రాజమండ్రి

అసహన బీజం (శాంతి వచనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఆశిస్తామే కానీ కోరుకున్న వాటిని ఇతరులకు వాటిని అందివ్వం... ఎందుకని ప్రశ్నించుకుంటే, కోరుకున్నవి ఎందుకు తీరటం లేదో ఎవరికి తీర్చడం లేదో అర్థమవుతుంది. వినిమయానికి మనమిచ్చే ప్రాధాన్యమే సద్వినియోగానికి ఇవ్వలేని కారణం. రోజువారీ వ్యవహారాలతో ప్రారంభించిన మన దినచర్య ముగిసేటప్పటికి ఏ అర్థరాత్రో అపరాత్రో అవుతుంది. ఎక్కడ మొదలుపెడతామో అక్కడికే వెళ్లి మరీ ముగిస్తున్నాం. హడావుడిగా, అనాలోచితంగా, తొందర తొందరగా పనులు ముగించుకుంటూ ఏ దిశాగమ్యం లేని బ్రతుకు సమరం చేస్తున్నాం. ఆ బతుకు బాటలో దిశానిర్దేశనం లేని గమనంలో ఆలోచనాత్మకతకు చోటు లేకుండా బండిని నెట్టుకొచ్చేస్తున్నాం.
మన ఆరాటం, పోరాటంలో పనిచేస్తున్న కార్యాలయ విషయాలో, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాలో ఇరకాటంలో పడితే మనసులో అసహన బీజం వేళ్లూనుకుంటుంది. అంతే అంచలంచెలుగా అది రాజుకుంటూ నిప్పురవ్వలుగా అశాంతిని సృష్టిస్తుంటుంది. దానితో మన మనసు అశాంతి అంచు దాటి రాకుండా దాని లోపలి గోడలు తాకుతూ కుతకుతలాడిపోతుంటుంది. ఏ సమస్య మనసును తాకినా, మాలిన్యం పేరుకున్న మంచినీటి కుంట సైతం మురుగు గుంటగా మారడానికి ఏళ్లు పూళ్లు అవసరంలేదు. వాడిన నీరు వచ్చి చేరితే చాలు మురుగు కంపునకు వరద చేరుకున్నట్టు, ప్రతి చిన్న సంగతి మనసులోకి చేరి సమస్యల తుపాను సృష్టించడానికి సిద్ధమయిపోతుంటుంది.
అసంగతమైన విషయం మెదడు పొరల్లో చేరి తొలిచేస్తుంటే అలజడి మనసుసు కుదిపేస్తుంది. లోబడని అర్థిక ఆసమానతలు, శక్తిని మించి చేయించే కుటుంబ వ్యవహారాలు, సామాజికపరమైన విషయాలు జీవితాన్ని ఊగించేస్తుంది. నిత్య వ్యవహారంలోని వ్యక్తిగతమైన సంగతులున్నా భగభగలాడించేస్తుంది మనసును. గుప్పెడంత గుండెలో ఎన్నని ఇముడ్చుకుంటుంది. మనసు గగ్గోలు పెట్టేసి, ఇంట్లో కుతకుతలాడించేస్తుంది. ఇక దాంతో మొదలవుతుంది రణరంగానికి, యుద్ధ క్షేత్రాలకు వేదికల వేట. సరదాకు స్నేహ వాత్సల్యంతో మాటలాడుకునే మిత్రుల మధ్య విమర్శను కూడా సహేతుకంగా చర్చించే సన్నిహితుల మధ్య ప్రాముఖ్యం లేని సందర్భాల మధ్య చేరిపోయి ఏ చెణుకో విసిరితే వచ్చే అనర్థాల మధ్య అశాంతి అల్లుకుపోయి నిలువెల్లా వణికించేస్తుంది. పొగబెట్టకుండానే మంటలు ఎలా రావాలో వచ్చేసి గుండెల్లోంచి మనిషికి, వాళ్ల నుంచి ఇతరులకు, చుట్టుపక్కల వాళ్లకు అలా సమాజంలోని వాళ్లందరికి దావానలంలా వ్యాపించేసి దహించేస్తుంది. కుటుంబంలో మొదలైన అశాంతి మొత్తం ఆ కుటుంబ జీవన వ్యవస్థనే అతలాకుతలం చేసేస్తుంది. అది అక్కడితో ఆగిపోకుండా చుట్టూవున్న వాళ్లను తనలోకి లాగేసుకుని చుట్టుముట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరుక్కున్న ప్రాముఖ్యత గల వ్యక్తులు, అధికారాన్ని శాసించే పెద్దలు, ఎంతో ఉన్నతంగా వ్యవహరించే ప్రముఖులు తమలో అశాంతిని పారద్రోలకుండా సమాజంలో శాంతిని ఎలా సమాధానపరుస్తారు?
ప్రభుత్వాధికారులు, దేశాధినేతలు మనసు కల్లోలపరిచే స్థితిలో ఉంటే శాంతి సహవాసం ఎలా వర్థిల్లుతుంది? ఇదంతా మనసు చట్రం బయట నుంచి చూస్తే పెద్దదిగానే తోస్తుంది. దాని పరిస్థితి విస్తృతం అని చూపిస్తుంది. దాంతో మనసు భూతం నీడలాగా సాగి భయపెట్టేస్తుంది. హృదయాన్ని కన్నీళ్లతో తడపకపోతే జీవితం పొడిబారిపోతుంది. కనికరంతో మనసును చదును చేయకపోతే ఆలోచన కూడా అవయవాలకు సరిగ్గా సరఫరా కాదు. రక్తంలోకి దయ ఇంకితేనే మెదడు వికసిస్తుంది. మనిషి క్రియలు, చేసే పనులు మానవీయతగా మదిలోకి అనుమతించుకుంటేనే సమాజం మంచిగా విశాలమవుతుంది. శాంతి కోసమో, సమాధానం కోసమో సముదాయించే స్నేహ హస్తం వైపు చేతులు చాస్తేనే సాధ్యపడుతుంది. అపుడే మనుష్యులందరి మీద శాంతి ప్రసరిస్తుంది. మనసులపై శాంతి సమాధానం కలిగి మనిషి కుదుటపడతాడు.

- అమృత్, 94948 42274

పుస్తక పరిచయం

అనుభూతిమయం
‘ఏటి ఒడ్డున ప్రయాణం’
ప్రతులకు:
ఎ.పి.ఎస్.్భగ్వాన్
లంకలకోడేరు - 534250
పశ్చిమ గోదావరి జిల్లా

కవిత్వం రాసేవాళ్లు ఎంజాయ్ చేయడం కాదు కవిత్వాన్ని ఎంజాయ్ చేయగలిగితే అదే అసలైన కవిత్వం. అలాంటి కవిత్వం కోసం ఎక్కడికో పరుగిడనవసరం లేదు. మన గోదారి తీరం వెంబడి బోలెడంత కవిత్వం దొరుకుతుంది. బోరు కొట్టనంత మంది కవులు ఉన్నారు. అచ్చంగా కవి కులానికి చెందిన సీనియర్ కవి ఎవరయ్యా అంటే ‘్భగ్వాన్’ అనొచ్చు. సిన్సియర్ కవి కూడా ఆయన.
ఆయన రాసిన ‘ఏటి ఒడ్డున ప్రయాణం’2చదువుతుంటే కవిత్వానుభూతి ఎంత లోతైందో అంత గాఢత కలిగిందని స్పష్టమవుతుంది. వచన కవిత్వంలో చక్కని పేరు సంపాదించుకున్న ఆయన హైకూలు రాసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ కవితా ప్రక్రియ జపనీస్‌ది అయితే తెనుగుదనపు ఒరవడిని కావలసినంత కురిపించారు భగ్వాన్. అనుభూతి ప్రధానమైందేమో మనల్ని భగ్వాన్ ఏటి ఒడ్డున వదలకుండా తిప్పుతారు. మనకు రావాలనిపించదు. ఆయనకు వదలాలనిపించదు. కవి కదా తన అనుభవసారాన్ని రుచి చూపించిగాని వదిలేయరు. మొత్తాన్ని తినిపించి మరీ సంతృప్తిపరుస్తారు. పుస్తకం మొదటి పేజీ తిప్పి ఏటి ఒడ్డుకి కళ్లు పెట్టామో లేదో కట్టి పడేసి లోపలి పేజీల్లోకి లాక్కుపోతుంది. ఎంత చల్లగా దింపాడంటే కవి, చంద్రుడు చేసిన కవితను గుండెల్లోకి నింపి తీసుకుపోతారు భగ్వాన్ ‘ఏం చంద్రుడమ్మా వీడు/ కళ్లు మూసుకున్నా/ కనిపిస్తున్నాడు.2గోదారి పక్క పల్లెల్ని చూసుండకపోతే, ఆ మాటకొస్తే పల్లెల్ని చూడకుంటే వాటిలోని మాధుర్యం తెలీదు. అభివృద్ధివైపు చూపున్నట్టు ఆత్మీయత వైపు లోతున్నట్టు అర్ధం. నగరవాసి ఏం కోల్పోయాడో పల్లెకు వస్తేకాని తెలియలేదు. ఇది చూడండి తెలుస్తుంది పోయిందేదో.. ‘పల్లెకు వచ్చిన / నగరవాసి స్వగతం/ నేను జీవితంలో చాలా కోల్పోయాను’. అంతే గొప్పగా పల్లె అందాల్ని ఆనందాన్ని గొప్పగా ఆవిష్కరించిన హైకూ ఇది ఓ తియ్యని కలత పొందుతుంది, మనసు... ‘ఏ నగరం నుంచి వచ్చాడో/ కాలవనీ బల్లకట్టునీ/ ఆశ్చర్యంగా చూస్తున్నాడు’.
ఎందుకో పట్నం కృత్రిమత్వానికి నెలవు. అక్కడంతా స్వార్థ చింతన కపటత్వానికి కొలువుగా ఉంటుంది. ఆ పక్కనే అభివృద్ధికరమైన మార్పు కన్పిస్తుంది. ఇటువంటి ఎన్నో సమ్మేళిత అంశాలు ముడిపెట్టి చూపారు ఈ హైకూలో బల్లకట్టు / పల్లెను/ పట్నానికి తీసుకుపోతుంది. ఒక రూప ప్రధాన ప్రక్రియ హైకూ అయితే భావానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ముఖం కడుక్కుందామని / చెరువులోంచి / దోసెడు ఆకాశాన్ని తీసాను2 మంచి భావుకతతో కూడిన హైకూ మనసును పట్టేస్తుంది. ఇదీ అంతే చూడండి.. నిరుడు అక్కడే చనిపోయింది / ఒక బంతి మొక్క / ఇవాళక్కడెన్ని బంతి మొక్కలో.2
హైకూ స్వభావంలోని ప్రత్యేకతలు ఒడిసి పట్టుకున్న కవి భగ్వాన్. శబ్దాన్ని దృశ్యీకరించే అనుభవం పుష్కలంగా ఉంది. దానె్నంత గొప్పగా చెప్పారో ఈ హైకూ చూస్తే ఇట్టే పట్టేయవచ్చు ఆయన ప్రతిభను ఆమె బిందు ముంచుతుంది / చెరువు పులకించి / మృదంగం వాయించింది.2 సంసారంలోని దాంపత్య చిత్రణ గురించి ఎంత రసాత్మకంగా చెప్పారో ‘పిల్లలు పడ్డుకున్నాకా / ఆమె నవ్వింది / గది ఓ సౌందర్య ప్రపంచం. గతం కాని భవిష్యత్ కాని హైకూల్లో సూచించబడవు. అంతా వర్తమానమే. అయితే భగ్వాన్ హైకూలు చదివితే గమ్మత్తుగా ఇంకొంచెం గొప్పగా చెప్పినట్టు అనిపిస్తుంది చూడండి. ‘బజారు అందాల్ని చూసి / వారం రోజులయింది / మాయదారి ముసురు2 గతం ఏం ముంచిందో వర్తమానానికి కబురుపెట్టినట్టు లేదు. జీవిత అనుభవసారంలోది, వాస్తవం కూడా మన ఊర్లో మనం పరాయివాళ్లమెలా అవుతామో ఇదే రుజువు. ‘పాతికేళ్ల తర్వాత / సొంత ఊరెళ్లాను / ఎవరూ పలకరించలేదు’
పాత పుస్తకానికి కొత్త నగిషీలు చెక్కటం లేదుకాని హైకూ కవిత్వంలో ‘ఏటి ఒడ్డున ప్రయాణం’ పుస్తకానికి శాశ్వత స్థానముందని చెప్పే ప్రయత్నం ఇది. హైకూను తెలుగుపరం చేసిన గాలినారప రెడ్డి, ఇస్మాయిల్, పెన్నా శివరామకృష్ణ, సూర్యభాస్కర్ లాంటి వాళ్లను దాటి హైకూ సాహిత్యాన్ని చెప్పుకోకుండా వెళ్లలేము. ఆ తర్వాత చాలామంది కవులు హైకూలు రాసి ప్రసిద్ధులు అయ్యారు. అయితే హైకూలు రాయడం వచన కవిత్వం రాసినంత సులువుకాదు. మూడు పాదాల్లో పదిహేడు అక్షరాల్లో అనుభూతిని ఒలికించడం సామాన్యం కాదు. అయితే ఆ అక్షర నియమం జపనీస్ భాషలోనే సాధ్యం. ఎందుచేతంటే ఒక అక్షరం ఒక పదంగా ఉండే అవకాశాలు అసంఖ్యాకం కావడం.
ఇక్కడొక విషయాన్ని చెప్పుకోవాలి. పరిమిత పదాలతో అపరిమిత భావాన్ని చెప్పడంతోపాటు గాఢమైన అనుభూతి కలిగించడం హైకూ ప్రత్యేకత. దాన్ని అనుభవసారం చేశారు భగవాన్. ఎంతైనా కవితా సృష్టికర్త ఆయన. ఆయనెంత ప్రకృతి ప్రేమికుడో, పర్యావరణ ప్రియుడు కూడా. ప్రకృతి గురించి, బాల్యం గురించి, ప్రేమ గురించి ప్రస్తావించిన హైకూలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.
మన తెలుగు కవివర్యులు తెలుగులో హైకూ ప్రక్రియకు కృషికారులైన ఇస్మాయిల్ దీని మీద ఓ మాట అంటారు. ప్రకృతిపైన ప్రేమా, ప్రాపంచిక విషయాలపై విముఖతా, ప్రశాంత చిత్రమూ, సుకుమారమైన అనుభూతి మొదలైన మానసిక లక్షణాలున్న వారు మాత్రమే హైకూలు రాస్తారు. ఈ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు మన కవికి సరిపోతుంది. ఈ విషయం భగ్వాన్ కవిత్వంపైనే కాదు హైకూలు మీద తియ్యని సమీక్షకు దారితీసింది.
ఈ మాసంలోనే గిడ్డి సుబ్బారావు, భగ్వాన్ కవిత్వాన్ని స్పర్శిస్తూ పుస్తకం వేశారు. ‘గుండెను కడిగే కవితలు’ ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే నాకు ఇచ్చారు కవి సుబ్బారావు. అచ్చయిన కవితను ఎక్కడ చూసినా అది బాగుందంటే చాలు ఆ కవి సెల్‌కి రింగ్ మోగుతుంది. తనకు నచ్చిన ఆ నాలుగు పాదాలు ముచ్చటిస్తారు, ఆపై అభినందన జల్లు. పుస్తకం నా చేతికొచ్చాక ‘ఏటి ఒడ్డున ప్రయాణం’ హైకూలు గుర్తొచ్చాయి. పదహారేళ్ల కిందట పదుగురి నోళ్లల్లో నాని కవితాలోకం మెప్పు పొందింది. ఇప్పటికీ వనె్నతగ్గని ఆ లేత వెనె్నల హాయిని అనుభవించి ఆస్వాదించాల్సిందే.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

పరిసరానుగుణ్యత
బాల్యంలో చదివాను
రూపాంతర ప్రక్రియ గూర్చి
మొక్కల రంగులో మారిన లార్వా
ఆకుల రంగులో మారిన గొల్లభామ
ఆహారం కోసం మారే
డ్రాసిరా, యుట్రిక్‌లేరియా, నెపంథిస్‌లు
బ్రతుకు కోసం మారాయని
భవితను దీర్చుకున్నాయని
యవ్వనంలో లోకం చదివాక
ప్రేమ పేరు పెట్టుకున్న ఊసరవెల్లుల జాతి
మన స్థన్యాన్ని త్రాగి చివురులు వేసి
మన హైన్యానికి పునాది వేసి
మన కన్నీళ్లకు వాటరింగ్ చేసి
అహంకార సౌథాన్ని నిర్మించి
అందులో నిరంకుశ సింహాసనం
నింగిని తాకేలావేసి
పాద పీఠంపై పడతినుంచి
పదఘట్టన చేస్తుందని
ప్రజ్వలించకుండా కాలరాస్తే
కాలానికి కాళిక అవుతుంది
కన్నీరే మున్నీరై ముంచేస్తుంది
మహిళ జనింపచేయడమే కాదు
మానవత్వం మరచితే జ్వలించి
జగతిలో లేకుండా నివురుచేస్తుంది
ఓర్పుకైనా, నేర్పుకైనా,
తీర్పుకైనా మహిళే మహరాణి
- బిహెచ్ రమాదేవి, రాజమహేంద్రవరం

ఎదురుచూపు
ఎవరి కొరకు ఎదురుచూపు?
ఎందుకొరకు ముందుచూపు?

ఎండమావి నీరు కోసమా?
ఎదురుపడని ఎదుగు కోసమా?
మనసు లేని మనిషి కోసమా?
మాట వినని మమత కోసమా?

ఎవరి కొరకు ఎదురుచూపు?
ఎందు కొరకు ముందుచూపు?

కానరాని కరుణ కోసమా?
కంటపడని కాంత కోసమా?
కలలు రాని రేయి కోసమా?
కలగా మిగిలే హాయి కోసమా?

ఎవరి కొరకు ఎదురుచూపు?
ఎందు కొరకు ముందుచూపు?

భవిత లేని బ్రతుకు కోసమా?
బరువు లాగే బాట కోసమా?
కరవు నెతికిన మెతుకు కోసమా?
కడుపు నింపని కలిమి కోసమా?

ఎవరి కొరకు ఎదురుచూపు?
ఎందు కొరకు ముందుచూపు?

- కోన బాబూరావు,
96038 80783

కానుక
నీవే మాకొక కానుక
వయసుతో దూరం పెరిగింది
కాల మార్పుకు తలొగ్గవలసిందే
బంధాలు అనుబంధాలు కరిగిపోయాయి

గడచిన మా బాల్యానికి రూపం నీవు
మా అనుభవాలు రంగరించుకొని పెరిగావు
మా ప్రేమకు ప్రతిరూపమై నిలిచావు
హద్దులు చెరిపేసిన చదువులతో
సుదూర తీరాలకు సాగిపోయావు

నైపుణ్యాలను సంతరించుకున్నావు
ప్రపంచ పౌరుల నేస్తగాడి వయ్యావు
మేమెపుడైనా గుర్తుకు వస్తే
పలకరించు చరవాణిలోనైనా

మా పెద్దరికపు ఎల్లలు
ఒంటరితనంలో జీవనం నేర్పింది
బిడ్డల జ్ఞాపకాల కాలం కరిగిపోతోంది
ఊరంతా మా వయసు నేస్తగాళ్లే
మీ గురించి మాటలే మా కాలక్షేపం

జీవితంలో అడ్డంకులన్నీ అధిగమించాం
కాలం చెరిపేసిన అవధులతో
మనం దూరమయ్యాము
ఈ నేలకే మా జీవితాలు అంకితం

మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి
జన్మభూమిని మరువకండి
ఈ నేల రుణం తీర్చుకోవడం మన బాధ్యత
సముద్రానికి ఈవల వైపే మా జీవితాలు
మా హృదయాన ముచ్చట్లే మిగిలిపోతాయి

- డాక్టర్ జనపాల కాళేశ్వరరావు
చరవాణి: 9848142428

అంత వయసొచ్చిందా...!

ఆశ్చర్యపోతుంటారు అంత వయసొచ్చిందా! అని
అరవైలో ఇరువైలా రభసంగ తిరిగేవారిని చూసి!
జీవిత మకరందం తెలిసిన వారిలో జారిపోదు జిగి
మధురభావాలు ముప్పిరిగొన్నవానిలో మలగదు ఒగి!

ఆనందంగ ఉండాలా! సాధ్యమే
హృదయాన్ని ప్రక్షాళించాలి కష్టంకాదు!
పట్టుదల వుంటే/ మందుల్ని మింగినంత మాత్రాన
మోహనత్వం తొడుక్కోదు దేహం!

వ్యాయామాలెన్ని చేసినా విలక్షణం లేకుంటే
అల్లుకోదు వికాసం!
యోగభోగం ప్రాయానె్నంత పదిలపరచిన
ఈర్ష్యాసూయలతో మనసు ఇరుకైతే

కలగదు ఇంగితజ్ఞానం/ ఆరోగ్యం దూరం!
సహాయపడే సహృదయత నీ సంకల్పమైత
శాంతి సౌఖ్యాలకు సర్వాధికారివి నీవే!

సుష్మ సౌందర్యాన్ని వీక్షించాలి
సంభ్రమం అవ్వాలి!
మంచినే వినాలి సుస్వర సంగీతానికి
మనోజ్ఞ సాహిత్యానికి సంవృతం అవ్వాలి!
హృదయం సంద్రతరంగంలా ఉప్పొంగాలి!

మంచినే భాషించాలి మాటలు
మధుధారలై మత్తెక్కించాలి!
మది రంజిల్లుతుంది ఆనందం అభిరామం అవుతుంది
స్వచ్ఛమైన స్నేహం మచ్చరాన్ని మాయం చేస్తుంది!

కలసిమెలసి సాగే సౌజన్యముంటే కాలగమనం
కమనీయమవుతుంది!
ఎడద అలాగే ఎడతెగని కళాత్మక భావాలతో
మేలిమిగ వుంటే..

నీరుపోసి నిబ్బరంగ పెంచిన మొక్కలా
పచ్చదనంతో మిసమిసలాడుతుంటుంది!
ఎగిరే గువ్వలా జీవితం సదా సంతోషంగా
వయసెంతైన తుదివరకూ వర్థిల్లుతుంది!

- మల్లెమొగ్గల గోపాలరావు
పిఅండ్‌టి కాలనీ, రాజమహేంద్రవరం
చరవాణి: 9885743834

జాగృతి
మెదడు క్షీర సాగరాన్ని
లక్ష్యం కవ్వంతో తిప్పు
ఆలోచనామృతం దక్కుతుంది
మనసు గుర్రాన్ని
బుద్ధిరౌతు స్వాధీనంలో ఉంచు
గమ్యం చక్కగా చేరగలమ్...
గుండెడప్పుపై
సమస్యలు భేరి మ్రోగిస్తున్నాయని
వెరవనక్కరలేదు!
అరిషడ్వర్గాలు
అక్రమదాడులు చేసినా ఆవిరైపోకు!
చేతనా స్థితి మాత్రమే మనిషిని
మహాత్మునిగా మార్చుతుంది
చేతగాని స్థితి మాత్రం
మనిషిని పాతరేస్తుంది సుమా!

- కిలపర్తి దాలినాయుడు
సెల్ : 9491763261.

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- అమృత్