడుకుని బతికించుకున్నాడురా. ‘నేను చేస్తోంది ఎంత తప్పుపనో నాకు తెలుసు. కానీ నా కొడుకు చనిపోతే నేను...’ అంటూ ఆయన ఏడుస్తుంటే మన చంటి ఓదార్చాడురా. నేను ఎంతగా చెప్పినా వినలేదురా. అమ్ములు చనిపోతే నేను బతకడం అనవసరం అన్నాడు. నువ్వు లేకుంటే అమ్ములు కూడా బతకదురా’ అంటే ‘నేను డబ్బుకోసం అమ్ముడు పోయానని, అదీ తనను బతికించుకోడానికేనని నచ్చచెప్పి.. తనని వాళ్ల నాన్నకి అప్పగించరా’ అన్నాడు.
విషయం బయటికి పొక్కింది. అమ్ములికి అసలు విషయం తెలిసింది. అమ్ములికి మొదటి నుంచీ తనను వదిలి చంటి మరో అమ్మాయితో ఉంటున్నాడంటే అసలు నమ్మకం కుదరడం లేదు. ‘నువ్వు లేని లోకంలో నేనెందుకుంటాను?’ అని విషయం తండ్రికి చీటీ రాసి ఆత్మహత్య చేసుకుంది. ‘అసలు తప్పు చేసింది నేను. ఇద్దరినీ దగ్గరుంచుకుంటే ఇలా జరిగేది కాదు’ అనుకున్నాడు పశ్చాత్తాపంతో పరంధామయ్య!
- జ్యోతిర్మయి, విజయవాడ.

నివాళి

స్ఫూర్తి ప్రదాత

ఆడపిల్ల అందాల ఆటబొమ్మ అనే
సమాజానికి తన సాహిత్యంలో
అతివను ఇంద్రధనుస్సులా
ఆవిష్కరించిన ఆధునిక యుగకర్త!
ముక్కుపచ్చలారని వయసున
ముదుసలితో మనువైనా
కన్యాశుల్కపు కోరలలో
పసిప్రాయం బూడిదైనా
ఆచారాల సంప్రదాయాన్ని నిలబెట్టిన
ముద్దుగుమ్మ పూర్ణమ్మ!
చదువనేర్చిన గడసరితనం
వంటింట్లో మగ్గిపోతూంటే
పొయ్యూదుకుంటూ -
రుబ్బురాయ తిప్పుకుంటూ
కన్నీళ్ళను మోచేతితో తుడుచుకునే -
బేల బుచ్చమ్మ!
మూఢాచారాల, మత దురహంకారాన
దిక్కుతోచక అల్లాడిన
కుటుంబ మగ మహారాజుల
రెపరెపలాడే ప్రాణాలను నిలిపిన తెగువరి - నాంచారమ్మ
మరో మగువపై మనసుపడే మగని
సుతిమెత్తగా దారికితెచ్చి
భార్యలు ‘బెటర్ హాఫ్’లు అనిపించిన -
గడసరి కమలిని!
చాందసాన గ్రాంథికానికి పెద్దపీట వేసిన
మహాకవుల బాటమార్చి
పదిమంది నడవాల్సిన త్రోవ చూపిన
వ్యావహారిక భాషోద్యమకర్త!
ఇంటితోపాటు దేశాన్ని, ప్రపంచాన్ని గెలిచి
యెల్లలోకములొక్క యల్లన్న వసుధైక కుటుంబ పెద్ద!
కనుమరుగై వంద వత్సరాలు
మచ్చుకైనా కానరావు ఆనాటి ఆచారాలు
కానీ సమస్యలు రూపాల్ని మార్చుకున్నాయ
ఆడదంటే అందాల అంగడి బొమ్మ ఈనాడు!
ఆసిడ్ దాడుల, లైంగిక వేధింపుల, మానభంగాల -
హత్యల, ఆత్మహత్యల - ముప్పేట దాడిలో
ముదితకు రక్షణ లేని - నవజీవన విధానం!
ఆకాశంలో సగభాగానివి.
అందుకో... అవకాశాలివిగో...!
అని ఊరించి ఎండమావులను చూపే -
కాలుష్య ప్రపంచం!
అవరోధాలను అధిగమించి -
విచక్షణతో మసలుకునే తరుణమిది!
స్ఫూర్తి ప్రదాతను తలచుకుని
ఆకాశాన్ని అందుకునే సమయమిది!
ఆడదంటే శక్తి ప్రతీక - సకల విద్యాపారంగత
ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది
రేపటి తరానికి ఆమె ప్రతీక!

- చివుకుల శ్రీలక్ష్మి, విజయనగరం, 9441957325

మనోగీతికలు

ప్రభాతం
ప్రకృతి పులకించేవేళ
సుందర ప్రభాతకాలం
పక్షుల కిలకిలరావాలు
తూర్పున వెలుగు రేఖలు
చల్లని గాలుల మెల్లని
అలలుగా పయనం
పొలాల సువర్ణ కంబళి
కప్పుకొన్నది నేలతల్లి!
చెట్టూ చేమా
మంచుముత్యాలతో మురిపెంగా
కలువలూ పద్మాల మధ్య
నీటి పక్షుల కలకలం
ప్రకృతిమాత
గొప్ప సౌందర్యదేవత
నా హృదయానందాన్ని స్వాగతిస్తూ
ఉదయించింది!

- మహోదయ
సెల్:94412 65545

మాటంటే మాటే
మాటంటే సూదంటురాయి
ఆకర్షిస్తుంది వికర్షిస్తుంది
మాటంటే బాణం
దూసుకెళ్తుంది దూసుకొస్తుంది
మాటంటే తాయిలం
ఊరిస్తుంది ఊగిస్తుంది
మాటంటే సంజీవిని
ఊరడిస్తుంది ఊపిరిపోస్తుంది
మాటంటే పరుసవేది
మనిషిని బంగారం చేస్తుంది

- శంకర వెంకట నారాయణరావు
బ్రాహ్మణవీధి, ఆచంట, ప.గో.జిల్లా
సెల్:9959163676

అభ్యర్థన
రతీదేవి మగడా
సంపంగి వీరుడా
చెరకు విలుకాడా
ఓ మన్మథా! ఒక విజ్ఞప్తి
కుసుమ శరాలు సంధించి
నీ సేనతో వేధించి
మానవాళిని రెచ్చగొట్టకు!
యువతను అతిగా ప్రేరేపించకు
పరిధి దాటనివ్వకు
కాదంటే
వయోభేదం, వావివరసలుండవు
కన్నూమిన్నూ కానని కామతృష్ణకి
ఆడది కనిపిస్తే చాలు
అడ్డూ అదుపూ లేని
రాక్షస అత్యాచార దురంతాలు
బీభత్సంగా జరిగిపోతాయి
జరిగిపోతున్నాయి కూడా!
దానికి బాధ్యుడివి నువ్వే కాదు
ఆధునిక నాగరికత కూడా..

- కృష్ణ మాధవరపు
కాకినాడ,
సెల్:89854 92283

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- శ్రీపతి పండితార్యాధుల పార్వతీశం