రాజమండ్రి

ఆచరణ ఏది? (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగిన నగరం!
ఆ తర్వాత ఎన్నో దశాబ్దాలుగా కరవు రక్కసిలో చిక్కుకుని ప్రజలంతా వలసల బాట పట్టి ఒంటరిగా మిగలబోతున్న కరవు జిల్లా అయ్యింది. అలాంటి వలస కుటుంబమే వెంకటేశుది. పంటలు లేక, పనుల్లేక ఊళ్లు ఊళ్లు సొంత ఊరనే భ్రాంతి వదలి నగరాలకి వచ్చేస్తున్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతుర్ని, మూడేళ్లయినా నిండని కొడుకు, భార్యతో కలసి నగరానికొచ్చారు. బస్తీలో ఓ గది నెలకి రూ.200 బాడుక్కి తీసుకొని భార్యాభర్తలిద్దరూ భవనాల కూలీకి పోతున్నారు. మల్లిక, తమ్ముణ్ణి పెట్టుకుని ఒంటరిగా పక్కింటి వృద్ధులు తోడుగా సాయంకాలం దాకా గడుపుతోంది. వీధి పంపు నుండి నీళ్లు మోసుకొని బకెట్లు, తొట్టె నింపటం, బట్టలవీ జాడించటం చేస్తోంది. తమ్ముడి ఆలనా, పాలనా చూసుకొంటోంది. బట్టలు బయట తాడుమీద ఆరేస్తుంటే, రోడ్డు మీద స్కూళ్ల బస్సుల హడావిడి. విద్యార్థుల మాటలు వినిపిస్తున్నాయి. అందరి షర్ట్ జేబులపైన జాతీయ జెండా గుచ్చి ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది. ఈ రోజు జెండా పండుగ అయివుంటుందని ఒక్కసారిగా తన ఊరు, బడి గుర్తుకొచ్చాయి. జెండా వందనానికి పూలు తెచ్చివ్వటం, చక్కని దేశభక్తి గీతాన్ని పాడటం, ఆ పాట విని టీచర్లంతా ఎంతో మెచ్చుకోవటం, మంచి భవిష్యత్ ఉంది నీకని దీవించటం, మనసు ఆనందంతో నిండిపోయింది. మరి తిండి గడవక ఇట్లా రావాల్సి రావటం, ఈ వాడ కట్టున ప్రభుత్వ పాఠశాల లేకపోవటంతో తమ్ముడితో ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులకంత తీరుబడే ఉండటంలేదు మల్లిక చదువు గురించి పట్టించుకోవటానికి. అక్కడ తమ ఊళ్లో గవర్నమెంటు వాళ్లే భోజనం పెట్టి పుస్తకాలిచ్చి చదివించేవారు. మరి ఊరింకా పెద్దదికదా! ఇంకా చాలా బళ్లు ఉంటాయి కదా! నేనెందుకు చదువుకోకూడదు? చిన్ని మనస్సు ఆలోచిస్తోంది. సరే రాత్రికి నాన్న వచ్చాక అడుగుతాను అనుకొంది. వెంటనే దగ్గరలో ఏ స్కూలు ఉంటే అక్కడికెళ్లి జెండా వందనం చూసి చాక్‌లెట్లు తెచ్చుకోవాలని గబగబా ఉన్నవాటిలో మంచి బట్టలు తమ్ముడికి తొడిగి, తాను వేసుకొని పక్కింటికెళ్లి తాను స్కూలుకెళ్లొచ్చే దాకా ఇల్లు చూస్తుండమని చెప్పి, తమ్ముణ్ణి ఎత్తుకొని బయలుదేరింది.
సందు చివరిగా ఓ పెద్ద స్థలంలో బోలెడు బస్సులు, కార్లు ఆగి ఉన్నాయి. గబగబా అటు దిక్కుకి నడిచింది. అదో పెద్ద స్కూలు. చాలా మంది కన్పించారు ఖరీదైన బట్టలు, నగలు, చీరలు ధరించి. పిల్లలంతా వరుసగా బారులుతీరి నిలుచున్నారు. వారి ఎదురుగా పెద్ద వేదిక. వేదికపై నగరంలోని పెద్దలు ఆశీనులై ఉన్నారు. గేటు బయట నిలబడి లోపలికెళ్లి ఓ మూలగా నిలుచుని జెండా పండుగ చూడవచ్చా? వాచ్‌మెన్‌ను అడిగింది. కుదరదమ్మా! ఈ బడిలో చదివే వాళ్లనే లోపలికి రానిస్తారు, బయటే నిలబడి చూడు అన్నాడు.
మామయ్యా! నాకు జెండా పండుగంటే చాలా ఇష్టం. మా ఊర్లో నేను క్రితంసారి పండుగకు టీచరు నేర్పించిన జెండా పాట కూడా పాడాను. పాటల్లో నాకు బహుమతి కూడా వచ్చింది. ఇప్పుడేమో నన్ను ఏ బడికీ పంపలేదు. అందుకే ఈ స్కూలు దగ్గరగా ఉందని, నేను, తమ్ముడు కలసి జెండా వందనం చూద్దామని వచ్చాం. ఓ పక్కగా నిలబడి చూసి జెండాకి జై అంటూ చెప్పి వెళ్లిపోతాం! బయట నుండైతే బాగా కనిపించదు కదా! నీకు నమస్కారాలు చేస్తా ఒక్కసారి ఆ మూల చెట్ల దగ్గర నిలబడి చూసి వెడతాను. ఆ ఆశతోనే వచ్చాను అంది. అంతా విని నేనేం చేయలేనమ్మా! ఓ దారి ఉంది. నీవు ఆ పక్క ఖాళీస్థలంలోకెళ్లి అక్కడున్న ఇసుక గుట్ట పైకో, రాళ్ల గుట్ట పైకో ఎక్కి దగ్గరగా చూడవచ్చు అని సలహా ఇచ్చాడు. అది విని మల్లిక తమ్ముణ్ణి ఎత్తుకొని పక్కనే గోడనానుకొని ఉన్న రాళ్లగుట్ట నెమ్మదిగా ఎక్కింది. జెండా వందన కార్యక్రమం వేదికపైనున్న పెద్దలు, వరుసగా బారులుతీరిన విద్యార్థినీ విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో కార్యక్రమం జరుపుతున్నారు. ముందుగా 3వందేమాతరం2 పాడారు. తర్వాత జెండా వందనం చేశారు ప్రముఖ అమాత్యులవారు. వారి సందేశం ఓ అరగంటపైగా సాగుతోంది. ఇపుడే నేను 3బాలలంతా చక్కగా చదువుకోవాలి, బాల కార్మికులనే వారే ఉండకూడదు, బాలకార్మిక వ్యవస్థ రద్దుచేసి పిల్లలంతా చక్కగా చదువుకొనే వీలు కల్పించేలా ఓ చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి గవర్నరు గారికి పంపించి వచ్చాను2 అంటూ పిల్లలు క్రమశిక్షణ, అందరికీ చదువు, సమన్యాయం, ఇత్యాది విషయాలను తన ప్రసంగంలో వివరించారు. ఉపన్యాసం పూర్తయ్యింది. అంతా చప్పట్లు కొట్టారు. తర్వాత పిల్లలు దేశభక్తి గేయాలు పాడుతున్నారు. జైజై భారత పాట పాడుతుంటే మల్లిక సంతోషంతో తన గళం కూడా కలిపింది. వాళ్లు ఒక చరణం పాడి ఆపేస్తే, తను రెండో చరణాన్ని తన్మయత్వంగా గొంతెత్తి పాడుతోంది. అంతా విస్తుపోయారు. పాట వస్తున్న దిక్కు చూశారు. పాట అయిపోయింది. వాతావరణం నిశ్శబ్దమైపోయింది. జనగణమన పాడారు. తర్వాత అందరికీ స్వీట్లు పంచుతున్నారు. గబగబా రాళ్ల గుట్టదిగి గేటు దగ్గరకి ఉరుకులు, పరుగులతో గంటకిపైగా ఎండలో నిల్చోవటంతో చెమటలు కారుతూ ముఖం కందిపోగా తమ్ముణ్ణి చంకనేసుకొని మామయ్యా! తమ్ముడికి ఓ స్వీటిస్తారా అడిగితే అంది. వాచ్‌మెన్ జవాబు, చెప్పేలోగా హారన్ వినిపించి గేట్లు బార్లా తీశాడతను. తనకోసమే గేటు తీశాడేమోననుకొని గబగబా లోపలకెళ్లబోయేంతలో మంత్రిగారి కారు దూసుకొస్తోంది. గట్టిగా హారన్ వేశాడు కారు డ్రైవర్. ఆగి పక్కకెళ్లింది. కారాపించి మంత్రిగారతన్ని (వాచ్‌మెన్) బాగా కేకలేశారు.
ఏమయ్యా! ఎనే్నళ్ల నుండి పనిచేస్తున్నావ్? ఇది ఎలాంటి స్కూలనుకొన్నావ్? ఆ పిల్ల స్కూల్లోకి దూసుకొస్తుంటే ఊరుకొన్నావ్! పెద్దపెద్ద సినిమా యాక్టర్ల పిల్లలు, ప్రముఖుల పిల్లలు, ధనవంతుల పిల్లలు చదువుకుంటున్న స్కూలు కదా! ఉద్యోగం ఊడుతుంది జాగ్రత్త ఏమనుకున్నావో, అలగా జనాన్ని రానిస్తున్నాడు అంటూ బాగా తిట్టి వెళ్లిపోయారు. ఇప్పటిదాకా పిల్లలంతా సమానమంటూ అందరూ జాతి రత్నాలని, చదువు అందరికీ సమానంగా అందాలని అరగంటకు పైగా పిల్లల్ని ఎండలో నుంచోపెట్టి ఉపన్యాసాలను దంచిన రాష్ట్ర విద్యాశాఖామంత్రి వర్యులవారు మరి. వారి మనుమడు కూడా మూడో తరగతి ఆ స్కూల్లోనే చదువుతున్నాడుగా మరి.
ఆ తిట్లన్నీ భరించి పాపా! నువ్వు లోపలికి వెళ్లకూడదమ్మా! నేను నీకు చివరకి స్వీట్లు ఇచ్చే పంపుతాను పక్కగా నిలబడమా అన్నాడు వాచ్‌మెన్!
మల్లిక వెళ్లేవాళ్లను ఆశ్చర్యంగా చూస్తోంది. పిల్లల్ని కార్లో తీసుకొని వెడ్తున్నారు ఖరీదైన మనషులు, అంతకంటే ఖరీదైన కార్లో. అంతా ఆశ్చర్యంగా తిలకిస్తోంది మల్లిక గోడవారగా నిలబడి.
ఒక్కొక్కరుగా వెడుతున్నారు. టీచర్లు ఇద్దరు ముగ్గురు, మల్లిక పాట విని గుర్తుపట్టి ఇదిగో ఈ పాపే జైజై భారత పాటను మొత్తం చక్కగా పాడింది గేటు బయట నుండి. మనం వారం నుండి ప్రాక్టీసు చేయించినా మన పిల్లలు పాట పూర్తిగా పాడలేకపోయారు. ఏం పాపా? చదువుకుంటున్నావా? మీదే స్కూలు? అడిగారు టీచరు. చెప్పింది మల్లిక తమ పరిస్థితి. జాలి కలిగిందాటీచరుకి. సరేనమ్మా! ఇవిగో నీకు స్వీట్సు తమ్ముడికి అంటూ స్వీట్సు ఇచ్చారు మల్లికకి. సంతోషపడింది. నమస్కారం పెట్టి ఇంటికొచ్చింది. మల్లిక సంబరంగా పక్కింటి తాతకి, మామ్మకి కూడా పంచింది. జెండా పండుగయ్యింది స్కూల్లో ఇచ్చారని చెప్పింది. వాళ్లకి జాలి కలిగింది. ఊరుకాని ఊరొచ్చారు తిండి జరుగుబాటు లేక. పాపం చదువంటే ఈ పిల్లకి ఎంత ఇష్టమో, స్కూలంటే ఎంతిష్టమో. బయట నుంచొని జెండా వందనం చూసి, పాట పాడింది, పాపం పేదరికంతో అన్ని ఇష్టాలు చంపుకోవాల్సి వచ్చింది. బాధపడ్డారు ఆ వృద్ధులు!
కేవలం ఉపన్యాసాలకే పరిమితం అయ్యి, అవి ఆచరణకి నోచుకునే పరిస్థితి లేని దేశంలో ఉంటున్నాం. ఆ ఉపన్యాసం మంత్రిగారి హృదయం నుంచి వచ్చి ఉంటే అప్పటికప్పుడు గవర్నమెంటు సంక్షేమ వసతిగృహాల్లో ఆ పిల్లలను చేర్చి, చదువు, తిండి సమస్తం తీర్చేవారు కదా! అంతటి అధికారం ఉంది కదా వారి చేతుల్లో! మరి గేటు నుండి ఆ ఖరీదైన స్కూల్లోకి ఒక్క అడుగు వేసినందుకే అన్ని తిట్లు తిట్టిన వారి ఔన్నత్యం, మరివన్నీ చేస్తుందా? ఈ మన ప్రజాస్వామ్య దేశంలో, ఈ భారతావనిలో? అర్ధంకాని ప్రశే్న ఆచరణ శూన్యమైన వేళ పక్కింటి పెద్దవాళ్లిద్దరూ ఆ చిన్నపిల్ల చదువు గురించి తీవ్రంగా ఆలోచించటం మొదలెట్టారు. వెంటనే ముసలామెకో విషయం గుర్తుకొచ్చింది. తమకో గూడు ఏర్పాటుచేసుకోవటానికి పట్నం వలస వెళ్లిన కొడుకు ప్రతినెలా తన ఖర్చులకుంచుకుని మిగిలిన డబ్బు తల్లిదండ్రులకు నెలకో, రెండు నెలలకో పంపిదాయమని ఇచ్చి వెడ్తున్నాడు. ఆ డబ్బు గుర్తుకొచ్చింది. లోపలకెళ్లి పెట్టెలో దాచి పెట్టిన డబ్బు మొత్తం ఎంతుందో చూసి భార్యాభర్తలిద్దరూ ఓ ఆలోచనకొచ్చారు.
రాత్రికి ఆ మల్లిక తండ్రి ఇంటికి రాగానే వారి ఆలోచన చెప్పారు. అప్పుగానే తీసుకొని ఆ పాపను స్కూల్లో జాయిన్ చేయమని, పిల్లవాణ్ణి తాము చూసుకుంటామని చెప్పారు. తమకి డబ్బు ఒక్కసారే ఇవ్వనక్కర్లేదు, నా కొడుకు ఇల్లు అమర్చుకోవాలని ఈ డబ్బు దాచి పెట్టాడు. మేము దానిలో కొంత డబ్బుతో మరో కుటుంబం బాగుపడాలని కోరుకుంటున్నాము. ఆడపిల్లని చదివిస్తే ఓ కుటుంబమంతా సంస్కరించబడుతుంది. ఒప్పుకోమంటూ ఒత్తిడి చేశారు. వాళ్లు ముక్కుమొగం తెలియని కొత్తవాళ్లు. ఇంతిదిగా తన కూతురిని చదవించమని కోరుతుంటే కాదనలేకపోయాడు.
పక్కింటి తాతగారు, మామ్మగారు, మల్లిక అమ్మానాన్నలు వేడుకకు వచ్చారు. మరి మల్లిక సాధించిన విజయాలను చూడాలిగా అందుకే అంతా వచ్చారు. ఓ అరగంటలో సభ మొదలైంది. మంత్రిగారి రాకతో జనంలో హడావిడి. సభను వారి ఉపన్యాసంతో మొదలుపెట్టారు. ఈ బాలికోన్నత పాఠశాల ప్రతి సంవత్సరం ఎంతోమంది ఉత్తమ విద్యార్థినులను తయారుచేస్తోంది. అందుకు ప్రధానోపాధ్యాయులు, మిగిలిన టీచర్లను అభినందిస్తున్నాను. ఈ స్కూలుకింకా ఏ వసతులు కావాలో తెలియజేయండి, తప్పకుండా కల్పిస్తాను, ఈ స్కూలుకేం కావాలో అన్నారు వారు. అంతా చప్పట్లు కొట్టారు. తర్వాత పాటల్లో, ఆటల్లో, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని వేదికపైకి పిలిచి బహుమతులు అందచేస్తున్నారు. ఆరవ తరగతి చదివే మల్లిక అన్ని విభాగాల్లో బహుమతులు గెలుచుకొందని హెచ్‌ఎం గారు మల్లికకు బహుమతులను మంత్రిగారి చేతులమీదుగా అందించారు. మంత్రిగారి వైపు చూసి, వారిని ఇదివరకెపుడో చూశాను అనుకొని ఆలోచించుతుంటే మల్లికకు రెండు నెలల కిందట ఓ (పబ్లిక్) స్కూల్లో జెండా వందనానికి తాను వెళ్లిన సంఘటన, తాను గేటు దగ్గర ఇదే కార్పొరేట్ మంత్రిగారితో తిట్లు తిన్న విషయం గుర్తుకొచ్చింది. ఆయన ఇలాంటి స్కూల్లోకి ఇలాంటి పిల్లను ఎందుకు రానిచ్చావని వాచ్‌మెన్‌ని తిట్టిన తిట్లు గుర్తుకొచ్చాయి.
ఏమ్మా! మీ తల్లిదండ్రులెవరు? నీవు బాగా చదువుకొంటున్నావని, ఆటల్లో, పాటల్లో, అన్నిరంగాల్లోను మంచి ప్రతిభను కనబరుస్తున్నావని నీకొచ్చిన బహుమతులు చెప్తున్నాయి అన్నారాయన. తన అమ్మ, నాన్నలతోపాటు పక్కింటి మామ్మగార్ని, తాతగార్ని కూడా వేదికపైకి తీసుకొచ్చి మంత్రిగారికి పరిచయం చేసింది. వీరి మూలంగానే నేనీనాడు ఈ స్కూల్లో ఇంత బాగా చదువుకోగలుగుతున్నాను. దయచేసి నాకిచ్చే బహుమతులన్నీ ఈ పెద్దవారికే చెందుతాయి. వినయంగా చెప్పింది.
తాతగారు మంత్రిగారితో ఇలా అన్నారు. బాబూ! వీళ్లు కరువులో ఈ ఊరికి వలస వచ్చారు. మా పక్కింట్లోనే ఉంటున్నారు. తల్లిదండ్రి కూలి పనులకు వెళితే, తమ్ముణ్ణి పెట్టుకొని ఇంటిపట్టునుండి రోడ్డుమీద ఇస్కూలుకెళ్లే పిల్లలను చూస్తూ, తాను చదువుకోలేకపోతున్నందుకు బాధ పడుతుంటే, మేమే కాస్త డబ్బు సాయంచేసి ఈ స్కూల్లో చేర్పించాము. ఇదిగో మల్లిక మాబాగా చదువుతూ, మమ్మల్ని కూడా ఈ వేదికనెక్కించింది. ఇదంతా మా పిల్ల అదృష్టం అంటూ చెప్పాడు. చాలా మంచి పని చేశారు. పేదలనాదుకునే ప్రభుత్వం మాది. అందుకే పేద పిల్లల కోసమే ఉచిత విద్య, పుస్తకాలు, భోజనం ఏర్పాటుచేశాం. మల్లికా ఈ సంవత్సరం నీకు స్కాలర్‌షిప్ ఇదిగో ఈ వెయ్యి రూపాయలు అంటూ ఓ కవరిచ్చారు. అందుకొని తాతగార్కి అందజేసింది. ఓ మాట సార్! ఆ రోజు ఫలానా స్కూల్లో నన్ను ఎందుకు రానిచ్చారని వాచ్‌మెన్ మామని మీరు కేకలు వేశారు గుర్తుందా! గుర్తుచేసింది. ఔనమ్మా! ఆ బీద పిల్ల అంటూ నసిగారు. నేనేనండి ఆ బీద పిల్లని ఇప్పుడు ఇలా మీ చేతులమీదుగా బహుమతులు అందుకొన్నాను. మరి అప్పుడు తిట్లు, ఇప్పటి బహుమతులు నవ్వి నమస్కారం చేసింది.
యు.శైలజ, రాజమండ్రి

పుస్తక సమీక్ష

కవిత్వాన్ని ఊపిరిగా మలిచిన మోత
శరీర బరువు మోతకన్నా కష్టాలు కన్నీళ్లు, అపవాదులు, వ్యసనాలు మున్నగువాటిని మోసే మోతే ఎక్కువంటున్న కవి ఇంకా ఇలా అంటున్నాడు. ఎందరో శత్రువులు నాలోనే దాక్కున్నారు. నాలోనే ప్రపంచ యుద్ధాలున్నాయి. వీటన్నింటినీ నిత్యం మోస్తున్నా అన్నీ మోసిన వానికి ఈ మోత ఓలెక్కా? ప్రపంచ మోతలన్నింటీనీ నేనే మోస్తున్నా, నాకు నేనే ప్రళయాన్ని సృస్టించుకుంటాను. పరిష్కార మోతల్ని మోస్తూనే ఉంటాను అంటున్న కవిలో ఒక రైతు, ఒక శ్రామికుడు, ఓ కష్టజీవి, ఓ నిర్భాగ్యుడు ప్రతిబింబిస్తాడు పాఠకుల మదిని దోస్తాడు. కదలికనిస్తాడు.
ఈ కవితా సంపుటి 66 కవితల సమాహారం. కొన్నిటిలో మానవత్వం తొణికిసలాడుతుంది. కొన్నిటిలో శ్రమైకజీవనం, అవినీతిని అంతంజేయడంలో పరిష్కార సూచన. నీతి నిజాయితీలు, మైత్రి, పరోపకారం, జీవ లక్షం వంటి వివాంఛనీయమని మనిషిని మనీషిగా చూడాలన్న ఆకాంక్షతో పెల్లుబిన కవితల్ని ఆవిష్కరించిన ప్రతిభాశాలి, ఉపాధ్యాయ అవార్డుగ్రహీత, కవిగా తెలుగువారికి, సుపరిచితులై ఐదవ కావ్యానందించిన అంబటి నారాయణ నిర్మల్ (అదిలాబాద్) వాసి.
తన మోత కవితల ద్వారా నవజీవనశైలిని మనిషిలో మార్పుని కోరుతాడు తద్వారా సమాజ వికాసాన్ని దేశకల్యాణాన్ని ఆకాంక్షిస్తాడు.
ఆకలితో అలమటిస్తున్న అనాధల మధ్యనున్న నేను ఆవిష్కరించుకుంటాను. అంటున్న కవి ఆవేదన అగుపిస్తుంది. ఈ దేశంలో జంతువులు కూడా ఆకలితో అలమటించ కూడదన్న స్వామి వివేకానందుని వాణి ప్రతిధ్వనిస్తుంది.
మగాళ్లలో మృగాళ్లున్నారు. రాబందులు రెక్కలు విసరకముందే, కామాంధులు పక్కలు పరవకముందే, మేల్కొండి అంటూ స్ర్తిజాతిని మేల్కొలపడం వాంఛనీయం, అనివార్యం, అభినందనీయం. నీ పిలుపుతో నిరాశా నిస్పృహలలో, మ్రగ్గేవారికి, ఒక ప్రేమపూర్వక పిలుపు జవజీవాల నందిస్తాయి. చైతన్యాన్ని నింపుతాయనడం అక్షర సత్యం. జీవన సూత్రంలో జీవన పోరాటమే ఆరాటంగా మల్చుకోవాలని, స్వశక్తిని నమ్ముకున్నవారనికి, అపజయం ఉండదన్న కవి పంక్తులు ఊరటనిస్తాయి. ఉత్సాహాన్నందిస్తాయి. స్వాగతించదగినవి.
రక్తాన్ని చెమటగా మార్చే కర్షకుణ్ణి నేను / నా అక్షరసేద్యం మానవీయ మతంకోసం / సమాజహితం కోసం / కవుల కలాల్లో కండ బలముంది / గళాల్లో గుండెధైర్యముంది / మనిషి అంతర్గత శక్తి అక్షరమే / బాధల మోతల్ని పోగొట్టేది, అక్షరం దొంగలకు దొరకని ఆస్తి, అంటున్న కవి, మన జీవితంలో మనపాత్ర ఏమిటో, నిర్ణయించుకోవాలన్న హెచ్చరికనందిస్తూ మనమాటలు ఎదుటివారి ప్రగతిబాటలు కావాలి వారి ఎదుగుల్లో పూదోటలు పూయించాలంటున్న కవి పంక్తులు పరమాన్న సదృశాలు పన్నీటి పరిమాళాలు పౌర్ణమినాటి వెనె్నలలు.
కొలతకు అందని కోవెల హృదయం అమ్మసాగరమంత విశాలం నాన్న ఎద సదనం, అర్థాంగిలో అమ్మతనం ఉంది. అంటూ తల్లిదండ్రులు భార్యపై అపారప్రేమను వ్యక్తం చేసాడు. ప్రతివారూ కోరదగింది స్వాగతించగదిగింది. విద్యార్థి నిత్యం మోస్తున్న మోత పుస్తకాల మోత, మానసిక మోత స్థాయిని మించిన మోత, పోటీ యుగంలో వికసించే నవ్వులేదు. విరబూసే పువ్వులేదు. మనసులో దిగులు తెలియని గుబులు పెద్దల కలల మోతల్ని వారినెత్తిన మోపిన మోత అంటూ పుస్తక శీర్కి మోత చక్కని రూప కల్పన చమత్కారం రంగరించడంలో కవి ప్రతిభ కన్పిస్తుంది.
వృద్ధాప్యం కవితలు సహకరించని అవయాలు తగ్గిన చురుకుదనం/శక్తి సన్నగిల్లింది / చూపు మందగించింది. ఆకృతిలో మార్పు వచ్చింది. ప్రకృతిలో వికృతి వచ్చింది. అన్నపంక్తులు సందేశాత్మకాలు. ప్రతులకు నెం. 9849326801ను సంప్రదించగలరు. కవిని అభినందిస్తూ మరిన్ని కావ్యాలను మంచి పాకంతో వెలయించాలని ఆకాంక్షిద్దాం.
- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు

నవ శకాల భావ నివేదన
చిట్టెడు చిట్టికథలు
చిన్నారులకు ఆలోచనలు రేకెత్తించేవి, విలువలు పెంచేవి, జ్ఞానవంతులుగా తయారు చేయగలిగేవి కథలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే చిన్నారులకు సరిపడే కథలను సంకలనం చేసి వాటిని ‘చిట్టెడు చిట్టికథలు’ పేరిట సృజన విశాఖ భావావిష్కరణ వేదికగా మన ముందుకు తెచ్చినవారు గుండాన జోగారావు. దీనిని సాహిత్య సృజనం-5 అనే సంచికగా విడుదల చేశారు. ఇందులో ముప్ఫై మంది రచయితల కలాల నుండి జాలువారిన చిన్నచిన్న కథలు సమ్మితమై పాఠకలోకాన్ని పరవశింపజేశాయి.
చదువంటే కొనలేనిదని, దాన్ని మనం సముపార్పించుకోవాలని ‘చదువుకొనలేము’ కథలో రచయిత చెప్పిన తీరు చదువు పట్ల ఆసక్తిని రేకెత్తుతుంది. స్మార్ట్‌సిటీ పేరిట పర్యావరణాన్ని ఉరికంబం ఎక్కిస్తున్నారని, జీవులు తమ ఉనికిని కోల్పోతున్నాయని మూగజీవుల వేదనను ‘నిర్ణయం’ అనే కథలో సాయిప్రకాష్ తెలియజేశారు. ఆడపిల్లలు ఆస్తులు పంచుకోవడమే కాదు బాధ్యతలూ పంచుకోవాలని ‘శ్రీమతి ఒక బహుమతి’లో ఆదిమధ్యం జానకి చెప్పారు. నిజమైన ప్రేమ, మనసు పెట్టి చేసే పని దేవుని పూజతో సమానమని ‘మనసంతా నువ్వే’ కథలో సుబ్రహ్మణ్యం వివరించారు. కాంట్రాక్టు కార్మికుల బతుకులు ఎలా ఉంటాయో వారి, వారి వెట్టిచాకిరీ బతుకుల గురించి సునీతాదేవి వివరించారు. పిల్లికి బిచ్చం పెట్టని వాడు పుష్కరాలకు బయలుదేరగా అందరూ ముక్కున వేలేసుకున్న విషయాన్ని ‘పిండమే ప్రధానం కథలో చినరామారావు సాక్షాత్కరించారు. చిరుద్యోగికి అదనపు ఖర్చులు తోడైతే జీవితం ఎలా ఉంటుందనేది నల్లపాటి సురేంద్ర వ్యక్తీకరించారు. అమ్మ కమ్మని తత్వాన్ని, స్పర్శను తెలియజేస్తూ పెళ్లాం వస్తే అమ్మను చూస్తుందో ‘నేను అమ్మను’ కథ ద్వారా పాఠకులకు అందించారు శ్రీమణి. ఇలా పలువురు రచయితలు తమ కథల ద్వారా పాఠకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
- కుబిరెడ్డి చెల్లారావు,
సెల్ : 9885090752

మనోగీతికలు

సాంగత్య ఫలం

ఇత్తడి పాత్రలు తోమి ఇంటిలోన పెట్టినపుడు
పుత్తడి పాత్రల లాగున మిలమిలమని మెరుస్తాయి
గాలిలోని తేమ వాటి మెరుపు మరుగు పరుస్తుంది
ధూళి చేరి కిలుము పట్టి కాంతిని చెరిచేస్తుంది
చెడ్డవారితో చెలిమి చెరుస్తుంది ఇలా మదిని
నిత్యశుద్ధమైన మనసు మాలిన్యపు గుణము సోకి
తన శుద్ధత కోల్పోయి వికృతంగ మారుతుంది
చెడ్డవారితో చెలిమి మురుగు ప్రక్క నివాసం
దుర్గంధపు దుర్గుణాలు మనసులోన కలుగజేసి
మురికి తోటి మనసు నింపి మనసు శుద్ధి మాయచేసి
దురాలోచనలు రేపి దుష్క్రియలొనరింపచేసి
అంధకార కూపంలో మనిషిని నెట్టేస్తుంది
మనసు మలిన పడకుండా మంచిగ ఉండాలంటే
చెడ్డవారి చెలిమి విడచి మంచివారి చెంత చేరి
నిరంతరం సత్పురుషుల సాంగత్యంలో మెలిగితె
క్షార పదార్థముల వల్ల కిలుము వదలిపోవునట్లు
మదికంటిన మురికి చెరచి మెరియునట్లు చేస్తుంది
నీతియనే నీట ముంచి ప్రక్షాళన గావించి
మనసుకు మెరుగులు దిద్ది ప్రకాశింప చేస్తుంది
గంధపు వృక్షం చెంతన పెరిగిన ఏ వృక్షమైన
గంధ గుణం సోకి తాను సుగంధాన్ని ఇచ్చునట్లు
మంచివారి సాంగత్యం మల్లెపూల సహవాసం
మనసులోని దుర్గుణాలు దూరంగా నెట్టేసి
సుగుణ సుగంధాలు నింపి సువాసనలు నింపుతుంది
ఆలోచన చక్కదిద్ది మంచి పనికి పురికొల్పి
మానవతను నిదురలేపి మమత నింపుతుంది
మంచి-చెడులు వివేచించు సుజ్ఞానం కలిగించి
మనసునెపుడు నిర్మలంగ నిలుచునట్లు చేస్తుంది.

- వెలగల ప్రదీప్ శంకర్‌రెడ్డి
కొంకుదురు
బిక్కవోలు మండలం

మనసు ఉన్న మనిషి
బహుభాషా కోవిదుడై, బహువిధ శాస్త్రాలు చదివి
పండితునిగ రాణించి, ప్రజ్ఞను చూపించు గాక
ప్రజల మనసులోన, పిసరు చోటైనా పొందలేరు
పదవిలోన ఉన్నప్పుడు, భట్రాజుల వలె పొగుడును
పదవి జారిపోయినపుడు, పలుకరించువారుండరు
మది లోపల వాని కీర్తి, మసకబారి పోతుంది
అధికారం ఉన్నప్పుడు, కప్పల వలె దరిచేరి
చేయికట్టి గౌరవంగ, సలాములు చేస్తారు
పదవీ విరమణ చేసి, ప్రక్కకు తొలగిన రోజున
ముఖమైనా చూడకుండ, ముఖం చాటువేస్తారు
ధనమున్న రోజుల్లో, చీమల్లా చెంతచేరి
తేరుమీద ఎక్కించి, ఊరంతా తిప్పుతారు
పొగడ్తలతో కీర్తిస్తూ, పనులను నెరవేర్చుకుని
అవసరాలు తీర్చుకుని, ఆవల విసిరేస్తారు
ఎంగిలాకులా తలచి, ఎడంగాను తొలగుతారు
పాండిత్యంతో పదవితో, అధికారంతో, ధనంతో
ప్రజల మనసు చూరగొని, పెద్దలు కాలేరెవ్వరు
ప్రేమామృతమును పంచే, పెద్ద మనసు ఉన్నవాడు
ప్రేమమూర్తి నైటింగేల్, మదర్ థెరిసా లాగ
ఆర్థ్రతగల మనసు ఉన్న, ఆర్ధర్ కాటన్ లాగ
సర్వం త్యాగం చేసిన, శాస్ర్తి - గాంధీలాగ
గుండె గుడిలో దైవంగా, ప్రతిష్ఠింప బడతారు
జనుల గుండెలో నిలచి, పూజలందుకొంటారు
మనసు ఉన్న మనిషి ఎపుడు, మనసుల్లో నిలుస్తాడు
ప్రేమ కలిగి ఉన్న మనిషే, పెన్నిధిగా మారతాడు
మది మదిలో మమత నింపి, మాననీయుడౌతాడు

- వెలగల సత్యనారాయణరెడ్డి
కొంకుదురు

గులాబీ
హృదయంలోని వౌన భావాలను
కళ్ల నుండి ప్రవహించే ప్రేమను
కళ్లల్లో ప్రతిఫలించే ప్రేమను
మనసున పూచే ఆనంద సందేశాన్ని అందిస్తావు
ఆకాశానికి ఆత్మీయం ఇంద్ర ధనస్సు
అవనికి ఆనందం ప్రేమ ధనస్సు
కన్నీళ్ల మధ్య కంటకాల మధ్య
జీవితపు ఔచిత్యాన్ని
తెలుపుతావు వౌనంగా
అరమరలు లేని మనస్సు
అంతరాలు లేని ఆంతర్యం
అంతరంగాన ఆనందం
నా కళ్ళల్లో మనోహర దృశ్యం
చాచా నెహ్రూ కోటుపై
చెరగని నీ చిరునవ్వు
పాపాయ బోసినవ్వు
ఇంకా వెలుగుతూనే ఉంది
పాప నవ్వులా ప్రేమకు ప్రతిరూపంలా
నిజాయతికీ మారురూపంలా
నిక్కచ్చికి చిహ్నంలా
నిలువెత్తు సాక్షిగా
ఎల్లప్పటికీ
నీ వెలుగు జిలుగు
మాకు జయకేతనం
అదే మాకు నిత్యచైతన్యం

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి - 9247577501

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.

email: merupurjy@andhrabhoomi.net

యు.శైలజ, రాజమండ్రి