రాజమండ్రి

కొంచెం ఇష్టం... కొంచెం కష్టం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలకృష్ణ పదవీ విరమణ చేసి వారం దాటింది. సీనియర్ రైల్వే ఇంజినీర్‌గా తన వృత్తిని అంకితభావంతో పూర్తిచేశాడు. గోపాలకృష్ణ భార్య సుజాత. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. మొదటి పాప సంతోషిని హైదరాబాద్‌లో ఉండే వినయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి ఇచ్చి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు. రెండవ పాప వైశాలిని బెంగుళూరులో ఉండే తరుణ్, మెకానికల్ ఇంజినీర్‌కి ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు.
గోపాలకృష్ణకి తెలుగు సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఈ విశ్రాంతి జీవితాన్ని సాహిత్యానికి అంకితం ఇద్దాం అనుకున్నాడు. అప్పటికే తను వ్రాసిన కవితలు, హైకూలుకు చెప్పలేనంత పేరొచ్చింది. హాస్య కథలకు బహుమతులు కూడా వచ్చాయి.
ఓ రోజు వైశాలి ఫోన్ చేసి ‘నాన్న మీరు బెంగుళూరు రండి, ఓ వారం రోజులు ఉండండి’ అని చెప్పగానే ‘ఇద్దరూ వెళ్లారు’!
అల్లుడు స్టేషన్ దగ్గర రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లారు కారులో, కుశల ప్రశ్నలు అయిన తర్వాత. రెండేళ్ల మనవడు సృజన్‌ను పడుకోవడం చూసి, ఏమైందమ్మా? అని అడిగాడు గోపాలకృష్ణ!
బాబుకి జ్వరం నాన్న మా ఇద్దరికి కాలం మొత్తం ఆఫీస్‌లోనే సరిపోతుంది, అందుకే వాడిని ఛైల్డ్ బేబీకేర్‌లో వేశాం. రెండు రోజుల్లోనే వాడికి జ్వరం వచ్చింది. వాడికి తగ్గే దాకా మీరు, అమ్మ దగ్గర ఉండి చూసుకోండి నాన్న. నాకు, మీ అల్లుడికి ఆఫీస్‌కి ఒక రోజు సెలవు పెట్టడానికి కుదరదు!
గోపాలకృష్ణ చిన్న నవ్వు నవ్వుకొని ఊరుకొన్నాడు!
వారంరోజులపాటు సృజన్ ఆలనాపాలనా చూశారు ఇద్దరు! సృజన్ చలాకీగా ఆడుతూ పాడతూ తనకు వచ్చిన బుజ్జిబుజ్జి మాటలను పలికాడు. గోపాలకృష్ణకి పెద్ద కుమార్తె ఫోన్ చేసి చెల్లి ఇంటి దగ్గరే ఉంటారా, మా ఇంటికి కూడా రండి నాన్న అనగానే తప్పకుండా వస్తాం అన్నాడు!
సృజన్ పూర్తిగా కోలుకున్న తర్వాత
నాన్న సృజన్‌కి పూర్తిగా తగ్గింది, మళ్లీ హెల్త్‌కేర్‌కు పంపిస్తాం. మా ఉద్యోగాలతో వీడిని చూడటం కుదరదు, అక్కడైతే వీరి వయస్సు పిల్లలు ఉంటారు, ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి, తినడానికి స్నాక్స్ పెడతారు. అమ్మ, నాన్న నేనేమైనా తప్పు చేస్తున్నానా?
‘అలాంటిదేం లేదు’ అది కరెక్టే అని వైశాలి ముందు చెప్పారు ఇద్దరు.
హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమైనప్పుడు సృజన్ అమ్మమ్మ తాతయ్య వైపు ఏదో బాధతో చూశాడు!
* * *
‘నాన్న చెప్పడం మర్చిపోయాను వివేక్‌ను హాస్టల్‌లో వేశాము. పాప వర్థినిని మా అత్తమామ వాళ్లు తీసుకున్నారు’ అని సంతోషి తన అమ్మనాన్నలతో చెప్పింది.
‘వివేక్‌కి నాలుగు సంవత్సరాలు అప్పుడే హాస్టలా?’ అంటూ అడిగాడు గోపాలకృష్ణ
‘అవును నాన్న హాస్టలే... ఇక్కడ మూడు సంవత్సరాలు నుండే హాస్టల్స్ ఉన్నాయి! అది ఇంటర్నేషనల్ స్కూల్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి! ఉద్యోగాలతో గడిపే జీవితాలు మావి. స్కూల్ టెన్షన్స్ అవసరమా అని నేను, మీ అల్లుడు నిర్ణయం తీసుకొని హాస్టల్‌లో వేశాము. పాప, వాళ్ల తాతయ్య, నానమ్మలు అంటే ఇష్టం. అందుకే వాళ్ల దగ్గర ఉంచేశాము.’
‘నాన్నా చెప్పడం మర్చిపోయాం, మీ అల్లుడు గారు బేగంపేట దగ్గర పెద్ద ఫ్లాట్ కొన్నారు, అది పదిహేను అంతస్తుల పెద్ద భవంతి. అక్కడ అందరూ సెలబ్రిటీలు ఉంటారు.
‘ఓహ్ అంటూ ఆశ్చర్యపోయారు గోపాలకృష్ణ!’
మరో ఐదు రోజులు తర్వాత సామాన్లు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ‘మావయ్యగారు నేను, మీ అమ్మాయి ఆఫీస్‌కి వెళ్లిపోతాం, సామాన్లు ప్యాకింగ్ వాళ్లతో మాట్లాడాను, మీరు దగ్గర ఉండి చూసుకోండి’ అని చెప్పాడు.
గోపాలకృష్ణ ఇల్లు చూసి షాకయ్యాడు. వీళ్లది పదో అంతస్తు. అందులో నాలుగు బెడ్ రూంలు, రెండు హాల్‌లు, రెండు కిచెన్లు ఉన్నాయి. ఉన్న ఇద్దరికి పెద్ద ఇల్లు అవసరమా అనుకొన్నాడు. ఇరవై రోజుల తర్వాత ఇంటికి చేరుకొన్నారు.
* * *
పిల్లలు పెద్దస్థాయిలో ఉన్నారని ఆనందించాలా?
లేక వారి ఆలోచనలు అర్థవంతంగా ఉన్నాయని విచారించాలా?
ఈ కాలం వాళ్లు డబ్బు వెనకాల పరిగెడుతున్నారా, భవిష్యత్ డబ్బు అని ఆలోచిస్తున్నారా?
ఏదైనా నా జీవితం ఉప్పూ కారంలా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా మారింది.
- నల్లపాటి సురేంద్ర , సెల్: 9490792553
ఊర్మిళ

నీ ఒడిలోని వెచ్చదనం
నీ నవ్వులోని చల్లదనం
నేనింకా ఆస్వాదించనే లేదు

నీ అల్లరి చూసి గలగల నవ్వే
నా గాజులను ఇంకా మందలించనేలేదు

నీకై ఆర్తితో వెదకులాడే
నా కను దోయి కదలికలు ఇంకా ఆగనే లేదు

నల్లని నా కురులలో నీ చేతి వ్రేళ్లు
మునిగితే... తన్మయంగా మూసుకుపోవాలన్న
నా నళినాక్షుల కోరిక ఇంకా తీరనే లేదు

నీ చిలిపి కబుర్లు విని
లజ్జా భారంతో నా చూపులు
ఇంకా నేలకు వాలనే లేదు

నీ ప్రేమావేశపు మత్తులో
మునిగి తేలాలని తపించే
నా తప్త హృదయం ఇంకా శాంతించనే లేదు

నీ చల్లని ఒడిలో అలసి సొలసి
నేను తీయని నిద్దురలోకి జారనే లేదు

నిద్దురలో నీ అల్లరి చేష్టల ఆలాపనలో
నా ఎర్రని అధరాలు ఇంకా పలవరించనే లేదు

ఓరుూ! లక్ష్మణా!
జానకి రామునితో నువ్వు
వన వాసానికేగిన వేళ
ఇచ్చట నీ నెచ్చెలి ‘ఊర్మిళ’
కన్నీరుతో... నీ కర్తవ్య నిర్వహణలో
నేనూ భాగమై గుండె దిటవు
చేసుకుంటున్న వేళ...
నిన్ను వీడిన నా గుండె విలవిలలాడిన వేళ
నీ సుందర రూపాన్ని
నా మదిలో నేను అనుక్షణం
చూసుకుంటున్న వేళ...
నీకై విరహంతో నేను
అభిసారికలా వీక్షించువేళ
ఏమిటిది? ఏమిటిది? ఏమిటిది?
ఏమిటీ.. ఈ అంతులేని నిద్దుర
కనురెప్పలపై ఈ మోయలేని భారమేల?
సఖా! లక్ష్మణా
నీ భౌతిక దేహం
నను వీడి నీ అగ్రజుని వెంట
అడుగులేసింది
కానీ....
నా స్వప్న లోకం దారులు తెరుచుకుంది
నాకై నువ్వు చేతులు చాచి
మనోహరంగా నవ్వుతున్నావు
ప్రియతమా!.... నా కన్నులు వర్షిస్తున్నాయి
నా గుండెల్లో గూడు కట్టుకున్న
పర్వతమంత దుఃఖం కరిగి కరిగి
ఏరులై పారుతుంది....
తేలికైన నా హృదయం నిను
మనసారా హత్తుకుంటుంది
అందమైన స్వాప్నిక లోకంలో విహరిస్తుంది

- భల్లం మోహనలక్ష్మి, గన్నవరం

పుస్తక సమీక్ష

రసానుభూతి
కోడూరివారి ‘సాహిత్యానుభూతి’

ప్రతులకు:
కోడూరి భారతి
డోర్ నెం:5, అఖిల్ అపార్ట్‌మెంట్స్,
దానవాయిపేట, రాజమహేంద్రవరం-3
సెల్: 9346968969
పుస్తకం చదవడం ఎడ్యుకేషన్ పుస్తకాలు చదవడం వలన భాషాభివృద్ధి పెరుగుతుంది. విషయ జ్ఞానం అలవడుతుంది. అలా ఒక మంచి పుస్తకాన్ని విశే్లషణాత్మకంగా పరిచయం వలన ఇంకెంత ఎడ్యుకేషన్ అవుతుందో కదా. అటువంటి ఎన్నో పుస్తకాలను చదివి మనోవైజ్ఞానిక దృక్పథంతో విషయ పరిశీలన చేసిన రచయిత కోడూరి శ్రీరామమూర్తి. తెలుగు పాఠకుల్ని సాహిత్యాభిరుచిని పెంచే వివిధ విశ్వవిద్యాలయాలలో జరిగిన సెమినార్‌లలో రచయిత సమర్పించిన పత్రాలు మరికొన్ని పత్రికలలో వచ్చినవి సంకలన చేసిన వ్యాసాల్ని ‘సాహిత్యానుభూతి’ పేర పుస్తకంగా ప్రచురించారు.
ఆయా సదస్సుల్లో సమర్పించిన సెమినార్ పేపర్లు పరిశోధకుల మధ్య చర్చకు వెళ్లినవి అరుదైనవి, విలువైనవి ఈ వ్యాసాలు. తెలుగు పాఠకులు గతంలో చదవనివి విననవి ఈ వ్యాసాలు చాలా ఉపయోగకరమైనవి. నవలా సాహిత్యంలో కాని కథాసాహిత్యంలో కాని మనోవిశే్లషణ చేసిన రచయిత మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈయనొక్కరే అన్నది నిజం. రచయిత సృష్టించిన పాత్రలను ఆ పాత్రల తాలూకా సంఘర్షణలను బేరీజు వేయటానికి మనోవైజ్ఞానిక విమర్శ ఎంతగానో తోడ్పడుతుంది. మొత్తం దాని మీదే ఈ పుస్తకం మొదటి వ్యాసంలో చాలా కూలంకషంగా చర్చించారు. ‘ఆధునిక సాహిత్య విమర్శనారీతులు మనోవైజ్ఞానిక విమర్శ వ్యాసంలో ఇది ఎందుకు అనే దాన్నిలా వివరించారు రచయిత. ‘మనిషి మనోప్రవృత్తికి సంబంధించిన అంశాలను మనోవైజ్ఞానికత శాస్తప్రరంగా ఆలోచిస్తే ఇదే విషయాన్ని సృజనాత్మక రచయిత హృదయ స్పందనల నేపథ్యంలోంచి అవలోకిస్తాడు. అతడు చేసే పనికి శాస్తప్రరమైన అవగాహన కొంత తోడ్పాటును ఇవ్వవచ్చు. అలా కాని సందర్భాలలో కూడా తన సృజనాత్మకశక్తితో మనిషి గుండెల్లోకి చీకటి కోణాలపై ప్రసరింపగల శక్తి అతడికి ఉంటుంది. సాహితీ సృజనకూ, మనో వైజ్ఞానిక దృక్పథానికీ మధ్యగల అవినాభావ సంబంధమే కాలక్రమంలో ఆధునిక సాహిత్య విమర్శలో ‘మనోవైజ్ఞానిక విమర్శ’ అనే ధోరణి ఆవిర్భవించడానికి కారణమైందంటారు. భారత స్వాతంత్య్ర సముపార్జనలో గాంధీజీది ఎంత ముఖ్య భూమికో స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో ఆయన ప్రభావం అంత తీవ్రమయింది. ‘నేను మరలా జన్మించదలచుకోలేదు, కాని మరలా జన్మించవలసిన పరిస్థితులు ఏర్పడితే ఒక అస్పృశ్యుడిగా జన్మించాలని కోరుకుంటాను’ అంటారు గాంధీజీ. ఈనాడైతే ‘దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ లాంటి భావాలున్న నేతలున్న కాలం ఇది. ఆ కోవ నుంచి వచ్చిన ‘మాలపిల్ల’ నవల మీద కోడూరివారి వ్యాసం క్యాస్ట్ మీద ఒక సమగ్రతనిచ్చింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ స్ఫూర్తితో తెలుగులో కథలు, నవలలు, నాటికలు వచ్చాయి. కాని ఆయన దృక్పథ ప్రభావంతో రాయబడ్డ నవల ఇది మాత్రమే. అలాగే వ్యవహారిక భాషలో రాయబడ్డ తొలి నవల కూడా ఇదే.
ఉన్నవ లక్ష్మీనారాయణ పూర్తి గాంధేయవాది. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడేళ్లు జైలుశిక్ష అనుభవించినవాడు. విశాలమైన గాంధేయ దృక్పథపు కాంతిలో మంగళాపురం అనే ఊరులో ఒక హరిజన కుటుంబంపై మోతుబరి వర్గానికి చెందినవాళ్లు చేసిన ఆకృత్యాలు కథలోని ఇతివృత్తం. చాలా విలువైన వివరణాత్మక విషయాలు ఈ వ్యాసంలో మనకు కనిపిస్తాయి. స్వరాజ్యాన్ని కోరిన గాంధీజీ సురాజ్యాన్ని కాంక్షించడం నవలలో చూస్తాం. ఇక బుచ్చిబాబు మీద సోమర్‌సెట్ మామ్ ప్రభావం గురించి చెప్పిన వ్యాసం ఔత్సాహిక రచయితలకు బాగా అవసరమయింది, తెలుసుకోవలసిందీను. బుచ్చిబాబు కథల్ని సమీక్షిస్తూ ఆయనపై సోమర్‌సెట్‌మామ్ ప్రభావం ఏ మాత్రం ఉందో తెలియచెప్పే ప్రయత్నం ఉంది. కొన్ని కారణాలు పట్టుకొని ఆయనతో సరిపోల్చి విషయాలు మనముందు ప్రస్తావించారు. మామ్ ప్రభావం ఎంతున్నప్పటికీ ఆయన ఆలోచనా విధానం బుచ్చిబాబుకు నచ్చలేదన్న విషయాలు సోదహరణంగా వివరించారు. మనం ఈ వ్యాసాలు చదువుతుంటే బుచ్చిబాబు వ్యక్తిగత విషయాలు తెలుస్తాయి. అలాగే ఆయన రచనలు మనం ఏం మిస్ అయ్యామో కూడా తెలుస్తుంది. ఎందుచేతంటే బుచ్చిబాబు శత జయంతి సందర్భంగా నివాళిగా రాసిన వ్యాసం.
అక్షరాలతో వ్యాసాన్ని రసవత్తరం చేయటంలో కోడూరి వారిది అందెవేసిన చెయ్యి. చదువుతుంటే విడిచి వెళ్ల బుద్ధికాదు. దేనికి అంతలా మనల్ని మనసుకు వీక్షకుడ్ని చేసి లాక్కుపోతారు. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ఆధారంగానే కోడూరి వారు మనోవైజ్ఞానిక విమర్శ చేయరు. ఫ్రాయిడ్‌తోపాటు ఆల్‌ఫ్రెడ్ ఆడ్లర్, గుస్టాన్‌యూంగ్‌ల సిద్ధాంతాల్ని సైకోఎనాలిసిస్‌గా వ్యవహరిస్తారు. దాని అవగాహనతో విశే్లషించడం కోడూరి వారి ప్రత్యేకత. అలా దేనిని స్పర్శించినా తనదైన ముద్ర వాటిలో తప్పక ఉంటుంది. కడలి బాపిరాజు నవలలు రాసే నాటికి మనస్తత్వ శాస్తజ్ఞ్రుల సిద్ధాంతాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే బాపిరాజు ప్రత్యేకించి మనోవైజ్ఞానిక నవల రాయబూన తలపెట్టిన నవలాకారుడు కాదంటారు కోడూరి. ఆయన రాసిన మూడు నవలల్ని తుపాను, కోనంగి, నారాయరావులను విశే్లషించారు. ఈ సంగతులన్నీ చదువుతుంటే మరోసారి ఆ నవలను తప్పక చదవాలనిపిస్తుంది. అలాగే కొడవటిగంటి కుటుంబరావు కథలు గురించి చక్కని వ్యాసం అందించారు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని వికృతులను గమనించినప్పుడు రచయితకు కలిగే ‘కసి’ సాహితీ సృజనకు ఎలా మూలమవుతుందో తెలుస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్లోని వికృతులు ఈ ‘కసి’కి కారణమవుతాయి. ఈ కసితోనే కొడవటిగంటి కథలు, నవలలు రాశాడంటారు.
చింతా దీక్షితులు ఒక కథకుడే కాదు చలానికి గురువు, మరో మాట చెప్పుకుంటే రచనాశక్తి నుంచి భక్తి రుచిని చూపించినవాడు. దీక్షితులు కథలు ఎంత అనుభూతిమయమో తెలియజెప్పారు. అయితే చలానికి దీక్షితులుకు భావాల్లో కాని, అభిప్రాయాల్లో కాని పోలిక లేదు. దీక్షితులు పూర్తి సాంప్రదాయవాది. దీక్షితులు గురించి కోడూరి వారిచ్చిన సర్ట్ఫికెట్ చూడండి. ‘సంప్రదాయం పట్ల మక్కువను చూపించి వుండవచ్చు, కాని వెలుతురును చూడలేని గుడ్లగూబ గుణం ఆయన రచనల్లో కనపడదనే చక్కని కితాబు ఎంత ఉత్తమ సాహిత్యాన్ని వెలువరించారోననటానికి నిదర్శనం.
ఆయన గురించి తప్పనిసరిగా చెప్పే మరో మాట బాల వాజ్మయ బ్రహ్మగా ఆయన కీర్తిల్లారు. మనోవైజ్ఞానిక విమర్శకు తగిన సాహిత్యకారుల మీదే కాదు స్వీయ కథ, ఆత్మకథలు, స్వీయ చరిత్రకారుల మీద ఈ పుస్తకంలో సమగ్ర చర్చ ఉంది. అలాగే గోదావరి మీద వచ్చిన కథల్ని కూడా దీనిలో కోడూరి సమీక్షించారు. ఏదైనా దాచుకొని మరీ చదవాల్సిన పుస్తకం ఇది.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

అచ్చుల్లో అమ్మ - అనంతము

‘అ’ద్భుతాల సృష్టికి మూలము అమ్మ. ఏ కులమైనా, మతమైనా
‘ఆ’ అమ్మ ఒడే మన బడి - అనంతమునకు ఆనంద ప్రక్రియలకు మూలములు
‘ఇం’దరిలో అందరిలో - అంచెలంచెలుగా అత్యంత అభిమానంతో
‘ఈ’ విశ్వానికి మూల కారణంగా సర్వదా వికసిస్తూ, విశ్వసిస్తూ
‘ఉ’న్న తరుణంలో మన పిల్లలను మనము ఘనంగా, విశిష్టంగా
‘ఊ’ళ్లోకాక, పొరుగూళ్లో కాక, విదేశాలకి పంపి డాలర్ల వేటలో, బాటలో
‘ఋ’షులకు నిలయమైన మన భారతదేశము విలువలు మరిచే
‘ఎ’వరూ లేని చోట, విదేశీయుల బడిలో, వడిలో ఎందు కాలిడినా
‘ఏ’లా? పిల్లల్ని వదలి పెడుతున్నారో కదా! అయితే
‘ఐ’కమత్యముతో అందరు, కలసి ఒకరి కొకరు సాయపడుతూ
‘ఒ’క్కటనే భావనతో మంచిని పెంచుతూ - పెంచుము మేలు జీవితానికి
‘ఓ’! మానవా అమృత బాట వెయ్యి
‘ఓ’కే ఈ నట్ట నడిమ పని నాటకము అనే అన్నమయ్య సూక్తిని తెల్పుతూ
‘ఔ’న్నత్యాన్ని కల్గి ఉండి మన పిల్లల్లో, పెద్దల్లో పెంపొందించిన నాడే
‘అం’తా ఒక్కటే మనమంతా ఒక్కటే అనే భావనలో అందరిలో
‘అః’- ఆహా! అనే కీర్తిని కుటుంబాలకి, భారత దేశానికి వనె్న తెద్దాం

‘అచ్చుల్లో అమ్మ ఉంది - ఆనందం ఉంది - ఐకమత్యం ఉంది’
అచ్చులు కలిపితేగాని హల్లుకు రూపము రాదు. అవీ మన గుణింతాలు కదా!
వదిలేసిన అక్షరాలను క్షమించమని ఋషిలాంటి మనుష్యులుగా
మహా మహనీయులుగా మన భారతదేశం ఆనాడు కీర్తిగాంచిన ఔన్నత్యం
నేడు కూడా మనకు అనువంశికంగా రావాలని ఆశిస్తూ...- నారుమంచి వాణీప్రభాకరి, తణుకు

ప్రేమా... ఎక్కడ నీ చిరునామా!
ఆరాధనా మాధుర్యమైన నీ హృదయాన్ని తెరచి
పవిత్ర ప్రేమను ఆశించి పడిగాపులు కాస్తున్నావా?
ప్రేమ కల్మషమైనప్పుడు అంకితభావం వుంటుందా?

అనే్వషిస్తున్నావా అచ్చమైన ప్రేమకోసం
ఎలా అందుతుంది ప్రేమ అభూమైతే!
నిట్టూరుస్తున్నావా! నిజమైన ప్రేమ కోసం
ప్రేమలో నిశ్చలం లేంది ఎక్కడని వెతుకుతావు

విరక్తి చెందకు ప్రియురాలికై చేసిన తపస్సు ఫలించలేదని
నిందించుకోకు నిక్కమైన ప్రేమ దక్కలేదని!
ప్రేమకు దూరమై బ్రతుకు భారమైందని బాధపడకు
పైపై ఆకర్షణలు ప్రలోభపెడుతున్నాయి అమ్మాయిల్ని!
మభ్యమాటలు మాయచేస్తున్నాయి మనసుల్ని
ఆడంబరాలు సృష్టిస్తున్నాయి అగాధాన్ని!
మోసాల మెరుపులో కళ్లు చీకట్లు కమ్ముకుంటున్నాయి!

క్రుంగిపోతోంది స్ర్తి కామాన్ని ప్రేమగ భ్రమసి
న్యాయం చేయండంటూ గోడు పెడుతోంది గర్భం ధరించి!
గింజుకుంటోంది గిజగిజ ప్రేమనే సాలెగూడులో చిక్కి
వంచన గ్రహించక మానాన్ని కోల్పోయి బలైపోతోంది!

సరుకులన్నీ కల్తీ అయినట్లే
మనసులు కూడా అయిపోయాయి కల్తీ
వెర్రివాడా! ఎందుకు వేదనపడతావు ప్రేమ ప్రేమంటూ
కృత్రిమం నిండిన ఈ రోజుల్లో ఎవరొస్తారు నేనున్నానంటూ

ఏమో
నిరీక్షణలోనే నీవుకోరుకున్న నికరమైన
ప్రేమ ప్రత్యక్షవౌతుందేమో!
నింగిలో తళతళలాడే తారకలా కళాత్మక భావాలు
కల్గిన హృదయంపై వాలిపోతుందేమో!

- మల్లెమొగ్గల గోపాలరావు, ఫోన్: 98857 43834
పిఅండ్‌టి కాలనీ, రాజమహేంద్రవరం
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర