రాజమండ్రి

మరణ మృదంగం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గోదావరి బ్రిడ్జిమీద దడదడమని శబ్దం చేస్తూ పట్టాలపై పరుగుతీస్తోంది. చల్లని గాలి రివ్వున కంపార్టుమెంటులోకి దూసుకొస్తోంది. ఎదురుగా గోదావరి ఉరకలు వేస్తూ పరుగులు పెడ్తోంది. చిన్న చిన్న అలలు ఎగిసిపడుతున్నాయి.
నా మదినిండా రకరకాల ఆలోచనలు. అవీ నా బాల్య స్నేహితుడు సురేశ్ గురించి.
మా బాల్యంలో సురేశ్‌తో ఆడిన ఆటలూ, పాడుకున్న పాటలూ, చేసిన చిలిపి పనులూ అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
మా బాల్య జ్ఞాపకాలు కళ్ళెదుట కదలాడుతూ ఉంటే ఆ జ్ఞాపకాలు నాకు సంతోషాన్ని కలిగించడానికి బదులు మనస్తాపానికి గురి చేస్తున్నాయి. గ్రామానికి వస్తున్నప్పటి సంతోషం ఇప్పుడు వెళ్తున్న సమయంలో మచ్చుకైనా కానరావడంలేదు.
సురేశ్ జ్ఞాపకాలు నన్ను మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. ‘సంక్రాంతి సెలవులకి నేను మన గ్రామానికి హైదరాబాదు నుండి వస్తున్నాను. నీవు బెంగుళూరు నుండి సెలవు పెట్టుకుని రా’ అని సురేశ్ అన్న మాటలు నా చెవిలో ఇప్పుడు కూడా గింగుర్లాడుతున్నాయి.
ఉవ్వెత్తున ఎగిసిపడ్తున్న భోగి మంటలు, ఆ మంటల్లో వేస్తున్న భోగి పిడకల దండలు, ప్రతి ఇంటి ముంగిట రకరకాల ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య శోభాయమానంగా అలరారుతున్న గొబ్బెళ్ళు, కోడిపందాలు, గంగిరెద్దుల వాళ్ళ సన్నాయి వాయిద్యాలు, ఆకాశంలో ఎగురుతున్న వివిధ రంగుల గాలిపటాలూ ఇవన్నీ పరిసరాలకి వింత శోభ తెచ్చిపెట్టేవి. తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత ఆ సంబరాల్ని చూసి ఆనందించే అవకాశం కలుగుతోందని సురేశ్ ప్రస్తావనకు నేనూ అంగీకరించి బెంగుళూరు నుండి మా గ్రామానికి బయలుదేరాను. నేను బెంగుళూరు నుండి, సురేశ్ హైదరాబాదు నుండి బయలుదేరి మా గ్రామంలో వాలాము.
రైల్లోని బిచ్చగాడి పాటతో ఆ ఆలోచన్లు చెల్లాచెదురయ్యాయి.
తిరిగి ఆలోచన్లు నన్ను చుట్టుముడ్తున్నాయి. గ్రామంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటే నా హృదయం బాధగా మూలిగింది. వచ్చినప్పుడు ఆనందంగా ఉత్సాహంగా గ్రామానికి వచ్చిన నేను ఇప్పుడు వెళ్తున్న సమయంలో పిడికెడంత గుండెలో ఒకింత ఆవేదన, కళ్ళల్లో కన్నీరు నింపుకుని వెళ్ళవల్సి వచ్చింది.
సురేశ్, నేనూ ఓ సాయంత్ర సమయంలో పొలాల గట్ల మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఓ రైతు పొలం వద్ద విద్యుత్ తీగెల కింద కొబ్బరి చెట్లున్నాయి. ఆ కొబ్బరి చెట్టు మట్టలకి తీగెలు తగిలి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న చెరుకు తోటకు మంటలు వ్యాపించాయి. తోట కాలిపోతోందని గ్రామస్థులు తోట దగ్గరకు పరుగులు తీశారు.
సురేశ్ ఆ దృశ్యం చూశాడు. చలించిపోయాడు. ఆ సమయంలో వాడు ఉద్వేగంతో ఊగిపోయాడు. ఆ సమయంలో కేవలం వాడి ఆలోచన ఒక్కటే తనవంతు సహాయం అందించాలని, నన్ను వదిలిపెట్టి అడ్డదారిలో పరుగుతీశాడు. అప్పటికే తెగిన విద్యుత్ తీగ కింద పడి ఉంది. పరుగు తీస్తున్న సురేశ్ కాలికి ఆ తీగ తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే అసువులుబాశాడు.
‘‘మన పాలేరు రామయ్య పొలంలో ఫ్యూజ్ పోయిందని ఫ్యూజ్ వేస్తూంటే షాక్ తగిలి చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత మనో వేదనతో భార్యకి పక్షవాతం వచ్చింది. వితంతు పింఛను ఆమెకి రాలేదు. వెంకటేశం మామయ్యా అని పిలిచేవాడివి గుర్తుందా? అతను కూడా పొలానికి వెళ్ళి మోటర్ ఆన్ చేస్తుండగానే మృత్యువాత పడ్డాడు.
మెట్ట్భూమి ఉన్నా బోరు పాడయి పంటలు వేయలేని స్థితి ఆ కుటుంబానిది. గేదెపాలు అమ్ముకుని ఆ కుటుంబం జీవన యాత్ర సాగిస్తోంది. ఇంకా విను. మనకి సరుకులు ఇచ్చే షావుకారు కామరాజు పరిస్థితి మరో విధంగా ఉంది. అతను ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా విద్యుత్ తీగలు తెగి అతనిపై పడ్డాయి. అతనికి రెండు కాళ్ళూ చేతులూ తొలగించవలసి వచ్చింది. మంచంపై పడి ఉన్నాడు. అతని కుటుంబానికి కూడా తగిన సాయం అందలేదు. అలాగే సింహాద్రిది మరో విషాద సంఘటన. విద్యుదాఘాతానికి గురైన అతను మంచంపై పడి ఉన్నాడు. భార్య, కొడుకు కూలి పనులకి వెళ్తున్నారు’’ నాన్నగారు గ్రామంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్తూ ఉంటే నా మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది.
పోస్టుమార్టం చేసిన తరువాత సురేశ్ ప్రాణం లేని శరీరాన్ని ఓమారు కుటుంబ సభ్యులకి చివరిసారిగా చూపించడానికి అవకాశం కలిగించారు. వాడి నిర్జీవ శరీరాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చాను. వాడి భార్య దు:ఖాన్ని దూరం చేయడం ఎవ్వరికీ సాధ్యపడలేదు.
‘‘దిన వారాలు అయ్యేవరకూ సెలవు పెట్టుకుని ఉండు. నీకు ప్రాణ స్నేహితుడు కూడా సురేశ్’’ అన్నారు నాన్నగారు. అయితే ఆ పరిసరాలలో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి వేయలేదు. వస్తున్నప్పుడు ఇద్దరం ఆ గ్రామంలో అడుగుపెట్టాం. వెళ్తున్నప్పుడు ఒక్కడినే వెళ్తున్నాను. మనిషి పుట్టినపుడూ ఒంటరిగానే పుడ్తాడు. చనిపోయినపుడు కూడా ఒంటరే. విరక్తిగా అనుకున్నాను. వెంటనే గ్రామంలో ఉండలేక ప్రయాణమయ్యాను.
స్టేషన్లో నాన్నగారు నాతో... ‘‘సూర్యం! నీవు స్థిమితపడు. అయిందేదో అయిపోయింది. అయిందానికి ఎవ్వరూ ఏం చేయలేరు’’
సురేశ్‌కి పెళ్ళయి సంవత్సరం కూడా అవలేదు. సురేశ్ భార్య గర్భవతి కూడా. ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. పడబోతున్న నన్ను తిరిగి ఎవరో పట్టుకున్నారు. నన్ను మా ఇంటికి తీసుకువచ్చారు. ఇవన్నీ నాకు గుర్తే లేదు.
నాకు తెలివి వచ్చిన తరువాత సురేశ్ మరణ దృశ్యం జ్ఞప్తికి వచ్చి నాకు దు:ఖం ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్నాను చిన్నపిల్లాడిలా. మా కుటుంబ సభ్యులు నన్ను ఓదారుస్తున్నారు.
‘‘ఈ సంఘటనకే నీవు ఇలా డీలాపడిపోయావు. మన గ్రామంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్తే నీవు తట్టుకోలేవు’’ అన్నారు నాన్నగారు నాతో. ‘‘ఏ సంఘటనలు?’’ నేను నాన్నగారిని అడిగాను. ‘‘అదే! సరస్వతి పిన్ని అని చిన్నప్పుడు నీవు పిలిచేవాడివి. ఆ సరస్వతి పిన్ని గుర్తుందా?’’ నాన్నగారి మాటలు విన్న నేను సరస్వతి పిన్నిని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ సరస్వతి పిన్ని భర్త రామారావు విద్యుత్ మోటారు వేయడానికి పొలానికి వెళ్ళాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ్డం వలన ట్రాన్స్‌ఫారం దగ్గరకు వెళ్ళాడు. దాన్ని చూస్తున్న సమయంలో మృత్యువాత పడ్డాడు. భర్త మరణించడం వలన ఆ ఇంటి భారమంతా సరస్వతి పిన్నిమీదే పడింది. అసలే చిన్న పిల్లలు. వాళ్లని చదివించడంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఆర్థిక స్తోమత లేక చివరికి కూలి పనికి కూడా వెళ్తోంది సరస్వతి పిన్ని’’ నాన్నగారు అన్నారు.
‘అయ్యో’ బాధగా మూలిగింది నా హృదయం.
ట్రైను కదిలింది. భారమైన హృదయంతో నాన్నగారికి వీడ్కోలిచ్చాను.
నేను నాదైన శైలిలో ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా ఉచిత విద్యుత్ విషయంలో మొదట రైతుల్ని చైతన్యవంతుల్ని చేయాలి. వారికి సురక్షిత చర్యల గురించి తెలపాలి. వర్షం పడినప్పుడు నేల తడిగా ఉంటుంది. అందుకే రైతు చూసుకుని పంపుసెట్ ఆన్ చేయాలి. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పంపుసెట్లనే వాడాలి. వైరింగులోనూ నాణ్యత చూసుకోవాలి. రైతులకి బీమా చేయించాలి. విద్యుత్ లైన్ల తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. లైన్ ఇన్‌స్పెక్టర్లు కూడా లూజయిన లైన్లను సరిచేయాలి. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఎర్తింగ్ సరిగా ఉందో లేదో చూడాలి. ప్రమాదం జరిగినప్పుడు దానిపై అధ్యయనం జరగాలి. కారణం తెలుసుకోవాలి. ప్రభుత్వం విచారణ జరిపించాలి. తిరిగి ప్రమాదాలు జరగనీయకుండా జాగ్రత్తపడాలి’
నేను ఇలా ఆలోచిస్తున్నాను కాని, వాస్తవానికి, వాటిలో సగమైనా అమలు అవుతున్నాయా? లేదే! అందుకే అన్నదాతలు కరెంటు తీగలపై శవాలవుతున్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి’ నా ఆలోచనలతో సంబంధం లేకుండా ట్రైను పట్టాలమీద దడదడ శబ్దం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
ఫోన్ : 08922231605.

పుస్తక పరిచయం

గొంతెత్తి పిలిచే
‘విస్తృత స్వరాలు’

ఇప్పుడు స్వేచ్ఛగా బతికే స్పృహ గుర్తుకొస్తే స్వాతంత్య్ర పోరాటాన్ని మర్చిపోము. ఆ వెంటనే స్ఫురించే గాంధిని మర్చిపోము. ఆ స్వాతంత్య్ర పోరాటాన్ని చూడలేదు గాని అది ఎక్కడ చదివినా ఎవరు చెప్పినా ఒడలు పులకిస్తాయి. ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాగే గాంధీని చెప్పుకున్నా, గాంధేయ వాదులమని అనుకున్న వాళ్లని విన్నా మనసు కుతూహల పడుతుంది. జాతీయోద్యమంలో వీరోచిత పోరాటాలతోపాటు విలువైన మానవీయ నిరసన ఉద్యమాలు అంతర్భాగమై ఉన్నాయి. జాతీయోద్యమంలో గాంధి తలపెట్టిన ప్రతి ఉద్యమం ఒక విభిన్నతనే కాదు ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. అహింస, సత్యాగ్రహం, నూలు వడకడం, గ్రామాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం కూడా గాంధీ ప్రభావం దేశ రాజకీయాల మీద ఉంది. అభివృద్ధికి ఒక మార్గం అయ్యాడు గాంధి. గాంధి సిద్ధాంతం దేశ మానవాళికి ఒక దిక్సూచి అయింది. ఆయన్ని చూసి ప్రభావితమైన వాళ్లు ఆయన్ని అనుసరించి ప్రభావిత పరిచినోళ్లు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తివంతం, వారి సేవాతత్వం వారి జాగృతత్వం ఈ దేశ పౌరులందరికీ ఎంతో అవసరం. అలాంటి వారిని పరిచయ పరచిన పుస్తకం ‘విస్తృత స్వరాలు’. పదిహేను మంది గాంధేయవాదుల ఇంటర్వ్యూలను యువ రచయత ‘గౌరవ్’ దీనిలో పొందుపరిచారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారిని ఏరికోరి చేసిన అమూల్యమైన పరిచయాలు. పరిపూర్ణ జీవితానే్న కాదు పరిపూర్ణ లక్ష్యాన్ని సాధించినోళ్లు వీరంతా. వారి పరిధిలో వారి త్రోవలో సమాజాన్ని జాగృతపరుస్తూ గాంధీ తత్వానికి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందని నిరూపిస్తున్నారు. అంతా అరవై పైబడిన వారు వివిధ కులమతాలకు చెందిన వారూను. ఒక చక్కని జీవిత విధానం క్రమశిక్షణాయుతమైన ఆలోచనా విధానం గాంధేయ మార్గంలో ఇంకా ప్రజలకు సేవ చేయాలనే 99 ఏళ్ల రావూరి అర్జునరావు గారికి ఉందంటే గాంధీ ప్రభావం అర్థమవుతుంది. ప్రముఖ గాంధేయవాది ‘గోరా’ గారికి ఈయన అల్లుడు. సంపూర్ణ ఆరోగ్యంతో గాంధి విలువలు పాటిస్తున్న సరస్వతీ దేవి గారు ఇప్పటికీ నూలు వడకడంలో గ్రామ స్వరాజ్య కాంక్ష ప్రబలంగా కనపడుతుంది. దీనికంతటికి కారణం తన చిన్నపుడు విరాళాల సేకరణకు వచ్చినపుడు గాంధి అడిగిన చెవికమ్మలు తీసి ఇచ్చి వేయడం, తర్వాత కళాశాలలో చదువుతుండగా గాంధియాత్రలో భాగంగా తమ దగ్గరకొచ్చినపుడు తన చేతి ఉంగరాన్నిచ్చి బదులుగా నాకేమిస్తారన్నారట ఆమె. వెంటనే ‘తకిలీ’ ఒకటి తీసిచ్చారంటారు. ఇప్పటికీ నూలు వడకడంలోని బలవత్తర అంశం అదే.
సత్యం అహింస నైతిక విలువలు ఎన్నో జీవన సత్యాలను ఆవిష్కరించిన గాంధేయ మార్గం ఎందరెందరినో ప్రభావితం చేసింది. అందులో ఫక్తు వ్యాపారాత్మక ఆలోచనలతో ఉండే అరవింద్ జైన్ ఆలోచనలలోకి గాంధి ఆశయాలు దూరాయి. సేవా పరాయణత్వంతో సమాజానికి సేవ చేయాలనే తలంపు కలిగింది. అదే ఆయనలోని నిరాడంబరతకు అద్దం పట్టింది. తను చదివిన గాంధి ఆత్మకథ ‘సేవాశ్రమం’ పెట్టడానికి కారణమైందంటే గాంధేయ భావజాలం ఎంతలా వేళ్లూనుకుందో మనం అర్థం చేసుకోవాలి. మత కర్మలకన్నా దాని విధులకన్నా వాటి ఆచారాలకన్నా తాను ఆచరించి, నిర్వహించిన ఎన్నో సత్యాలను తెలియజెప్పిన ‘గాంధి మార్గం’ సరళాత్మకం, శరణాత్మకం. అవన్నీ ‘విస్తృత స్వరాలు’ పుస్తకంలో పొందుపరిచిన వారి వారి అభిప్రాయాలు ఆలోచనలు భావితరాలకు మరింత బలంగా ప్రేరణాత్మకం అవుతాయి. కమ్యూనిస్టులు మొదలు అంబేద్కరిస్టుల వరకు గాంధిని విమర్శించే వారే. అయితే దానికి 84 సంవత్సరాల సుదీర్ఘ ఖాదీ ప్రచారోద్యమంతోపాటు ఖాదీ గ్రామోద్యోగ సంస్థకు ఛైర్మన్‌గా, నిష్కళంక ప్రజాప్రతినిధిగా సేవలందించిన పరిపాటి జనార్దనరెడ్డి ఒక మాట చెప్తారు. కమ్యూనిజాన్ని మించిన ప్రజా సిద్ధాంతం గాంధీది అంటారు. అదే గాంధేయ సోషలిజం. ఆయన దృష్టిలో కమ్యూనిజానికి గ్రామ స్వరాజ్యానికి పెద్దగా తేడా లేదంటారు. ఇక విమర్శను డొల్లతనంగా కొట్టి పారేస్తారు తన ఇంటర్వ్యూలో. రాట్నం ద్వారా ఉప్పు సత్యాగ్రహం ద్వారా స్వరాజ్యం తెస్తాననటం, స్ర్తిలను గ్రామాలను బలోపేతం చేసేలా ఖాదీ తదితర కుటీర పరిశ్రమల్ని స్థాపించడం ప్రపంచ విప్లవ చరిత్రలోనే వినూత్న ప్రయోగమంటారు. గాంధీజీ ఆశయాలు మేళవించేలా సహజ సిద్ధంగా ప్రకృతి బద్ధంగా జీవించే తరాలు రావాలన్న ఆయన ప్రగాఢ ఆకాంక్ష ఎంత గొప్పదో చూడండి.
గాంధీయే జీవితమన్నట్లు గాంధీని సుచరితం చేసే లక్ష్యంతో రచనలు చేసిన గాంధేయ వాద రచయత ప్రఖ్యాత తెలుగు సాహిత్య విమర్శకులు కోడూరి శ్రీరామమూర్తి గారి ఇంటర్వ్యూ చదివితే గాంధీ మీద పెక్కు రచనలు చేసిన తెలుగు గాంధేయ వాద రచయిత కోడూరి వారన్నది తెలుస్తుంది. ‘బాపూ బాల విహారం’ అశాస్ర్తియ విద్యా విధానంపై ఆయన సంధించిన ప్రత్యామ్నాయ విద్యా విధానం.
పిల్లలకోసం ‘చదువు’, చదువుకుందాం అలాగే ‘నైతిక విప్లవం’ అనే పత్రికలు స్థాపించి మెరుగైన సమాజం కోసం అవిరళ కృషిసల్పారు. అలా విలేఖరిగా, చరిత్ర పరిశోధకునిగా, పూర్తికాల నిబద్ధతగల రచయతగా నశీర్ అహ్మాద్ ప్రస్థానం తెల్సుకోటానికి, అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ లెక్చరర్‌గా చేసి మాతృభూమికి తనేదయినా చేయాలనే లక్ష్యంతో వెనుకబడిన గిరిజన ప్రాంతంలో ప్రస్తుత విద్యా విధానంపై చెర్నాకోలా విసిరి ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థకు ఆద్యుడైన పిడికె రావు గార్ని తెల్సుకోవాలన్నా, సుమారు 4 దశాబ్దాల శోధన ద్వారా ‘బాలబడి’ నిర్మించిందీ ఆయనే. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సభ్యునిగా జపాన్ మొహియుద్ధీన్‌ను తెల్సుకోవటానికి, భూదానోద్యమ నేత ఆచార్య వినోభాభావే ప్రేరణతో సర్వోదయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించి ఇంకా సేవ చేయాలనే యోచనతో వికలాంగుల హాస్టల్ నడుపుతున్న గోవిందరాజుల వెంకట సుబ్బారావు గార్ని ఇంకా పివి చారి, డి నారాయణరావు, అచ్యుత వెంకట రామగుర్నాథం, వేములకొండ రఘుమాయాదేవి, కెఎన్ శాస్ర్తీలాంటి వారిని తెల్సుకోటానికి ఈ పుస్తకం తప్పక దోహదపడుతుంది.

- అమృత్, సెల్: 9494842274

జనవాక్యం

ఓ మగువా ఉద్యోగించు - తెగువతో సాధించు

జీవన ప్రమాణాలు పెరిగిన తర్వాత ప్రజల జీవితాలలో కూడా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. కుటుంబ అవసరతలు, నిత్యవసర ధరలు తదితర మైనవి పెరిగిపోవడంతో భార్యాభర్తలిద్దరూ కష్టించ వలసి వస్తుంది. కనీసం నెలకు వేలల్లో రెండంకెలు లేకపోతే ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబం సైతం సౌకర్యంగా బతకలేని పరిస్థితి. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరం ఏర్పడుతోంది. దీనికోసం రకరకాల ఉద్యోగ వేటకు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్న ఉద్యోగాల కోసం వెంపర్లాడ వలసి వస్తోంది. ఉద్యోగం సంపాదించటం ఒక కష్టతర ప్రయత్నం. అయితే దానిలో కొనసాగడం కత్తి అంచుమీద నిలబడి గారడీ చేయడం లాంటిది. స్ర్తి, పురుష ఉద్యోగాలు చేసే కార్యాలయాల్లో అయితే ఇతరులను నొప్పించక తానొవ్వక అన్న చందంగా ఉద్యోగించడం మరింత కష్టసాధ్యం. తన ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఇతర ఉద్యోగులతో సఖ్యత చెడకుండా నెట్టుకు రావడానికి బలమైన వ్యక్తిత్వం ఉంటేనే సాధ్యపడుతుంది. అనేక మంది మహిళలు వివిధ కార్యాలయాలలో పనిచేస్తూ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోడానికి వీలుగా ఈ అంశాలు పనిచేస్తాయేమో చూద్దాం.
మీ వస్త్ర ధారణ ఎదుట వారిని కవ్వించే రీతిలో కాకుండా హుందాగా గౌరవం ఉట్టిపడేలా మీ శరీర నిర్మాణానికి తగిన విధంగా ఉండేలా వస్త్రాలు ధరించాలి. ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా పర్‌ఫ్యూమ్‌లు, స్ప్రేలు చేసుకోవడం అవసరమా! అనేది ఒక కోణమయితే, గాఢత కల్గినవి ఉపయోగించడం మరొక అంశంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అబద్ధాలకు అవకాశం లేని పరిస్థితులు కల్పించుకుంటూ ఆత్మగౌరవం రెట్టింపు చేసుకోటానికి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి.
మీతో పనిచేస్తున్న పురుష ఉద్యోగులతోనే కాదు మహిళా ఉద్యోగులతో కూడా అనవసర విషయాలే కాదు అసంబద్ధ ఉపన్యాసాలు విడనాడాలి. అవసరం అనుకుంటే ఆఫీసు విషయాలు తప్పితే కుటుంబ విషయాలు, స్వ విషయాలు ఎక్కడా ఏకరువు పెట్టకూడదు. ఇతరుల సానుభూతి కోసం పరితపించకుండా ప్రయత్నించాలి. సానుభూతికోసం మనసు ఉపశమనం కోసం ప్రయత్నిస్తే చాలు, అదునుకోసం కాసుక్కూర్చొన్న అవకాశవాదులు విజృంభిస్తారు.
మగ ఉద్యోగులతో సాధ్యమైనంత వరకు ఏకాంత సంభాషణ అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే మాట్లాడేది ఎంత మంచి విషయమైనా అపార్థం చేసుకునే వాళ్లకి అవకాశం ఇచ్చినట్టవుతుంది.
అసూయ పుట్టిన తర్వాత ఆడది పుట్టిందన్న సామెతకు కొందరు మచ్చుతునకగా ఉంటారు. గోప్యంగా ఉంచుకునే స్వవిషయాలు కుటుంబ రహస్యాల్లాంటివి స్నేహంగా కన్పించే ఏ మహిళా మణికి ఈ గాలి ఊదకండి. దీనిని అలుసుగా తీసుకుని ఏదో సందర్భంలో ఎక్కడో ఒకచోట కార్నర్ చేసే అవకాశాన్ని వాళ్లకెందుకు ఇవ్వడం.
ఎవరితోనైనా సున్నితంగా సమయోచితంగా మాట్లాడాలి. ఒకరి మీద ఒకరికి పితూరీలు, ఒకరిపైన ఒకరికి చాడీలు చెప్పి సొంత వ్యక్తిత్వాలను దిగజార్చుకోకుండా చూసుకోవాలి.
ఇంటి సమస్యలు చక్కబెట్టుకుంటూ ఆఫీసు సమస్యల్లోకి తలదూర్చకుండా తమ పనిని సరిగా చేసుకుంటూపోతే మహిళ ఎక్కడైనా స్వేచ్ఛగా ఉద్యోగించవచ్చు. వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకోకుండా ఎక్కడైన స్ర్తి మనగలుగుతుందని రుజువు చేయవచ్చు.

- పాతగొలుసు వౌన్య
హౌసింగ్ బోర్డు కాలనీ,
రాజమహేంద్రవరం

మనోగీతికలు

కాల్‌మనీ
వడ్డీ బెంగలేదు
అదునుకు అప్పుచాలు
నోరు కట్టుకు తీర్చేద్దాం
సామాన్యుడి మనోగతం

కాబూలి వ్యాపారం
ఇసుక మద్యం - మాఫియా
దోపిడికి పెట్టుబడి
బుగ్గిపాలు ప్రజాజీవనం

అనంత అవసరాలు
తాహతకు మించి బాకీలు
రాబడికి అందని వాయిదాలు
ఎప్పటికీ తీరని బకాయిలు

అద్దంలో మురిపం
అడగ్గానే అప్పు
రుణతీర్థం - మహాసంద్రం
తీరం దొరకని ప్రయాణం

కాల్‌మని చీకటి కోణం
స్ర్తిల అభిమతి భంగం
మృగాళ్ల ధనదాహం
గతి వ్యభిచార కూపం

అవసరాలు అనవసరాలు
ఎరుగని సామాన్యులు
డబ్బు ఎర వస్తు వ్యామోహం
రుణ ఊబిలో పతనం

అధిగణం అండ
అగ్రగణ్యుల నీడ
పెద్దల మదుపు
ఎదురులేని తంత్రం

కాల్ నాగుల దురాగతం
ఆర్థిక సంక్షోభంలో జనం
ధనమాన ప్రాణాలు అర్పణం
న్యాయం చూడని దారుణం

చట్టం కఠినతరం
వడ్డీ నియంత్రణం
బ్యాంకుల సరళతరం
కావాలి - పొత్తుకదే అంతం

ఖర్చుల అదుపు
ఆర్థిక క్రమశిక్షణ
సామాజిక బాధ్యత
అలవడాలి బాలలకు

- డాక్టర్ జనపాల
కాళేశ్వరరావు
రాజమహేంద్రవరం, తూ.గో.జిల్లా
సెల్: 9848142428

ఓ సైనికుడా.. జోహార్లు
ఓ సైనికుడా!
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
దేశం కోసం
జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను
నీవే సర్వస్వం అనుకొని
నీ వెంటే నడిచి వచ్చిన
భార్యను వదిలి
కేరింతలతో మనస్సుకు హత్తుకునేలా
చిరునవ్వులు నవ్వుతూ
నీ కోసం చేతులు చాచే నీ బిడ్డ
ముద్దు పలుకులు వినకుండా
దేశ సరిహద్దులలో మైనస్ డిగ్రీల
చలిని కూడా లెక్కచేయకుండా
నా దేశం...నా దేశ ప్రజలు
క్షేమంగా ఉంటే చాలు
అనే దృఢ సంకల్పంతో
రేయింబవళ్లు
నిద్రాహారాలు మానుకొని
దేశరక్షణకై
పోరాడుతూ...
తుదిశ్వాస విడుస్తున్న
ఓ సైనికుడా...
ఇవే మా జోహార్లు
- చింతా రాంబాబు,
కాట్రేనికోన, తూ.గో.జిల్లా

మగువ
సరిగమ పదనిసల పదహారేళ్ల వయసు
మధుర భావాలు పలికించే మగువ సొగసు
పరమ యోగిని కూడా భోగిని చేసే సౌందర్యం
కోటి ఆశలతో పండించుకొనే తొలి రాత్రి
అరమరికలు లేని నిత్య వన దాంపత్యం
జీవితాల దాసోహం అనే అవ్యాజప్రేమ
మాతృత్వపు పవిత్రత
అమ్మతనంలోని కమ్మతనం
సహధర్మచారిణి సౌకుమార్యం
ప్రకృతికే ప్రతిరూపమైన స్ర్తిత్వం
కనె్న కలల నుండి తలపండిన అలల వరకు
తొణికిసలాడే అనుభవ లాలిత్యం
సున్నిత మనసుకు చిరునామా
సృష్టికే ఆధారమనే తత్త్వం
సంస్కృతీ సాంప్రదాయాలలో పెద్దపీట
ఏమైపోయాయి?
మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాయి!
మరి కారణం తెలుసా!
స్ర్తిని స్ర్తిగానే చూడాలి
అవసరాలకు యంత్రంగా కాదు!
మగువ మనసును కలుషితం చేయకు!
అపుడే సృష్టిలో మధురిమలు
తెల్లని మల్లెల ఘుమఘుమలు
పది కాలాలు నిలబడతాయి
లేదా! అంతా నిర్లిప్తం!!

- వారణాశి
వెంకట సూర్య కామేశ్వరరావు
రాజమహేంద్రవరం, తూ.గో.జిల్లా
సెల్: 9491171327

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- గూడూరు గోపాలకృష్ణమూర్తి