రాజమండ్రి

వెనెన్నల తీర్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో హడావుడి...
మనసుల వెనుక పరిమళించే నిశ్శబ్దం
చూపుల మధ్య ప్రేమ జలపాతం
ఇద్దరి మధ్య మాటలు లేని మూగ తపస్సమాధి
నైరుతి వర్షంలా
గుండెలో బొట బొట కురుస్తున్న చినుకు
భయం సహజమే!
బంధువుల సందడి మధ్య పండుగ కళ
ఆత్మీయ ప్రతీకలై చిగురించే ఆనంద స్పర్శ మధ్య
గదిలో
ఆనంద భాష్పాల చూపుల కలయికలు
కళ్లల్లో
ప్రేమాభినివేశం
కాలం వౌన పరవశం
హృదయం విశాల మైదానంలో
చూపుల సజీవ దృశ్యం రెండు క్షణాలే
కనురెప్పల మధ్య వెలుగై సీతాకోకై మరీ వెళ్లింది
ఆగిన క్షణకాలం
కొత్త జీవ స్పర్శ
మేఘం అమృత వర్షిణి అయ్యింది
ఆ క్షణం ఆ అనుభూతి
‘వెనె్నల’ మనస్సులో తడబాటు, ఆందోళన
ఎందుకంటే తనను చూడటానికి పెళ్లివారు వస్తున్నారు
ఉదయం 11 గంటలకు తనకు పెళ్లిచూపులు
అమ్మ రామతులసి రాత్రి చెప్పింది. మామూలుగా ఉదయం
శీతాకాలం ఏడు గంటలకు గాని మెలకువరాదు నాకు,
రాత్రి అమ్మ చెప్పిన మాటతో నాలో ఏదో తెలియని అనుభూతి చిగురిస్తోంది. పెళ్లిచూపులంటే ఏ ఆడపిల్లకైనా ఆ తెలియని ఆనందం వర్ణించడం కష్టం.
వెనె్నల డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసింది. అందంతో వినయం విధేయతలు ఉన్నాయి. పాటలు బాగా పాడుతుంది. సాంప్రదాయానికి విలువ ఇచ్చే కుటుంబం. తండ్రి సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయుడు. తండ్రి ఉన్నత ఆశయాలు, తల్లి సంప్రదాయాల మధ్య ఉన్నతంగా సంస్కారవంతంగా ఎదిగిన వెనె్నల ఆలోచనా విధానం కొత్తగా ఉంటుంది. ఎవరినీ నమ్మదు. ఎంతో ఆలోచిస్తే గాని మాట ఇవ్వదు; ఎక్కువగా మాట్లాడదు.
వెనె్నల తండ్రి అమలాపురంలో హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి నుండి మూడు ఎకరాల భూమి, కొబ్బరి తోట ఎకరం ఉంది. రెండు పెంకుటిళ్లు ఉన్నాయి. ఇటీవల వెనె్నల పేరు మీద అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఆయనకు ఒక్కతే కూతురు వెనె్నల. తన చిన్ననాటి మిత్రుడు రామనాథం మీ అమ్మాయి వెనె్నలకు మంచి సంబంధం ఉంది. ఈ సంవత్సరం పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే చూడమంటే చూస్తానన్నాడు. పెళ్లి కొడుకు ఎల్‌ఐసిలో ఉద్యోగం. నెలకు రూ.40 వేల జీతం. మంచి సంప్రదాయం కలిగిన కుటుంబం వారిది. పెళ్లి కొడుకు అందగాడు. పేరు చరణ్‌కుమార్. ఇంట్లో అందరూ అతనిని చరణ్ అంటారు. పెళ్లి కొడుకు తండ్రి మాధవరావు. మంచివాడు. కానీ, కొంచెం పిసినారి. తల్లి లలిత, మంచి మనసున్న తల్లి. మంచి సంబంధం. అయితే వెనె్నలకు చదువు పూర్తయింది. కావున పెళ్లి చేస్తానన్నాడు సత్యనారాయణ. చూడమన్నాడు మిత్రుణ్ణి. దాని ఫలితమే ‘వెనె్నల’ పెళ్లి చూపులు.
తెల్లవారింది. కిటికీలోంచి తొంగి చూసింది వెనె్నల. రోడ్డు మీద ఆరోగ్యం కోసం నడక మిత్రుల పరుగులు. తన మనస్సులో కాలం పరుగులు. ఇంతలో సెల్ మోగింది. ఉదయానే్న ఎవరు ఫోన్ చేశారోనని చూసింది. తన స్నేహితురాలు వాణి. చెప్పు వాణి అంది. నిన్ననే తనకు పెళ్లిచూపులు జరిగాయని, పెళ్లికొడుకుకు తాను బాగా నచ్చానని, కానీ ఎందుకో సంబంధం ఖాయం చేసుకోలేదని తర్వాత చెబుతామన్నారని చెప్పింది. ‘ఈరోజు ఉదయం నాకు పెళ్లిచూపులు. నీవు తప్పకుండా రావాలి’ అంది వెనె్నల. తప్పకుండా వస్తానంది వాణి.
బంధువులంతా వచ్చారు. వాణి రానే వచ్చింది. వెనె్నలకు తానే అందంగా అలంకరణలు చేసింది. అందాల వెనె్నలను చూడటానికి వెయ్యి కళ్లు చాలవనిపించింది వాణికి. వాణి పెద్ద అందగత్తె కాదు. చామన ఛాయ, లోతయిన కనుముక్కు తీరు, పొడుగైన జుట్టుతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వెనె్నల మాత్రం పాదరసం నింపిన గాజుబొమ్మలా మిలమిల లాడుతూ ఉంటుంది. ఆమె సౌందర్యం అలాంటిది. నిన్ను చూస్తే పెళ్లికొడుకు అదిరిపోవాలి. వెంటనే సంబంధం కుదిరిపోతుంది. పది రోజుల్లో పెళ్లయిపోతుంది కూడా అంది నవ్వుతూ వాణి. నీ మాట నిజమవ్వాలి వాణి, అంది వెనె్నల తల్లి.
పెళ్లి వారు రానే వచ్చారు. అమ్మాయిని చూసుకున్నారు. కానీ, ఏ విషయం చెప్పలేదు. పెళ్లి కొడుకు చరణ్‌కు మాత్రం వెనె్నల బాగా నచ్చింది. కాని, పెళ్లి సంబంధం ఖాయం చేయకపోవడం ఆశ్చర్యం కలిగింది వాణికి. వెంటనే పెళ్లికొడుకును గమనించింది. ‘అతడే’ నన్ను చూసుకున్న వాడే. పక్కనే పెళ్లి కొడుకు తండ్రి మాధవరావు వెనె్నల తండ్రిని ఆస్తి వివరాలు తెలుసుకోవడం చూసింది వాణి. వెంటనే వెనె్నల చెవిలో ఏదో చెప్పింది వాణి.
అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుందో కొంత సమయం వౌనం చిగురించింది అక్కడ. రెండు రోజుల్లో సంబంధం ఖాయంపై చెబుతామని పెళ్లివారు బయలుదేరుతున్నారు.
ఒక్క క్షణం ఆగండి! అంది వెనె్నల. తనకు ఈ సంబంధం నచ్చలేదంది. తండ్రి అమ్మా! ఒక్క క్షణం ఆలోచించమని అన్నాడు. ఆలోచించడానికి ఏమీ లేదు నాన్న.
నిన్న...
నా స్నేహితురాలు వాణిని చూసుకున్నారు. వాళ్లకి ఆస్తి తక్కువ. ఈ రోజు వాళ్లకన్నా మనకు ఆస్తి ఎక్కువ. అందుకే నన్ను చూసుకున్నారు. రేపు మరొకరికి ఆస్తి ఎక్కువని తెలిస్తే వాళ్ల అమ్మాయినే చూస్తారు. ఇలా...ఎంతమంది? కట్నం కోసమే తప్ప మరేం అక్కరలేదు వాళ్లకు... ఇటువంటి సంబంధం మనకు వద్దు అంది.
డబ్బు చుట్టూ తిరిగే ఈ సంబంధం చేసుకుని బాధలు అనుభవించేకన్నా తాను తనని అర్థం చేసుకునే భర్త కోసం ఎదురు చూస్తానంది. ఇంతలో పెళ్లిచేసుకోనని, ఎంఏ చదువుతానంది.ఆదుకునే మనుషులు, ఆత్మీయతల మనస్సులు గల కుటుంబం, అర్థం చేసుకునే భర్త దొరికే వరకు తాను పెళ్లికి నిరీక్షిస్తానంది.
కూతురు మాటల్లో నిజాన్ని గ్రహించిన తండ్రి కళ్లల్లో ఆకాశమే పక్షిలా ఎగిరిపోతున్న స్ఫూర్తి కల్గింది. వెనె్నల లాంటి ఆలోచనా విధానం కలిగిన అమ్మాయిలు ఉంటే కట్నం కోసం పరుగులు తీసే చరణ్ లాంటి పెళ్లికొడుకుల్లో మార్పు రాక తప్పదని అందరూ అనుకున్నారు.

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, సెల్: 9247577501

రచయిత పరిచయం

సమతా సంస్కార రచనల వారధి ‘సవేర’

బౌద్ధం మహిమాన్వితం కాదు మానవీయ వాదం. బహుగా ఫలించి విస్తరిల్లాల్సిన అవసరం ఉంది. వందల ఏళ్ల క్రితం ఫరిఢవిల్లి నూతన మార్గానికి ప్రాణం పోసిన బౌద్ధం అంబేద్కర్ ఆలోచనా స్ఫూర్తితో నయాబుద్ధిజం అయ్యింది. అష్టకష్టాలు అవమాన భారాలు మోసిన ‘సవేర’ మాస్టారుకి అంబేద్కర్ మార్గదర్శిగా, బౌద్ధం సర్వజన సమానత్వ సహజీవన లక్ష్యంగా తోచింది. అంతే. ఆయనో ప్రబోధాత్మకుడిగా మారిపోయారు. అంబేద్కర్ బౌద్ధ ప్రచారకులు అయ్యారు. అంబేద్కర్ దృక్పథంలో ఎన్నో రచనలకు మూలకారకులయ్యారు. గోదావరి తీరంలోని ఓ కుగ్రామంలోని బిడ్డ జాతి వైతాళికుడ్ని వెలుగుపరిచే ఉద్దీపకుడు అవుతాడని ఊహించి ఉండరు. తండ్రి ఆశను తీర్చే తనయుడయ్యారు. కాయకష్టంతో ఊడిగం చేయకూడదనే పాలేరు బిడ్డ పాఠాలు చెప్పే బడి పంతులయ్యారు. ఆయనే సరెళ్ల వెంకటరత్నం గారు. కవిత్వం ద్వారా అనేక సాహిత్య రచనల ద్వారా ‘సవేర’గా సుప్రసిద్ధులయ్యారు.
తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లిలో బీద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన సెలవు రోజుల్లో కూలికెళ్లి చదువుకొచ్చానంటారు. ఎస్సెస్సీ స్కూల్ ఫస్ట్ వచ్చి ఊరికి తెచ్చిన ఘనత ఒకపక్క తక్కువ కులపోడు ఎక్కువ మార్కులతో పాసయ్యాడనే ఉడుకుమోతుతనం ఊరి అయ్యోర్లకు ఉండేదంటారు. అంబేద్కర్ చనిపోయాక ఆయన్ని అధ్యయనం చేయడం మొదలైంది. మా గ్రామంలో సంతాప సభ జరిగింది. ఆ సభలో నాయకుల కన్నీళ్లను గుర్తు చేసుకుంటే నాకిప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయంటారు. అలా అంబేద్కర్‌ను అధ్యయనం చేయడం వల్ల ఆయన చూపిన మార్గంలో బుద్ధునిగా మారాను అంటారు.
రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే బివి రమణయ్య అనుచరుడిగా, రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తగా చురుకైన పాత్ర నిర్వహించారు. విద్యార్థి ఉద్యమంలో భాగంగా అనేక గ్రామాల్లో రాత్రి బడులు నడిపి అంబేద్కర్ జీవితాన్ని వివిధ కోణాల్లో వివరించి చెప్పామంటారు. లాంతరు వెలుగులో ఆత్మీయంగా తమకు పెట్టిన నాటుకూర మాంసంతో చారు కలుపుకు తిన్న సందర్భాలు తియ్యని జ్ఞాపకంగా ఈనాటికీ సజీవంగా గుర్తుకు వస్తుందంటారు. అధ్యయనం ద్వారానే అభివృద్ధి అనే లక్ష్యంతో 1965లో అంబేద్కర్ స్టడీ సెంటర్ పెట్టి దళిత విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశామన్నారు. మూడు దశాబ్దాలు ఉపాధ్యాయ రంగంలో ఉండటం వల్ల అంబేద్కర్‌ను, బౌద్ధాన్ని విద్యార్థుల చెంతకు మరింత చేరువ చేసే అవకాశం కలిగిందంటారు. అన్ని సంఘాల్లో ఉండే ముఠాతత్వం అగ్రకులాధిపత్యం రాజ్యమేలుతున్న తరుణంలో బౌద్ధ సంఘాల్లో కూడా వారి ఆధిపత్య ధోరణులు నిత్యకృత్యంగా మారాయంటారు. సంఘాల్ని నిర్వీర్యం చేసే కుట్ర పూర్వం నుండి నడుస్తోందన్నారు. వీటికి మూల కారణం బ్రాహ్మణాధిపత్య భావాజాలమే అంటారు. ఎంతో స్ఫురద్రూపి అయిన అంబేద్కర్ బౌద్ధాన్ని నవీనీకరించారు. ఆయన ఆచరించిన బౌద్ధాన్ని నిజమైన బౌద్ధం కాదనే వాదన ఉంది. దానికి ఘాటుగా స్పందిస్తూ నాగార్జునుడి బౌద్ధాన్ని బ్రాహ్మణ బౌద్ధాన్ని ఇష్టపడే అగ్రవర్ణాలు ఇప్పటికీ బౌద్ధ సంఘాలపై తమ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని వదులుకోలేక పీడిత ప్రజలవిముక్తికి తోడ్పడే బౌద్ధాన్ని ఫలపర్చలేక క్షుద్ర ప్రచారాలకు తెగపడుతున్నారంటారు. హంగేరీ లాంటి దేశాల్లో పీడిత ప్రజల ఆపద్బాంధవునిగా అంబేద్కర్‌ను గౌరవిస్తున్నారంటే ఆయన రూపొందించిన బౌద్ధమహోన్నతతత్వాన్ని అర్థం చేసుకోవాలేగాని మరొకటి కాదంటారు. ఆ వైపుగానే పలు కార్యక్రమాలను ‘దళిత చైతన్య వేదిక’ ద్వారా అవగాహనతోపాటు వందలాది విద్యార్థులకు సాయం అందించానంటారు. అలాగే నిరుపేద దళిత విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం ‘అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశామన్నారు. దాంతోపాటు ‘సవేర ఛారిటబుల్ ట్రస్టు’ స్థాపించి ఎంతో మందికి ఇతోధిక సేవా సహకారాలు అందిస్తున్నామన్నారు.
తెలుగులో తొలి బౌద్ధ ధర్మ ప్రచార పత్రికను అంబేద్కర్ దృక్పథంతో ‘్ధర్మ ప్రభ’ పత్రికను ప్రారంభించానంటారు. దానిని మూడేళ్లపాటు నడిపారు. దేశ విదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖ బుద్ధిస్టుల ఇంటర్వ్యూలు, ఎన్నో అరుదైన బౌద్ధ దార్శనిక రచనలు ఆ పత్రిక ద్వారా అందించానంటారు. 1974లో మొదటి రచనను ప్రచురించడం ప్రారంభించాక ఇప్పటివరకు 35 పుస్తకాలు అచ్చు వేశారు. ‘హరిజన్ అనే పథాన్ని నిషేధించండి’ అనే పుస్తకం అయిదు వేల కాపీలతో ముద్రించి ప్రజలకు అందించి ఆ పదం నిషేధానికి తనరచన ముఖ్య భూమిక వహించిందంటారు. అలాగే ‘జై భీమ్’ ప్రాముఖ్యతను వివరించే లక్ష్యంతోను ముల్క్‌రాజ్ ఆనంద్ - అంబేద్కర్‌కు జరిగిన చర్చను తెలుగు చేసేంత వరకు ఎంతో ఉద్యమ సాహిత్యాన్ని వెలువరించానంటారు. డాక్టర్ ఎండ్లూరి చిన్నయ్య గారి జీవిత చరిత్రను ప్రముఖ బౌద్ధ రచయిత పి అబ్బాయి జీవిత చరిత్రను పుస్తకాలుగా అందించారు. ఇంకా అంబేద్కర్ జీవిత చరిత్రను సంక్షిప్తీకరిస్తూ చేసిన తన పుస్తకం సుమారు లక్ష మందికి చేరువైందంటారు. ఆ కృషి కారణంగానే అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ లిటరరీ అవార్డు తనకొచ్చిందన్నారు. బౌద్ధ సంఘాల్లోను అంబేద్కర్ ఆలోచనా వేదికల్లోను పురుషాధిక్యత చలామణి అవుతుంది. దానికి కారణమేంటనే ప్రశ్నకు మగాళ్లతో సమానంగా మహిళలు బయటకు రాలేకపోవడం ఒక కారణమయితే, బౌద్ధ అవగాహన లేకపోవడం ప్రధాన కారణంగా పేర్కొంటారు. దానిపై తన అక్షర సమరాన్ని సంధించారు. ‘బుద్ధుని అనుసరించిన ప్రసిద్ధ బౌద్ధ మహిళలు’ అనే పుస్తకం రాశారు.
తాను రాసిన 35 పుస్తకాల్లో 14 పుస్తకాలు అంబేద్కర్ కోసం బౌద్ధం కోసం రాశారు. తొమ్మిది పుస్తకాలు కవిత్వం కోసం అయితే మిగిలినవి కొంత బాల సాహిత్యం, జీవిత చరిత్రలు అనువాదాలను, ఆయన రాసిన ‘దళిత జాతుల ధర్మ యుద్ధం’ గేయ కావ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఎ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా తీసుకోబడింది. అలాగే ఎన్నో ఆయన కవితలు ఆకాశవాణి (రేడియో)లో ప్రసారమయ్యాయి. దళిత బహుజన రచయితల్లో బోయి భీమన్న గారు ఎన్నో ఉదాత్తమైన రచనలు చేశారు. అన్ని ప్రక్రియల్లోను రాయగల దిట్ట. ఆయన తర్వాత ఎవరైనా ఉంటే ‘సవేర’నే పేర్కొనవచ్చు.

- రవికాంత్
సెల్: 9642489244

జనవాక్యం

బీమాతోనే మహిళకు ధీమా

ఆడ, మగ వ్యత్యాసం ప్రకృతిపరంగా ఉన్నప్పటికీ బతుకు గమనంలో అందరూ కష్టించి సుఖపడవలసిందే. చేసే పనుల్లో కాని, ఉద్యోగాల్లోగాని పురుషులకు ఏమాత్రం తీసిపోమని మరీ ఘంటాపథంగా నొక్కి వక్కాణిస్తున్నారు నేటి మగువలు. అన్ని రంగాల్లోను తామేమాత్రం మగవాళ్లకు తీసిపోమంటూ ఆయా నైపుణ్యాల్లో దూసుకుపోతున్నారు. కనుక జీవిత భద్రత విషయంలో ఇరువురి ఆలోచనలూ బీమా పాలసీ తీసుకోవడంలో ఒకేలా ఉంటున్నాయి. కారణం జరగరానిది ఏదైనా జరిగితే తమపై ఆధారపడ్డ వారి ఆర్థిక, రక్షణ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మైంట్ వంటి అవసరాలకు బీమా పాలసీ తీసుకుంటారు. అయితే స్ర్తిల సగటు జీవితకాలం ఎక్కువ కనుక వారి ఆర్థికావసరాలూ మగవారి కంటె భిన్నంగానే ఉంటాయి. కాని భర్త తరువాత కూడా చాలాకాలం జీవించి ఉండే మహిళలకు బీమా రక్షణ మాత్రం అందుకు తగినట్టుగా ఉండటం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు తక్కువ బీమా ఉండటమో, అసలు లేకపోవడమో జరుగుతోంది. విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా ఇదే పరిస్థితని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో కేవలం 14 శాతం మంది మహిళలకు బీమా రక్షణ ఉందట. అదే సంపన్న మరియు అగ్రదేశమైన అమెరికాలో 64 శాతం మగవాళ్లకు, 50 శాతం మహిళలకు బీమా రక్షణ ఉంటుంది.
భారతదేశంలో చాలామంది గృహిణులే కావడం వల్ల వారికి సంపాదన ఉండదు కనుక బీమా రక్షణ అవసరం లేదంటారు. కాని సంపాదన లేకున్నా వారికి బీమా రక్షణ కల్పించడం అదనపు ఆర్థిక రక్షణ అవుతుందని గ్రహించరు. ప్రస్తుతం ఆధునిక స్ర్తిలు, పురుషులతో పోటీపడి సంపాదిస్తున్నారు. కనుక వారికి ఆ స్థాయిలో బీమా ఉండాల్సిందే. ఇంటి బడ్జెట్‌లో స్ర్తిలకు మరెవరూ సాటిరారు. ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్లిళ్లు వంటి దీర్ఘకాలిక అవసరాలకు ముందస్తుగా చక్కని ప్రణాళికను రచిస్తారు. వాటిని చేరుకోవడంలో బీమా పాలసీలు కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి అటు బీమా రక్షణతోపాటు, ఇటు సంపదను సృష్టించే విధంగా పాలసీలు ఎంచుకోవాల్సి ఉంటుంది. యులిప్స్, ఎండోమెంట్ పాలసీలు ఇందుకు అనువుగా ఉంటాయి. మహిళల సగటు ఆయుప్రమాణం ఎక్కువ గనుక జీవిత భాగస్వామి లేకున్నా ఆర్థికావసరాలకు తడుముకునే అవసరం లేనివిధంగా ప్రణాళిక వేసుకోవాలి. అందుకు విధిగా రిటైర్మెంట్, ఎండోమెంట్ పథకాలు తీసుకోవాలి. మార్కెట్లో అనేక రకాల పెన్షన్, హోల్ లైఫ్ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. భర్త పోయిన స్ర్తిలు కాని, విడిపోయిన మహిళలకు బీమా మరీ ముఖ్యం.
కుటుంబ బాధ్యతలన్నీ వారిష్టంపైనే ఉంటాయి కనుక ఆ స్థాయిలో ఆర్థిక రక్షణ ఉండేలా బీమా పాలసీ తీసుకోవాలి. బాధ్యతలేవీ లేకున్నా వృద్ధాప్యంలో ఆదుకోడానికి రుణాలు, మార్టిగేజ్ వంటి రక్షణకోసం బీమా అవసరం ఎంతో ఉంది. ఏ వయసు స్ర్తిలైనా సరే వీలైనంత మొత్తాన్ని బీమాకు మళ్లించిన నాడు వారి రక్షణకు ఢోకా ఉండదు. మరిన్ని వివరాలకోసం బీమా ఏజెంటును సంప్రదిస్తే మీ అవసరాలకు సరిపడే పాలసీలను సూచిస్తారు.

- జి అనసూయాదేవి
కోరుకొండ, తూ.గో.జిల్లా

మనోగీతికలు

మనమంతా భారతీయులమై!...
శాంతితో సేద తీర్చుకుని
కాంతితో కడుపు నింపుకుని
భ్రాంతిని మనలోంచి తొలగించుకుని
చేమంతుల వెలుగుల్ని బతుకుల్లో నింపుకుని
బాంబులూ, స్టెన్‌గన్లూ మందుపాతరల
క్రాంతివాదాన్ని తొలగించుకుని
ఎయిడ్స్ హెపటైటిస్ వంటి
అంతుదొరకని భయానక జబ్బుల్ని పారద్రోలుకొని
సమత మమతల్ని మదిలో నింపుకుని
కడుపు నింపే రైతన్నల
చెమటోడ్చే కార్మికన్న (కూలన్న)ల
కడగండ్లను తీర్చుకుని
మానవతే మనుగడకు
మార్గమన్న నిజాన్ని తెలుసుకుని
కులమతాల భ్రాంతుల్ని మదిలోంచి తొలగించుకుని
మనమంతా ఒక్కటేనన్న
మార్గాన్ని ఎన్నుకుని
భారతీయులుగా మనమంతా
ప్రగతి పథంలో నడుద్దాం
మనమందరికీ ఆదర్శంగా నిలుద్దాం
భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి
నేతల ఊహల్లో శాంతిని విశ్వానికి తెచ్చి
అన్నపూర్ణ దేశానికి అర్హులమై నిలుద్దాం
మనమంతా భారతీయులమైనందుకు
నిజంగా గర్విద్దాం!

- దోసపాటి సత్యనారాయణమూర్తి,
రాజమండ్రి, సెల్: 9866632877

క్షణికం
చంద్రకాంతి....
ప్రకాశిస్తున్న మనిషి వలె పలకరించింది
కనులు తిప్పి చూచు సమయంలో....
కారుమబ్బులు కమ్ముకున్నాయి
మునుపటి ప్రకాశం పరవశింపజేయలేదు
ఇప్పటి శూన్యం దిగులుపరచలేదు
ఎందుకంటే చంద్రుడు ఉన్నాడని
గుర్తించ గలుగుతున్నాను

- ఎం నీరజాదేవి,
సెల్: 9866779398

మెరుపులా మెరిశావు
నీ కళ్లల్లో నేను చూస్తాను
జింకలోని బెదురుతనం
నీ వాల్జడలో చూస్తాను
నల్లత్రాచుల కదలిక వేగం
నీ మనసులోకి చూద్దాముకుంటాను
మెరుపు వేగంతో నీ వయ్యారం
పలుకుల్లో చిలుకలుంయేమో
ప్రక్కకు రాగానే ఎగిరిపోతాయి
కులుకులో నెమళ్లుంటాయోమో
పింఛం విప్పిన నీదండాల చీరలు
అడ్డు వచ్చి అడ్డంగా నిలుపుతాయి
లతాలలనవో శంపాలతవో
ఏమని వర్ణించను నీ అందం?
హంసల సోయగాలులో
హింసలు పెట్టేనా నిన్ను

- సుధాశశిరేఖ, సెల్: 94415 99321

ఓటు ఒక ఫిరంగి గుండు!
అది - ఉగ్రవాద లోహ సదనాలనూ, నిరంకుశ కంచు
దుర్గాలనూ మట్టిగుట్టలుగా మార్చివేసే బోఫోర్స్
ఫిరంగి గుండు ‘స్వేచ్ఛా వీరుని చేతిలో పడితే.
అది అవినీతి వృక్షాలను పెకలించి వేసే సునామీ,
జాతీయ వాది చేతిలో వివేచనపత్రమైతే.
అదే ఓటు! శ్రేయోరాజ్య గోళాన్ని సృష్టిస్తుంది
అక్షరాస్యుని చేతిలో కందుకమైతే
అది అన్యగ్రహాలను భూమికి అనుబంధ భాగాలుగా
మార్చివేస్తుంది; శాస్తవ్రేత్త చేతిక్రయోజనిక్ అయితే.
అది - అంధ విశ్వాస పాషాణ కుడ్యాల్ని కూల్చివేసే క్లస్టర్
బాంబు, సంస్కర్త చేతిలో కలమైతే,
అది - మహిళా సాధికారితకు పుప్పొడి వనం,
నారీ హస్తంలోని సాహస శస్తమ్రైతే,
అది - జాతిని గాజుపెంకుల బాటలో నడిపిస్తుంది
పిచ్చివాని చేతిలో రాయి అయితే,
ధన ప్రవాహానికి ఆనకట్టలు కట్టే ‘ఓటరు ఇంజినీర్లు’,
ర్యాగింగ్, గూండాయిజాల గుండెలపై పిడుగుల వంటి
పిడికిళ్లు, సారా ఏర్లను ఇంకించే ప్రజా చైతన్య గ్రీష్మాలు,
ప్రజాస్వామ్య సేద్యానికి ఏరువాకలుగా, సామ్యవాద మరంద
వాకలుగా, సృష్టిస్తారు, పరిణమింప చేస్తారు

- విఎస్‌వి ప్రసాద్, తణుకు, ప.గో.జిల్లా,సెల్: 8106320576

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. ళ్ఘౄజ: ౄళూఖఔఖూకబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

- నల్లా నరసింహమూర్తి