రాజమండ్రి

అద్వైతం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇదిగో మామా! పొయ్యి మీద కాగులో యేన్నీళ్లు కాగుతున్నాయి. ఈ బక్కెట్లో వంపి ఇస్తానుండు. కాసిని యేన్నీళ్లు పోసుకుంటే వళ్లు నొప్పులవీ తగ్గుతాయి కదా’ అంది మెల్లిగా. ‘ఒసేయ్! గుళ్లో ఈయాళ ఎంత వైభోగంగా ఉంటుందో? పెందలకాడే ఎల్లిపోవాలి, నీతో ఊసులాడ్తే నాకాలస్యం అయిపోతుంది’ అంటూ నాల్గు బాల్చీలు తోడుకొని ‘తానం చేసి ఐదే నిమిషాల్లో వస్తాను, ఈలోగా టీ కాయివే’ అంటూ భార్యని పురమాయించాడు. ఇక అనేందుకేమీ లేక, గబగబా ప్రక్కనే ఉన్న బడ్డీకొట్టు దగ్గరున్న పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టింది. ఈలోగా స్నానం చేసి మంచి బట్టలేసుకొని విభూది నామాలు పెట్టుకొని, దొడ్లో పూలన్నీ ఓ కవర్లో వేసుకొని ‘గంగీ! టీ కాగిందా?’ కంగారు పెట్టాడు. ఉరుక్కొంటూ తెచ్చిచ్చింది. ‘ఏంది మావా నీ హడావిడి. పొద్దునే్న కానె్వంటు పిల్లలను తీసుకెళ్లాలి కదా! ఆ శివాలయంలోకెళ్లావంటే, నీవు మనిషిలా ఉండవ్! రాత్రికే రాక! పిల్లలంతా నీ రిక్షా కోసం ఎదురుచూస్తుంటారు‘ గంగమ్మ కోపంగా అడిగింది. ‘ఇయాల్టికి మన పెద్దోణ్ణి రిక్షా తీయమనవే, నాకు లేటవుతుంది’ గబగబా సైకిలెక్కి వేగంగా శివాలయం సందులోకి వెళ్లాడు.
గంగమ్మ, సాంబయ్య భార్యాభర్తలు. సాంబయ్య తనకి ఊహవచ్చిన దగ్గరనుండి శివుడే నాకు అన్నీ అంటూ ఇంటి పట్టున ఉండేవాడు కాదట. గంగమ్మకి అత్త చెప్పింది. బడికెళ్లకుండా గుడికెళ్లి కూర్చునేవాడట. శివాలయంలోని పెద్ద అయ్యగారు చంద్రవౌళీ గారే గుళ్లోనే కాస్త అక్షరం ముక్కలు నేర్పారు. చదవటం వచ్చుగానీ రాయలేడు. అలాగే పెరిగి పెద్దయి ఆ అయ్యవారి పుణ్యమా అని డబ్బు సంపాదించకపోతే అన్నమెవరూ పెట్టరని భయపెడితే రిక్షా తొక్కటం మొదలుపెట్టాడు. గుళ్లో ఉత్సవాలున్నప్పుడు మాత్రం మానేసేవాడు. మేనత్త కూతుర్ని చేసుకున్నాడు. ఓ ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు, అంతా కష్టపడతారు. కూతురి పెళ్లి, పెద్ద కొడుకు పెళ్లి అయ్యింది. చిన్న కొడుక్కి చదువంటే ఇష్టమవటంతో చదువుకొంటున్నాడు. పెద్ద కొడుకు మాత్రం తండ్రిని ఇంక రిక్షా తొక్కద్దని గట్టిగా చెప్పటంతో కొన్ని తగ్గించుకొన్నాడు. ఓ పదిమంది పిల్లల్ని మాత్రం కానె్వంట్‌కి తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. శివాలయం రానే వచ్చింది. సైకిల్ లోపల పెట్టి పంపు దగ్గర కాళ్లు, చేతులు కడుక్కుని, లోపలికెళ్లాడు సాంబయ్య. శివయ్య ఎదురొచ్చాడు. పక్కనే ఆనుకుని ఉన్న వెంకటేశ్వరస్వామి గుళ్లో పనులు శివయ్య చేస్తుంటాడు. చంద్రవౌళయ్యవారు నీ కోసం రెండుసార్లు అడిగారు వస్తాడా? అసలే రాత్రి జ్వరం. మందు బిళ్ల ఇచ్చాను వేసుకొన్నాడో లేదో మొండాడు అన్నారు బాబాయ్! నాకక్కడ ఏకాదశి, శనివారంతో బాగా జనాలు, ఖాళీలేదు. యెళ్లి అయ్యోరికి కనిపించు, అంటూ ప్రక్క గుళ్లోకెళ్లిపోయాడు శివయ్య.
చంద్రవౌళిగారెదురొచ్చారు. ‘ఏరా! లేచావా! వస్తావో రావో బోలెడు పనులున్నాయి అనుకుంటున్నాను. పదపద అక్కడ మారేడు దళాలు వలవాలి, ఇక్కడ కొబ్బరికాయలు కొన్ని వొలిచి ఇవ్వాలి. తర్వాత మంటపాన్ని శుభ్రంచేసి, మామిడి తోరణాలు కట్టాలి. సాంబయ్య నవ్వుతూ అందుకొన్నాడు. నమశ్శివాయ అనుకొంటూ ఓ గంటలో వారు చెప్పిన పనులన్నీ చేసేశాడు. ఓవైపు శివుడికి అభిషేకాలు జరిపించుకొంటున్నారు. కొందరు నవగ్రహాల దగ్గర అభిషేకాలు, రాహుకేతు పూజలు చేస్తున్నారు. ఒక్కసారి లోనకెళ్లి నా శివుణ్ణి తనివితీరా దర్శనం చేసుకొని రావాలని లోపలకెళ్లాడు. స్వామి అలంకరణలో కన్నుల పండువగా ఉన్నాడు. ఉత్తి రోజుల్లో ఇంత అలంకరణ ఉండదు నా సామికి. ఏకాదశి కార్తీకమాసం, మాసశివరాత్రి, శివరాత్రిళ్లపుడు తప్పితే జనం కూడా పూజలు, అభిషేకాలు ఏవీ చేయించుకోరు. పక్కనున్న ఏడుకొండల సామికేమో ఈ ఎర్రిజనాలు ఎప్పుడూ పూజలు, పెసాదాలు, నిత్య కల్యాణంలా ఉంటుంది ఆ గుడి. శివయ్య వేళాకోళాలాడ్తాడు బాబాయ్! మీ శివయ్యకి మాత్రం నాల్గు ఆకులు, కాసిని నీళ్లే పోస్తారని దానికి చాలా బాధపడి చంద్రవౌళిగారి దగ్గరకెళ్లి అడిగేవాడు. అయ్యవారూ! శివయ్య నా శివుణ్ణి ఇలా అంటున్నాడని, ఆయననేవారు. అక్కడ గుళ్లో ఏడుకొండలసామికి పూలు, పండ్లు ఇచ్చినా ఈ శివుడికిచ్చినట్టే. దేవుడు ఒక్కడేరా! ఏది చేసినా ఇద్దరికీ చెందుతుందని,
కార్తీకమాసం వచ్చిందంటే ఎనె్నన్ని మైళ్లో సైకిల్ తొక్కి బస్తాల కొద్దీ (చెట్టెక్కి) మారేడు దళాలు, మామిడాకులు కోసుకొచ్చి తోరణాలు కట్టి లక్ష పత్రి పూజకు ఆకులన్నీ వలిచి పెట్టేవాడు. గుడంతా బంతిపూలతో అలంకరించేవాడు. దగ్గర దగ్గర యాభై ఏళ్లు దాటుతున్నాయి. ఓసారి చెట్లెక్కి మారేడు దళాలు కోస్తుంటే కరెంట్ షాక్ కొట్టి కిందపడ్డాడు. ఆ శివుడి దయ వలన గట్టి దెబ్బలయితే తగల్లేదు. కానీ ఇంట్లో, గుళ్లో మాత్రం బాగా చీవాట్లు తిన్నాడు.
నీకంటే వయస్సులో పెద్దోడు. ఒక పని చెప్తే పది పనులు చెప్పకుండానే అందిపచ్చుకుంటాడు అతన్ని చూసి నేర్చుకో అని ఎప్పుడైనా శివయ్య వచ్చి కాస్త సాయం చెయ్యవా అడగటం ఆలస్యం, వెంటనే వెళ్లి చేసి వచ్చేవాడు. అక్కడి వైభోగం, ఆ హడావిడి చూసి మాత్రం నా శివుణ్ణి ఎవరూ ఎందుకు పట్టించుకోవడంలేదని బాధపడేవాడు అంత ఆరాధన శివుడంటే.
తర్వాత బ్రహ్మోత్సవాలు వెంకన్న బాబుకి మొదలైనాయి. జనం ఎక్కడెక్కడి నుండో రాసాగారు. ఇక్కడ పెద్దగా పనులుండవుగానీ అక్కడికెళ్లరా! శివయ్యకి సాయం చెయ్యి. ప్రసాదాలు, డబ్బులు బాగా వస్తాయి అని పెద్ద అయ్యగారు చెప్పటంతో పెద్దగా ఇష్టం లేకపోయినా వెళ్లాడు. ఓపాలి సామికి దండం పెట్టుకొని వద్దామని లోపలకెళ్లాడు. కళకళలాడుతూ తులసి మాలలతో చామంతి, గులాబి దండలతో వెంకన్న బాబా! కాదు కాదు నా శివయ్యే ఎంత బాగున్నాడో అనుకొంటూ దండం పెట్టుకొని వచ్చేశాడు.
చివరిరోజు రథయాత్ర. నాలుగు వీధులు వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించుతారు. సాంబయ్య, శివయ్య, రాము, ఇంకో ఇద్దరు కలసి లాగి తిప్పేవారు. రథం ముందు ఓం నమశ్శివాయ అంటూ సాంబయ్య భక్తిగా పాడేవాడు. రథం వెనుక జనాలంతా గోవిందా! గోవింద అంటూ గోవింద నామాలు పాడుతున్నారు. ఇళ్లల్లోకి జనాలెదురొచ్చి హుండీలో కానుకలేసేవారు. హారతులిచ్చేవారు. ఇలా బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఇంత హడావిడి జరిగింది. విశ్రాంతి లేక పదిరోజులు తిండి కూడా సరిగ్గా లేక పనుల ఒత్తిడికి సాంబయ్యకి ఒకటే జ్వరం. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెస్ట్ కావాలి అని బలానికి రెండు గ్లూకోజ్ బాటిల్స్ యెక్కించారు. రెండురోజులుంచి ఇంటికి పంపారు. ఇంటికొచ్చాక రెండురోజులు తీవ్రంగా నిద్రపోయాడు. అతని చుట్టుపక్కల స్నేహితులొచ్చి ఇదిగో సాంబయ్యా! రా! బైటకెళ్లి కాస్త గాలి పీల్చుకొద్దామంటూ బైటకి తీసుకెళ్లారు. తిన్నగా సారా కొట్టుకు తీసుకెళ్లి బలవంతంగా తాగించారు. అంతే అదేం మత్తోగానీ పూర్తిగా ఆ మత్తులోకి దిగిపోయాడు. గుడి, శివుడు, భార్య, పిల్లలు ఏవీ గుర్తుకు రానంత మత్తు. డబ్బులు లేకపోతే గుళ్లో పూజారి గార్ని ఆ పనిచేస్తానని చెప్పి డబ్బులు పుచ్చుకొని తాగి రావటం, కొడుకులెళ్లి ఆ పనులు చెయ్యటం జరుగుతోంది. అంతా చెప్పి చూసినా మారటం లేదతను. గంగమ్మ చాలా బాధపడుతోంది. గుళ్లోకెళ్లి పనులు చెయ్యి మామా అని వినడు. ఓ రోజు చంద్రవౌళిగారు వెతుక్కొంటూ వచ్చారు. ఏంటమ్మా! మీ ఆయనేడి, డబ్బులు తీసుకోవటం, పనులకు రాకపోవటం, ఇదేమైనా బాగుందా అని! అయ్యవారూ! కాస్సేపాగండి వస్తాడు. మీరంటే ఉన్న గౌరవంతో మీ మాట వింటాడేమోనంది.
ఈలోగా రానే వచ్చాడు. చంద్రవౌళిగార్ని చూసి దండాలయ్యా అంటూ తలొంచుకొని నుంచున్నాడు. ఏరా? గుడి ముఖం చూసి ఎన్ని నెలలయ్యింది? శివుడికి దండం పెట్టుకోవడానికి కూడా రాదలచుకోలేదా? ఇంతకుముందు దాకా ఎంత బాగుండేవాడివి ఏమైందిరా? వద్దురా! శివుడికిలాంటివి నచ్చవురా బుజ్జగిస్తూ అన్నారాయన.
బుద్ధిగా విని తలూపాడు. రేపటి నుండి రారా! వేరే అతని పనిలో పెట్టుకున్నాను నీలాగా ఎవరూ చేయటం లేదురా? వెనక నిలబడి చెయ్యించాల్సి వస్తోంది అన్నారాయన. సరేనయ్యా! వినయంగా అన్నాడు సాంబయ్య. గంగమ్మా ఈ 200 ఉంచు, వాడికివ్వకు. రేపొద్దున పంపించు గుడికి అంటూ ఆయన వెళ్లిపోయారు. మర్నాడు లేచాడు గానీ గుడికెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. బతిమిలాడింది. పిల్లలు కూడా నాన్నా! గుడికెళ్లి ఊర్కే కూర్చో, నీ శివయ్యని చూస్తూ కూర్చో, ఏ పని చెయ్యక్కర్లేదులే! వెళ్లిరా కాసేపు. అయినా వెళ్లలేదు. నీరసంగా మంచం మీద పడుకున్నాడు. నాలుగు నెలలు గడిచాయి. వెంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టారు. ఓ రోజు రాత్రి అతనికి కల్లో శివుడొచ్చాడు రారా! ఈరోజు రథయాత్ర ఉంది. నీవు రాకపోతే ఎలాగా? అన్నట్లు. అంతే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దొడ్లో పూలు తెంపుకొని, ముఖాన ఇంత విభూది రేఖలు పెట్టుకొని, గంగీ! వస్తావా! రథయాత్ర సాయంత్రం ఉంది కదా! పిల్లల్ని వెంటపెట్టుకుని రా! అని చెప్పి గబగబా సైకిలెక్కి గుడికెళ్లిపోయాడు.
ఇవాళ ఏ దేవుడు నా మొర ఆలకించాడో నా మామలో ఇంత ఉత్సాహం, మార్పు వచ్చింది అని దండం పెట్టుకొంది గంగమ్మ. హుషారుగా పనులు చేసుకొని సాయంత్రం ఎప్పుడెప్పుడు వెళ్లి రథయాత్ర చూద్దామా అని సాంబయ్య ఓం నమశ్శివాయ అనుకొంటూ శివాలయానికెళ్లి లెంప లేసుకొని పూలుపెట్టి నమస్కారాలు పెట్టి పనులందుకున్నాడు. ఈలోగా చంద్రవౌళిగారొచ్చి ఏరా? సాంబయ్య! ఇన్నాళ్లకి నీకు శివయ్య గుర్తుకొచ్చాడా అన్నారు. ఇక్కడ పనులు ఏంలేవుగానీ, అటు ఆ దేవాలయానికెళ్లు కావలసినంత పని అని పురమాయించారు. గబగబా వెళ్లాడు. సాయంత్రం దాకా ఒకదాని తరువాత ఒక పని అలుపొచ్చేసింది. శివయ్య కాస్త పులిహోర తెచ్చి పెట్టాడు. అది తిని మంటపంలో కాస్త ఒత్తిగిల్లాడు. రథయాత్ర మొదలైంది. భార్య, పిల్లలు వచ్చి వెతుక్కుంటూ లేపారు. అదాటున లేచి ఏంటి? నా శివయ్య రథంలో ఊరేగాడా? రథయాత్ర అయిపోయిందా అని, లేదు మామా! పద బయటకు అలా అరుగుమీద కూర్చుంటే అంతా కనిపిస్తుంది అంటూ వెంటబెట్టుకుని తీసుకెళ్లింది. బయట కూర్చున్నారు. ఉత్సవమూర్తులను రథంలో సర్దుతున్నారు. రథం అందంగా అలంకరించారు. సాంబయ్య స్వామిని చూస్తూ గంగీ! చూడు చూడు నా శివయ్య ఎంత అందంగా ఉన్నాడో! పట్టుబట్టలెంత బాగున్నాయో! గంగకి, అయోమయంగా అనిపించింది. ఏడుకొండలవాణ్ణి చూసి శివయ్య అంటున్నాడని. ఈలోగా మేళతాళాలతో రథయాత్ర మొదలైంది. ఒక్క అడుగు కదిలాక రథం సరిగ్గా సాంబయ్య కూర్చున్న అరుగు దగ్గరకొచ్చి ఆగింది. శివయ్య, రాము, భద్రం ఎంతమంది లాగినా కదలటంలేదు. హారతులిచ్చారు స్వామి! తప్పులుంటే క్షమించమని దిష్టితీసి కొబ్బరికాయలు కొట్టారు. ఊహు! కదలటంలేదు. ఏమైందో ఏంటో అందరికీ కంగారుగా ఉంది. చంద్రవౌళిగారు వచ్చి సాంబయ్యా! రారా! రథం లాగు! నీవు లాగటంలేదనే స్వామి కదలనని మొరాయించారు అంటూ సాంబయ్యని రథం దగ్గరకి తీసుకొచ్చారు. నమశ్శివాయ అంటూ స్వామీ పధ్నాలుగు వీధుల జనం నీ కోసం ఎదురుచూస్తున్నారంటూ రథం తాడు లాగాడు అంతే చిత్రంగా రథం వడివడిగా కదిలింది. రథం ముందు శివుడి స్మరణతో సాంబయ్య, రథం వెనుక గోవింద నామాలతో అర్చకులు, భక్తులు శోభాయమానంగా సాగుతోంది రథయాత్ర.

- యు.శైలజ
సెల్: 9440247596

చిన్న కథ

మరోసారి
ముసలి కుందేలు మరణశయ్యపై ఉన్నప్పుడు మనవడిని పిలిచి ‘నాయనా! పరుగు పందెంలో ఓడిపోయి, మన జాతికి మాయని మచ్చని తెచ్చిపెట్టాను, నిజానికి మెల్లగా వెళ్లే తాబేళ్లు, రివ్వున దూసుకుపోయే మన కుందేళ్లతో పోటీకి సరితూగవు. తాబేలు ప్రతిభ వల్ల కాక, నా స్వయంకృతాపరాధం వల్ల ఓడిపోయాను. పోటీ ముందు రాత్రి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డే నైట్ మ్యాచ్ చూశాను. నీకు తెలుసుగా, నాకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో!. పైగా నా అభిమాన ఆటగాడు సచిన్ విజృంభించి పాక్ పని పడుతుంటే నిద్రపోగలనా? అలా నిద్రలేమితో పోటీలో పాల్గొని, తాబేలు వచ్చేలోపు ఓ కునుకు తీసి లేచేసరికి ఘోరం జరిగిపోయింది. అటువంటి పొరపాటు చేయకుండా గెలిచి ప్రతీకారం తీర్చాలి. ఇదే నా ఆఖరి కోరిక’ అని కన్నుమూసింది.
యువకుందేలు తాబేలు మనవడి దగ్గరకెళ్లి సవాల్ చేసింది. తాబేలు పెద్దగా స్పందించకపోవడంతో ‘స్లెడ్జింగ్’2 మొదలెట్టింది. విసిగిపోయిన తాబేలు ‘సరే! అయితే ఓ షరతు. మనం పరగడుపున పందెంలో పాల్గొనాలి. వచ్చేనెల 13న పోటీ పడదాం2అంది. సమరోత్సాహంతో ఉన్న కుందేలు వెంటనే అంగీకరిస్తూ ‘గడువెందుకు?’2అంది తొందర పడుతూ. తాబేలు లోలోపల నవ్వుకుంటూ ‘ఈ నెల రోజులు రన్నింగ్‌లో షార్ట్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటా’ అంది. కుందేలు బిగ్గరగా నవ్వి వెళ్లిపోయింది.
పోటీ రోజున అడవంతా కోలాహలంగా ఉంది. తాబేలు గెలుస్తుందని ఎవరికీ ఏ కోశానా ఆశలేదు. అందుకే జంతువులన్నీ కుందేలుపై భారీగా బెట్టింగులు కట్టాయి. పిస్టల్ పేలగానే రన్నింగ్ రేస్ ప్రారంభమైంది. ప్రతీకారంతో రగిలిపోతున్న కుందేలు దూసుకుపోయింది. తాబేలు కూడా శక్తికి మించి పరుగులు తీసింది. కొంతదూరం వెళ్లి వెనక్కి చూసిన కుందేలుకు కనుచూపు మేరలో తాబేలు కనబడలేదు. అయినా అలసత్వం ప్రదర్శించకుండా ముందుకు సాగిపోయింది. కాసేపటికి దారిలో విప్పపూలు కనిపించి నోరూరినా ఆగకుండా ముందుకు వెళ్తుంటే బాట మీద బోల్డన్నీ కేరట్లు కన్పించాయి. పక్కనే ఉన్న కొలనులో నీళ్లు తాగే సరికి భుక్తాయాసం కలిగి మైకంతో ఇక పరుగు తీయలేకపోయింది. మార్గమధ్యంలో విప్పపూలు, కేరట్లు ఎలా వచ్చాయబ్బా2 అని ఆలోచిస్తూ గాఢనిద్రలోకి జారిపోయింది తిండిపోతు కుందేలు.

- కౌలూరి ప్రసాదరావు
వేళ్లచింతలగూడెం, గోపాలపురం మండలం
సెల్: 7382907677

మనోగీతికలు

అమ్మా అమ్మా!
ఆప్తుల పాలిట సన్నిధివై
పేదల పాలిట మహా పెన్నిధివై
బతుకు బండి ఒడిదుడుకులకు లోనైనా
అందరూ ఉండి లేని దానివై నా అనేవారు కరవై
బతుకు దుర్భరమై
ఆప్యాయతానురాల లేమితో
ఎంత నిరాదరణకు గురియైనా
అందరూ నీవారనే భావనతో
మసలిన నీవు చరితార్థురాలివమ్మా
నీవు లేని లోటు సర్వజనావళి
జీవన స్రవంతికదో వెన్నుపోటు
బతుకు గతిలో చీకటి నిండినా
పేదల పాలిట వెలుగువై కిరణ్మయివై
శివునిలా గరళం నిండినా
జీవన మరణ సమస్యల లెక్కగొనక
అమృతం పంచి ఇచ్చే అమృతమయివమ్మా నీవు
భార్యగా, తల్లిగా స్థానం పొందకున్నా
అమ్మగా మారి అందరి మన్ననలనందావు
అమ్మగా ఎంతటి ఘనతనొందావు
సినీ రంగమందు కళకు అంకితమై
సాటి లేని మేటి నటిగా రాణించావు
రాజకీయ రణరంగమందు
దుష్టకీచక దుశ్శాసన
దుశ్చర్యలనధిగమించావు
పట్టుదలే వజ్రంలా వజ్రాయుధంలా
ఎనలేని ఆత్మస్థైర్యంతో
నిస్వార్ధంతో ఇడుమలెన్నో ఎదుర్కొని
నీ జీవితమే పణమొడ్డి
అందరి జీవనగమనంలో వెలుగులు నింపిన
ఎంతటి ఘన చరిత్ర నీదమ్మా
నీకు లేని సక్రమ జీవనగతిని అందరికీ అందించి
సఫలత నొందించి పేదల కడగండ్లు రూపుమాపి
భళిరా భళిరా! అమ్మా అని పిలిచే
పిలిపించే ఎంతటి త్యాగశీలివమ్మా
ఎంతటి దయ గల తల్లివమ్మా
వేనోళ్ల శ్లాఘించే
ధన్యచరితవమ్మా నీవు
ఎంతటి భవ్య చరితవమ్మా
దేవతలు తథాస్తు తథాస్తు అందురుగాక
నీజన్మ చరితార్థతనొందుగాక

- యలమంచిలి శివాజీ,
పెందుర్తి, విశాఖపట్నం-530047

మధుర కవిత

ఊహల లాలనలో ఊగిసలాడెను
ఓ మధుర జ్ఞాపకం
కనుల కలల్లో తారసపడెను
ఓ మధుర దృశ్యం
పూల ఒడిలో తొణికిసలాడెను
తియ్యని మకరందం
ఆకాశవీధిలో మినుకు మినుకలాడెను
నక్షత్రకాంతులు
పేద రైతన్న మోములో
మిలమిల మెరిసెను అభివృద్ధి కాంతులు
ఆశావహ దృక్పథంతో
జరిగెను అంతా మేలు
జనజీవనంలో నిండెను కొత్తకాంతులు
పూబంతులు విరిసెను
చామంతులు విరిసెను
బాలల బోసినవ్వులు మురిపించెను

- మజ్జి పాపినాయుడు,
సెల్ : 9100475182

నోటు - జీవితం
నోట్ల రద్దుతో
సామాన్యుడి బ్రతుకు రద్దయ్యింది
ఎటిఎం దగ్గర
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా
పోరాడినా ఓటమి
పచ్చ కాగితాల కోసం
పచ్చని జీవితాలు బలైపోయాయి
నిశ్శబ్దంగా
ఎటిఎంలు నో.టి.ఎంలై
కాగితాల చేదు నిజానికి
సజీవ సాక్ష్యాలు
చావును శాసించే హక్కు నోటుకుందా?
జీవితాలన్నీ కాగితాలకు ముడిపడ్డాయ్
గుండెల్ని బలితీసుకున్న
నోట్ల రద్దు వార్త
క్షణక్షణం గంటగా మారినట్లు
రూపాయి రూపాయి ప్రోగుచేసి పెద్ద కాగితాలైతే
ఆ కాగితానికి విలువ లేదన్నారు
విలువ లేని నోటు విషాదంగా తొంగిచూస్తోంది
చనిపోయానని నోటు
వెక్కివెక్కి ఏడుస్తోంది నిశీధిలో
ఇవాళ నోట్లు మొలకెత్తని బీడు భూమైంది
కాలం కాగితంతో
కన్నీరు పెడుతోంది ఆత్మీయత కరువై
నోటు బాధల్ని గమనించిన కళ్ల నుండి
కన్నీరు కెరటమై ప్రభంజనంగా
బ్యాంకులను వరదలా ముంచెత్తింది
నోటు వంట గదిలో పోపు డబ్బాలో నిలబడి
విషాదంగా తొంగి చూస్తోంది అమ్మవైపు
బ్యాంకు చుట్టూ జనం ఉద్యమంలా
క్రొత్త దృశ్యాలు విషాదంగా చిగురిస్తున్నాయ్
కలలన్నీ కన్నీళ్లుగా మారి వికసించని పువ్వులా
కొందరి కోసం ఎందరూ కన్నీళ్లు
సమాజంలో ఒక శూన్యం
కొత్త అడుగులు వేస్తోంది కాలంతో

- నల్లా నరసింహమూర్తి
తెలుగు లెక్చరర్, అమలాపురం
చరవాణి: 9247577501
ఓ వెర్రివాడా!
శాంతి కావలెనన్న నల్లధనమును వీడు
తెల్లధనమే నీకు సుఖము కూర్చు
పరుల కష్టమునెల్ల నిస్సిగ్గుగా దోచి
ఏమి బావుకొందువు ఓ వెర్రివాడా!

జానెడు పొట్టకు పిడికెడన్నము చాలు
మితిమీర భుజియింప మధుమేహమెచ్చు
బ్రతుకుటకు మాత్రమే అన్నపానములుగాని
అవియే బ్రతుకనుకోకు ఓ వెర్రివాడా!

జన్మనిచ్చిన జననీ జనకులను మరచి
సమాజసేవనుచు తిరుగ భ్రమయుగాదె
స్వధర్మమును మరచి పరధర్మమును పొగడ
నరక మెక్కడో లేదు ఓ వెర్రివాడా!

ఓటుకు నోటనుచు ఓలలాడించిన నీకు
విలువ పోయి నీగతియు తప్పె
కాల ధనమెల్ల కాలదోషము బట్టె
భవిష్యత్ వ్యూహమేది ఓ వెర్రివాడా!

కూలినాలి చేయు బడుగు జీవుల చూడ
తెల్ల మొహములు వైచి సాగుచుండె
నాగరికుల మనుచు నయగారములు బోవ
పోయె కాలము గాదె ఓ వెర్రివాడా!

ఇకనైన మేలుకో స్వచ్ఛ మనసు తోడ
నిస్వార్థ సేవతో మనిషి మన్ననలు గెలవ
ఇహములోన మరియు పరములోన
బ్రహ్మానంద మదిగాదె ఓ వెర్రివాడా!

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
చరవాణి: 9491171327

‘జయ’లలిత

కోకలాగించిన వాడి ‘పంచె’ ఊడగొట్టించడం
ఊచల వెనుక నెట్టించిన వాడిచేత
అదే ‘ఊచల్ని’ లెక్కించేలా చేయడం
ఆమెకే సాధ్యం!
‘కథానాయకులకే’ సాధ్యంకానివన్నీ
సుసాధ్యం చేసుకున్న
కథానాయకి... విప్లవనాయకి...
పంతానికి, పట్టుదలకి పర్యాయపదం ఆమే!
సినిమాల్లో ‘హీరో’2పక్షంలో ఉన్నట్టుగానే
రాజకీయాల్లో ‘ప్రజా’పక్షం వహించి
‘అమ్మ’గా అందరి గుండెల్లో అగ్రపీఠం ఆమెదే!
అందలం ఎక్కినా.. కళ్లు నెత్తికెక్కి
ప్రవర్తించక - తన చూపు ఎప్పుడూ
‘నిరుపేదల’ వైపేనని - చివరంటా
వాళ్ల వెన్నంటి నిలిచిన అమృతమూర్తి!
ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా
ఎత్తులకు పై ఎత్తులతో చిత్తుచేసిన వీరవనిత...
‘జైలు’లలితని కించపరిచినా
‘జైజేలు’ లలితగా
ఎల్లెడలా కీర్తించబడ్డ ధీర వనిత

- ఎన్‌కె నాగేశ్వరరావు
సెల్: 9030360988

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net
email: merupurjy@andhrabhoomi.net

- యు.శైలజ